Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 22

 

                                     9
    కాలింగ్ బెల్ విని బద్దకంగా నిద్ర లేచాడు రమణరావు అతని తండ్రి అతడి కోసం ప్రత్యేకంగా కొనిచ్చిన చిన్న ఇల్లు ఇది. అందులో ప్రస్తుటానికి అతనొక్కడే వుంటున్నాడు.
    రమణరావు లేచి తలుపులు తీసి ఉలిక్కిపడి -- "నువ్వా?"
    "ఏం -- ఆశ్చర్యంగా వుందా?' అంది కౌముది నవ్వుతూ.
    "నేనిక్కడుంటానని నీకెలా తెలుసు?' అన్నాడు రమణరావు.
    "నీ గురించి నాకు చాలా తెలుసు. నువ్వూ రోశయ్యా కలిసి నన్ను చంపడానికి పట్టయ్య ను నియమించారని కూడా తెలుసు" అంది కౌముది.
    "నువ్వు.....మరి....పట్టయ్య బారి నుంచి ఎలా తప్పించుకున్నావు?" అన్నాడు రమణరావు-- ఇంకేలాగూ దాచి ప్రయోజనం లేదని అతను తన అసలు రంగు నావిధంగా బయట పెట్టాడు.
    "చాలా సింపుల్....నాకు అందం వుంది. వయసుంది వాడు మగాడు. ఎదిరించడానికి బదులు ప్రేమించాను వాణ్ని నేను పెళ్ళి చేసుకుందుకు సిద్దపడ్డాను. ఇప్పుడు వాడు నిన్నూ, రోశయ్య నూ కూడా నాకోసం చంపడానికి సిద్దంగా వున్నాడు...."
    "నువ్వు....నువ్వు....పట్టయ్య తో....ఛీ!" అన్నాడు రమణరావు.
    "ఏం చేయను? నువ్వు నన్ను పట్టయ్య కు వదిలి పోయావు....' అంది కౌముది.
    "ఇప్పుడు నువ్వు నా దగ్గర కెందు కొచ్చావ్?"
    కౌముది తలుపులు వేసింది -- "చెప్పానా?" అంది.
    "చెప్పు!" అన్నాడు అతను.
    అతని వంక ఆమె ప్రేమగా నవ్వింది -- "నేను నిన్ను నమ్మాను. నువ్వు నిజంగానే రోశయ్య ను చంపావనుకొని నీకు నా శరీరాన్నిచ్చాను. కానీ నువ్వు నన్ను పూర్తిగా మోసం చేయడమే కాక నన్ను చంపాలనుకున్నావు. ఒక నరరూప రాక్షసుడ్ని నామీదకు ఉసి కోల్పావు. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు!"
    ఆమె కళ్ళలో కనిపించే ప్రేమకు ఆశ్చర్యపడుతూ -- "ఆడవాళ్ళకు తెలిసింది ప్రేమ ఒక్కటే! మంచి చేసినా, చెడు చేసినా మగవాడ్ని ప్రేమించాలి, ఆరాధించాలి! అదే ఆడదాని కర్తవ్యం. మరోసారిలా కౌగిలి లోకి రావలిసిందిగా ఆహ్వానిస్తున్నాను" అన్నాడు.
    కౌముది నవ్వింది. ఆమె కళ్ళలోని ప్రేమ కాస్త మాయమైంది -- "మా అమ్మ చావుకు రోశయ్య ఎంత కారణమూ, నీ తండ్రి కనకారావు అంతే కారణం. నా పగ వీళ్లిద్దరి మీదా వుంది. ఇప్పుడు తండ్రి మీద పగ తీర్చుకునేందుకు కొత్త ఉపాయం స్పురించింది."
    "ఏమిటది?"
    "దుర్మర్గంలో నువ్వు నీ తండ్రికి తీసిపోవు. వయసు మళ్ళిన నీ తండ్రిని చంపడం కంటే నిన్ను చంపితేనే మంచిది. ఈ ప్రపంచానికి ఓ దుర్మార్గుడి బాధ వదుల్తుంది. నీ తండ్రి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు...." అంది కౌముది.
    "నన్ను నువ్వు చంపుతావా---ఎలా?" అన్నాడు అతను తేలికగా నవ్వేస్తూ.
    "ఇలా?" అంది కౌముది. ఆమె చేతిలో రివాల్వర్ అప్పుడే తళుక్కుమంది. మాట్లాడుదామని నోరు తెరుచే లోగానే ఏదో ఒక సన్నని సూది వంటి వస్తువు అతనికి గుచ్చుకుంది. మనిషి నిలువునా కుప్పలా కూలిపోయాడు.

                                      10

    "మీనాక్షమ్మగారూ -- వచ్చి చూస్తారా?"అంది కౌముది.
    "ఏంటమ్మా!"అంది మీనాక్షి.
    "మిమ్మల్ని వంచించిన కనకారావు కొడుకును...." అంది కౌముది.
    "వాడు నీ చేతుల్లో ఎప్పుడో పోయాడుగా ...." అంది మీనాక్షి.
    కౌముది మీనాక్షిని చేయి పట్టుకుని ఓ గదిలోకి తీసుకు వెళ్ళి ఓ బీరువా తలుపు తెరిచి చూపించింది. అందులో ఆస్థి పంజరాన్ని చూసి ఉలిక్కిపడింది మీనాక్షి.
    "ఇతడే కనకారావు కొడుకు....రమణరావు" అంది కౌముది.
    "ఏమిటమ్మా-- ఇది!" అంది మీనాక్షి కంగారుగా.
    కౌముది అక్కడున్న మరో రెండు బీరువాలు చూపించింది. వాటిలో కూడా ఆస్థి పంజరాలున్నాయి.
    "నేను రోశయ్యను చంపాలనుకున్నాను. సాధనకు కాబోయే నా భర్తను ఎన్నుకొన్నాను. రోశయ్య ను చంపడమన్నది నేను నిర్ణయించిన వర పరీక్ష. ఇందులో దెబ్బతిన్నా, మోసం చేసినా ఆ మనిషిని చంపడంతో నా సరదా తీరదు. వాడి శవాన్ని అస్థిపంజరంగా మర్చి ఈ గదిలో బీరువాలో అలంకరిస్తే తప్ప నాకసి తీరదు....' అంది కౌముది.
    మీనాక్షి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. ఈమె వర పరీక్ష లో ఎప్పటికైనా వరుడు ఎన్నికవుతాడా?

                                                *    *    *    *

    "మీ పేరు నాకు తెలియదు. వారం రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను కానీ మాట్లాడ్డానికి ధైర్యం చేయలేకపోయాను. ఈరోజు అన్నింటికీ తెగించాను. మీ కులం, గోత్రం వగైరాలతో నాకు నిమిత్తం లేదు. మీరు అంగీకరిస్తే నేను వెంటనే రిజిస్ట్రారు ఆఫీసుకి తీసుకెళ్ళి మిమ్మల్ని పెళ్ళి చేసుకొంటాను" అన్నాడా యువకుడు.
    కౌముది అతడి వంక పరీక్షగా చూసింది. ఓసారి నవ్వింది.
    ఇద్దరూ పార్కులో కూర్చునివున్నారు. అతను కౌముది వంక ఆత్రుతగా చూస్తున్నాడు.
    "మీ నిర్ణయం బాగానే వుంది. కానీ మనం ఏ నిర్ణయమైనా తీసుకొనే ముందు భవిష్యత్తు లోకి తొంగి చూడాలి కదా!" అంది కౌముది.
    "అన్నీ ఆలోచించే నేనీ నిర్ణయానికి వచ్చాను--" అన్నాడతను.
    "భవిష్యత్తు లోకి చూస్తుంటే నాకేం కనబడుతుందో తెలుసా?....మీ స్థానంలో ఆస్థి పంజరం కనబడుతోంది"అంది కౌముది.
    "అంటే?"
    "అంటేనా....రేపు చెబుతాను....'అంది కౌముది.
    "రేపు మళ్ళీ నాకోసం ఇక్కడకు వస్తావా?' ఆశగా అడిగాడతను.
    "తప్పకుండా....' అందామె.

                          *    *    *    *
    "సత్యానంద్ ....నాకు మరో బీరువా బేరం చేసి వుంచు...."అంది కౌముది.
    "ఏం-- మళ్ళీ ఏదైనా కొత్త బేరం తగిలిందా ...."అన్నాడు సత్యానంద్.
    "అవును... మనిషి చూడ్డానికి అమాయకుడి లాగా వున్నాడు. కానీ రమణరావు విషయంలోనూ అలాగే అనుకోని మోసపోయాను నేను--" అంది కౌముది.
    సత్యానంద్ కౌముదిని తన ఇంటికి తీసుకు వెళ్ళి -- "నీకో సర్ప్రయిజ్ చూపించనా?" అన్నాడు.
    "ఏమిటది?"
    సత్యానంద్ కౌముది ని ఓ గదిలోకి తీసుకు వెళ్ళాడు. ఆ గదిలోకి తొంగి చూసి నిశ్చేష్టురాలైంది కౌముది.
    అక్కడ మంచం మీద వుంది ఓ శవం. అది రోశయ్యది.
    "ఆఖరికి నువ్వు ..." అని మాట రాకుండా ఆగిపోయింది కౌముది.
    సత్యానంద్ నెమ్మదిగా అన్నాడు--" నీపగ రోశయ్య మీద....ఆ పగతో ఇప్పటికి ముగ్గురు యువకుల్ని అస్థిపంజరాలుగా మార్చావు. ఈ ప్రపంచంలో నూటికి నూరుపాళ్ళు నీతిమంతులేక్కడున్నారు? నువ్వు నీ వర పరీక్ష ను నమ్ముకుంటే నీ గదంతా అస్థిపంజరాలతో నిండి పోతుంది. క్రమంగా నువ్వో నరరూప రాక్షసి వౌతావు. అలా జరగడం నాకిష్టం లేదు. అందుకే నేను హంతకుడి నయ్యాను. ఇక నుంచైనా నువ్వు నీ బుర్ర లోంచి హత్యలు గురించిన ఆలోచనలు తొలగించి నీ భావిజీవితం గురించి ఆలోచించగలవని ఆశిస్తున్నాను...."
    అవాకై అతడి వంక చూస్తూ వుండిపోయింది కౌముది.

                             *    *    *    *

    అతను పార్కులో ఆమె కోసం ఎదురు చూసి ఎదురు చూసి విసిగిపోయాడు.
    ఆమె రాలేదు.
    "ఎమైందామెకు?"....ఇదే ఆలోచన అతడి మదిలో వేదోస్తోంది.
    అతడు చుట్టూ చూశాడు. కాస్త దూరంలో ఓ రోడ్డు సైడు హస్త సాముద్రికుడు వున్నాడు.
    కాలక్ల్షేపార్దం అతను వెళ్ళి హస్త సాముద్రుకునికి చేయి చూపించాడు. సాముద్రికుడు అతడి చేయి పరీక్షగా చూసి -- "చాలా అదృష్ట వంతుడివి -- కొద్ది సేపటి క్రితమే నీకు చాలా ప్రమాదం తప్పింది" అన్నాడు.
    అతడికే కాదు. అందానికి భ్రమ పడే ఎందరో యువకులకు కొద్ది సేపటి క్రితం ప్రమాదం తప్పింది.
    ఇప్పుడు కౌముది గదిలో నాల్గవ బీరువా నలంకరించడానికి తయారవుతున్నది. ఆఖరి అస్తిపంజిరం -- అదే రోశయ్య అస్థిపంజరం .

        
                      -----: అయిపొయింది :------


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS