వినీత ఆశ్చర్యపడుతుందనుకున్నాను. కానీ నిర్లిప్తంగా నవ్వింది. ఆ నవ్వులోనే నా ప్రశ్నలకు సమాధానాలున్నాయి.
నేను వినీత చేయిపట్టుకుని-"వినీతా! తల్లీ బిడ్డల్ని యెక్కువ కాలం విడదీయడం నాకిష్టముండదు.....మరి నువ్వు నన్ను కాదనకు...." అన్నాడు.
వినీత నా వంక తీవ్రంగా చూసి-"చేయి వదలండి" అంది.
నేనామె చేయి మరింత గట్టిగా పట్టుకుని-"వదలను-" అన్నాను.
"వదలండి-"అందామె మళ్ళీ.
"వదలండి అనే బదులు నీవే విదిలించుకోవచ్చుగా- నాకు తెలుసు. నీకిష్టమే!" అన్నాను.
"రావణాసురుడిని సీత ఆపలేదు. తన క్షేమంకోరిన వాడై రావణుడే ఆమె అనుమతికోసం ఆగాడు...."
"ఆమె సీత, సాక్షాత్తూ శ్రీరామచంద్రుడి భార్య."
"నేను వినీతను. సాక్షాత్తూ సిద్దేంద్రస్వామి భక్తురాల్ని...."
చటుక్కున ఆమె చేయి వదిలి-"నీ కొడుకు నీ యింటికి క్షేమంగా తిరిగిరావాలని లేదా?" అన్నాను.
"ఉంది కానీ అందుకు మీమీద ఆధారపడను...." అందామె.
"మరెవరున్నారు నీకు?"
"సిద్దేంద్రస్వామి! ఆయన తల్చుకుంటే ఆకాశం నేల కూలుతుంది. సముద్రాలు పొంగుతాయి. మీ వంటివారు సర్వనాశనమైపోతారు....
కోపంలో కూడా ఆమె యెంతో అందంగా వుంది. ఇంకా చెప్పాలంటే కోపంలో ఆమె అందం పెరిగింది.
"సిద్దేంద్రస్వామి నిన్నెలా ఆదుకుంటాడో చూస్తాను. ఈ క్షణంలోనే నేను నిన్ను లోబర్చుకుంటాను...."
ఆమె నా వంక చూసింది. నా కళ్ళలో దృఢ నిశ్చయాన్ని కనిపెట్టిందో ఏమో-"నేను పవిత్రతను నమ్ముకున్నాను. నా పవిత్రత నిలబడినంత కాలమే జీవిస్తాను" అంది.
"అంటే?"
"నర్సింగ్ హోంలో మీరు నా బాబును చంపేయండి. బయట నేను ఆత్మహత్య చేసుకుంటాను...."
ఉలిక్కిపడి ఆమె వంక చూశాను.
ఆమె నన్ను బెదిరిస్తోంది. మనిషి చాలా ప్రశాంతంగా వుంది.
"నీ బిడ్డపోయి, నువ్వాత్మహత్య చేసుకుంటే ఆ సిద్దేంద్రస్వామి ఏమి చేసినట్లు? ఆయన్ను మర్చిపోయి నన్ను నమ్ముకో మీరిద్దరూ సుఖంగా బ్రతికే మార్గం యేర్పాటు చేస్తాను...."
"నా మనసు కేది నచ్చితే, ఏది తోస్తే అది సిద్దేంద్రస్వామి ఆశయం ఈ ప్రపంచంఓ యెవరు బ్రతికినా ఆయన శాసనం మీదనే! అవకాశముండీ ఇంతకాలం మీరు నాపై బలప్రయోగం చేయలేదంటే అంతా అయన మహిమ...."
ఆమె మాటలు వినగానే అట్నించి నరుక్కురావాలనిపించింది.
"నువ్వెంతగా నిరాకరించినా నాకు నీమీద మోజు పోవడంలేదు. అది కూడా సిద్దేంద్రస్వామి ఆశయమే!" అన్నాను.
"రావణాసురుడు యెన్నో పాపాలు చేశాడు. ఆ పాపాలు భగవంతుడి ఆదేశమూకాదు, ఆశయమూకాదు. సృష్టిలో ఏదో వికటించి అటువంటి దుర్మార్గులు అవతరిస్తూండడం జరుగుతుంది. ఆ పాపాలు పండేరోజున పాపాత్ముడు భగవంతుడి జోలికి వెడతాడు. రావణుడు సీత నెత్తుకుని పోయాడు. మీరు నన్ను బలాత్కారం చేయాలనుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధీ...."
"అయితే?"
"ఏదో జరుగుతుంది మీకు" అంది వినీత.
"ఎప్పుడు?"
"మీరు నన్ను బలాత్కారం చేసేలోగా.... ....."
నమ్మకం ఆమె కళ్ళలో చూశాను.....అప్పటి కామె జోలికి వెళ్ళలేదు.
4
ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి నాభార్య శ్రీదేవి చాలా కంగారుగా ఉంది.
"ఏం జరిగింది?" అన్నాను.
ఆమె మౌనంగా నాకో ఉత్తరం అందించింది.
"డియర్ శ్రీదేవీ!
డియర్ అన్నానని కంగారు పడకు. నేను నీభర్త కులా దుష్టున్ని కాదు. నీకు అన్నవంటివాణ్ణి. ఇటీవల నీ భర్త దురాగతాలు పెచ్చుమీరాయి. తనది కానిధాన్ని తనది చేసుకోవాలన్న తాపత్రయం ఎక్కువయింది. తప్పులు చేసిన ప్రతివాడికీ శిక్ష తప్పదు. నీభర్త తప్పు లిలాగే కొనసాగితే అతడికి మరణశిక్ష తప్పదు. నీమాంగల్యాన్ని కాపాడుకునేందుకు కతన్ని హెచ్చరించు, అందుకే ఈ ఉత్తరం.........
నీ
అన్నయ్య...."
ఉత్తరం చదువుకుని కంగారుపడ్డాను.
అన్నయ్య ఎవరో వెంటనే తెలిసిపోయింది నాకు.
ఒక స్మగ్లింగ్ ఆపరేషన్లో అతడు, నేను ప్రత్యర్దులం, వరుసగా రెండుసార్లు అతఃడు నాచేతిలో దెబ్బతిన్నాడు. రెండుసార్లూ అతడి నష్టం తడవకు నాలుగులక్షలు. అతడి నష్టమే నాకు లాభం.
రెండోసారికూడా నష్టపోయేక అతఃడు నన్ను హెచ్చరించాడు-"నువ్వు కాలనాగుతో ఆడుకుంటున్నావు. పులిమీసాలు లాగుతున్నావు. ఫలితం ఘోరంగా ఉంటుంది. ఇంతవరకూ చేసిన తప్పులు క్షమించాను. ఇక ముందు చేసే తప్పులు క్షమించను.... ...."
ప్రత్యర్ధిగా అతణ్ణి చూడడమేతప్ప అతడెవరో నాకు తెలియదు. నేనతన్ని-"నువ్వెవరు?" అనడిగాను.
"నీభార్యను డియర్ అని పిలిచే చనువుంది నాకు. నే నామెకు అన్నయ్యని-" అన్నాడతడు. ఆ మాటలు బాగా గుర్తుండిపోయాయి నాకు.
నాభార్యకు తమ్ముళ్ళే కనీ అన్నయ్యలు లేరు. దగ్గర, దూరపు బంధువుల్లో నాకు తెలిసి ఆమెను చెల్లీ అని పిలిచేటంత చనువుగల వ్యక్తులు లేరు. శ్రీదేవి నడిగితే ఆ విషయం కన్ఫర్మ్ చేసింది.
"మీరు నిజంగా దుర్మార్గాలు చేస్తున్నారు?" అంది శ్రీదేవి.
ఉత్తరం మడిచి-"లేదు..." అన్నాను.
"చేస్తే మానేయండి........"
"శ్రీదేవి! ఈ ఉత్తరం రాసిందొక దుర్మార్గుడు. నేను చేసే మంచి పనులు నచ్చక ఇలా ఉత్తరం రాశాడు...."
"అతడెవరో మీకు తెలుసా?"
"తెలియదు.....కానీ తెలుసుకోగలను...."
శ్రీదేవికి నానుంచి ఇంకా తెలుసుకోవాలని ఉంది. నాకు మాత్రం ఆమెతో మాట్లాడాలనిలేదు. వెంటనే ప్రదీప్ కు ఫోన్ చేశాను.
కాసేపట్లో ప్రదీప్ మాయింటికొచ్చాడు. ఇద్దరం ఓ గదిలో దూరి తలుపులు వేసుకున్నాం.
ప్రదీప్ నా అంతరంగిక గూఢచారి అతడి కూళ్ళో అన్నిరకాల సమాచారమూ తెలుసు. సమాచారాన్ని సేకరించి ఉంచుకోవడం అతడి హాబీ. పోలీసులకీ, పత్రికలవాళ్ళకీ కూడా తెలియని ఎంతో రహస్యసమాచారం అతడివద్ధ ఉంటుంది.
"ఏమిటి విశేషం?" అన్నాడు ప్రదీప్.
"శ్రీదేవి అన్నయ్య ఉత్తరం రాశాడు...." అంటూ ఉత్తరం అతడి కందించాను. ప్రదీప్ ఉత్తరం చదవసాగాడు.
శ్రీదేవి అన్నయ్య గురించి ప్రదీప్ కు ముందే చెప్పాను. ప్రదీప్ అతడి గురించి నాకు కొంత సమాచారం అందజేశాడు.
అతడు చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తి. రూపాలు మారుస్తాడు. పేర్లు మారుస్తాడు. రాజకీయంగా అతడికి చాలా పలుకుబడి ఉంది. అతడు నేరాలు చేయడు. చేయిస్తాడు.
