Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 23

 

    "ఓగంట క్రితం -- ఈ కాగితం మనింటి తలుపు సందుల్లోంచి తోయబడి వుంది-" అంటూ భర్తకు ఆ కాగితాన్నందించిందామె. రామం ఆత్రుతగా దాన్నందుకుని చదివాడు.
    "హలో మిస్టర్!నువ్వు చేసిన హత్యకు నేను ప్రత్యక్ష సాక్షి నన్న విషయం గుర్తుందా?" త్వరలో నేను నిన్ను కలుస్తాను. నేనడిగింది నువ్వివ్వాలి. ఇస్తావనే అనుకుంటున్నాను. ఇవ్వకపోతే వురి తప్పదు కదా మరి! వివరాలు మళ్ళీ వుత్తరంలో రాస్తాను...."
    క్రింద సంతకం లేదు.
    "ఇది తప్పకుండా ఆ సుబ్బారాయుడి పనే అయుంటుంది-"అన్నాడు రామం.
    'సుబ్బరాయుడు కాక మరెవరైనా ఇది రాయరనుకుంటే మనకు మనశ్శాంతి కూడా వుండదు. ఆ హత్యకు ప్రత్యక్ష సాక్షి అతనొక్కడే! అతను కాక ఇంకెవరున్నారు?" అంది గిరిజ.
    "అవును --- ఇంకెవరున్నారు?" అన్నాడు రామం. అప్పుడే అతనికి ఏదో స్పురించింది. ముగ్గురంటే ముగ్గురికి మాత్రమే ఈ హత్య గురించి తెలుసు. అందులో తనను మినహాయిస్తే మిగిలింది ఇద్దరు. ఒకడు సుబ్బారాయుడు. ఇంక.....గిరిజ.....
    రామం వుత్తరాన్ని పరీక్షగా చూశాడు. అది గిరిజ దస్తూరీయేనని అతడికి అనిపించింది.
    సుబ్బారాయుడు కిలాంటి వుత్తరం రాసే దమ్ము లేదు. ఈ వుత్తరం గిరిజే రాసి వుండాలి. రాస్తే ఎందుకు?"
    ఓ హత్య చేయడం వల్ల ఎన్ని అనర్దాలుంటాయో తనకు తెలియాలి. అందులోని ప్రమాదం తనకు అర్ధం కావాలి. మున్ముందు హత్య పట్ల తను విముఖుడు  కావాలి .
    ఇది గిరిజ ఎత్తుగడ!
    రామం వుత్తరాన్ని జేబులో పెట్టుకుని-- "గిరిజా! సుబ్బారాయుడిని , రవికిశోర్ తో పాటు కలిపి చంపుతాను. నువ్వేమీ భయపడకు--"అన్నాడు.
    "ఏది ఏమైనా మీరు కాస్త తొందపడి వాడి ఉనికి తెలుసుకోండి-- నాకు చాలా బెంగగా వుంది-" అంది గిరిజ.
    రామం తనలో తానూ నవ్వుకున్నాడు.

                                    8
    అయితే కొద్ది గంటలు తిరక్కుండానే రామం ఆ వుత్తరాన్ని సీరియస్ గా తీసుకోవలసోచ్చింది.
    మరిచిపోయిన పాలడబ్బాలు కొనడం కోసం అతను బజారు వెడితే ఓ షాపులో అతడికి సుబ్బారాయుడు కనబడ్డాడు.
    రామం ఉలిక్కిపడ్డాడు.
    సుబ్బారాయుడు రామాన్ని చూడలేదు. రామం ఒక్కక్షణం తటపటాయించి -- చివరికి సుబ్బరాయుడ్ని పలకరించాలనే అనుకున్నాడు.
    రామం పలకరింపు విని సుబ్బారాయుడు ఆశ్చర్యపోయాడు -- "ఎవరండీ మీరు?" అన్నాడు ఆశ్చర్యంగా.
    "నేను గుర్తులేనా నీకు సుబ్బారాయుడు-" అన్నాడు రామం.
    "నాపేరు సుబ్బారాయుడు కాదు. పాపారావు--" అన్నాడామనిషి.
    'అలాగా-- నువ్వు పేర్లు కూడా మరుస్తావన్న మాట--" అన్నాడు రామం.
    "మీరు చెప్పేది వింటుంటే నాకేదో జోక్ గుర్తుకొస్తోంది. నాకిప్పుడు టయిం లేకపోయింది కానీమీతో సరదాగా కబుర్లు చెప్పి వుండే వాణ్ణి ...." అని చటుక్కున అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను.
    రాము కంగారుగా అతడి ననుసరించాడు. అతను నన్నెవరో అనుసరిస్తున్నరన్న ధ్యాసే లేకుండా వెళ్ళిపోయాడు. రామం అతను వెళ్ళిన ఇల్లు బాగా గుర్తు పెట్టుకున్నాడు. కె. పాపారావు అన్న నేమ్ ప్లేటు కూడా వుందా ఇంటికి.
    నేమ్ ప్లేటు చూడగానే తెల్లబోయాడు రామం వీడు  నిజంగానే పాపారావయుండాలి. లేకపోతే ఇంటికింకో నేమ్ ప్లేట్ ఎందుకుంటుంది?
    కానీతనకు సుబ్బారాయుడు బాగా తెలుసు. తన కళ్ళు పోరబడవు.
    రామం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి గిరిజతో -- "నాకు సుబ్బారాయుడు వునికి తెలిసిపోయింది. వాణ్ణి ఎలాగైనా చంపేయాలి!" అన్నాడు.
    గిరిజ చాలా ఆశ్చర్యపడింది --"సుబ్బారాయుడీ ఊళ్ళో వున్నాడా?' అంది ఆత్రుతగా.
    "సందేహం లేదు. వాడే ఆ వుత్తరం రాశాడు. ఎటొచ్చీ ఈ ఊళ్ళో వాడి పేరు పాపారావు. వచ్చి ఎంత కాలమయిందో తెలియదు గానీ నలుగుర్నీ మోసం చేసి బ్రతికే వెధవ -- నన్నే బెదిరించే స్థితికి వచ్చాడు--" అన్నాడు రామం.
    "మీరేదో పెద్ద గ్యాంగు లీడర్లా మాట్లాడుతున్నారు!' అంది గిరిజ.
    "గ్యాంగు లీడర్ని కాకపొతే నెం-- చిటికెలో హత్య చేసి అవలీలగా తప్పించుకోగలను . కాదంటావా?"
    "కాదనను కానీ మనిషిని అదృష్టం అన్ని వేళలా కాయదు. మనసు ఓ పర్యాయం కాసింది. అపద్దర్మంగా అనుకోకుండా హత్య చేయడం వేరు కావాలని పధకం వేసి ద్వేషంతో, పగతో హత్య చేయడం వేరు. అలాంటి వాళ్ళను దేవుడు క్షమించడు. మళ్ళీ మళ్ళీ నేరాలు చేయడం లోనే నేరస్థుడు తప్పటడుగు వేసి దొరికిపోతాడు. జరిగింది మర్చిపోండి" ఇంకెవర్నీ హత్య చేయాలని అనుకోకండి --" అంది గిరిజ.
    "కానీ గిరిజా! నువ్వో విషయం మర్చిపోతున్నావు. ఆ సుబ్బారాయుడి దగ్గర నా ప్రాణాలు తీసే రహస్యం దాగి వుంది. దాంతో వాడు నా ప్రాణాలు తీస్తాడు. లేదా డబ్బు కోసం వేదిస్తాడు. వాణ్ని అంతం చేయలేకపోతే ఎలా?"
    "సరే-- సుబ్బరాయుడ్ని చంపుతారు. తర్వాత రవికిశోర్ ని చంపుతారు. ఇన్ని హత్యలు చేసి మీరు తప్పించుకోగలననే అనుకుంటున్నారా?'
    "నీవంటి భార్య వుంటే ఈ ప్రపంచంలో ఏమైనా చేయగలను!' అన్నాడు రామం.
    'అయితే వినండి. నేను మీకు ఏ విధంగానూ సాయపడలేను. అందువల్ల హత్యల సంగతి మీ బుర్రలోంచి చెరిపేయండి-" అంది గిరిజ.
    "కానీ సుబ్బారాయుడు నన్ను బెదిరిస్తూ వుత్తరం రాశాడు. దానికేమంటావ్?"
    'అది సుబ్బారాయుడు రాయలేదు. నేనే రాశాను!" అంది గిరిజ.
    పక్కలో బాంబు పేలినట్లు వులిక్కిపడ్డాడు రామం- "గిరిజా! ఆ వుత్తరం నువ్వే రాసినట్లు అనుమానించాను. నేను మళ్ళీ మళ్ళీ హంతకుడ్ని కావడం ఇష్టం లేక నన్ను నా ప్రయత్నం నుండి విముఖుడ్ని చెయడానికా వుత్తరాన్ని నువ్వే సృష్టించి వుంటావని నేననుకున్నాను. కానీ ఇప్పుడు సుబ్బారాయుడ్ని చూశాక ఆ వుత్తరం వాడే రాశాడని తెలిసిపోయింది. నీ అబద్దాలు నేను నమ్మను. నా ఆలోచనలు నీ దారికి మళ్ళవు. నువ్వు నాకు సహకరించి తీరాల్సిందే!" అన్నాడు.
    "మీకు తప్పక సహకరిస్తాను. కానీ హత్యల విషయంలో కాదు. ఆ వుత్తరం నేనే రాశాను కావాలంటే దస్తూరీ సరిపోల్చండి. ఇంక సుబ్బారాయుడి విషయమంటారా? అతడు అమాయకుడు. మిమ్మల్ని బెదిరించి డబ్బు గుంజే వుద్దేశ్యం అతడికి ఏ కోశానా వుండదని నేను నమ్ముతున్నాను. అతణ్ణి చూసినట్లే మర్చిపోండి. నేనుత్తరం రాయడం-- మీరతడ్ని చూడడం కాకతాళీయంగా జరిగాయి--" అంది గిరిజ.
    దస్తూరి సరిపోల్చగా ఆ వుత్తరం గిరిజ రాసిందేనని తేలింది. కానీ రమ్మ నమ్మలేదు.

                                    9
    రామం ఆ యింటి తలుపు తట్టగానే ఓ యువతి వచ్చి తలుపు తీసింది. అతనాశ్చర్యపడ్డాడు. ఆమె సుమతీ కాదు.
    "సుబ్బారాయుడు గారింట్లో లేరా?" ఆనడిగడతను.
    "సుబ్బారాయుడుగారెవరు?" ఇది పాపారావు గారిల్లు--" అందామె.
    "మీరు...."
    "నేనాయన భార్యను ....." అందామె.
    రామానికి నమ్మకం కలుగలేదు-- "మీతో ఒక్కక్షణం మాట్లాడాలి. నేను మీకు అన్నలాంటి వాడ్ని --" లోపలకు రావచ్చా ?' అనడిగాడు.
    ఆమె అభ్యంతర పెట్టలేదు.
    ఇద్దరూ లోపలకు వెళ్ళి కూర్చున్నాక రామం ఆమెను మంచినీళ్ళడిగాడు. ఆమె లోపలకు వెళ్లి వచ్చే లోపల అతనక్కడ గోడలకు తగిలించిన ఫోటోలు చూశాడు. అందులో ఒకటి సుబ్బారాయుడిది. రెండవది ఇంట్లో వున్న యువతిది. మిగతావి ఎవరివో తెలియలేదు.
    ఆమె మంచినీళ్ళు తీసుకురాగానే రామం గోడకున్న ఫోటో చూపించి 'ఆ ఫోటోలో ఆయనేగా మీ భర్త!" అన్నాడు.
    "అవుననడానికి కాస్త సిగ్గుపడిందామె.
    "చూడమ్మా-- మీ భర్త చూస్తె పచ్చి మోసగాడిలా వున్నాడు.అయన నాకు బాగా తెలుసు . మూడేళ్ళ క్రితం వరకూ ఇద్దరం బాగా కలసి మెలసి తిరిగాం. ఆయనకు నా స్నేహితురాలు సుమతితోనే వివాహమైంది. ఇద్దరూ చిలకా గోరింకల్లా వుండేవారు. నాకు తెలిసినంతవరకూ ఆయనపేరు సుబ్బారాయుడు. ఇప్పుడు తన పేరు పాపారావంటున్నాడు. సుమతి నేం చేశాడో తెలియదు. చంపెశాడో -- వేరేచోట వుంచాడో-- " అన్నాడు రామం.
    "నాకూ ఆయనకూ వివాహమై నాలుగేళ్ల యింది. ఇద్దరం ఇంతవరకూ కలిసి మెలిసి హాయిగా వుంటున్నాం. అయన నన్నొదిలి పెట్టి ఏడాదికి పది రోజులుంటారేమో -- అంతే! మీరు చెప్పే కధలేవీ ఆయనతో పొసగడం లేదు. కానీ నేను మీ బాధ అర్ధం చేసుకోగలను" అందామె .
    'అంటే?" అనడిగాడు రామం.
    "మా ఆయనకో కవల సోదరుడున్నాడు. అచ్చం ఆయనలాగానే వుంటాడు. పేరు సుబ్బారాయుడు. అతడి భార్య సుమతి అవడం నిజం. అయితే అన్నాదమ్ములిద్దరికీ సంబంధ భాంధవ్యాలు లేవు. సుబ్బారాయుడి బుద్దులు మంచివి కాదు. నలుగుర్ని మోసం చేసి బ్రతుకుతాడు. ఈయనేమో నలుగురిలో గౌరవంగా బ్రతుకుతున్నారు. అందుకని సోదరుడితో అన్ని బంధాలూ తెంచుకున్నారీయన. ఎవరైనా సుబ్బారాయుడి గురించి అడిగినా తనకు తెలియదంటారు. పోలికల కారణంగా ఒకరికొకరు పొరబడతారని ఇలాదూరంగా వస్తే -- ఇక్కడ కూడా మీరయన్ను వెతుక్కుంటూ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది--" అందామె.
    రామం అనుమానంగా -- 'అయితే సుబ్బారాయుడెక్కడుంటున్నాడు?" అనడిగాడు.
    "ఇంకెక్కడి సుబ్బారాయుడు? అతనూ అతడి భార్య ఓ చంటి కుర్రాడూ- ఆర్నెల్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో చచ్చిపోయారు. శవాలు కూడా గుర్తు తెలీకుండా పోయినై-- నలుగుర్నీ మోసం చేసి బ్రతికినందుకు ఆ ఉసురు-- అతన్నే కాక- అతడి భార్యా బిడ్డలా క్కూడా కొట్టింది--" అందామె.
    "శవాలు కూడా గుర్తు తెలియకపోతే మరి సుబ్బారాయుడు పోయాడని ఎలా అనుకున్నారు?"
    ఆమె బాధగా నవ్వి -- "పెళ్లై నప్పట్నించి ఈయనకు సుబ్బారాయుడు మీద అనుమానం. అతడు తన పోలిక లతో నన్ను కూడా మోసం చేస్తాడేమోనన్న భయంతో అయన ఏదో వంక పెట్టి ఒరోజున ఇద్దరూ పచ్చబొట్లు పోడిపించుకునేలా చేశారు. అయన చేతి మీద పాపారావు పేరుంటుంది.సుబ్బారాయుడి చేతి మీద అతడి పేరు వుంటుంది. అదే అతణ్ణి రైలు ప్రమాదం లో పట్టించ్చింది. అతడి దగ్గర్లో ఉన్న తల్లీ బిడ్డలా శవం అతడి భార్యా బిడ్డలని ఊహించాం . తల్లి శవం తెలియకపోయినా- బిడ్డ శవం గుర్తు బాగా తెలుస్తోంది--' అంది.
    రామం ఆమెతో మాట్లాడుతుండగానే అక్కడికి పాపారావు వచ్చాడు. అతడి చేతి మీద పాపారావు అన్న పచ్చబొట్టు కూడా చూశాక అతను విచలితుడయ్యాడు.
    ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది! తీరికూర్చుని తను ఓ అమాయకుణ్ణి హత్య చేసేవాడు. అందువల్ల తనకు కొత్త ప్రమాదం రావడం తప్పితే ప్రయోజనమేమీ వుండదు.
    పాపారావు నిజంగా పాపారావేనని -- సుబ్బారాయుడికి తెలిసిన హత్యా రహస్యం అతడికి తెలియదనీ తెలిసిన సుబ్బారాయుడు చచ్చిపోయాడని రామం ఊహించలేక పోయాడు.
    అతడి మనసిప్పుడెంతో తేలికగా వుంది. ఉత్సాహంగా ఇంటికి వెళ్లి గిరిజ కు మొత్తం విషయమంతా చెప్పి -- "జన్మలో నేను మళ్ళీ హత్యా ప్రయత్నం చేయను. అంతేకాదు ఆవేశాన్ని వదిలిపెట్టి నిదానంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నిదానించడం వల్లనే పాపారావు గురించిన అసలు రహస్యం తెలిసింది--" అన్నాడు.
    "సుబ్బారాయుడు బ్రతికే వున్నా -- మీరు కాస్త నిదానిస్తే -- అతడి వల్ల కూడా మీకే ప్రమాదమూ వుండదని తెలిసేది. ఊరికే ఆవేశపడి హత్యలు చేయాలనుకోవడం వల్ల ఉరికంబం మేక్కడం తప్ప ప్రయోజనమేమీ వుండదు--" అంది గిరిజ.
    అయితే ఆమె మనసులో ఓ అనుమానం వుంది. సుబ్బారాయుడు నిజంగా చచ్చిపోయాడా? లేక పాపారావు అలాంటి కధ ఒకటి తయారు చేశాడా?
    ఏది నిజమైనా దాని వల్ల ఒక విషయం స్పష్టమవుతుంది. సుబ్బారాయుడు వల్ల తన భర్తకు ప్రాణ భయం లేదు. సుబ్బారాయుడు చచ్చి వుంటే ఎలాగూ బాధ లేదు. ఒకవేళ పాపారావే సుబ్బారాయుడై వుంటే-- అతను తన భర్తకు భయపడుతున్నట్లు తెలియనే తెలుస్తుంది.
    ఏది ఏమైనా పాపారావు గురించి తెలిసిన నిజం రామానికి చాలా మంచి చేసింది. అతడిప్పుడు రవికిశోర్ విషయం కూడా పూర్తిగా వదిలిపెట్టి తన బ్రతుకు తను బ్రతుకుతున్నాడు.

                      ----:అయిపొయింది:--------


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS