నేను : వెర్రిఅమ్మాయీ, నేనూ అందరితోటి వాణ్ణే! ఈ లోకంలోని పరమ రహస్యాలన్నిటిలోనూ సంచరించాను. పరమ పవిత్ర ప్రదేశాలలోనూ సంచరించాను. ఆ అనుభవము తప్ప నాలో ఇంకేమీ లేదుసుమా.
నామాటలకు ఆమె ఆలోచనలో నిమగ్నమయినది. నేనూ ఆలోచనా లీనుడ నయ్యాను. ఆ ఆలోచన లటుంచి మళ్ళా కథ ప్రారంభిస్తాను.
నేను స్కూలు ఫైనలు పరిక్షలో డెబ్బదికి తక్కువ కాని మార్కులతో కృతార్థుడనైనాను. '' అమ్మాయి కాలు పెట్టిన వేళ మంచిది, అబ్బాయి ప్యాసయినాడు'' అన్నారు. మా మామగారు నేను చెన్నపట్టణములో చదవడము మంచిదని నిశ్చయము చేసినారు. మా మామగారు, మా అమ్మా, నేనూ ముగ్గురము కలిసి చెన్నపట్టణము వెళ్ళినాము.
చెన్నపట్టణము బయలుదేరే పూర్వము శకుంతలను చూచి, మాట్లాడి వెళ్ళాలని నాకు కోరిక కలిగినది. ఇదివరకు ఒక్క నిమిషము కూడ వదలి ఉండేవాళ్ళము కాదు కదా! మా వివాహమే మాకు అడ్డము రావాలా! ఏమీ టీ సిగ్గు? భార్యా భర్తల కీ సిగ్గు ఎందుకో ? వారిద్దరికీ రాబోయే స్త్రీ పురుష సంబంధము వలన జనించి ఉంటుంది. కాని రాను రాను నవ వధువున కదీ అలంకారమైన ఆనందము సమకూరుస్తుంది. ఈ వ్రీడ నవ వధూవరుల నడమ తేరా కావడమే కాక, వధూవరుల యిరువురి చుట్టూ తెర అవుతుంది.
బాలవే నీ వెపుడు
గోలవే బేలవే!
పరమ సౌందర్యాలు
పడతి నీ కన్నులే
కన్నుల్లొ దాగెనే
కమ్మని సిగ్గొకటి.
బాలవే....
ఉదయసంధ్యల ఎరుపు
పెదవుల్ల తేనెలే
తేనెలో ఒదిగింది
తీయతీయని సిగ్గు.
బాలవే....
తంత్రుల్లు మీటుతూ
తలవాల్చి పాడుతూ
ననుముంచు నీ పాట
నవ్వు వెన్నెల సిగ్గు.
బాలవే....
నీలి కనురెప్పలో మేలమాడే సిగ్గు
అందాల నీ పెదవి అలమిపోయిన సిగ్గు
దివ్య గాంధర్వాన నవ్యమయ్యే సిగ్గు
సిగ్గులను మాలగా చేర్తువే నా గళము?
బాలవే....
మా అత్తగారే మే మిద్దరము కలుసుకోవడానికి కారణభూతురాలైంది. శకుంతల గదిలో ఉందని మా అత్తగారు నన్ను బలవంతాన గదిలోనికి త్రోసింది. ఆమె తల దువ్వుకొని బొట్టు పెట్టుకొంటున్నది. నేను వెనకాలే వెళ్ళి శకుంతల కళ్ళు మూశాను. ఆమె మూర్తినంతా మెరుములా సిగ్గు ప్రసరించి మాయమైనట్టు ఎదుటి నిలువుటద్దములో స్పస్టమైకనబడినది. ఆమె పెదవులలో చిరునవ్వు మధుర లాస్యము లాడినది. అతి స్పష్టమైన పెదవి కదలికతో '' బావ '' అన్నది. ఆ పెదవు లతికోమలములు. ఆ పెదవుల వట్రువులు, ఎరుపురంగులు, ఆ పెదవులలోని ఆర్ద్రత, ఆ పెదవులలోని నునుపుగీతలు చూస్తూ ఆ బాలిక తలను నా భుజంమీదికి వంచుకొని వణికిపోతూ, సిగ్గుపడుతూ, ఉప్పొంగుతూ, కరిగిపోతూ ఆ నునులేత వెలుగుల జిలుగు పెదవులను ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను. కళ్ళ నుంచి చేతులనూ తీసినాను.
ఆమె మోము ఎంత ప్రపుల్లమైపోయినది! ఆమె తల వాల్చుకొని '' చెన్నపట్టణము నుంచి ఉత్తరం....''
నేను : నువ్వూ ఎప్పుడూ ఉత్తరాలు రాస్తుంటావా?
ఆమె : నేనూ, అమ్మా ఎప్పుడో చెన్నపట్నం వ్సస్తాము.
నేను : స్టేషణకు వచ్చి నిన్ను కారుమీద ఇంటికి తీసుకుపోతాను.
దీర్ఘాలై, నల్లనైన కనువెంట్రుకలతోడి రెప్పల నొకసారి పైకెత్తి క్రిందకు చూచినది.
నేను : ఇలారా. సోఫామీద కూర్చుండి మాట్లాడుకొందాము.
ఆ సోఫామీద కూర్చున్నాము. మా మౌనమే అనేక విషయాలను మాట్లాడినది, మా మౌనమే పాటలు పాడినది. మా మౌనమే మే మింతలో విడిపోవు దుఃఖాన్ని అశ్రువులుగా రాల్చినది. ఆమె చేతులు రెండూ నా చేతులలో ఉన్నవి.
6
నా చేతులు అందమైనవి. నా వ్రేళ్ళు అంత అందమైనవికావు. అవి పోడుగాటివి, బలమైనవి, సూక్ష్మస్పర్సకలవి. నా చేతులు చూచిన ఇద్దరు ముగ్గురు పెద్దలున్నారూ, '' ఈ అబ్బాయివి డాక్టరు చేతులు '' అని, బాహ్య రూపంలో కూడా ఎట్టి సూక్ష్మమైన తెడాలనైనా, ఎట్టి అవ్యక్త స్పందనాన్నైనా స్పృశించినంత మాత్ర్రాన తెలుసుకోగలిగిన వ్రేళు! వ్రేళ్ళతో చేయగలిగిన పని ఏలాంటి దృఢమైన దైనా, ఏలాంటి సున్నితమయినదైనా నాకు పండు వొలిచినట్లే.
ఇంటర్ పూర్తిచేసి డాక్టరు చదువుకు వెళ్ళుదామని సంకల్పము నాకు. మదరాసులో ఒకనాడు నేనూ నాస్నేహితులు కొందరూ కలిసి సిద్దప్ప శిల్పాశ్రమానికి వెళ్ళినాము. సిద్దప్పగారు కొడగుదేశపు ఉత్తమకులీనుడు, ఆయన పాశ్చ్యాత్య దేశాలకుపోయి పాశ్చ్యాత్య శిల్పవిద్య సర్వతోముఖంగా నేర్చుకొని వచ్చినాడు. ఇటలీలో, పారిస్ లో అతనికి బహుమతులు, యోగ్యతాపత్రాలు అనేకము సంర్పించబడినవి. అతని శిల్పకళా వైదగ్ద్యాన్ని పొగడుతూ పాశ్చ్యాత్య దేశాలలోని వివిధ పత్రికలు ప్రశంసించాయి.
