వీరచంద్రుడి కంతా అయోమయంగా అనిపించింది. ఈ ఉంగరం పెద్దపులికి ఎలా వచ్చింది ? ఈ ఉంగరం ధరించిన రాజకుమారుడు పులివాతపడ్డాడా ? అయితే మాత్రం ఉంగరం పులి పంజా మీదికెలా వచ్చింది?" ఇందులో ఏదో తమాషా ఉంది.
ఏమైనప్పటికీ వీరచంద్రుడు పులి జోలికి వేళ్ళదల్చుకోలేదు. అతడు అనువైన ప్రాంతంలో విశ్రమించాడు. అలసిపోయి ఉన్నారేమో త్వరగానే అతడికి నిద్రపట్టేసింది.
తిరిగి మేలకువ వచ్చే సమయానికి అరణ్యమంతా చీకటిగా ఉన్నది. వీరచంద్రుడు అది అర్ధరాత్రి సమయమై ఉంటుందని ఊహించాడు. అతడు వెంటనే అదృశ్య రూపాన్ని వదిలిపెట్టి సమీప ఫల వృక్షాల నుండి తనకు కావలసిన పళ్ళు కోసుకుని తిన్నాడు. అంతేకాక కొన్ని పళ్ళు తన అంగీలో భద్రపరచుకున్నాడు కూడా.
ఆరోజుకు అతడికి అదృశ్యమయ్యే అవకాశం లేదు. అయితే రోజు గడపడానికి కూడా ఎంతో వ్యవధి లేదు. ఆ కొలది క్షణాలు గడిచి పొతే తిరిగి అదృశ్య రూపాన్ని ధరించి ఎక్కడైనా పడుకుందామని అతడను కొన్నాడు. అంతవరకూ ఆకాశంలోని నక్షత్రాలు లెక్క పెడుతూ కాలం గడపాలను కొన్నాడు.
ఈలోగా అతణ్ణి ఎక్కడ్నించో ఒక పేద చేయి వచ్చి బిగిసి పట్టుకున్నది. వీరచంద్రుడికి ఏం జరిగిందో అర్ధమయ్యే లోగా అతను బ్రహ్మరాక్షసి అరచేతిలో దాని ముఖానికి ముందుగా ఉన్నాడు.
"చాలాసేపట్నుంచి నరవాసన తగులుతున్నది. ఇప్పటికి దొరికావు. ఈరోజు నిన్ను తృప్తిగా ఆరగిస్తాను" అంది బ్రహ్మరాక్షసి.
"వీరచంద్రుడు భయాశ్చర్యాలతో దానివంకే చూస్తున్నాడు. ఎందరో రాజకుమారులు బ్రహ్మరాక్షసులను కత్తితో చంపిన కధలను విన్నాడు. కానీ అదెలా సాధ్యమో ఈ బ్రహ్మరాక్షసిని చూస్తె తెలియాడం లేదు. తను కత్తితో పొడిస్తే ఈ బ్రహ్మరాక్షసికి ముల్లు గుచ్చు కున్నట్లయినా ఉంటుందో, ఉండదో !
"నరుడా! నీకు మాటలు రావా?" అంది బ్రహ్మరాక్షసి.
వీరచంద్రుడు వాస్తవం లోకి వచ్చాడు. బ్రహ్మరాక్షసి తనతో మాట్లాడాలనుకుంటుంది. అది తినాలని అనుకున్నప్పటికీ వెంటనే ఆ పని చేయలేదు. ఒక విధంగా తను అదృష్ట వంతుడే! తను దానితో సంభాషణకు దిగి ఏదో ఉపాయం చూడాలి.
"మాటలు వచ్చు, కాని నిన్ను చూస్తె భయం వేసింది" అన్నాడు వీరచంద్రుడు.
"నువ్వెవరు ? ఈ వనంలో కెందుకొచ్చావు ?" అంది బ్రహ్మరాక్షసి.
వీరచంద్రుడు స్వరూపరాణి స్వయం వరంలో అడిగిన ప్రశ్నకు జవాబు వెతుకుతూ ఇక్కడకు వచ్చానని చెప్పాడు.
'అయితే నువ్విప్పుడు విధ్వంసక పర్వతం దగ్గరకు వెళ్ళాలనుకుంతున్నావా ?" అంది బ్రహ్మరాక్షసి.
'అవును !" అన్నాడు వీరచంద్రుడు.
"నీకులా చాలా మంది వచ్చారు. వచ్చిన వారందరినీ నేను లెక్క పెడుతూనే ఉన్నాను" అంది బ్రహ్మరాక్షసి.
'అయితే ఇంతవరకూ ఎందరు వచ్చారు?"
"నీతో కలిపి వంద మంది !" అంది బ్రహ్మరాక్షసి.
వీరచంద్రుడి గుండె ఝల్లుమంది. "ఐతే అందర్నీ నువ్వు తినేశావా ?" అన్నాడు.
బ్రహ్మరాక్షసి తల అడ్డంగా ఊపి, "విధ్వసంక పర్వతం దగ్గరకు వెళ్ళే వాళ్ళనెవ్వరినీ నేను భుజించను" అంది.
ఈ మాటలు వింటూనే వీరచంద్రుడికి ప్రాణం లేచి వచ్చినట్ల యింది - " ఎందుకని?" అన్నాడు.
"విధ్వంసక పర్వతంలో నిత్యం పొగలు వచ్చే గుహలో పంజరంలో బంధించబడిన రామచిలుక ఒకటున్నది. అది నాక్కావాలి. అది తెచ్చి పెట్టగలరన్న ఆశతో ఇప్పటికి తొంబై తొమ్మిది మందిని వదిలిపెట్టాను. ఒక్కడూ తిరిగి రాలేదు" అంది బ్రహ్మరాక్షసి .
"వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారని నా ఉద్దేశ్యం ?" అంటూ వీరచంద్రుడు తను చూసిన కొండచిలువ, పులి గురించి చెప్పాడు.
బ్రహ్మరాక్షసి కర్ణకఠోరంగా నవ్వి , "వాళ్ళు చనిపోలేదు. అంతవరకూ నాకు తెలుసు " అన్నది.
"మరి కొండచిలువకూ, పెద్ద పులికీ ఆ ఉంగరాలేలా వచ్చాయి " అన్నాడు వీరచంద్రుడు.
"ఎలా వస్తాయి ? ఉంగరాలు ధరించిన మనుషులే ఆ జంతువులుగా మారిపోతే తప్ప !" అంది బ్రహ్మరాక్షసి మాములుగా.
వీరచంద్రుడు ఉలిక్కి పడ్డాడు. తాండవవనంలో అడుపెట్టిన రాజకుమారు లందరూ జంతు రూపాల్లోకి మారిపోయారా ? అలా ఎలా జరిగింది.
"మనుషులు జంతువుల్లా ఎలా మారిపోతారు -- ఏ బ్రహ్మరాక్షసులో మారిస్తే తప్ప !" అన్నాడు వీరచంద్రుడు.
'అలా మార్చడం నాకు చేత కాదు. అందువల్ల నాకు ప్రయోజనమే లేదు. విధ్వంసక పర్వత గుహలోని రామచిలుక నాక్కావాలి. అది నాకు తెచ్చిస్తావన్న నమ్మకంతో నిన్ను వదిలి పెడుతున్నాను. ఇంతమంది సాధించలేనిదాన్ని నువ్వు సాధించగలవనుకోవడం కేవలం నా ఓపికనే తెలియజేస్తుంది" అంటూ బ్రహ్మరాక్షసి అతణ్ణి నేలమీద వదిలిపెట్టింది.
నేలమీద అడుగు పెట్టాడు, పునర్జన్మ లభించినట్లుగా ఊపిరి పీల్చుకున్నాడు వీరచంద్రుడు. అయితే బ్రహ్మరాక్షసి మరో పర్యాయం అతణ్ణి హెచ్చరించింది. "ముందు ముందు నీకు చాలా ప్రమదాలుంటాయి . అతి జాగురూకత వహించాలి నువ్వు, నీ పని అయ్యాక నాకు రామచిలుక నివ్వడం మరిచి పోకూడదు. ఈ మాట మరీ మరీ గుర్తుంచుకో !"
అన్నింటికీ తల ఊపి అక్కణ్ణించి అరణ్య మధ్యం లోకి బయల్దేరాడు వీరచంద్రుడు.
5
బ్రహ్మరాక్షసి తనను వదిలి పెట్టెక వీరచంద్రుడు ఒక రోజంతా అరణ్యంలో ప్రయాణం చేశాడు. అవసరమైతే తప్ప అదృశ్య రూపం దరించరాదను కున్నాడతను. అందులోనూ ఇప్పుడతడికి బ్రహ్మ రాక్షసి భయం లేనేలేదు.
ఇప్పుడు వీరచంద్రుడు ఒక పర్వత ప్రాంతానికి చేరాడు. అది నిటారుగా ఎంతో ఎత్తుగా ఉన్నది. బహుశా అదే విధ్వంసక పర్వతమ యుండవచ్చునని వీరచంద్రుడు భావించాడు. ఆ పర్వతం ఎక్కడమన్నది శ్రమతో కూడున పని. తీరా కష్టపడి ఎక్కితే అది విధ్వంసక పర్వతమావునో కాదో ఎలా తెలుస్తుంది?
వీరచంద్రుడి ఆలోచనంతా తేలకుండానే "నాయనా, వీరచంద్రా! త్వరగా రా !" అన్న కేక ఒకటి అతడికి వినిపించింది. ఆ కేక వింటూనే వీరచంద్రుడు హటాత్తుగా పరుగెట్టసాగాడు. అతడికి పరుగుపెట్టాలన్న కాంక్ష లేదు. కానీ అతడి శరీరం ఆ క్షణంలో అతడి ఆదుపులో లేదు.
అలా ఆగకుండా పరుగెత్తి అతడు ఒక చోట ఆగాడు.
అది ఒక గుహ ! ఆ గుహలోంచి పొగలు వస్తున్నాయి.
వీరచంద్రుడికి ఉత్సాహం కలిగింది. అయితే తన్ను పిలిచిందేవరు ? తన పేరు ఆ మనిషి కేలా తెలిసింది? హటాత్తుగా తనెందుకు పరుగు పెట్టాడు? తను కోరుకుంటున్న గుహకే ఎలా చేరుకోగలిగాడు? ఇదంతా తన మంచికే జరిగిందా! చెడుకు జరిగిందా ?
ఇప్పుడు తనేం చేయాలి ? గుహలోకి వెళ్ళాలా ? బయట ఉండాలా ?
గుహలో ఏముంది? అదే స్వరూపరాణి అడిగిన ప్రశ్న! ఆ గుహలో ఉన్న రామచిలుక బ్రహ్మరాక్షసి కి కావాలి. ఆ చిలకలో ఏముంది? గుహలోకి చిలుక ఎలా వచ్చింది ? అసలీ గుహలో ఇంకా ఏమున్నాయి ?
ఇంత దూరం వచ్చేక తానూ ఎలాగూ ఆ గుహలో ప్రవేశించక తప్పదు. ఏ మహాశక్తి తనని గుహ వరకూ రప్పించిందో అది ఇంకా తనను గమనిస్తూనే ఉండి ఉంటుంది. కాస్సేపు అలోచించి వీరచంద్రుడు మళ్ళీ అదృశ్య రూపం ధరించాడు. అప్పుడు నిర్భయంగా గుహలో ప్రవేశించాడు.
గుహలో ఆరంభం లోనే ఒక పెద్ద దేవీ విగ్రహమున్నది. అది నిజమైన విగ్రహం. దేవి కనులు చండ్ర నిప్పుల్లా ఉన్నవి. దేవికి నాలుగు చేతులున్నవి. ఒక చేతిలో మొండెం తెగిన శిరస్సు ఉన్నది. ఒక చేతిలో శూలమున్నది. ఒక చేతిలో గండ్ర గొడ్డలి , మరియొక చేతిలో ముళ్ళ గద ఉన్నవి. దేవి నాలుక బారచాపి అత్యంత భయం కరంగా ఉన్నది. దేవి ముందు హోమం వెలుగుతోంది. హోమానికి పక్కన ఒక బొమ్మ ఉన్నది. అ బొమ్మ చేతి నుండి ఆగి, ఆగి హోమ గుండంలో సాంబ్రాణి పొడి పడుతున్నది. ఆ కారణంగానే గుహ లోపల నుండి ఆగకుండా పొగ వస్తున్నది.
వీరచంద్రుడి కిప్పుడు గుహ నుండి వచ్చే పొగ రహస్యం తెలిసిపోయింది. అయితే ఈ ఏర్పాట్లు చేసిందేవరు? అందుకు ప్రయోజనం ఏమిటి ?
వీరచంద్రుడు గుహలో కలయదిరిగి చూశాడు. కాసేపటికి అతడు దేవీ విగ్రహం వెనుక నుంచి లోపలకు ఏదో దారి గమనించాడు. నెమ్మదిగా లోపలకు వెళ్ళాడు.
ఆశ్చర్యం !
ఊహకందనంతటి రమణీయమైన మందిరం ఉన్నదక్కడ. వీరచంద్రుడు ఆ మందిరంలో ప్రవేశించాడు.
మందిరం నిశ్శబ్దంగా ఉన్నది. వీరచంద్రుడు అదృశ్య రూపంలో నిశ్శబ్దాన్ని చేధించకుండానే ఆ మందిరిమంతా తిరుగుతూ ఓ గదిలోకి వెళ్ళి ఆశ్చర్య పోయాడు.
గదిలో మెత్తటి శయ్య పైన ఒక సుకుమారి నిద్రపోతున్నది ఆమె అందం మానవ కాంతలకు దుర్లభమనిపిస్తుంది. వీరచంద్రుడామేను సమీపించి ఆశ్చర్యంతో అలాగే చూస్తూ నిలబడి పోయాడు.
కాసేపటికి వీరచంద్రుడికా యువతిని లేపి ఆమెతో సంభాషించాలనిపించింది. ఆమెను తట్టి లేపాడు.
