Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 23


    
    రోడ్డుమీద నడుస్తోన్న మహేష్ కు ప్రక్కగా వొచ్చి సునంద కలిసింది.
    మహేష్ తలత్రిప్పి చూసి "హేయ్! ఇవేళ నడిచి వొస్తున్నావేం? కారేమయింది?" అన్నాడు.
    "నీతో కలసి ఏడడుగులు నడవాలనిపించింది"
    "ఏడడుగులేం కర్మ! డబ్బయి అడుగులు నడు. కాని కారుతప్ప నడక ఎరుగని నీ సుకుమారమైన పాదాలు కందిపోవూ?"
    "కందిపోవు. పైగా కొంత'మందితో కలసి నడిస్తే సుఖంగా కూడా వుంటుంది."
    "అదొకటా?" అని మాట తప్పిస్తూ "నీ చేతిలోనిదేమిటి? నవలా?" అనడిగాడు.
    అతని దృష్టి నాకర్షించాలనే ఆమె పుస్తకాన్ని అతనికి కనిపించేటట్లు పట్టుకున్నది. "ఇర్వింగ్ వాలెస్ - ది సెవెన్ మినిట్స్. నీకు నవలలంటే యిష్టంగా. చదువుతావా?" అంటూ అతని జవాబుకోసం ఎదురుచూడకుండా చేతికి అందించింది. ఎందుకో ఆమెగుండె గబగబ కొట్టుకొంది.
    "బావుంటుందా?"
    "చాలా, ప్రతిపేజీ విడవకుండా చదువు. థ్రిల్లింగ్ గా వుంటుంది" ఇంతలో మలుపు వొచ్చింది. అతను రెండోవైపుకు తిరిగి వెళ్ళిపోవాలి.
    "డబ్బయి అడుగులకుపైగానే నడిచాం" అంటూ తనదార్న వెళ్ళిపోయాడు.
    ఒక్కక్షణం స్తబ్దుగా నిలబడి నిట్టూర్చి చిన్నగా ముందుకు కదిలింది.
    
                              *    *    *
    
    "ఎక్కడికీ?" అనడిగింది ప్రియంవద ప్రొద్దుటే మహేష్ తెల్లటి యూనిఫాంలాంటి బట్టలు వేసుకుని, తెల్లటి బూట్లు వేసుకుని బయల్దేరుతోంటే.
    "ఇవేళ క్రికెట్ మ్యాచ్ వుంది."
    "ఎవరెవరికి?" అన్నది ప్రియంవద ఆసక్తిగా.
    "మెడికల్ కాలేజీకి, ఆర్ట్స్ కాలేజీకి నేను ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ని."
    "నేను కూడారానా?" అని అడిగిందామె కుతూహలంగా.
    "నీకు క్రికెట్ అంటే యింటరెస్టా?"
    "చాలా."
    అతనామె ముఖంలోకి చూశాడు. ఈ కొద్దిరోజుల పరిచయంలొ ఆమెలో ఎన్ని మార్పులు! మొదట్లో ఎంత చలాకీగా, చిలిపిగా వుండేది. ఇప్పుడెంతో ఎదిగినట్లు......ఆ ఎదుగుదలలో ఓ దిగులు, విషన్నవదనంలా.....
    ఆమెకు కొంత రిలాక్సేషన్ యివ్వాలనిపించింది "నేను ముందుగా వెళ్ళాలి. పదిగంటలకల్లా నువ్వు సునందతో కలిసిరా."
    "ఎక్కడకు రావాలి?"
    అతను మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో వివరంగా చెప్పాడు.
    
                              *    *    *
    
    స్టేడియం గ్రౌండ్స్.
    ప్రియంవదా, సునందా కలిసి అక్కడకు పదిగంటలకల్లా చేరుకున్నారు సునంద కారులో.
    గేమ్ చూడటానికి మెడికల్ కాలేజి స్టూడెంట్సూ, ఆర్ట్సు కాలేజీ వాళ్ళూ చాలామంది వొచ్చారు.
    ప్రియంవదా, సునందా కలిసి కొంచెం ఎడంగా వున్న చోటు చూసుకుని కూచున్నారు.
    ఆటగాళ్ళంతా గ్రౌండ్ లోకి రాలేదు.
    "ఆ ఉత్తరమతనికి అందజేశాను" అన్నది సునంద అప్పుడే గుర్తుకొచ్చినట్లు.
    ప్రియంవద గుండె గబగబకొట్టుకుంది. "ఏమని జవాబు వొచ్చింది?" అన్నది కంపిత స్వరంతో.
    "తెలీలేదు. నవల్లో పెట్టి యిచ్చాను. చూసుకున్నాడో లేదో"
    "నవల యిచ్చాక - ఆ తర్వాతరోజు కనిపించినప్పుడు అతని భంగిమ ఎలా కనిపించింది?"
    "మొహంలో ఎలాంటి భావం కనబడలేదు. ఏమీ తెలీనట్లే ప్రవర్తించాడు"
    కెప్టెన్స్ యిద్దరూ గ్రౌండ్ లోకి వెడుతున్నారు-టాస్ వెయ్యటానికి ఎంపైర్స్ తో.
    టాస్ వేశారు.
    మెడికల్ కాలేజి క్యాప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చెయ్యటానికి ఎలెక్ట్ చేశాడు.
    ఎంపైర్స్ యిద్దరూ గ్రౌండ్ లోకి వెడుతున్నారు.
    ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు.
    తర్వాత ఫీల్డ్ చెయ్యటానికి ఆర్ట్స్ కాలేజి ప్లేయర్స్ గ్రౌండ్ లోకి వెళ్ళారు.
    ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్ మేన్ మహేష్, అతని జతగాడు ప్యాడ్స్ కట్టుకుని బ్యాట్సు ఊపుకుంటూ వెడుతున్నారు.
    స్వాగత పూర్వకంగా ప్రేక్షకుల కరతాళధ్వనులు.
    "వైట్ డ్రెస్ తో స్టెయిల్ గా మహేష్ ఎలావున్నాడో! ఓ యువరాజులా లేడూ?" అన్నది సునంద.
    ప్రియంవదకు కోపమొచ్చింది. మహేష్ ను యింకో అందమైన అమ్మాయి మెచ్చుకోవటం ఆమెకు నచ్చలేదు.
    అని వూరుకోక 'అవునా?' అన్నట్లు చూసింది సునంద ఆమెవంక.
    ప్రియంవద నిర్లక్ష్యంగా పెదవివిరిచింది.
    'అవున్లే ఆ బొండాంలాంటి ఆంజనేయులు మైకంలో వున్న యీ మూర్ఖురాలికి ప్రేమలేఖ బాగా రాయటం వొస్తే రావచ్చుగాక- మగసిరి అంటే ఏం తెలుస్తుంది' అనుకుంది సునంద జాలిగా.
    పిచ్ వైపు, స్టెయిల్ గా బ్యాట్ ఊపుకుంటూ నడుస్తోన్న మహేష్ కళ్ళు ప్రియంవద కోసం ప్రేక్షకుల వైపు ఆత్రుతగా రెండు మూడుసార్లు కదిలాయి. కాని ఆ జనంలో ఎక్కడ వున్నదో కనబడలేదు. ఎక్కువసేపు చూస్తే బాగుండదని మళ్ళీ ముఖం త్రిప్పుకున్నాడు.
    "అతను మనల్ని చూడటానికి ప్రయత్నించాడు. కాని మనం కనబడలేదు" అంది నిరాశగా సునంద.
    ప్రియంవద ఆ విషయం గమనించింది. కాని ఏమీ వ్యాఖ్యానం చెయ్యకుండా వూరుకుంది.
    మహేష్ పిచ్ మీదకు వెళ్ళి, స్టంప్స్ కు దగ్గరగా నిలబడ్డాడు. ఆట ప్రారంభం కాబోతోంది. ఫీల్డర్స్ ఎవరి స్థానాల్లో వాళ్ళు సర్దుకుంటున్నారు. క్యాప్టెన్ బాల్ ని ఫాస్ట్ బౌలర్ చేతికి యిచ్చాడు.
    ఫస్ట్ బాల్ మహేష్ ఎదుర్కోబోతున్నాడు అతని ముఖంలో టెన్షన్ కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
    అతని రూంనుండి బయల్దేరేముందు ప్రియంవద చేసిన హెచ్చరిక అతని వీనుల్లో మార్మోగుతోంది.
    "మీరు సెంచరీ కొట్టాలి. మీరు కొడితే చూడాలని వుంది."
    ఆమె మాటల్లోని నిజాయితీ, గేమ్ పట్ల ఆమెకున్న మక్కువ అతని కర్ధమయింది.
    చిరునవ్వు నవ్వి "ట్రై చేస్తాను" అన్నాడు.
    "ట్రైచెయ్యటంకాదు. సాధించాలి."
    అతనేమీ జవాబు చెప్పలేదు. ఇంకోసారి నవ్వి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS