Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 22

 

    "సుబ్బారావ్ ....నువ్వు నాకో సాయం చేయాలి!" అన్నాడు ప్రతాప్.
    "ఏమిటది?" అన్నాడు సుబ్బారావు.
    " ఈ రాత్రికి నువ్వు నా గదిలో సాయం పడుకోవాలి."
    "ఎందుకు ?" అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యంగా.
    "ఓ దెయ్యం నన్ను భయపెడుతోంది " అన్నాడు ప్రతాప్.
    "దెయ్యమా ?" అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యంగా.
    'అవును....' దీనంగా అన్నాడు ప్రతాప్.
    "సూర్యం నీకు బాగా స్నేహితుడు , అతన్నాడగక నన్నడిగావెం?"
    "సూర్యం దెయ్యాన్ని నమ్మడు. ఎవరో నన్నేడ్పించాలని చేస్తున్న కొంటేపని ఇది అని కొట్టిపారేశాడు" అన్నాడు ప్రతాప్.
    "బాగుంది నా అభిప్రాయమూ అదే!" అన్నాడు సుబ్బారావు.
    "నిన్న సూర్యం అలా అంటే నేను ధైర్యం తెచ్చుకున్నాను. కానీ రాత్రీ పన్నెండు గంటలకు మొన్నటి అనుభవమే మళ్ళీ జరిగింది...." అంటూ తన అనుభవాన్ని వివరించి చెప్పాడు ప్రతాప్.
    సుబ్బారావు ఆశ్చర్యంగా అంతా విని "ఇక్కడ దయ్యమా?" నమ్మలేను" అన్నాడు.
    "నువ్వు నమ్మలేనంటున్నావు. సూర్యం అయితే నమ్మననే అంటున్నాడు. రాత్రి పన్నెండయ్యేసరికి నా వళ్ళంతా ఎక్కడ లేని వణుకు వచ్చేస్తోంది. ఎక్కడ లేని భయమూ నన్నావహిస్తోంది. ఆ దయ్యం ఎవరో నన్నెందు కిలా పీడిస్తుందో తెలియడం లేదు...'అన్నాడు ప్రతాప్.
    'అయితే నన్నేం చేయమంటావ్ ?"
    "నాకు సాయం పడుకో."
    "ఉండు. ముకుందరావు ని పిలుస్తాను. ఈ భవనంలో  అతను చాల ఏళ్ళగా వుంటున్నాడు. అతడి ఎరుకలో ఎప్పుడైనా యిలాంటి అనుభవం వచ్చిందేమో కనుక్కుందాం " అన్నాడు సుబ్బారావు.
    "పిలవడ మెందుకూ మనమే ముకుందరావు దగ్గరకు వెడదాం" అన్నాడు ప్రతాప్.
    ఇద్దరూ కలిసి ముకుందరావు దగ్గరకు వెళ్ళారు. ముకుందరావు వీళ్ళ కధ విని ఏదో అలోచించి "అన్నట్లు నువ్వుండేది పదమూడో నంబరు గది కదూ-" అన్నాడు.
    "అవును - ఏం?" అన్నాడు ప్రతాప్ కంగారుగా.
    "నీకు ముందు అందులో జోసెఫ్ ఉండేవాడు. ఆ గది లోనికి రోజూ కామిని పిశాచి వచ్చి గాజులు గలగల లాడించేదట. దాని బాధ భరించలేకనే అతనా గది వదిలి పెట్టి వెళ్ళిపోయాడు" అన్నాడు ముకుందరావు .
    "నీకు గాజుల గలగల వినపడుతుందా?' అనడిగాడు సుబ్బారావు.
    "భయంతో శబ్దాలంతగా గుర్తు లేదు నాకు. మీరు అడుగుతుంటే అనుమానంగానే వుంది. తలుపులు బాదినప్పుడు గాజుల గలగల మన్నట్లే వుంది" అన్నాడు ప్రతాప్.
    "నువ్వు మాత్రం జోసఫ్ లా చేయకు. ధైర్యంగా వుండు" అన్నాడు ముకుందరావు.
    'ధైర్యంగా వుండాలనే వుంటోంది. కానీ గడియారంలో టైము పన్నెండయ్యేసరికి నా సర్వశక్తులూ నశించి పోతున్నాయి. శరీరం వణికిపోతోంది" అన్నాడు ప్రతాప్.
    'అయినా అస్తమానూ టైము చూసుకోవడమెందుకూ / రాత్రి తొమ్మిదింటికే ముసుగుతన్ని పడుకో -- తెల్లవారే దాకా ముసుగు తీయకు ....' అన్నాడు ముకుందరావు.
    "వెధవ దెయ్యం ఊరు కోవడం లేదు కదా తలుపులు దబదబ బాదుతోంది" అన్నాడు ప్రతాప్.
    "నీది చాలా అదృష్టం....జోసెఫ్ కైతే .....అంటూ జోసెఫ్ ని ఓర చూపులతో ఎలా కవ్వించేదో అప్పుడప్పుడు పళ్ళు బైటపెట్టి ఎలా బెదిరించేదో వివరించి చెప్పాడు ముకుందరావు.
    "చెప్పొద్దూ ప్లీజ్ ...." అన్నాడు ప్రతాప్.
    'ధైర్యంగా వుంటే ఏమీ ప్రమాదముండదు.  పిరికి వల్లనే దెయ్యా లేడ్పిస్తాయి " అన్నాడు ముకుందరావు.
    "నన్నేమన్నా ఫరవాలేదు. దయతో ఈ ఒక్క రాత్రి నన్ను కాపాడండి. నాకు సాయముండండి" అన్నాడు ప్రతాప్. ఇద్దర్నీ ఉద్దేశించి. ముకుందరావు చెప్పిన కధ విన్నాక అతడి భయం ఇంకా పెరిగినట్లుంది.
    
                                    3
    ఆ భవనంలో పాతిక గదులు కాక ఓ పెద్ద హలుంది. ఆ హల్లో ఓ వంటవాడుంటున్నాడు. అతడి పేరు సుబ్బయ్య. పదేళ్లుగా అక్కడ పని చేస్తున్నాడు. సుబ్బయ్య, భవంతి లోని వారందరికీ ఏం కావాలంటే అది చేసి పెడుతుంటాడు. సుబ్బయ్య, అతడూ, అతడి భార్య ముగ్గురు పిల్లలూ ఆ హాల్లోనే వుంటున్నారు.
    ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు ముకుందరావు సుబ్బారావు, ప్రతాప్ కలిసే భోం చేశారు. భోజనాలయ్యాక ముగ్గురూ కలిసి ప్రతాప్ గదికి వెళ్ళారు.
    "నమ్మకం ఒకందుకు మంచిదే. కానీ -- దానివల్ల కూడా కష్టాలు కూడా వున్నాయి " అన్నాడు ముకుందరావు.
    "ఏం?" అన్నాడు ప్రతాప్.
    "ఒకడు దేవుణ్ణి నమ్మాడనుకో ప్రాణం సుఖంగా వుంటుంది. ఏ బాధలు వచ్చినా వాడు చలించడు. అన్నీ  దేవుడికి వదిలి నిశ్చింతగా ఉండగల్గుతాడు. నమ్మకం అలాంటిది. నువ్వు దెయ్యాన్ని నమ్మావు , అనుక్షణం దాని గురించి బ్రాంతి పడి సుఖ శాంతులు కోల్పోతున్నావు అన్నాడు ముకుందరావు.
    'అయితే నేను భ్రాంతి పడుతున్నానంటావా? జోసెఫ్ సంగతేమిటి?" అన్నాడు ప్రతాప్.
    "మీ నమ్మకమే మీకా బ్రాంతి ని కలిగిస్తూ వుంటుంది. ఉదాహరణకు జోసెఫ్ సంగతి తీసుకో... అతడి గదిలో దెయ్యాన్ని చూడ్డం కోసం నేనొక్క డిని నాలుగు రాత్రులు న్నాను. అది నా కంట బడలేదు. కారణమేమిటంటావ్?"
    "జోకులేయడానికి మనుషులు వెర్రి వెధవల్ని అనుకున్నట్లే, దెయ్యాలు కూడా భయస్తుల్ని ఎన్నుకుంటాయేమో" అన్నాడు సుబ్బారావు.
    'అయినా నువ్వు దైవ భక్తుడివి కదా --" నీకు భయమేమిటి?" అన్నాడు ముకుందరావు . అతడా గదిలో వున్న దేవుడి బొమ్మలను పరీక్షగా చూస్తున్నాడు.
    "ఎన్ని బొమ్మలుంటే ఏం లాభం? ఆంజనేయస్వామి బొమ్మ లేదుగదా!" అన్నాడు ప్రతాప్ దిగులుగా .
    "సరే -- ఇది కూడా నమ్ముతున్నావూ! హిందువులకి ఆంజనేయుడి గురించి తెలుస్తుంది. మరా దెయ్యం ఏ ముస్లిం దో అయితే ....?" అన్నాడు ముకుందరావు.
    "ఓ పని చేయి. ఈరోజుకా దెయ్యం ఏ మతంతో తెలుసుకుందుకు ప్రయత్నించు. దాన్ని బట్టి నివారాన ఉపాయం ఆలోచిద్దాం" అన్నాడు సుబ్బారావు.
    'దెయ్యం గురించి తలచుకుంటేనే ప్రాణం పోయేలా వుంటే పలకరించి మతం తెలుసుకోమంటున్నావ్! పలకరించే ధైర్యముంటే ఈ బాధంతా ఎందుకు?" అన్నాడు ప్రతాప్.
    "దెయ్యాలు లేవని నీ మనసును నమ్మించు, నీకే భాధ వుండదు" అన్నాడు ముకుందరావు.
    క్రమంగా టైము పన్నెండు దాటింది. మాటల్లో ఎవరికీ టైము తెలియలేదు. టైము పన్నెండు పావయ్యేక "ఇప్పటికైనా ధైర్యం వచ్చిందా?" మమ్మలిక్కడే పడుకోమంటావా?" అన్నాడు ముకుందరావు.
    "ఇంక ఫరవాలేదు. మీరు వెళ్ళండి" అన్నాడు ప్రతాప్ బింకంగా.
    ముకుందరావు, సుబ్బారావు బైటకు వెళ్ళారు. ప్రతాప్ తలుపులు వేసుకుని మంచం వైపు నడిచాడు. కిటికీ దగ్గర ఏదో ఆకారం కదలినట్లయింది. మనసుకో మూల ధైర్యం చెప్పుకుంటూ , చూడకూడదనుకుంటూనే అటు చూశాడు ప్రతాప్.
    వాడి గోళ్ళున్న రెండు చేతులు కిటికీ అద్దాల వెనుక భయంకరంగా కదుల్తున్నాయి. ప్రతాప్ కి భయంతో నోట మాట రాలేదు. అతడికి ముందడుగు కూడా పడలేదు.  కాని అతడు కిటికీ వైపు చూడకుండా కళ్ళు మూసుకున్నాడు గట్టిగా!
    అంతలోనే ఒక విచిత్రమైన అరుపు వినపడింది.
    అది కూడా కిటికీ దగ్గర్నుంచే వచ్చింది. ఆ ప్రయత్నంగా ప్రతాప్ కిటికీ వంక చూశాడు.
    అక్కడి ఆకారం అతడి వంక భయకరంగా చూస్తోంది. అది కిటికీ లోంచి గదిలోకి రానున్నాదని అతడికి అర్ధమైపోయింది.
    ప్రతాప్ కెవ్వుమని అరిచి ఒక్క ఉదుటున గుమ్మం దగ్గరకు చేరి తలుపులు తీసుకుని బైటకు వచ్చాడు. అతడి చెవులకు దూరంగా ముకుందరావు కంఠం వినిపించి ఒక్క అంగలో అతనటు చేరాడు.
    అతడు చేరుకున్నది భోజనాల హాలు! అక్కడ ముకుందరావు, సుబ్బారావు , వంటవాడు సుబ్బయ్య ఏవో మాట్లాడుకుంటున్నారు. ముందు సుబ్బయ్య ప్రతాప్ ని పలకరించి "ఏం జరిగింది బాబూ అలా కంగారుగా వున్నారు" అన్నాడు.
    ప్రతాప్ ఎంతో కష్టం మీద ప్రయత్నించి "దెయ్యం అని మాత్రం అనగలిగాడు.
    దెయ్యం అన్న పదం వింటూనే సుబ్బయ్య ఉలిక్కిపడి "అయ్యబాబోయ్ మళ్ళీ వచ్చిందా అది!" అన్నాడు. ఆ మాట వింటూనే అతడు వణికిపోసాగాడు.
    ముకుందరావు ఆశ్చర్యంగా అతడి వంక చూసి "నీకూ తెలుసా దెయ్యం కధ!" అన్నాడు.
    "రెండేళ్ళ క్రితం చూశాను బాబూ!" అన్నాడు సుబ్బయ్య.
    ఓ రాత్రి పడుకొంటే ఎవరో చప్పట్లు చరిచింనట్లయిందిట. మెలకువొచ్చి చూస్తె ఓ అందమైన ఆడపిల్ల జుట్టు విరబోసుకుని , తెల్లచీర కట్టుకుని తనకు కాస్త దూరంలో నిలబడి వుందట. సుబ్బయ్యను చూసి నవ్విందట. సుబ్బయ్య అనుమానం వచ్చి కాళ్ళ వైపు చూశాట్ట. అవి వెనక్కు తిరిగి వున్నాయట. అప్పుడు తనకు కల్గిన భయం ఇంతా అంతా కాదుట. అతికష్టం మీద ప్రయత్నించి "ఆంజనేయా!" అని పెద్దగా కేక పెట్టాట. దెయ్యం నాలిక బైటకు పెట్టి భయంకరంగా వెక్కిరించి మాయమైపోయిందట. ఈ కధ తెల్సుకోడానికే భయంకరంగా వుండడం వల్ల సుబ్బయ్య మరింకెవరికీ చెప్పలేదుట.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS