Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 23


    కళ్యాణి బట్టలు మార్చేసరికల్లా కణకణలాడే నిప్పుల కుంపటి తెచ్చిపెట్టాడు రంగడు. "అన్నం కచప్పచల్లారిపోయింది, బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టనా?"
    "ఇంక కొంచెం సేపట్లో తెల్లారిపోతుంది. ఇప్పుడేం భోజనం? ఇక నువ్వు వెళ్ళి పడుకో." ఒళ్లంతా వెచ్చగా కాచుకొని పక్కపరిచి వెచ్చగా శాలువా కప్పుకోని పడుకొన్నాడు. వాతావరణం చల్లగా ఉంది. వెచ్చగా పడుకోవడంలో సుఖం ఉన్నా కళ్యాణ్ కంటి మీదికి కునుకన్నది రావడంలేదు.
    "రూపా..... రూపా..... రూపా...."
    రఘు కేకలు హృదయంలో ప్రతిధ్వనిస్తూ మనస్సును కలిచివేస్తున్నాయి.
    రూప!
    తన భగ్నజీవితానికీ, బాబును పోగొట్టుకొని బాధ పడడానికీ కారణభూతురాలైన రూప! తనకు పరోక్షంగా ఉండి కొన్నాళ్ళు, ప్రత్యక్షమై కొన్నాళ్ళు సర్వనాశనం చేసింది జీవితం! ఆమెవల్ల తను నష్టపడింది జన్మలో పూడ్చుకోలేనిది.
    భూమి గుండ్రం అన్నట్లు ఏ స్మృతి నుండి విస్మృతి కోరి ఇక్కడికి వచ్చాడో, అదె స్మృతి ఇంకా దృఢమయ్యే పరిస్థితి ఏర్పడింది. విధివైచిత్రి!
    వెళ్ళిపోవాలి! ఈ స్మృతినుండి దూరంగా వెళ్ళిపోవాలి! ఈ పరిసరాలకు దూరంగా పారిపోయి సమస్త గాథలూ, బాధలూ మరిచి ప్రశాంత జీవితం సృష్టించుకోవాలి!
    
                                   *    *    *

    ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండమని కళ్యాణ్ ఇచ్చిన ఇంటి తాళంచెవి అందుకొంటూ, "మళ్ళీ ఎప్పుడు వస్తారు, బాబుగారూ?" అని ప్రశ్నించాడు రంగడు రుద్దకంఠంతో.
    "ఎప్పుడో మనస్సు కుదుటబడ్డాక!" వెళ్ళి రెండెడ్ల బండిలో కూర్చొన్నాడు కల్యాణి, ఊరికి బండి దూరమౌతూన్న కొద్దీ అనుకొన్నాడు బాధగా 'స్వగ్రామం అని వస్తే నాకింత ప్రశాంతి ఇవ్వలేకపోయావా' అని.
    మాధవపురంలో కృష్ణప్రియ ఇల్లు రెండతస్తుల పూర్వపు కట్టడం. కళ్యాణ్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఎవరెవరో ఎదురుగా వచ్చారుగాని కృష్ణప్రియ దర్శనం కాలేదు, అన్నీ కొత్త ముఖాలే, ఎవరా అని ఆశ్చర్యపోతూ, వంటగదిలో వంటావిడకు నాడు చేయవలిసిన కూరగాయల జాబితా చెబుతూన్న కృష్ణప్రియను కలుసుకొన్నాడు.
    "ఇప్పుడేనా రావడం, కృష్ణా?" ఆదరంగా పలకరించింది కృష్ణప్రియ.
    "ఆఁ ఇప్పుడే." కాళ్ళకు నీళ్ళు ఇస్తూన్న కృష్ణ ప్రియను అడిగాడు: "ఇంట్లో ఎవరెవరో ఉన్నారు. ఎవరు వాళ్ళంతా?"
    "వాళ్ళా?" అంటూ నవ్వింది.
    చివరికి తెలిసింది, కుటుంబాలకు కుటుంబాలే అక్కగారి ఆశ్రయంలో ఉన్నాయనీ, తనకు కనిపించిన వారందరూ వాళ్ళేననీ.
    భోజనానంతరం తనతో మాట్లాడాలని గదిలోకి వచ్చిన కృష్ణప్రియతో అన్నాడు కల్యాణ్ : "నీ ఇల్లు చూస్తూంటే 'మాయామృగం'లోని సావిత్రి గృహం గుర్తు వస్తూంది. ఈవిధంగా నీ ఏకాంతాన్ని పోగొట్టుకున్నావన్నమాట!"
    "ఇంతేకాదు; ఓ పిల్లవాణ్ణి కూడా పెంచుతున్నాను, దత్తత చేసుకోవాలని, తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు. వట్టి దరిద్రుడు!" అని, "గోపీ, గోపీ!" అంటూ కేకవేసింది కృష్ణప్రియ.
    ఎర్రగా, ముద్దుగా ఉన్న నాలుగేళ్ళ కుర్రాడు ఒకడు పరిగెత్తుకు వచ్చి కృష్ణప్రియ ఒళ్ళో పడ్డాడు. "వీడే, గోపీనాద్. అనూరాధకి చెప్పాలి, త్వరగా పిల్లను కని నా కొడుక్కి ఇమ్మని" అంటూ ముసిముసిగా నవ్వింది.
    "నిన్ను ఆవిధంగా కోరవద్దని అననుగాని ఆశ మాత్రం పెంచుకోకు. ఫలితం ఎలా ఉంటుందో, మరి."
    "ఎందుకూ?" 'మళ్ళీ ఏమి వచ్చిందా?' అని అదిరి పోయింది.
    "నేను ఊరు వదిలి వస్తున్నాను అక్కా!"
    "అంటే?"
    రూప సంగతీ, తను ఊరు విడిచిరావడమూ తెలిసి, "ఏ జన్మ అనుబంధమో, ఋణానుబంధమో తెలియదు కాని ఎక్కడికి పోయినా సైతానులా నన్ను వదలడంలేదు రూప" అన్నాడు.
    కృష్ణప్రియ నిట్టూర్చి అంది: "మానవుడు చేసే పాపాలకు ఏ దేవతలో ఫలితం నిర్ణయించక్కర్లేదు. తన పాపాలే శాపాలై పీడిస్తాయి. ఇప్పుడు పాపఫలం అనుభవిస్తూంది అది. చేసుకొన్నవారికి చేసుకొన్నంత!" కాస్సేపాగి తిరిగి అంది: "నీ కింకా లగ్నబలం వచ్చినట్లు లేదు అందుకే ఇలా జరుగుతూంది. మనస్సు స్తిమితంలేక నువ్వు దేశాల మీద పోతే, మరి ఏమిటి, మాధవమామయ్యవాళ్ళకు నీ సమాధానం?"
    "ఏముంది? మనస్సు మళ్ళినప్పుడు వస్తాను. పెళ్ళి చెయ్యమను."
    "బాగుందిరా నీ వరస! నీకంటే పెళ్ళి తొందర లేకపోవచ్చుగాని ఆడపిల్ల గలవాళ్ళు ఎన్నాళ్ళని వేచి ఉంటారు?"
    "నిజమే, నాకేం తొందర లేదు. తొలిసారిగా పెళ్ళి అంటే చెరుకురసంలోని తీయదనం అనుభవమౌతుంది కాని రెండు సార్లు దానివల్ల వంచితుణ్ణి అయ్యాక ఇప్పుడు పెళ్ళి అంటే చొప్పదంటులా చప్పగా ఉంది. మనస్సు ఉరకలు వెయ్యడం లేదు, మరి. అనూరాధకు నామీదే మనస్సు ఉంటే నా మాటగా చెప్పు. నిజమైన ఆరాధన ఉన్నప్పుడు నిరీక్షణలో సుఖం ఉన్నదని!"
    "తిక్కగా వాగకు. నాకు ఒళ్ళు మండుకు వస్తున్నది." కోపగించి చర్రున వెళ్ళిపోయింది కృష్ణప్రియ.
    అక్కగారి ఆదరసత్కారాలలో వారం రోజులు గడిపి బయలుదేరాడు కళ్యాణ్. మొట్టమొదట తిరుపతి కొండ ఎక్కి ఏడుకొండలవాని దర్శనం చేసుకొన్నాక, 'ఇక ఎటు పోవాలని బుద్ధిపుడితే అటు' అని నిర్ణయించుకొన్నాడు.
    విధి వింత చిత్రాలలో మరి ఒక చిత్రం జరిగింది, కల్యాణి జీవితంలో అతడు ఏ స్మృతినుండి దూరంగా పోతున్నాడో తిరిగి ఆ స్మృతికే చేరువ అయ్యే సంఘటన అది.
    ఓ స్టేషన్ లో ట్రెయిన్ దిగి వార్తాపత్రిక కొన్నాడు. ప్రథమంగా అతడి కళ్ళబడింది, రూప ఆకారవిశేషాలు వివరిస్తూ తెచ్చి అప్పగించినవారికి వెయ్యి రూపాయలు బహుమతి ఇవ్వబడుతుందని రఘు వేయించిన ప్రకటన.
    'ఛీ, ఛీ! ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను వదిలేటట్లు లేవే!' పత్రిక చదవ బుద్ధికాక, మడిచి దూరంగా విసిరాడు.
    పక్క కంపార్ట్ మెంట్ ముందు ఏమిటో గలభావినవచ్చింది. ఏమిటో అని దిగి చూశాడు కళ్యాణ్. ఇందాకా ఎవరి విషయమైతే చేదు విషంలా తోచిందో ఆమే ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది!    
    "దిగు, దిగు! చూడడానికి దొరసానిలా ఉన్నావు! ఇదేం బుద్ధి? కల్చర్ లెస్ ఫూల్! సంస్కారంలేని చదువెందుకు? టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావా?" చెకింగ్ మాస్టర్ కాబోలు, రూపచెయ్యి పట్టి కిందికి లాగి, సూట్ కేస్ ప్లాట్ ఫారంపైకి పారేశాడు.
    "ఎవడివిరా నువ్వు, నన్ను దింపెయ్యడానికి? సంస్కారంలేనిది నీకా, నాకా?" పట్టలేని ఆగ్రహంతో కాలిచెప్పు దూసి అతడి ముఖంకేసి విసిరింది. "ప్రపంచంలో అడుగు పెట్టినవాడే మృత్యువుకు టికెట్ తీసుకువచ్చాను. నీకూ ఉందా టికెట్! నువ్వు మరిచావేమోగాని, ఆ స్టేషన్ వచ్చినప్పుడు యమభటులు నిన్ను కిందికి లాగిపారేస్తారు, తెలుసా?" ఒకప్పుడు తను ఇంగ్లీష్ లెక్చరర్ కనక, అనర్గళంగా ఇంగ్లీష్ లో లెక్చర్ ఇస్తూంటే మూగిన జనం అంతా ఆశ్చర్యపోయారు.
    అవమానభారంతో ముక్కుపుటాలు అదురుతూండగా "ఎవత్తో పిచ్చిముండ! నోటికి వచ్చినట్లల్లా వాగుతూంది" అన్నాడు అక్కస్సుగా.
    "పిచ్చిముండా! ఎవర్రా?" రెండోకాలి చెప్పు తియ్యబోగా ఓ యువకుడు పట్టుకొని వారించాడు. "ఎందాకా వెడుతున్నారు?" ఎంతో మంచివాడిననిపించుకొనే ఉద్దేశ్యంతో తెచ్చిపెట్టుకొన్న సౌమ్యత తో ప్రశ్నించాడు.
    "కైలాసంవరకూ!"
    "అయితే ఈ బండి కాదు. బండెడు రాళ్ళు కట్టుకొని బావిలో దూకండి. వెంటనే వచ్చేస్తుంది కైలాసం!" తన గడుసుతనానికి తనే పగలబడి నవ్వాడు ఒక ప్రబుద్ధుడు.
    తిరిగి చెకింగ్ మాస్టర్ కేసి తిరిగింది రూప. "టికెట్ లేదని దింపేస్తావా? వెధవ టికెట్టూ, బోడి టికెట్టూ! వందలు కొనుక్కో" అంటూ సూట్ కేస్ తెరిచి నోట్లకట్ట నిర్లక్ష్యంగా అతడి ముందుకు విసిరింది.
    తెల్లబోయాడు చెకింగ్ మాస్టర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS