"ఈ నాగు జామచెట్టుకు ఆపిల్సు కాయిస్తాడు. కానీ ఆడినమాట మాత్రం తప్పడు."
6
"అమ్మా! నన్ను అప్సర పిలుస్తున్నది-" అన్నాడు సురేంద్ర.
"బాగుంది నాయనా-ఆ అమ్మాయి పిలవడమూ- నువ్వు వెళ్ళడమూ-" అంది సులోచన చిరాగ్గా.
మహాలక్ష్మి నవ్వి-"చూడండి వదినగారూ-మన మెలాగూ వియ్యమందబోతున్నాము. ఈనాటి కుర్రాళ్ళ సంగతి మనకు తెలియదు. వాళ్ళకేమేం మాట్లాడుకోవాలనుకుంటుందో-ఏకాంతంలో మాట్లాడుకోవడమే బాగుంటుంది-" అన్నది.
సులోచన ఇబ్బందిగా నవ్వి-"మగపిల్లల విషయంలో నాకంత పట్టింపు లేదుకానీ-ఆడపిల్లల విషయంలో మాత్రం ఇలా నచ్చదు నాకు. మీ అమ్మాయి విషయం మీ యిష్టంకానీ"....అని ఆగిపోయింది.
వాసుదేవరావు కూడా-"ఏ ఏకాంతమైనా పెళ్ళయ్యాక-మా మాటలకు ఏకాంతం అక్కర్లేదు-" అన్నాడు.
"మీ అమ్మాయిమీద మీకు నమ్మకం లేకపోతేసరే-మా అమ్మాయిమీద నాకా మాత్రం నమ్మకముంది-" అన్నది మహాలక్ష్మి.
"మనిషిని నమ్మొచ్చుకానీ వయసును నమ్మకూడదు పిన్నీ-" అన్నాడు వాసుదేవరావు. వీళ్ళ మాటలు జరుగుతుండగానే సురేంద్ర ఏకాంతానికి పక్కగదిలోకి వెళ్ళిపోయాడు. గదిలో అప్సర కూర్చుని వుంది.
"అంతమందిలో మీతో మాట్లాడాలంటే నాకు సిగ్గు-" అన్నదామె.
"అంతమంది వుండగా మనమిద్ధరమూ ఏకాంతంగా ఇక్కడ వున్నామంటే సిగ్గుగా లేదా?" అన్నాడు సురేంద్ర.
"లేదు-" అంది అప్సర అదోలా నవ్వుతూ-"మీతో ఏకాంతమంటే నేను స్వరమూ మరిచిపోతాను. ఒక మగవాన్ని ఇంతలా ప్రేమిస్తానని మిమ్మల్ని చూసేదాకా అనుకోలేదు-"
సురేంద్ర ముఖంలో గర్వం తొంగిచూసింది-"బయట అమ్మ కూర్చుని వుంది. అందుకని నాకు కాస్త సిగ్గుగానే వుంది-"
"మీకంత సిగ్గుగా వుంటే వాళ్ళక్కనిపించేలా గది గుమ్మం దగ్గర కూర్చుందాం-" అంది అప్సర. సురేంద్రకది సబబనిపించింది. ఇద్దరూ గది గుమ్మందగ్గర కూర్చుని కబుర్లారంభించారు.
సురేంద్ర తల్లి సులోచన ఆశ్చర్యంగా ఆ జంట నే చూస్తోంది. అప్సర వ్యవహారం ఆమెకు నచ్చలేదు. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో ఏకాంతాన్నభిలషిస్తున్న అప్సరా, ఈ విషయాన్ని పూర్తిగా సమర్ధిస్తున్న అప్సర తల్లి మహాలక్ష్మీ ఆమెకు చాలా విచిత్రంగా తోచారు. అసలారోజు మధ్యాహ్నంనుంచీ ఆమెకు తెలిసిన వివరాలన్నీ ఆశ్చర్యజనకంగానే వున్నాయి.
వాసుదేవరావు మహాలక్ష్మికి అక్క కొడుకు. పిన్ని బాబాయిలంటే అతను ప్రాణం ఇస్తాడు. ఎలాపడ్డాడో సురేంద్ర అప్సర ప్రేమలోపడ్డాడు. సంగతి తెలిసిన వాసుదేవరావు వీళ్ళ ప్రేమ ఫలింపజేయడంకోసం తను కట్నం లేకుండా దేవీబాలను పెళ్ళిచేసుకోవాలను కున్నాడు. ఈ మాటలు మాట్లాడ్డానికే మహాలక్ష్మి తన్ను వచ్చు పిల్చికెళ్ళింది. మహాలక్ష్మి భర్త - తన భర్తను పిల్చుకురావడానికి బ్యాంకుకు వెళ్ళాడట. మనిషింకా తిరిగిరాలేదు కానీ కబురు వచ్చింది. సుబ్బారావు తను వచ్చేసరికి కాస్త ఆలస్యమైనా యెదురుచూస్తూ అందర్నీ ఇక్కడే వుండమన్నాడట.
సాయంత్రం ఏడుగంటలైనా భర్త రాలేదు. సురేంద్రను పంపి కబురు తెలుసుకోమందామా అంటే- అతడికి కదిలే మూడ్ వున్నట్లు లేదు. అప్సరసతో కబుర్లు చెబుతూ అక్కణ్ణించి కదలడానికేమాత్రమూ సుముఖంగా లేడు. సాయంత్రమైనప్పట్నించీ-సులోచనకు ముళ్ళమీద కూర్చున్నట్లుంది. టైము ఎనిమిదిన్నరయ్యేక ఆమె మహాలక్ష్మితో-"చూడండి-మరీ ఆలస్యమైపోతోంది-ఎందువల్లనో ఆయనింకా రాలేదు. నేను మళ్ళీ మరోసారి వస్తాను-" అని లేచింది.
మహాలక్ష్మి కూడా పెద్దగా అభ్యంతరపెట్టలేదు- "సరేలెండి వదినగారూ- మీకిష్టమైతే మా యిల్లు చిన్నదేంకాదు. మీకు పక్కలూ అవీ ఏర్పాటు చేసేస్తాను. మీకు వెళ్ళిపోవాలంటే మాత్రం నాకేమీ అభ్యంతరం లేదు-"
సురేంద్ర కూడా అయిష్టంగానే అక్కణ్ణించి కదిలాడు. దేవీబాల తల్లినీ, అన్ననూ అనుసరించింది.
7
సుబ్బారావు ఆశ్చర్యంగా చూశాడు. ఆయనకు నమ్మశక్యంలేదు-"ఎక్కన్నించి వస్తున్నారు?" అనడిగాడు కుటుంబాన్ని.
సుమారు పావుగంట వ్యవధిలో ఆ రోజు జరిగిన వివరాలన్నీ తెలిశాయాయనకు. తన భార్యాబిడ్డలు వాళ్ళకు తెలియకుండానే ఇంతవరకూ నిర్భంధంలో వున్నారని గ్రహించడాని కాయనకెంతోసేపు పట్టలేదు.
"అయితే తప్పకుండా ఆ యింటికోసారి వెళ్ళి రావాలి-" అన్నాడు సురేంద్రవంక చూస్తూ ఆయన. ఆ యింటికి మరోసారి వెళ్ళాలని సురేంద్ర మనసులో కూడా వుంది. అతను వెంటనే అంగీకార సూచనగా తలాడించాడు.
"కాస్త ఎబ్బెట్టుగా తోచినా-వాళ్ళు మంచివాళ్ళే అనుకుంటానండీ. మర్యాదలు బాగానే చేశారు-" అంది సులోచన భర్త వెళ్ళడానికి అంగీకారాన్ని సూచిస్తూ.
సురేంద్ర, సుబ్బారావు కలిసి మళ్ళీ ఆ యింటికి వెళ్ళారు. సుబ్బారావు కాస్త వెనుకగా నిలబడివుండగా సురేంద్ర వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. మరుక్షణం లోనే తలుపు తెరుచుకుంది. సురేంద్రను చూసి-"మీరు మళ్ళీ నా కోసం వస్తారని అనిపించింది. మనది జన్మజన్మల అనుబంధమనుకుంటాను-" అంది తలుపు తెరచిన అప్సర.
"మా నాన్న గారు కూడా వచ్చారు-" అన్నాడు సురేంద్ర మనసులో మాత్రం అప్సర దర్శనం త్వరగానే అయినందుకు సంతోషపడుతూ.
అప్సర ముఖంలో వెలుగు కనబడింది-"మా నాన్నగారు కూడా ఇప్పుడే వచ్చారు. లోపలకు రండి-" అంది. ముందు సురేంద్ర, వెనుక సుబ్బారావూ ఆ ఇంట్లో ప్రవేశించారు.
క్షణాల మీద ఆ యింటి సభ్యులతో సుబ్బారావుకు పరిచయమైంది. వాసుదేవరావాయనకు నమస్కరించి-"ఇదివరలో కట్నం గురించి నొక్కించి మీ మనసు నొప్పించాను. మీరు నన్ను క్షమించాలి-" అన్నాడు.
సుబ్బారావు ఆశ్చర్యంలో వున్నాడు. ఆయనూహించిన ప్రకారం-మహాలక్ష్మి భర్త-నాగు అయుండాలి. కానీ ఆయన అంచనా తప్పయింది. మహాలక్ష్మి భర్త పేరు సూర్యనారాయణ. ఆయనకూ నాగుకూ ఎక్కడా పోలికలు లేవు. మనిషి చూస్తే చాలా అమాయకుడిలా గున్నాడు. ఆ యింట్లో పదినిమిషాలు గడిపితే-యింటి వ్యవహారాలన్నీ భర్త జోక్యం లేకుండా మహాలక్ష్మి తనే చూసుకుంటుందని అర్ధమైపోతుంది. సుబ్బారావుగారు పదినిమిషాలేం కర్మ-సుమారు అరగంటసేపక్కడ గడిపాడు.
అప్సర తన కథ ఆయనకు వివరంగా చెప్పేసింది. తనూ, సురేంద్రా ప్రేమించుకున్నారు. పెళ్ళి ప్రసక్తి ఎత్తేసరికి తన తల్లిదండ్రులకు కట్నం పట్టింపు బాగా వున్నదని సురేంద్ర చెప్పేశాడు. ముఖ్యంగా చెల్లె పెళ్ళి కోసం కట్నం చాలా అవసరపడిందని అతడు చెప్పి-కట్నం లేకనే-వాసుదేవరావుతో పెళ్ళి ఆగిపోయిన ఉదంతం చెప్పాడు. వాసుదేవరావు వివరాలు విన్న మీదట-అతడు తన పెద్దమ్మ కొడుకేనని అప్సర గ్రహించింది. వాసుదేవరావు చదువంతా మహాలక్ష్మి ఇంట్లోనే అయింది. వాళ్ళ అనుబంధం చెప్పుకోతగ్గది. వెంటనే ఆమె తల్లికి అన్ని వివరాలూ చెప్పింది. వాసుదేవరావుకు కబురు వెళ్ళింది. అతను వచ్చాడు.
ఈ కథలన్నీ వింటూంటే-నాగుకీ వీళ్ళకీ సంబంధముండి వుండవచ్చునని సుబ్బారావుకు అనిపించడంలేదు. అలా అని అంతా కాకతాళీయంగా జరిగిందన్నా నమ్మబుద్ది కావడంలేదు.
