Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 25

 

    "అదే అర్ధం కావటం లేదు. కాని, నా తప్పులేదు శేఖర్. నేనెంతో ప్రయత్నించాను. నాకు ఆమె ఆచూకీ తెలియలేదు. అసలది కాకుండా భార్గవి తో సమానంగా చూసుకున్న నిర్మలను భార్యగా ఎలా స్వీకరించను? అక్కయ్య విచిత్రమైన మనిషి. ఆమె ముఖం చూస్తూ, నేనేమీ మాట్లాడలేను. ఇందులో బావగారికి సీరియస్ గా ఉండటం - ఏమిటో నా కంతా అయోమయంగా ఉంది. ఆ జబ్బేదో నాకు రాకూడదు" జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి బాధగా అన్నాడు శ్రీధర్.
    "డోంట్ వర్రీ- అంతా సక్రమంగా నే జరుగుతుంది. మీరు ముందు కాకినాడ వెళ్ళండి"
    ధైర్యమిస్తూ అన్నాడు శేఖర్.
    కాకినాడ లో రైలు దిగిన శ్రీధర్ ఆదుర్దాగా రిక్షా లో ఇంటికి బయలుదేరాడు. శ్రీధర్ ఇల్లు చేరేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మనుషులున్న అలికిడే లేదు.
    రిక్షా వాడికి డబ్బులిచ్చి సూట్ కేసు తీసుకుని లోపలకు అడుగుబెట్టాడు. ముందు హాలులో కూడా ఎవ్వరూ కనపడలేదు. పెళ్ళికి కాబోలు తీసుకొచ్చిన బియ్యపు బస్తాలు, ఒక వారగా పసుపు దంచిన పచ్చగా ఉన్న రోలు- ఏవేవో అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. హాలుకి అనుకుని కుడి వైపున్న గదిలోకి వెళ్ళబోయాడు. అది చంద్ర శేఖరం గది. ఇంతలో వెనక నుంచి
    "మామయ్యా!' అన్న పిలుపు వెంటనే పెద్దగా ఏడుపు వినపడింది.
    ఒక్కంగలో నిర్మల దగ్గర కెళ్ళాడు శ్రీధర్.
    "నిర్మలా! బావగారికెలా వుంది?"
    ఆత్రంగా అడుగుతున్న శ్రీధర్ కి నిర్మల ఏడుపు తప్ప ఏమీ సమాధానం రాలేదు.
    "నిర్మల! మాట్లాడు నిర్మలా!" అనునయంగా భుజం పట్టుకుని ఊపుతూ అడిగాడు శ్రీధర్.
    "మామయ్యా! నాన్న నిన్న పొద్దునే పోయారు. బావురుమంటూ అతని గుండెల మీద వాలిపోయింది.
    'నిర్మలా!'ఆమెను పొదివి పట్టుకుని కళ్ళ నుండి ధారాపాతంగా కారే కన్నీటితో ఆమె శిరస్సంతా తడిసిపోతుండగా తల నిమురుతూ అలాగే నిలబడిపోయాడు.
    'ఊరుకో -- నిర్మలా --- ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అని ఆమెను వదిలేసి లోపలి కెళ్ళాడు. జయలక్ష్మీ పక్కనే కూర్చున్న భార్గవి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తున్నది.
    విరాగి లాగ శూన్యంలోకి చూస్తూ గోడ కానుకుని కూర్చుని ఉంది జయలక్ష్మీ.
    "అక్కయ్యా అంటూ ఆమె దగ్గర కెళ్ళి కూర్చున్నాడు శ్రీధర్.
    జయలక్ష్మీ అలాగే చూస్తూ కూర్చున్నది.
    "అసలేం జరిగింది భార్గవీ!" అన్నాడు కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ.
    "ఏమీ లేదు? బాగానే ఉన్నారు. ఇంట్లోకి కావలసిన సామాన్లన్నీ ఆయనే తెస్తున్నారు. ఉన్నట్టుండి గుండెల్లో నొప్పిగా ఉందన్నారు. వెంటనే స్పృహ పోయింది. అప్పుడే నీకు టెలిగ్రాం ఇచ్చాం. మళ్ళీ స్పృహ రానేలేదు. నిన్న పొద్దున్న 6 గంటలకు పోయారు."
    "భార్గవీ! ఇదంతా నా దురదృష్టం నేను అన్ని విధాలా అదృష్టహీనుడ్నే"  "కాదు శ్రీధరం -- నువ్వు కాదు. నీకేం మా నిర్మల దురదృష్టవంతురాలు-- లేకపోతె దాదాపు నాలుగు సంవత్సరాల నుండీ అడుగుతున్నాను. "ఇప్పుడెం తొందర -- సెలవు లేదు' అని తాత్సారం చేశావు. ఒక్కగానొక్క బిడ్డ ముద్దు ముచ్చటలు చూసుకునే భాగ్యం ఆయనకి లేకపోయింది. తల్లిదండ్రుల చేత కన్యాదానం చేయించుకునే భాగ్యం దానికి లేకపోయింది. ఇదంతా మా దిరదృష్టం నాయనా నీదేముంది."
    "అక్కయ్యా! అంత మాటనకు. ఇదంతా ఇలా జరుగుతుందని నేననుకున్నానా" బాధగా అన్నాడు శ్రీధర్.
    "చూడు శ్రీధరం -- ఎవరి కర్మ వాళ్ళది. ఎంత నగుబాట్ల పనయిందో చూడు - పెళ్ళికని తెచ్చిన వన్నీ కర్మ కాండలకి వినియోగించవలసి వచ్చింది. కష్టపడకుండా ధర్మరాజు అన్నీ తెచ్చి ఇంట్లో పడేసి మరీ వెళ్ళిపోయారు....." ముఖాన కొంగు కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది జయలక్ష్మీ.
    "అక్కయ్యా" శ్రీధర్ కి ఏం మాట్లాడాలో తెలియలేదు.
    "అయ్యో! పచ్చ తోరణాలతో, పసుపు కుంకుమలతో కళకళలాడవల్సిన పెళ్ళిల్లు శ్మశానమయిపోయిందే! నేనీ బాధ భరించలేను.  నిర్మలా ఎక్కడున్నావే! నేనూ పోతాను మీ నాన్నదగ్గరికి- నువ్వొక దరిద్రురాలివి" అంటూ శోకాలు పెట్టటం మొదలుపెట్టింది.
    "అక్కయ్యా! నీకేమయినా మతి పోయిందా! అదేం చేస్తుంది-- ఈ మాటలన్నీ విని మనసు పాడు చేసుకుని అదేమైనా అఘాయిత్యం చేస్తే ఏం చేస్తావు?" మందలింపు గా అన్నాడు శ్రీధర్.
    "నాకు తెలియదురా శ్రీధరం -- నేనీ బాధ భరించ లేకుండా ఉన్నాను. ఒరేయ్ -- నీకు తెలియదు గాని- ఇది చాలా ఘోరం రా! నలుగురూ దాన్ని చంపుకు తింటారురా-- నేను వినలేను -- భరించలేను"
    ఆవిడ దుఃఖాన్ని అరికట్టడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు.
    "దాన్నే ఎందుకంటారు? నన్ను మాత్రం అనరూ అనేవాళ్ళు. గొడవ చెయ్యకు అక్కయ్యా! పసి హృదయం దెబ్బ తింటుంది."
    "ఓ , నిర్మలా! ఎక్కడున్నావే" అని ఏడుస్తూ విరుచుకు పడిపోయింది జయలక్ష్మీ.
    "ఇదే ధోరణి అన్నయ్యా! స్పృహ లో ఉన్నప్పుడు అలా చూస్తూ కూర్చోటం -- లేకపోతె నిర్మలను తిట్టడం -- చివరకు అలసిపోయి పడిపోవటము , రాత్రంతా ఇరుగుపొరుగు వాళ్ళు తోడు పడుకున్నారు. తెల్లవారి వాళ్ళ పనులు వాళ్ళ కుంటాయి గదా. వెళ్ళిపోయారు" అంది భార్గవి జయలక్ష్మీ అరి చేతులు తన చేతుల్లో గట్టిగా రాస్తూ.
    నిర్మల కూడా వచ్చి కాళ్ళల్లో గట్టిగా రాయటం మొదలు పెట్టింది.
    కొంతసేపటికి మెలకువ వచ్చింది జయలక్ష్మీ కి.
    "అమ్మా నిర్మలా" అంటూ పిలిచింది.
    శ్రీధర్ రమ్మనమని సంజ్ఞ చేశాడు. పాదాల దగ్గర కూర్చున్న నిర్మల కదిలి రాలేదు.
    శ్రీధర్ లేచి వెళ్ళి రెక్క పట్టుకుని తీసుకు వచ్చాడు.
    నిర్మలను చూడగానే ఆవిడకు మళ్ళీ దుఃఖం ముంచు కొచ్చింది.
    "శ్రీధరం! దీన్నేం చేస్తావో" అంటూ నిర్మలను తన మీదకు లాక్కుని గుండెల కానించుకుంది.
    "అమ్మా! కష్టంలో నేనేమైనా అంటే బాధ పడకు"
    "లేదమ్మా! నేనేం బాధపడను"
    ఆ స్థితిలో ఆ తల్లీ కూతుళ్ళ ను చూసిన శ్రీధర్ కి, భార్గవి కి కన్నీరు ఆగలేదు.
    అక్కడ నిలబడలేక శ్రీధర్ బయటకు వెళ్ళిపోయాడు.
    జరగవలసిన తతంగమంతా జరిగిపోయింది.

                                
    "నీరజా! శ్రీధర్ జ్ఞాపకమున్నాడా"
    హటాత్తుగా అంది ఇందిర.
    "ఎవరు! మన క్లాస్ మేట్ శ్రీధర్ మాట . ఎందుకు లేడు?"
    "ఇవ్వాళ అతని పెళ్ళి! ఈపాటికి అయిపోయి ఉంటుంది." ఎటో చూస్తూ అంది ఇందిర.
    "పెళ్ళా! నీకెలా తెలుసు? ఎక్కడ ఉన్నాడతను" ఆశ్చర్యంగా అంది నీరజ.
    "భార్గవి అన్నయ్యే శ్రీధర్ -- భార్గవి తో వచ్చిన నిర్మలే శ్రీధర్ భార్య"
    "అరె! ఆశ్చర్యంగా ఉందే. నాకీ విషయం చెప్పనే లేదేం? భార్గవి అన్నయ్యను చూద్దామనుకొని కూడా పరాయి వ్యక్తిని ఏం చూస్తాం లే అనుకున్నాను. భార్గవి అన్నయ్య శ్రీధరా!"
    "పెళ్ళి మాట నీకెలా తెలుసు!" ఆమె ఇంకా ఆశ్చర్యంలో నుంచి కోలుకొనే లేదు.
    "భార్గవి శుభలేఖలు పంపింది. చూస్తావా" అని లేవబోయింది.
    "ఎందుకులే! చూడటం -- అయిపోయిందిగా ! అని వారించింది నీరజ.
    "ఏం, ముందే చెప్పి ఉంటె వెళ్ళే దానివా?"
    "నేనా! నిన్ను పంపేదాన్ని"
    "ఎందుకు -- వధూవరులిద్దరూ అందంగా, జోడుగా ఉన్నారో లేదో చూసి రావతానికా" లేని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అంది ఇందిర    నీరజ మాట్లాడలేదు.
    "నీరజా! కలకత్తా లో మెడికల్ కాన్ ఫరన్స్ " అవుతున్నాయి. శేఖర్ మరిమరీ రమ్మని ఉత్తరం వ్రాశాడు . వెళ్దామా?
    నేల చూపులు చూస్తున్న నీరజ తలెత్తి చూసి అడ్డంగా తల ఊపింది. "నీకు తెలియదు నీరజా! ఒకవేళ మన ప్రయాణం లో సురేంద్ర కలుస్తే కలవచ్చుగా" ఆశగా అంది ఇందిర.
    "ఎప్పటికయినా సురేంద్ర ఇక్కడికే వస్తారు అయన దర్శన భాగ్యం త్వరలోనే నాకు కలుగుతుందని నా మనసు చెప్తున్నది. నేనిక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను."
    "నీ పిచ్చి నీది. కాస్త గాలి మార్పయినా ఉంటె మనిషివవుతావు. ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూసుకో, ఎలా అయిపోయావో"
    "వద్దు ఇందిరా! నీకు తెలియదు. నేను రాను. ఖచ్చితంగా అంది నీరజ.
    "నువ్వు వచ్చి తీరాల్సిందే! ఇద్దరికీ టిక్కెట్స్ రిజర్వు చేయిస్తాను" నీరజ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది ఇందిర.

                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS