Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 22


    "నీ కల్లోని హంతకుణ్ణి ఎలా పట్టుకునేది? వాడు కనబడుతాడని గ్యారంటీ ఏమిటి?" అన్నాడు రవి బాధగా.
    "బాగుంది కలలోని హతురాలు కనబడగాలేంది- హంతకుడు మాత్రం ఎందుకు కనబడడు-అందుకు సమయం కోసం వేచిచూడాలి-అంతే!" అంది సుజాత.
    రవి ఒకక్షణం ఆలోచించి "నా దగ్గర శాంతికి సంబంధించిన ఫోటోలు చాలా వున్నాయి. ఆమెకూ, నాకూ తెలిసిన వాళ్ళని ఎందరివో ఫోటోలున్నాయి. అందులో ఎక్కడైనా హంతకుడి ఆచూకీ పట్టుకోగల వేమో చూస్తావా?" అన్నాడు.
    "కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారు మీరు" అన్నాడు సుజాత తండ్రి.
    "ఆ ఈక మీరు కాకూడదని నా ఆశ-" అన్నాడు రవి.
    రవి, సుజాత అక్కణ్ణించి వెళ్ళిపోతూంటే "నా ముందు ఎంత వినయంగా వుండేవాడు? ఈ వెధవిలా తయారౌతాడని నేననుకోలేదు" అన్నాడు సుజాతతండ్రి.
    "వాడిప్పుడు మనలో లేడండీ తనేం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. వాడి మనస్సు పూర్తిగా చెదిరిపోయింది. మీరేమీ అనుకోనంటే ఒకమాటగుతాను. ఆ పిల్ల మాయం కావటానికి మీరేమయినా చేశారేమిటి?"అంది సుజాత తల్లి.
    "బాగుంది. ఆఖరికి నువ్వుకూడా నన్ననుమానిస్తున్నావన్నమాట" అన్నాడు సుజాత తండ్రి బాధగా నిట్టూర్చి.
    "అనుమానించడం కాదండీ. ఇలాంటివి మీకు అలవాటే కదా."
    "నోర్ముయ్" అన్నాడు సుజాత తండ్రి కోపంగా-"కాబోయే కోడల్ని చంపాలనుకునేటంత కిరాతకున్ని కాను నేను. ఆ మాటకొస్తే మీ ఆడవాళ్లే ఇంకా ఘోరం. కాపురానికి వచ్చిన కోడల్ని రాచి రంపాన పెట్టి చంపుతారు."
    ఇక్కడ వీళ్ళిలా మాట్లాడుకుంటూండగా రవి, సుజాత తిరిగివచ్చారు. సుజాత నిరుత్సాహంగా తలాడిస్తూ "అంత సులువుగా దొరుకుతాడా హంతకుడు! అనుమానించదగ్గ ఫోటో ఒక్కటీ కనబడలేదు" అంది.
    
                                    7

    రవి, సుజాత కలిసి శాంతి ఇంటికి బయల్దేరారు.
    శాంతి పేదయింటి బిడ్డ. తండ్రి ఎలిమెంటరీ స్కూలు టీచరు. ఆయనకు అయిదుగురు పిల్లలు. అందరిలోకీ పెద్దది శాంతి.
    రవిని చూస్తూనే శాంతి తల్లి పెద్దగా శోకంపెట్టింది. శాంతి తండ్రి కళ్ళొత్తుకున్నాడు. రవి జేబులోంచి రుమాలు తీశాడు. సుజాతక్కూడా బాధ వచ్చింది.
    సుజాతను చూసేక శాంతి తల్లిదండ్రుల బాధ హెచ్చుఅయింది. హాయిగా ఆమెకులాగే తనూ కాపురం చేసుకుంటూ ఉండాల్సిన పిల్ల లేకుండా పోయిందిగదా అని ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దుఃఖం సహజమే మరి! సుజాతకు మాత్రం శాంతి చాలా దురదృష్టవంతురాలనిపించింది. అయితే ఆ దురదృష్టవంతురాలు తన కలలో కెందుకు వచ్చింది?
    రవి తను వచ్చిన పని చెప్పాడు. సుజాత కలగురించి మాత్రం చెప్పలేదు.
    "మా ఇంట్లో ఆల్బం లేదు బాబూ-ఫోటోలు తీసుకునే స్తోమతులేదు మాకు" అన్నాడు శాంతి తండ్రి నొచ్చుకుంటూ.
    "శాంతిగురించి తెలుసుకునేందుకు ఆమెను సన్నిహితులయిన వారందరి గురించీ తెలుసుకోవాలి. కానీ ఎక్కడా ఏ ఆధారాలూ దొరకడం లేదు" అంది సుజాత.
    "శాంతికో స్నేహితురాలుందమ్మా పేరు మాధురి. ఆమెదగ్గర ఎన్నో ఫోటోలున్నాయి. ఓసారి శాంతి వాళ్ళ ఆల్బం తీసుకొచ్చి ఇంట్లో అందరికీ చూపెట్టింది. అందులో శాంతినీ, శాంతిని తెలిసినవాళ్ళవీ ఎన్నో ఫోటోలున్నాయి" అంది శాంతితల్లి.
    రవి మాధురి అడ్రస్ అడిగి తీసుకున్నాడు. ఇద్దరూ అక్కన్నించి బయల్దేరారు.
    "గడ్డిమేట్లో సూదిని వెతుకుతున్నామేమో!" అంది సుజాత.
    "అదైనా ఫరవాలేదు. కానీ గాలిని పోగుచేసి మనిషిగా చేయాలనుకుంటున్నామేమోనని భయంగా వుంది" అన్నాడు రవి.
    "ఏది ఏమైనా నా కలగురించి మాత్రం రహస్యంగానే వుంచు. ఎవరైనా వింటే నువ్విలా నవ్వగలరు...." అంది సుజాత.
    ఇద్దరూ వెళ్ళేసరికి మాధురి ఇంట్లోనే వుంది. ఇంట్లో తనుతప్ప ఇంకెవ్వరూ లేరని చెప్పిందామె. రవి తాను వచ్చిన పని చెప్పాడు. వెంటనే అయిదారు ఆల్బమ్స్ తీసుకువచ్చి వాళ్ళముందు పడేసింది మాధురి. ఆల్బమ్స్ చూస్తూండగా మాధురి మంచినీళ్ళు తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ సమయంలో పక్కగదిలో ఏదో జరిపడిన చప్పుడైంది.
    "ఏ పిల్లో అయుంటుంది" అనుకుంటూ సుజాత లేచి పక్కగదిలోకి చూడ్డానికి వెళ్ళింది. రవి ఆల్బమ్స్ వైపు శ్రద్దగా చూస్తూ సుజాతకు చూపవలసిన మగవాళ్ళ ఫోటోలకోసం వెదుకుతున్నాడు. వాటిలో మగవాళ్ళ ఫోటోలు చాలా ఎక్కువగా వున్నాయి. అంతలో.....
    "కెవ్వు"మని అరిచి పరుగెత్తుకుంటూ వచ్చింది సుజాత.
    "ఏం జరిగింది చెల్లాయ్?" అన్నాడు రవి.
    సుజాత మాట్లాడలేక ఆయాసపడుతోంది. ఈలోగా అక్కడికి మాధురికూడా వచ్చి "ఏమిటండీ, ఏదో పెద్ద కేకలా వినబడింది" అంది.
    "పక్కగదిలో ఏదో జారిపడిన చప్పుడైతే చూడ్డానికి వెళ్ళాను. ఎవడో మగవాడు ఆ గదిలోంచి వెళ్ళిపోతూ చటుక్కున వెనక్కుతిరిగాడు. అప్రయత్నంగా నేను కెవ్వుమన్నాను. ఎవరండీ అతను?" అంది సుజాత.
    మాధురి ముఖం మాడిపోయింది. ఆమె తత్తరపాటును అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ "మీరు భ్రమపడ్డారేమోనని నా అనుమానం. ఈ యింట్లో ప్రస్తుతం నేను తప్ప ఇంకెవ్వరూ లేరు" అంది.
    "అయితేవాడు ఏ దొంగో, హంతకుడో అయుంటాడు" అన్నాడు రవి.
    సుజాత మాత్రం "ఏమోలే అన్నయ్యా నేను భ్రమపడేవుంటాననుకుంటాను" అంది.
    "అదే నా అనుమానం కూడా" అంది మాధురి.
    మళ్ళీ అందరూ ఆల్బమ్స్ చూడసాగారు. కాసేపటికి సుజాత అందులో ఒక ఫోటో చూపించి "ఇతనెవరు? శాంతికి తెలుసా?" అనడిగింది.
    "ఇతని గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు-కేసులో అనుమానితుడా?" అంది మాధురి అనుమానంగా చూస్తూ.
    "లేదు ఇతనిప్పుడు మా ఊళ్ళోనే వుంటున్నాడు. మావారి స్నేహితుడు. కుతూహలంకొద్దీ అడుగుతున్నాను" అంది సుజాత.
    "పెద్దగా తెలిసినదేమీలేదు. మా అందరికీ ముఖపరిచయముంది. అంతే! ఈ ఫోటో అతనే ప్రజెంట్ చేశాడు" అంది మాధురి.

                                      8

    "అన్నయ్యా నా కల అబద్దం కాదురా" అంది సుజాత.
    "ఎలా చెప్పగలవు?"
    "అంతకు మునుపెన్నడూ చూడని మనుషుల్ని నా కలలో చూశాను. వాళ్ళు కేవలం నా ఊహాచిత్రాలనుకున్నాను. కానీ నిజంగానే వాళ్ళీ భూమ్మీద వున్నారు. నీ ఆల్బంలో శాంతి ఫోటో చూశాను.....ఆ తర్వాత శాంతిని చంపినవాణ్ణి కూడా చూశాను" అంది సుజాత.
    రవి ఆశ్చర్యంగా "ఎక్కడ?" అన్నాడు.
    "మాధురి ఇంట్లో" అంది సుజాత.
    "నిజంగా?" అంటూ ఉలిక్కిపడ్డాడు రవి.
    అవున్రా ఆల్బమ్ చూస్తూండగా చప్పుడైందని పక్కగదిలోకి వెళ్ళాను కదా. అప్పుడు హడావిడిగా ఆ గదిలోంచి ఇంకో గదిలోకిపోతూ అలికిడికి వెనక్కు తిరిగాడొకడు. నేను కలలో చూపిన భయంకర హంతకుడు వాడే! వాణ్ణి చూడగానే భయంవేసి కెవ్వుమని అరిచాను. ఈలోగా ఆ గదిలోంచి పారిపోయాడు వాడు" అంది సుజాత. ఆ దృశ్యం తలచుకోవడంవల్ల కాబోలు ఆమె శరీరంలో మళ్ళీ వణుకు ప్రారంభమయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS