Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 24

 

    భార్గవి ని రైలెక్కించి శ్రీధర్ ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు శేఖర్.
    శ్రీధర్ తాపీగా అడుగు లేసుకుంటూ గేటు తీసి లోపలకు వచ్చి తాళం తియ్యబోతుండగా తలుపు దగ్గరగా ఒక వ్యక్తీ నిలబడి ఉండటం కనిపించింది.
    "ఎవరండీ ఎవరు కావాలి?' ఆశ్చర్యంగా అడిగాడతన్ని.
    "శ్రీధర్ గారు మీరేనా?" అన్నాడా వ్యక్తీ.
    "అవును నేనే. మీరెవరు?" ఆశ్చర్యం లోంచి కోలుకొనే లేదతను.
    "ఇంటికి వచ్చిన అతిధిని వాకిట్లో నే నిలబెట్టి మాట్లాడుతారటండి. ముందు తలుపులు తియ్యండి" అన్నాడతను నవ్వుతూ.
    ఫుల్ సూటు లో ఆరోగ్యంగా , అందంగా ఉన్న ఆ వ్యక్తీ ఎవరా అని ఆలోచిస్తూ "ఓ, సారీ! ఏమనుకోకండి" అంటూ తలుపులు తీసి లోపలకి దారి తీశాడు.
    వెనకాలే ఆతను కూడా వచ్చి తలుపులు మూశాడు. అతని చేష్టలకు క్షణ కాలం బిత్తర పోయాడు శ్రీధర్. అతను అక్కడే వున్న  సోఫాలో కూర్చున్నాడు.

                          
    "స్నానం , భోజనం - వగైరా ఉంటె కానివ్వండి. నేను కూర్చుంటాను. నాకు తొందర లేదు" అన్నాడతను.
    "అవన్నీ అయిపోయినాయి లెండి. ఇప్పుడే మా చెల్లెల్ని రైలెక్కించి వస్తున్నాను. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పారు కాదు"
    "మీ చెల్లెలు కాకినాడ వెళ్ళిందా?' చిరునవ్వుతో అన్నాడతను.
    'అవును! మీకెలా తెలుసు?"
    "ఇంకా తెలుసు. మీ పెళ్ళి మీ అక్కయ్య కూతురితో ఇంకా కొద్ది రోజులలో జరగబోతున్నది."
    శ్రీధర్ కి నోట మాట రాలేదు.
    "ఇకపోతే మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. నిర్మలతో మీ పెళ్ళి జరగదని" తాపీగా అంటున్నా అతన్ని దిమ్మేరపోయి చూడసాగాడు శ్రీధర్ - అంతలోనే తెప్పరిల్లి.
    "అసలు మీరెవరు? ఈ విషయాలన్నీ మాట్లాడవలసిన అవసరం మీకేమిటి?"
    "మిస్టర్! అనవసరంగా ఆవేశపడకు. నీ ప్రతాపం చూపించటానికి...."
    "షటప్!" కోపంతో శ్రీధర్ ముఖం జేవురించింది.
    "మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. దయచేసి బయటకు వెళ్ళండి! లేకపోతె పోలీసు రిపోర్టు ఇవ్వవలసి ఉంటుంది.
    శ్రీధర్ మాటలకు ఆవ్యక్తి పకపకా నవ్వాడు.
    "రిపోర్టు ఇస్తావా! అన్యాయంగా దౌర్జన్యంగా ఒక అమాయకురాలి శీలాన్ని అపహరించినప్పుడు -- ఆ దురదృష్టవంతురాలు తనకు జరిగిన అన్యాయాన్ని దేవుడితో మొరపెట్టుకుంటే ఏ దేవుడేమిస్తాడు - ఎవరు ఆమెను సహృదయంతో అర్ధం చేసుకో గలుగుతారు..."
    "ఏమిటి? ఏమిటి మీరంటున్నది. ఎవరి సంగతి" శ్రీధర్ కి శరీరమంతా చెమట పట్టింది. అప్పటికే అతని షర్టంతా తడిసిపోయింది.
    ఆ వ్యక్తీ తన జేబులోంచి ఒక ఫోటో తీసి చూపించాడు.
    "చూడు! ఈ అమాయకురాల్ని గుర్తు పట్టావా?' ఎందుకు గుర్తుంటుంది? ఈ దేశంలో స్త్రీకి అంతకన్నా విలువేక్కడిది. పురుషుడి దౌర్జన్యానికి బలయిపోయి ఆత్మహత్య చేసుకోవటం తప్ప స్త్రీకి వేరే మార్గమేముంది"
    "ఇందిరా!" శ్రీధర్ కేకలాటిది పెట్టాడు.
    "ఫరవాలేదు. పేరు జ్ఞాపకముంది." హేళనగా అంటున్న అతన్ని దీనంగా చూశాడు శ్రీధర్.
    "చెప్పండి! ఇందిర ఎక్కడుంది? నేను చేసిన పాపానికి అనుక్షణం కుమిలిపోతున్నాను.
    "దానికి సాక్ష్యమా ఈ పెళ్ళి. శుభలేఖ తీసి బల్ల మీద పడేస్తూ అన్నాడతను.
    అతని ధోరణికి శ్రీధర్ కి కోపం వచ్చింది.
    "స్త్రీని గురించి అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చారే! నేను చేసింది ఘోరమైన నేరమే. కాని అందుకు కారణం నేనొక్కడినే కాదు. నాలో సహనాన్ని నిలవనీయకుండా ఎన్ని విధాలుగానో నన్ను రెచ్చ గొట్టింది. నా జీవితాని కంతా ఆధారభూతమైన నా చదువుకే యెసరు పెట్టింది. తన అందాన్ని పొగుడుతూ తనని పెళ్ళి చేసుకోమని నేను అర్దిస్తున్నట్టుగా ఒక ఉత్తరాన్ని సృష్టించి నన్ను అన్యాయంగా అక్రమంగా కాలేజీ నుంచి వెళ్ళ గొట్టించింది. అందుకు నువ్వు అంత పెద్ద శిక్ష విధిస్తావా అంటారు మీరు. అందుకు శిక్ష ఆవిడే కాదు నేను  అనుభవిస్తున్నాను. ఆవిడ మనసు తెలియక - అసలేమయిందో , ఎక్కడుందో తెలుసుకోలేక అంతులేని నరకాన్ననుభవిస్తున్నాను."
    దుఃఖంతోనూ ఆవేశంతోనూ అతనికి మాటలు రాలేదు.
    "క్షమించండి! నిజంగానే నేను పొరబడ్డాను. అందరి లాంటి వారీ మీరనుకుని మీ మనసుని నొప్పించాను. నేను ఇందిర మేనత్త కొడుకుని. నా పేరు రాజారావు. ఇందిరను నా కిచ్చి పెళ్ళి చేయాలని మామయ్యా కోరిక. మరణశయ్య మీద కూడా ఇందిర పెళ్ళికి ఒప్పుకోలేదు. కారణం తెలియదు. అందుకని ఆమెకు తెలియకుండా ఆమె డైరీ ద్వారా అసలు విషయాన్ని తెలుసుకోగలిగాను."
    "ఆమె ఇప్పుడేక్కడుంది" ఆదుర్దాగా అడిగాడు శ్రీధర్.
    ఆమె కోసం మీరు ప్రయత్నించి ఉండవలసింది.
    "నా శాయశక్తులా ప్రయత్నించాను. కాలేజీ చదువు చెడిపోయిన తరువాత ఇంజనీరు చదువుదామని పొలం అమ్మటం కోసం మాఊరు  వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తరువాత - అంటే దాదాపు సంవత్సరం కాలం నాకా ఊళ్ళో కాలు పెట్టబుద్ది కాలేదు. ఎంతో ప్రయత్నించాను . లాభం లేకపోయింది.
    "సరే -- అయిపోయిందనుకోండి. ఇప్పుడామె జీవితం ఏం కావాలి. ఈ ఎనిమిదేళ్ళ నుంచి కంటికి కడువేడుగా దుఃఖిస్తూనే ఉన్నది. పైకి గంబీరంగా నవ్వుతూ ఉన్నా ఆమె హృదయంలో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి. ఒకరితో చెప్పుకోలేక -- మింగలేక -- ఆమె పడే బాధ నేను వర్ణించలేను. దానికి తోడు ఆవిడ స్నేహితురాలు నీరజ...."
    "నీరజ కూడా అక్కడే ఉందా!"
    "ఉంది. జీవితం బ్రద్దలు చేసుకుని- భర్తను దూరం చేసుకుని ఇందిర దగ్గరే ఉంది. మీరిప్పుడు ఏ విధంగా ఇందిరకు మనశ్శాంతి నివ్వగలరు?" బాధగా కణతలు రుద్దుకున్నాడు రాజారావు.
    "ఇందిర కోసం కాదు రాజారావు గారూ! నా కోసం -- నా ఆత్మ శాంతి కోసం నా సంతృప్తి కోసం నేను ఇందిరను వివాహం చేసుకుంటాను. గుండెల్లో ఆరని కుంపటి లా ఈ అగ్నిని నేను భరించలేను."
    ఆవేశంగా అంటున్న శ్రీధర్ ని ఆశ్చర్యంగా చూశాడు రాజారావు.
    "శ్రీధర్! నిజంగా మా యిందిర అదృష్టవంతురాలు. ఆవిడ పూజలన్నీ ఫలించినాయి. కాని, ఏ విధంగా మీరీ పెళ్ళి చేసుకోగలుగుతారు?" అనుమానంగా అన్నాడు రాజారావు.
    "ఇందిర మనసు తెలియక -- ఆవిడ ఎక్కడ ఉందొ కూడా తెలియక నాలో నేనే మధన పడ్డాను. ఇక ఆ విషయం నాకు వదిలేయండి" ఉత్సాహంగా అన్నాడు శ్రీధర్.
    "కాని, నేను ఇలా మిమ్మల్ని కలుసుకున్నట్టు మాత్రం మా ఇందిరకు చెప్పకండి. నేను ఇంకో నెలరోజుల్లో స్టేట్స్ కు వెళ్ళి పోతున్నాను. మీ పెళ్ళయిన తరువాత ఏదో మంచి సమయం చూసుకుని చెప్తే చెప్పండి -- నా పేరు మాత్రం బయటకు రానివ్వద్దు" నవ్వుతూ తేలిక పడ్డ హృదయంతో అన్నాడు రాజారావు.
    'అలాగే" అని ఇందిర విషయమంతా అడిగి తెలుసుకున్నాడు. రాజారావు "ఇక వస్తాను" పరుషంగా మాట్లాడి మీ మనసు నొప్పించాను-- అదేం మనసులో పెట్టుకోకండి" అని మరో మారు చెప్పి సెలవు తీసుకున్నాడు.

                           *    *    *    *
    రాజారావు వెళ్ళిపోయిన తరువాత గాని అసలు విషయం తల కెక్కలేదు శ్రీధర్ కి. ఈ పెళ్ళి ఆపటం ఎలాగో -- ఇందిరతో పెళ్ళి జరగటం ఎలాగో అతనికి ఎంతకీ అంతు పట్టలేదు. అన్నిటి కంటే భయంకరమైన విషయం జయలక్ష్మీ ని ఒప్పించటం. అది సాధ్యమయే విషయంగా కనపడలేదు శ్రీధర్ కి. ఎన్ని విధాల ఆలోచించినా ఒక్కటే మార్గం -- ఏదో రకంగా ఈ పెళ్ళి అగేటట్టు చూసి ఎవ్వరికీ తెలియకుండా ఇందిరను పెళ్ళి చేసుకోవాలి. అంతకంటే మార్గం లేదు.
    ఏమిటో అర్ధం లేని ఆలోచనలు -- మనసంతా అదోలా అయి పోయిందతని మనసు.
    అనుకోవటమే తప్ప ఏం చెయ్యాలో తేలియక- ఎట్లా పరిష్కరించాలో అర్ధం కాక తికమక పడుతుండగానే నాలుగు రోజులు గడిచి పోయినాయి. ఇంకా పది రోజులు మాత్రమే వ్యవధి ఉంది పెళ్ళికి. భార్గవి దగ్గరి నుంచి కులాసాగా చేరినట్టు సాధ్యమైనంత త్వరగా సెలవు పెట్టి రమ్మనమని ఉత్తరం వచ్చింది. ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టి ఎటూ తోచక ఇంట్లోనే కూర్చున్నాడు శ్రీధర్.
    శేఖర్ దగ్గరకి వెళ్ళి విషయమంతా చెప్పి ఈ సమస్యా పరిష్కారం ఎలాగో మాట్లాడాలని బయలుదేరుతుండగా టెలిగ్రాం వచ్చింది.
    "ఆ, ఏముంది - సెలవుపెట్టి రమ్మని అక్కయ్య ఇచ్చి ఉంటుంది!" అనుకుంటూ టెలిగ్రాం చించి చదవసాగాడు.
    "ఫాదర్ సీరియస్ -- స్టార్ట్ ఇమీడియట్లీ- నిర్మల ' అని ఉంది అందులో. టెలిగ్రాం చదివిన శ్రీధర్ కి గుండె ఝల్లుమంది.
    "బావగారికి సీరియస్ గా ఉండటమేమిటి?" అనుకుంటూ ఆదరాబాదరా ఇంటికి తాళం పెట్టి టాక్సీ లో శేఖర్ ఇంటి ముందు వాలాడు.
    శేఖర్ ఆఫీసు రూములో కూర్చుని ఉన్నాడు. ఏదో డిక్టేటు చేస్తున్నాడు. శివరాం గబగబా వ్రాస్తున్నాడు.
    శ్రీధర్ ని చూస్తూనే "రండి బావగారూ. రండి -- మీకో శుభవార్త -- ఏ క్షణంలో మీ చెల్లెలు మా ఇంట్లో అడుగు పెట్టిందో గాని  ఎన్నాళ్ళ నుంచొ బేరం కుదదరక, ఎటూ తేలక నానా తిప్పలు పెడుతున్న మా బట్టల షాపు వ్యవహారం నిముషాల మీద తేలిపోయింది. ఇక అది మా స్వాధీనం అయిపొయింది లెండి!' అంటూ ఆదరంగా ఆహ్వానించాడు.
    "శేఖర్! మా బావగారికి చాలా సీరియస్ గా ఉందట. ఇదిగో టెలిగ్రాం " అని గొంతు బొంగురు బోతుండగా టెలిగ్రాం అందించాడు.
    "ఒకవేళ మీరు వస్తారో రారో అని అనుమానంగా ఉండి ఇట్లా ఇచ్చారేమో."
    "ఆహా! అలా జరగదు. నిజమే అయుంటుంది. నేనీ రాత్రి కే వెళ్తాను. అన్నాడు శీధర్.
    శేఖర్ మాట్లాడలేదు. శ్రీధరే అన్నాడు. "నా జీవితమేమిటో గాని అన్నీ ఇలాగే ప్రాణాంతకంగా వస్తున్నాయి. శేఖర్ -- మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి -- అలా వస్తారా"
    "శివరామ్ ! ఇందాకటి కాగితాలన్నీ టైపు చెయ్యండి. ఇప్పుడే వస్తాను." అని శ్రీధర్ తో తన రూముకి వెళ్ళాడు.
    ఇందిర విషయం -- నిర్మలంటే తన కిష్టం లేకపోవటానికి కారణం , క్లుప్తంగా వివరించాడు శ్రీధర్.
    శ్రీధర్ చెప్పిందంతా విన్న శేఖర్ నిశ్చేష్టుడయ్యాడు.    
    "మీకు జబ్బు చేసిన రాత్రి ఆమె మీ దగ్గరే రాత్రంతా మెలుకువతో కూర్చుని మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకొంది. ఈ విషయం తెలియనివ్వవద్దని అంది. తరువాత కారణం అడిగితె యేవో సాకులు చెప్పిందే గాని అసలు విషయం చెప్పనే లేదు. ఇదా అసలు సంగతి. ఇందిర నాకు బాగా తెలుసు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. కాని, మీరెంత పొరపాటు చేశారు? ఇప్పుడీ పరిస్థితిలో ఈ పెళ్ళి ఎలా అపగలుగుతారు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS