Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 23


    "అదికాదు ఇదికాదు మరేది? రిపోర్టు తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడే వేళ్ళాడుతున్నాడంటే ఇది అనుమానించతగిన విషయం అన్నమాట. లాక్కురా ఇక్కడికి లాక్కురా" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అరిచినట్లే చెప్పాడు.
    "రాంబాబు అనే ఆయన వారంక్రితం తన సైకిలు పోయిందని రిపోర్టు ఇచ్చాడు. ఈవారంలో మనం కొన్ని దొంగ సైకిళ్ళని పట్టుకున్నాము కదా ఆ సైకిళ్ళలో తన సైకిలు ఉందేమోనని....
    "అంతేనా!"
    "అంతే!"
    "మంచి సైకిళ్ళు అవతలపెట్టాము కదా! మిగిలిన ఆరు డొక్కు సైకిళ్ళని ఆయనకి చూపించి దానిలో ఆయన సైకిలు వుంటే ఎత్తుకుపొమ్మను లేదంటే మళ్ళీ వారం ఆగి రమ్మను"
    "ఆయన సైకిలు కొత్తదిట"
    "ఆ సంగతి నాకూ తెలుసు నీకూ తెలుసు. ఇలాంటి కేసుల్లో మనం ఏం చేస్తామన్నది కూడా నీకూ తెలుసు నాకూ తెలుసు__
    "తెలుసు సార్! మీతో ఒకసారి చెప్పి చేద్దామని...."
    "సరే చెప్పావు కదా ఇకవెళ్ళి అదేదో చూడు" అని చెప్పి మళ్ళీ తలపట్టుకొని కూర్చున్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
    పావుగంట తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాడు అహోబిలం.
    వర్ధనరావు ఇంకా అదే ఫోజులో ఉన్నాడు. పై అధికారులు తన నెత్తిన వేసిన అక్షింతలు మాటిమాటికీ గుర్తుకు వస్తుంటే చిరాకు పడిపోతూ నెత్తిన చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. చిరాకు వల్ల మంచి మంచి ఆలోచనలు రావటంలేదు. దాంతో మరింత చిరాకు ఎక్కువ అయింది.
    అహోబిలం ధైర్యం చేసి 'సార్!' అన్నాడు.
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చింది. చర్రున కుర్చీలోంచి లేచి 'సైకిలు చూపించమన్నా కదా. ఇంకా ఇక్కడే వున్నావేమిటి? నన్ను చూస్తే నీకూ నవ్వులాటగా వుందా! గుళ్లో జరిగినదానికి నేనా కారణం! గోడమీద వాలిన చెట్టుని కొట్టించమంటే నామాట ఎవరయినా విని ఏడ్చారా? ఎంతసేపూ నామీద పడి ఏడవటం తప్ప పైవాళ్ళకేం పనిలేదు. ఇంతకీ ఆ సైకిల్ వాడు వెళ్ళాడా లేదా?" అంటూ కయ్ మన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
    "మీరూ నామాట కాస్త శాంతంగా వింటారా సార్!" అహోబిలం అన్నాడు.
    "వింటాను అందరిమాటా వింటాను. ముందు నువ్వెళ్ళి ఆ సైకిల్ వాడిని పంపించిరా!"
    "అతన్ని పంపించి పావుగంట అయింది సార్!"
    'ఏమిటీ? పంపించి పావుగంట అయిందా! నీక్కూడా నన్ను చూస్తుంటే ఆటలుగా ఉందా?'
    "లేదుసార్! నేను ఇందాక వచ్చి మీతో చెప్పి వెళ్ళి అతన్ని పంపించి వచ్చాను. మళ్ళీ వచ్చేసరికి పావుగంట అయింది. మీరు ఆలోచనలో మునిగి తేలుతూ నేను వెళ్ళిందీ వచ్చిందీ మీరు గమనించలేదు.
    "ఈజిట్!" ఆశ్చర్యపోతూ అన్నాడు వర్ధనరావు.
    "యస్ సార్!" అన్నాడు అహోబిలం.
    వర్ధనరావుని మాటలతో మామూలు మనిషిని చెయ్యకపోతే తనకి కూడా అక్షింతలు తప్పవని అహోబిలానికి తెలుసు. అందుకనే తెలివిగా ఇలా అన్నాడు.
    "పరమేశ్వరీ ఆలయంలో జరిగినదానికి మీరెంతమాత్రమూ బాధ్యులు కారు సార్! మీ సూచనలను గుళ్లోవాళ్ళు పాటిస్తే కదా! అందుకనే హత్యదాకా పోయింది. ఈ వ్యవహారం అంతటితో ఆగుతుందని నేను అనుకోవటం లేదు సార్! మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏమీలేదు.
    అహోబిలం పొగడ్తగా అలా అంటుంటే ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ముఖం విచ్చిన కలువ పువ్వులా అయింది.
    ఇన్ స్పెక్టర్ ని పొగిడితే చాలా పనులు అవుతాయని అహోబిలంకి అనుభవపూర్వకంగా తెలుసు.
    "నువ్వోయ్, మనిషివంటే. నీ మాత్రం వివేకం నీ మాత్రం ఇంగిత జ్ఞానం నా మొగుళ్ళకి (పై అధికారులకి) లేకపోయె. ఆలయంలో హత్యలకి నేను కారణం అన్నట్లు నా నెత్తిన ఇన్ని అక్షింతలు వేస్తే ఎలా" వర్ధనరావు అసలు విషయం చెప్పేశాడు.
    పోనీండి సార్! వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు" అంతకన్నా ఇంకేమనాలో తెలియక ఆ మాట అన్నాడు అహోబిలం.
    "వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని నాకూ తెలుసు. కాని వాళ్లేసిన అక్షింతలు నేనెలా మరిచిపోను? అందుకే నేనొకటి ఆలోచిస్తున్నాను. ఆ దొంగలని ఆ హంతకులని నేనే ఎందుకు పట్టుకోకూడదా అని....!"
    "అవర్ రైట్ గ పట్టుకోవచ్చు సార్! కాని ఎలా?" నెత్తిమీద ఎర్రటోపీ తీసి బుర్రగోక్కుంటూ అన్నాడు అహోబిలం.
    "దానికో ఉపాయం ఆలోచించాను"
    'ఇంకా ఆలస్యం ఎందుకు! చెప్పండి సార్ చెప్పండి'
    "మనం మారువేషాలు వేసుకుని వెళ్ళి భక్తుల మధ్యలో దూరి వాళ్ళంతా ఏమనుకుంటున్నారో వినటం వాళ్ళల్లో దొంగ వెధవలు ఉంటే వాళ్ళని పట్టేయటం. మన అదృష్టం బాగుండి తీగముక్క చేతికి దొరికి లాగామనుకో డొంకంతా కదులుతుంది. మనకి పేరు ప్రఖ్యాతి...."
    "అబ్బబ్బ ఎంత తెలివిగా ఆలోచించారండి, ఏదో గ్రహచారం బాగుండక ఈ కేసులో ఫెయిల్ అయ్యాము కానీండి ఎన్ని దొంగతనాలు పట్టలేదు? సైకిళ్ళ దొంగలని కోళ్ళ దొంగలని యింకా....
    "చాలోయ్ చాలు. నా ప్లాను నీకు నచ్చింది కదా?"
    "నచ్చిందా అని మామూలుగా అడుగుతున్నార! బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి ప్లాన్ మరొకరయితే చస్తే వేయలేరు"
    "అయితే మనం ఓ పని చెయ్యాలి"
    "చెప్పండి సార్!"
    'ఈ సంగతి చాలా గుట్టుగా వుంచుదాము. నీవూ నేను మన వేషాలు వేసుకుని భక్తుల మధ్య తిరగటం అక్కడ దొంగలు తిరుగుతున్నారేమోనని కనిపెట్టటంలాంటి పనులు చేద్దాం. ముందు రంగంలోకి దిగితే ఏదో ఒకటి పట్టకపోము"
    'ఆ పనిచేద్దాం సార్!'
    'ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు.'
    'మూడోకంటిదాకా పోతున్నారా సార్! రెండో కంటికి తెలియకూడదని నా అభిప్రాయం'
    అహోబిలం అన్నమాటకి ఇన్ స్పెక్టర్ చాలా సంతోషించాడు. 'ఇప్పుడు నా మనసు చాలా తేలికపడింది. ఇంక మనం ఏ వెధవ వేషాలు వేయాలి, ఏం చేయాలి అన్నది చర్చిద్దాము'
    అహోబిలం కళ్ళముందు కొత్త సైకిలు కనపడింది 'ఈ దెబ్బకి నాకో సైకిలు ఖాయం' అనుకున్నాడు.
    ఆ తర్వాత.
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కానిస్టేబుల్ అహోబిలం చాలాసేపు చర్చిస్తూ ఉండిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS