Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 22

 

    
                                   3
    ఇంటాయన తెల్లవారు జామునే లేచి వెళ్ళి పోయాడు. నేను ఉదయం పదిగంటల ప్రాంతంలో నా ఆఫీసు పని మీద బయటకు వెళ్ళాను. పార్వతి కోసం స్టేషన్ కు వెళ్ళదల్చుకోలేదు. కాబట్టి -- బయటకు వెళ్ళ బోయే,ముందు - తాళం కప్పకు ఓ ఉత్తరం రాసి పెట్టాను. అందులో శ్రీధరబాబు ఉళ్ళో లేని సంగతి రాసి - నేను ఇంటికి వచ్చే టైము కూడా ఇచ్చాను.
    హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ఇక్కడకు సుమారు నాలుగు గంటలకు వస్తుంది. నా ఆఫీసు పని కూడా నాలుగు గంటలకే అయింది. స్టేషన్ కు ఫోన్ చేసి ట్రయిన్ లేట్ ఏమో కనుక్కున్నాను. ఆ రోజు కరెక్టు టైముకే వచ్చిందిట. నేను టైము గుణించు కున్నాను.
    పార్వతి స్టేషన్లో దిగి కాసేపు అన్న గురించి ఎదురు చూస్తుంది. ఆతర్వాత నెమ్మదిగా అలోచించి మరి అన్నరాడని గ్రహించడానికి కనీసం ఒక అరగంటైనా పడుతుంది. అప్పుడామే విసుక్కుంటూ ఏ రిక్షా లోనో గదికి బయల్దేరుతుంది. ఇదంతా జరిగి ఆమె గదికి చేరుకునేసరికి సుమారు అయిదవుతుంది. ఉదయం చీటిలో అయిదున్నరకు వస్తానని రాసినా ఓ పావుగంట ముందుగా వెళ్ళడం మంచిదని తోచింది.
    నాలెక్క తప్పలేదు. నేను వెళ్ళే సరికి ఇంటి వరండాలో - ఒక యువతి కూర్చుని ఉంది. ఆ ఇంటికి అదే వరండా , అదే వీధి అరుగు అని చెప్పవచ్చు. ఎదురు గుమ్మం ఇంటాయనది. ప్రక్క గుమ్మం శ్రీధరబాబుది!
    ఆ యువతిని చూస్తూనే నేను తెల్లబోయాను. ఆమె అందంలో అప్సరస. చూసిన క్షణంలో అంతకు మించి మరే ఆలోచనా బుర్రలో కదలలేదు.
    నేనూ ఆ ఇంటి వరండాలో అడుగిడుబోతుండడం చూసి ఆమె అసహనంగా నావంక చూసి -- "మీరేనా అన్నయ్య స్నేహితుడు?" అనడిగింది.
    తియ్యని పలుకులు వింటూ కూడా - సమాధాన మేలా ఇవ్వగలిగానో నాకు ఆశ్చర్యమే మరి "శ్రీధరబాబు చెల్లెలు మీరే నన్నమాట!" అన్నాను.
    "చెల్లెలు అనే అనుకోండి" అని ఆమె అదోకలా నవ్వింది. "ఇంతకీ అన్నయ్య ఎప్పుడు వస్తాడు?"
    "రెండు లేక మూడు రోజులు "
    "బాప్ రే!" అందామె చిరాకును వ్యక్తపరుస్తూ.
    "ముందు గదిలోకి పదండి!" అన్నాను నేను ముందడుగు వేసి .
    తలుపు తాళం తీశాను ఆమె లోపలకు ప్రవేశించింది చిన్న సూట్ కేస్ తో.
    "ఇటువంటి పరిస్థితి వస్తుందని బాబు ఊహించలేదు. లేకపోతె నీగురించి ఏదో మంచి ఏర్పాటు చేసి ఉండేవాడు. టెలిగ్రాం కూడా అతను లేని సమయంలో వచ్చింది . మరి ఇప్పుడింక ఒకటే ఉపాయం. మీరిక్కడ హాయిగా మకాం పెట్టుకోండి . మీ అవసరాలన్నీ నేను చూస్తుంటాను. రాత్రిళ్ళు నేనిక్కడేనా పడుకునే ఏర్పాటు చేసుకుంటాను" అన్నాను.
    ఆమె తమాషాగా నవ్వి - "మొత్తానికీ మగవాడినిపించారు. చచ్చి ప్రయాణం చేసి నేను వస్తే మీరు రాత్రి గురించి ఆలోచిస్తూ న్నారు ." అంది.
    దెబ్బ తిన్నాను- అయినా లొంగకుండా --" నిజం చెప్పాలంటే మీరు ప్రయాణం చేసి వచ్చేరని పించడం లేదు. పువ్వులా ఇంత పిసరు నలగకుండా వచ్చారు "-- అన్నాను.
    ఆమె ముఖంలో రవంత గర్వం లాంటిది కనబడింది . - "బాగానే ఉంది మీ పొగడ్త! కానీ పెళ్ళి కాని ఆడది నలిగిన పువ్వులా ఉంటుందని ఎలాగానుకున్నారో నాకు మాత్రం తెలియడం లేదు."
    మళ్ళీ దెబ్బ తిన్నాను. ఘటికురాలే శ్రీధరబాబు చెల్లెలు అనుకున్నాను. ఈమె దగ్గర నాకింత పిసరు కూడా బెరుకు అనిపించడం లేదు. ఈజీగా మాట్లాడగలుగుతున్నాను. మనిషి ఫ్రీగా మసులుతుంది .- "మీతో మాట్లాడటం కష్టం. ప్రస్తుతం మీగురించి నేనేం చేయవలసి ఉందొ చెప్పితే అలా మసులుకుంటాను." అన్నాను వినయంగా.
    "దారికి వచ్చారు. అయితే ఈగదికి నేను యజమానిని. నా అన్నయ్య కు అతిధి కాబట్టి మీరు నాకూ అతిధే అవుతారు. అతిధి మర్యాదలు చేయడం నాకు బాగా తెలుసు. ముందు మీరలా కుర్చీలో కూర్చోండి అతిధుల్ని నిలబెట్టి మాట్లాడకూడదు "- అందామె చనువుగా.
    "నేను వెళ్లి కుర్చీలో కూర్చున్నాను. ఆమె కదిలి శ్రీధర బాబు మంచం మీద కూర్చుంది "- ఇప్పుడు ,మనం కాసేపు ఏవైనా కబుర్లు చెప్పుకుందాం -" అందామె అదోకలా వళ్ళు విరుచుకుంటూ.
    ఉండిండీ ఉండుండి ప్రక్క దారులు పడుతున్న మనసును నిలదొక్కుకుంటూ -- "కబుర్లా కధలు కూడానా?" అనడిగాను.
    "కధలే అనుకోండి - కాకపోతే కధ లాంటి కబుర్లు "-----
    "అయితే నాకు చేత కాదు, మీరే చెప్పాలి!' అన్నాను.
    'అర్ధమైంది లెండి -- మీకు నాతొ మాట్లాడం ఇష్టం లేదు-" అందామె కాస్త కోపంగా.
    'అలాగని ఎందుకనుకుంటున్నారు? మీరు మాటాడుతుంటే అలా వింటూ ఉండి పోవాలనిపించడం జరగవచ్చు కదా !" అన్నాను.
    చప్పట్లు కావాలంటే రెండు చేతులూ కలవాలి. సంభాషించాలంటే కనీసం ఇద్దరు మాట్లాడాలి."
    "మాట్లాడ్డానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్క మనవి, మీకూ నాకూ ఇంతవరకూ ఏ విధమైన పరిచయమూ లేదు. అందులోనూ మీరు అడ, నేను మగ . విచిత్ర పరిస్థితుల్లో మనమిక్కడ కలుసుకున్నాం. ఇవన్నీ కాస్త సంకోచానికి సరైన కారణాలు కావంటారా ?" అన్నాను.
    ఆమె భావగర్బితంగా నావైపు చూసింది -- " ఒప్పుకున్నాను. కానీ నేను కాస్త ధోరణి మనిషిని. కొత్త, పాత అని లేకుండా ఎవరితోనైనా గంటల తరబడి మాట్లాడేయగలను. అలా మాట్లాడాలనే నాకుంటుంది కూడా. కానీ అస్తమానం అవకాశం కలిసి రాదు. మంచి ఉత్సాహంతో కబుర్లు చెప్పుకునే సమయంలో.....అబ్బ ఈ పెద్ద వాళ్ళున్నారు చూశారూ - పానకంలో పుడకల్లా అడ్డు పడుతారు."........
    నేనామెను మధ్యలొ ఆపి " -- "ఇంతకూ మీ అన్నయ్య కూడా మీరంటున్న పెద్దల్లో ఒకడా?" అనడిగాను.
    "అనే అనుకోండి -" అందామె నవ్వి.
                                    4
    
    ఆమె స్నానం చేస్తానంది. ఆ సమయంలో నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తానని చెప్పి బయట పడ్డాను.
    పార్వతి ప్రవర్తన కాస్త చిత్రంగానే ఉంది నాకు. మనిషి చాలా అందంగా ఉంది. కంఠం తియ్యనిది. డాషింగ్ నేచర్ ఉంది. శ్రీధరబాబు తన చెల్లెలు ప్రసక్తి ఇతరులు తీసుకువస్తే సహించలేకపోవడానికి పార్వతి స్వభావానికి ఏదైనా సంబంధముందా అన్న అనుమానం నాకు లీలగా తోచింది.
    దొసేలూ, ఇడ్లీ పార్శేల్ కట్టించుకుని నేను గదికి వెళ్ళి తలుపు తట్టేసరికి  తల అరబోసుకుని ఉన్న పార్వతి తలుపు తీసింది. ఆ రూపంలో ఆమె చాలా చాలా అందంగా ఉండడం వల్ల నేను ఒక్క క్షణం పాటు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను.
    "తలుపులు తీశాను మరి. మీరు లోపలకు రావడం లేదు --' అందామె.
    ఆమె మాటల్లో నాకు రెండర్ధాలు ధ్వనించాయి. తన హృదయపు తలుపులు తెరిస్తే నేను సంకోచిస్తున్నట్లుగా ఆమె అన్నట్లు నాకు అనిపించింది. నేను గదిలో అడుగు పెట్టి మళ్ళీ తలుపు వేస్తూ ముందడుగు వేస్తూ కూడా ఆమెను అలా కళ్ళప్పగించి చూస్తున్నాను.
    ఆమె మంచం మీద కూర్చుంది. నేను కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు నాకు పార్వతి గురించి టిఫిన్ తెచ్చిన విషయం స్పురణకు వచ్చి లేచి వెళ్ళి "మీకోసం టిఫెన్ తీసుకువచ్చాను -" అంటూ ఆమెకు పొట్లాలు అందించాను.
    ఆ అందించడంలో ఇద్దరి చేతులూ కొద్దిగా తగిలాయి. అస్పర్శలోని మధురాను భూతిని వర్ణించలేను. కానీ ఒకసారి ఆమెను దగ్గరగా లాక్కోవలనిపించింది. నామేదడులోని ఆలోచన ఇంకా ఒక రూపానికి వచ్చేలోగానే -- సుదర్శనం గుండెల మీద కూర్చుని అతగాడి గొంతు నులుముతున్న శ్రీధర బాబు రూపం భయంకరంగా స్పష్టంగా ఊహలో కనిపించింది. చటుక్కున వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. పార్వతిని శ్రీధర బాబు చెల్లెలిగా గుర్తించడం జరగడంతో నేను పూర్తిగా నార్మల్ గా వచ్చాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS