తల వంచుకుని నిశ్చలంగా చెప్తున్న భార్గవిని అర్ధం కానట్టు చూశాడు.
మరుక్షణం లోనే అతని మనసు చురుగ్గా పని చేసింది.
"భార్గవీ....' ఒక్కడుగులో ఆమె దగ్గరకు వెళ్ళి రెండు చేతులూ పట్టుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ "పరిహాసమా?' అన్నాడు.
అప్పటికే ఆమె కళ్ళు నీళ్ళతో నిండి పోయినయి.
కాదన్నట్టు తల అడ్డంగా తిప్పింది.
"భార్గవీ!' అంటూ ఆమెను అమాంతం గుండెలకు బలంగా హత్తుకున్నాడు. అతని హృదయంలో తలదూర్చి తృప్తిగా కళ్ళు మూసుకుంది భార్గవి.
* * * *
అ మరునాడు భార్గవి, శేఖర్ తీరుబడిగా కాఫీ తాగుతూ కూర్చున్నారు. భార్గవి కళ్ళు వీధి వైపే ఉన్నాయి.
"మా అన్నయ్య ఇంకా రాలేదేమో! ఈ చెరలో నుంచి ఇంకా ఎందుకు తీసుకెళ్ళడా అని చూస్తున్నావు కదూ" శేఖర్ మాటలకు దృష్టి తిప్పి చూసింది.
"కాదు, కాదు అన్నయ్య వచ్చేస్తాడు -- మీ దగ్గర నుంచి నన్ను తీసు కెళ్తాడు -- అప్పుడు ఒంటరిగా కూర్చుని మిమ్మల్ని పెట్టిన బాధలన్నీ మననం చేసుకుంటూ....."
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కు వాలి పడుకున్నాడు.
దాదాపు పది గంటల ప్రాంతంలో శ్రీధర్ వచ్చాడు.
"అన్నయ్యా " ఒక్కంగలో శ్రీధర్ దగ్గర కెళ్ళింది.
భార్గవి ముఖంలో తొంగి చూస్తున్న సంతోషానికి శ్రీధర్ పొంగిపోయాడు.
"ఏం బావగారూ! ఏమంటున్నది మా చెల్లెలు?"
భార్గవి ముఖం చూసి ధైర్యంగా అడిగాడు శ్రీధర్.
"ఇంకొక్క క్షణం పెళ్ళి చెయ్యటం ఆలస్యం చేసినా అన్నయ్య మీద కేసు పెడ్తా నంటున్నది" నవ్వుతూ అన్నాడు శేఖర్.
"ఛీ! ఛీ! మీరెప్పుడూ ఇంతే" సిగ్గుతో కళ్ళు వాల్చుకుంటూ అంది భార్గవి.
శ్రీధర్, శేఖర్ ఒకరినొకరు చూసుకుని కులాసాగా నవ్వుకున్నారు.
ఆరోజే శ్రీధర్ తో వెళ్ళిపోయింది భార్గవి.
* * * *
నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచిపొయినాయి, శ్రీధర్ అఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత వంట గదంతా సర్ది బయటకు వచ్చిన భార్గవికి రెండు ఉత్తరాలు అందించి పోయాడు పోస్టు మాన్.
ఒకటి కలకత్తా విశేషాలు వ్రాయమని నిర్మల వ్రాసిన ఉత్తరం, రెండవది ముహూర్తం వ్రాస్తూ శుభలేఖలు అచ్చు వేయించి, ఈ ఉత్తరం అందిన వెంటనే భార్గవి ని పంపమని జయలక్ష్మీ వ్రాసిన ఉత్తరం.
సరిగ్గా ఇరవై రోజులుంది ముహూర్తం.
సాయంకాలానికి టిఫిను కాఫీ తయారు చేసి శ్రీధర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
ఎందుకో ఆమె కంత ఉత్సాహంగా లేదు. శ్రీధర్ వివాహం పట్ల చూపుతున్న నిరుత్సాహమే దానికి కారణమేమో అనుకున్నది మనసులో.
కాలింగ్ బెల్ మ్రోగడంతో తలుపు తీసింది. శ్రీధర్ కి బదులు శేఖర్ వచ్చాడు.
"మీ అన్నయ్య ఇంకా రాలేదా?"
"రాలేదు-- మా అన్నయ్య పెళ్ళికి మూహూర్తం పెట్టారుట. శుభలేఖలు ఇక్కడే అచ్చు వేయించమని అక్కయ్య ఉత్తరం వ్రాసింది. నీరసంగా అంటున్న భార్గవి ని చూసి శేఖరం నవ్వాడు.
"అదేమిటి? అలా ఉన్నావ్! అన్నయ్య పెళ్ళని ఉత్సాహంగా ఉరకలు వెయవలసింది పోయి -- దివాలా తీసినట్టున్నావెం?"
"ఏమిటో అన్నయ్య కీ పెళ్ళి అంత ఇష్టం ఉన్నట్టు లేదు. దాదాపు అయిదారేళ్ళ నుంచి వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడిహ తప్పలేదు.
ఇంతలో శ్రీధర్ వచ్చాడు. భార్గవి ఇద్దరికీ టిఫిను, కాఫీ ఇచ్చింది.
"బావగారు త్వరలోనే పెళ్ళి భోజనం పెడ్తున్నారన్న మాట"
భార్గవి ఉత్తరాలు తీసుకొచ్చి శ్రీధర్ కిచ్చింది.
నిర్మల రాసిన ఉత్తరం అక్కడే బల్ల మీద పడేసి జయలక్ష్మీ వ్రాసిన ఉత్తరం చదివాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. చైతన్యమే లేనట్టు మౌనంగా చూస్తూ కూర్చున్నాడు.
"అన్నయ్యా! రేపే శుభలేఖలు ప్రింటు కివ్వమా"
శ్రీధర్ ముఖం ఎర్రగా కందిపోయింది. అతని కళ్ళలో నీళ్ళు నిలిచినయి.
"శ్రీధర్! ఆశ్చర్యంగా అన్నాడు శేఖర్.
శేఖర్? నువ్వు అదృష్టవంతుడివి" అస్పష్టంగా ఏదో అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు లేసుకున్నాడు.
శేఖర్ అయోమయంగా భారంగా కదిలిపోయాడు.
మరునాడు పొద్దున్న ఆఫీసుకి వెళ్ళబోతున్న శ్రీధర్ తో మళ్ళీ ప్రస్తావించింది భార్గవి.
"నీ ఇష్టం. శేఖర్ ని రమ్మని ఫోను చేస్తాను. మీ ఇష్టమొచ్చినవి వేయించండి" అని ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
శ్రీధర్ ఫోను చేస్తేనో వచ్చాడో , అతనంతట అతనే వచ్చాడో కాని శ్రీధర్ వెళ్ళిన ఒక గంటకి శేఖర్ వచ్చాడు.
"రండి! మీకోసమే ఎదురు చూస్తున్నాను" అంది భార్గవి.
"ఎందుకో....." చిలిపిగా అంటున్న శేఖర్ ని చూసి తల దించుకుంది.
శేఖర్ కూడా ఆమె ముఖం చూసి ఆందోళన పడ్డాడు.
"నాకెందుకో సంతోషంగా లేదు. అన్నయ్య కేమాత్రమూ పెళ్ళంటే ఇష్టం లేదు. రాత్రంతా నిద్ర పోయినట్టు లేడు. యిష్టం లేని ఈ పెళ్ళి వల్ల అన్నయ్య ఏం సుఖపడతాడు. మా నిర్మల ఏం సుఖపడుతుంది?"
"మీ అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకునే మాత్రపు చనువు నీకు లేదా? అతను మాత్రం ధైర్యంగా చెప్పొచ్చుగా! చిన్న పాపాయి కాదుగా మీ అన్నయ్య. మొత్తానికి ఇద్దరు ఇద్దరే తమాషా వ్యక్తులు"
"శుభలేఖలకి అర్దరిచ్చోద్దాం పదండి" అంటూ బయలుదేరింది భార్గవి. అతని మాటలకు సమాధానం చెప్పకుండా.
ఆ రాత్రి నీరసంగా ఇంటికి వచ్చిన శ్రీధర్ ముఖం చూసిన భార్గవి మాట్లాడటానికి కూడా ధైర్యం చాలలేదు. అందువలన ఆమె మౌనంగా వూరుకుంది.
అన్నం తినటం, ఆఫీసు కెళ్ళటం - మళ్ళీ రావటం భోజనం చెయ్యటం నిద్ర పోవటం తప్ప ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడుకోలేదు.
ఆరోజు ఆదివారం శ్రీధర్ పేపర్ చూస్తూ కూర్చున్నాడు.
చేతిలో శుభలేఖల బొత్తి పట్టుకుని శేఖర్ వచ్చాడు. శ్రీధర్ ముందు బల్ల మీద పెట్టి నిన్ననే వచ్చినాయి -- రాత్రే వద్దామనుకున్నాను గాని కొంచెం తల భారంగా ఉండటం వలన రాలేక పోయాను" అన్నాడు . శేఖర్ రాకను గమనించిన భార్గవి తను కూడా వచ్చి అక్కడే కుర్చీలో కూర్చున్నది. శ్రీధర్ గంబీరంగా మౌనంగా ఉండటం వలన వాతావరణం అంతా బరువుగా ఉంది. ఎవ్వరికీ మాట్లాడబుద్ది కాలేదు.
శేఖరమే కవరు లోంచి శుభలేఖ బయటకు తీసి శ్రీధరానికి చూపించాడు.
అందంగా బంగారు రంగు అక్షరాలతో చూడ ముచ్చటగా ఉంది.
నిర్మల పక్కన తన పేరు చూసిన శ్రీధర్ గుండెలు బరువెక్కినయి.
"బాగానేఉంది- పంపవలసిన వాళ్ళకి పంపండి" అన్నాడు నిర్లిప్తంగా.
'అన్నయ్యా! మరి నా ప్రయాణం?"
"ఎక్కువ వ్యవధి లేదుగా! రెండు రోజుల్లో వెళ్ళు. శేఖర్ భార్గవి కి ఆ రిజర్వేషన్ , వ్యవహారం కొంచెం చూడండి"
కాసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. అందులోనూ శేఖరమే ఎక్కువ మాట్లాడాడు. శేఖరం మాట్లాడినదానికి -- "అవును, కాదు" అనటం తప్ప ఇంకేమీ మాట్లాడలేదు.
* * * *
"సుందరమ్మ గారూ! నీరజేది? నాలుగు రోజుల బట్టీ నాతొ భోజనానికి రావడంలేదు" అంది హాస్పిటల్ నుంచి వచ్చి భోజనానికి కూర్చున్న ఇందిర.
"అమ్మా! ఆమె అన్నం తిని వారం రోజులయింది. వంటింటి ముఖం కూడా చూడటం లేదు. చూస్తుంటేనే కడుపు తరుక్కు పోతున్నది. "కూర వడ్డిస్తూ అంది సుందరమ్మ.
"అదేమిటి?' నేను అడిగితె పొద్దున్న పది గంటలకి భోజనం చేశానని చెప్తున్నదే రోజూ! అయ్యో? రాత్రి పూట ఈ కేసుల గొడవల్లో పడి నేను పట్టించుకోవటం లేదు" అని అనుకుంటూ తింటున్న కంచంలోనే చెయ్యి కడుక్కుని నీరజ గదిలోకి వెళ్ళింది. కిటికీ వారగా వేసి ఉన్న మంచం మీద గడ్డం కింద చెయ్యి పెట్టుకుని శూన్యం లోకి చూస్తూ కూర్చొని ఉన్నది నీరజ.
"నీరూ...." దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి పిల్చింది ఇందిర.
నీరజలో కదలిక లేదు. గట్టిగా కుదుపుతూ మళ్ళీ పిలిచింది.
"ఇందూ! నువ్వా ..." అంది వెనుదిరిగి.
"నీరజా! ఏం పనిది! అన్నం మానేసి నువ్వు సాధించగలిగిందేమిటి? ఈ రకంగా ఆత్మ హత్య చేసుకుందామనుకున్నావా?' చిరుకోపంతో అంది ఇందిర.
"ఆత్మహత్య కాదు ఇందిరా! ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాను. అయన పట్ల నేను అన్యాయంగా ప్రవర్తిస్తున్నానా? నా నిర్ణయం వల్ల ఆయనే మౌతారు? అని ఆలోచిస్తున్నాను."
"దానికి అన్నం, నీళ్ళు మానేయ్యనవసరం లేదే"
"నా తపస్సు ఫలించి అయన రావాలి. ఎంత దూరంలో ఉన్నా నా పిలుపు ఆయన్ని మేలు కొలపాలి- అప్పుడే నాకు శాంతి -- అందాకా నన్ను నేను మర్చిపోయి తన కోసం తపించాలి. ఈఅరాధన లో ఎక్కడ అపశ్రుతి పలికినా ఆయనా రారు. ఆత్మ పరిశుద్దికే నా ఈ సాధన నన్ను నిర్భంధించకు" బ్రతిమిలాడుతున్న ధోరణిలో అంది నీరజ.
ఈ సాధనలో నీ శరీరం శుష్కించి నీ జీవితమే ముగిసిపోతే.....?'
"ఇందూ! నీకా భయం అక్కరలేదు. అయన ఒడిలోనే నేను నిద్రపోతాను. నా జీవిత యాత్ర అయన బాహువుల్లోనే ముగుస్తుంది. అందాకా ఈ శరీరాన్ని ఈ ప్రాణం వదలదు."
నీరజా.......! బాధతో ఆమె హృదయం మెలికలు తిరిగిపోసాగింది.
"అవును ఇందిరా! ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్తున్నానీ మాటలు. భగవంతుడి విషయంలో నాకు తప్పక న్యాయం చేకూరుస్తాడు. జీవితంలో విధితో పోరాడి అలిసిపోయిన నేను అయన గుండెల్లో ఒదిగిపోయి ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడు...."
"చాలు -చాలు -- అపు. నేను వినలేను" రెండు చేతుల్తో చెవులు మూసుకుని అవతలకు వెళ్ళిపోయింది ఇందిర.
మనసంతా పిచ్చెక్కినట్లయిపోగా -- ఎటూ తోచక ఆ గది లోంచి ఈ గదిలోకి ఈ గది లోంచి ఆ గదిలోకి తిరగసాగింది ఇందిర.
ఆమె ఆ స్థితిలో వుండగా రాజారావు రెండు కవర్లు చేతితో పట్టుకుని వచ్చాడు.
సోఫాలో తీరుబడిగా కూర్చుని చూడ సాగాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ఇందిర కాసేపు అతనితో మాట్లాడితే నన్నా కాస్త మనసు తేలిక పడుతుందని అతని కెదురుగా వచ్చి కూర్చున్నది.
"ఇదిగో శుఖలేఖ! వెళ్తావా పెళ్ళికి?' హేళనగా అన్నాడు రాజారావు.
రాజారావు వంక ఒక్క క్షణం చూసి అతని చేతిలోంచి శుభలేఖ తీసుకుని చూసింది.
అది నిర్మల, శ్రీధర్ ల పెళ్ళి శుభలేఖ.
అసలే మనస్తిమితం లేక బాధపడ్తున్న ఇందిర కు ఆ శుభలేఖ గుండెల్లో కత్తితో పొడిచి నట్టే అయింది.
ఛీ! ఛీ! ఎక్కడికి పోయినా అశాంతే!" అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది ఇందిర.
అక్కడే పడేసి పోయిన శుభలేఖను జాగ్రత్తగా కోటు జేబులో పదిలం చేసుకున్నాడు రాజారావు.
మరునాడు పొద్దున్న కాఫీ తాగుతుండగా రేడియో కింద కాగితం కనిపించింది ఇందిరకు.
ఆదుర్దాగా వెళ్ళి చూసింది. అది రాజారావు వ్రాశాడు. ఖరగ్ పూర్ తన స్నేహితుడి దగ్గరకు వెళ్తున్నట్టుగా ఒకే ఒక వాక్యం వ్రాసి ఉంది అందులో. అటు నుంచి కలకత్తా వెళ్ళడు కదా!' అని అనుకుని దీర్ఘంగా నిట్టూర్చింది చేసేది లేక.
