సుబ్బారాయుడి భార్య కాబోలు -- ఓ యువతి వచ్చి తలుపు తీసింది. ఆమెను చూసి రామం ఆశ్చర్యపోయాడు. ఆమె పేరు సుమతి. చదువుకునే రోజుల్లో రామం తలిదండ్రులు పక్కిల్లె అమెది. ఇద్దరూ మంచి స్నేహంగా వుండేవారు. రామం ఆమెను స్వంత చెల్లెలి కంటే అభిమానంగా చూసుకునేవాడు. కాలేజీ చదువుల కోసం రామం ఊరొదిలి పెట్టెక మళ్ళీ వాళ్ళు కలుసుకోలేదు.
నువ్వా అంటే నువ్వా అనుకున్నారిద్దరూ.
సుబ్బారాయుడు ఇంట్లో లేడు.
"ఎలావుంది మీ ఆయనింట్లో?"అనడిగాడు రామం కాసేపు కబుర్లయ్యాక.
"ఇంటికొచ్చి హడావుడిగా బైటకు వెళ్ళిపోయారు. మనిషి కంగారుగా వున్నారు--" అంది సుమతి.
"నీకేమీ చెప్పలేదా?"
"లేదు...."
రామం నిట్టూర్చాడు. అయితే అప్పుడే గండం గడిచిందనుకుందుకు లేదు. సుబ్బారాయుడు హడావుడిగా బైటకు వెళ్ళడానికి కారణమేమిటి? అతను పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడా?
రామం చందా రసీదుల పుస్తకం సుమతి కి అందించి -- "నీ భర్త నా యింటి కొచ్చి ఇది మరిచి పోయి వెళ్ళిపోయాడు. దీని మీద అడ్రస్ చూసి - పోనీ తిరిగిచ్చేద్దామని తీసుకొచ్చాను. మంచిదే అయింది. ఈ విధంగా నిన్ను మళ్ళీ చూశాను --"అన్నాడు.
'చందా రసీదుల పుస్తకం ఇవ్వడం కోసం ఇంత దూరం వచ్చావా? అప్పట్నించీ నీ మంచి బుద్ది అలాగే వుందన్న మాట--"అని నవ్వుకుంది సుమతీ. అంతలోనే దిగులు ఆమె ముఖాన్నావహించుకోగా -- "నువ్వు కానీ ఆయనకు చందా ఇవ్వలేదు గదా --'అంది.
"ఏం?" అన్నాడు రామం ఆశ్చర్యంగా.
"అబద్దమెందుకు ? నిజం చెప్పేస్తాను. నా భర్త నడిచే దారి మంచిదికాదు, అయన సంపాదిస్తున్న ప్రతి పైసా కూడా మోసం తోటే !' అని నిట్టూర్చింది సుమతి.
రామం ఆశ్చర్యపడ్డాడు. కానీంతలోనే అతడికి హంతకుడినన్న విషయం గుర్తుకొచ్చింది. ఈ విషయం తెలిస్తే సుమతి తన గురించి ఏమనుకుంటుంది?
రామం అక్కడ ఎక్కువసేపు వుండలేక పోయాడు. అతడు సుమతిని తన ఇంటికి రమ్మనమని ఆహ్వానించి అక్కణ్ణించి బయల్దేరాడు. ఇల్లు దాటి సందు మొగ తిరిగేసరికి అతడికి సుబ్బారాయుడు ఎదురుపడ్డాడు.
"హలో మిస్టర్ సుబ్బారాయుడు!'అంటూ రామం అతన్ని పలకరించాడు.
సుబ్బారాయుడు రామాన్ని చూసి తడబడి --" మీకు నాపెరేలా తెలుసు!' అన్నాడు.
రామం స్వరం తగ్గించి -- "ఒక్క నిముషం అలా పక్కకురా. నేను నిన్నేమీ చెయ్యను. నీ భార్య సుమతి నాకు స్వంత చెల్లెలి కంటే ఎక్కువ. చిన్నప్పుడు అయిదేళ్ళు కలిసిమెలిసి వున్నాం. నీతో ఒక్కమాట చెప్పాలి. అంతే!"అంటూ చేయి పట్టుకుని అతన్ని దూరంగా ఓ చెట్టు కిందకు తీసుకుపోయి-- తగ్గు స్వరంతో హత్య ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఆ కధంతా చెప్పాడు.
సుబ్బారాయుడు ఓపికగా ఇదంతా విని-- "మీరిదంతా నా కెందుకు చెబుతున్నారో తెలియదు నాకై నేనే నిజాయితీ పరుడ్ని కాను. మీ యింట్లో ఏం జరిగిందో మీరు గుర్తు చేసినా తెచ్చుకోను. నన్ను నమ్మండి. వదిలిపెట్టండి. నేను కలిసొచ్చే పనులు తప్ప చెయ్యను. కోరి ప్రమాదాలు ఆహ్వానించను" అన్నాడు.
రామం అప్పటికతన్ని వదిలిపెట్టాడు.
మర్నాడు భార్యాభర్తలిద్దరూ కలిసి సుబ్బరాయుడింటికి బయల్దేరారు. ఆ యిల్లు తాళం వేసి వుంది. వాకబు చేయగా సుబ్బారాయుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి పోయ్యాడని తెలిసింది.
ఆతర్వాత అతనేమయ్యాడో వాళ్ళకి తెలియలేదు.
7
పద్మనాభం అంతర్ధానం పోలీసు రిపోర్టు దాకా వెళ్ళడానికి కొన్ని నెలలు పట్టింది. పోలీసులు విచారించి ఏమీ తేల్చలేకపోయారు. అనుమానితుల జాబితాలోకి రామం రాలేదు. ఓ సంవత్సరం గడిచేసరికి అ కేసు ఫైలు మూల పడింది.
ఒక హత్య చేసి అంత సులభంగా తప్పించుకోగలనని రామం ఎన్నడూ అనుకోలేదు. కొంతకాలం పాటు అతను ఆవేశాన్నణచుకున్నప్పటికీ -- క్రమంగా అతడి కేదో మొండి ధైర్యం అవహించుకుంది. రామం తన ఆవేశాన్ని ఎప్పటివలెనె ప్రకటించడం ఆరంభించాడు.
"ఆవేశం మీచేత ఓ హత్య చేయించింది-- ఆ విషయం మరిచిపోకండి --" అంటూ గిరిజ భర్తకు ఎన్నో మార్లు మరీ మరీ హెచ్చరించింది.
"నేను చేసిన హత్య దైవనిర్ణయం. ఒక దుర్మర్గుడికి నాద్వారా శిక్ష విధించబడాలని దేవుడు నిర్ణయించాడు. నేను నిమిత్త మాత్రుడ్ని. అందుకే నాకే అపాయమూ వాటిల్లలేదు. ఇంక నేను దేనికీ భయపడను. నా ఆవేశం నాకు మేలు చేస్తుందే కానీ కీడు చేయదు. లేనిపోనీ నీతులు నాకు చెప్పకు --" అంటూ రామం తీసిపారేసేవాడు.
"తప్పించుకోగలగడం మీ అదృష్టం. అన్ని పర్యాయాలూ కలిసి రాదు. ఆవేశం అనర్ధదాయకం. ఆ విషయం మాత్రం మరిచిపోవద్దు--" అంటూ గిరిజ హెచ్చరించింది.
రెండేళ్ళు గడిచాక రామం ఊరు మారాడు. ఇక్కడ అతడి జీవితం మారింది. సంపాదన పెరిగింది. ఓ అబ్బాయి కూడా పుట్టాడు.
మధ్యతరగతి సంసారాల్లో సంపాదన పెరిగిన కొద్దీ ఖర్చు పెరుగుతూనే వుంటుంది. రామం సంపాదన పెరగడం వల్ల ఇంట్లో నాలుగు రకాల వస్తువులు అమరాయి తప్పితే బ్యాంకులో నిల్వ పెరగలేదు. గట్టిగా రెండు మూడు వేలు కావాలంటే డబ్బుకు తడుముకోవలసిందే౧ ఓరోజు భార్యాభర్తలిద్దరూ ఓ ఎలక్ట్రికల్ షాపులో వాషింగ్ మిషన్ బేరం చేస్తుండగా వారిని ఒక వ్యక్తీ పలకరించాడు. రామానికి వెంటనే ఆతడు గుర్తుకు వచ్చాడు. అతడు రవికిశోర్!
రవికిశోర్ రామాన్ని కాక గిరిజనే పలకరించాడు.
"హలో మిసెస్ గిరిజా! మనం హోటల్ సంపెంగా లో కలుసుకొని రెండేళ్ళు దాటిందనుకుంటాను. అప్పటికీ ఇప్పటికీ నీలో ఏమీ మార్పు లేదు. ఐ కంగ్రాచ్యులేట్ యువర్ హజ్బెండ్. ఆరోజు మనం ముగ్గురం కలిసి మాట్లాడుకున్న మాటలు- ఆహా- ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటున్నాయి. వై డోంట్ యూ కం డేర్ అగైన్!"అని రామం వంక తిరిగి -- "మిస్టర్ రామం -- మీశ్రీమతిని తీసుకుని మా ఊరొచ్చి హోటల్ సంపెంగ కు రావాలి మీరు. ఈసారి మీరు తిరస్కరించలేని ఆఫర్ తో వస్తాన్నేను. సీయూ...." అని వెళ్ళిపోయాడు.
రామానికి నోట మాటరాలేదు.
ఇద్దరూ ఆ షాపు లోంచి త్వరగా బైటకు వచ్చేసరికి-- రవికిశోర్ కారు వెళ్ళిపోయింది.
ఆ షాపులో రవికిశోర్ కు షేరుందట. రవికిశోర్ స్నేహితులని తెలియగానే వాళ్లకతను ఎక్కువ మర్యాద చేయబోయాడు. రవికిశోర్ కందులో షేర్లున్నాయన్న విషయం కంపరం కలిగించగా వారిద్దరూ అక్కడ ఉండలేకపోయారు. ఆతర్వాత వారు షాపింగ్ కొనసాగించానూ లేదు.
"డర్టీ రోగ్!" అన్నాడు ఇంటి దగ్గర రామం.
గిరిజ మాట్లాడలేదు.
"పద్మనాభానికి పట్టిన గతే వాడికి పట్టిస్తాను--" అన్నాడు రామం.
గిరిజ భయంగా -- 'చీటికి మాటికీ మీరు హత్యల గురించి మాట్లాడకండి!" అంది.
"లేదు గిరిజా! నేను అవతరించిందే దుష్ట శిక్షణ కోసం - అలాంటి చీడ పురుగుల్ని ఏరేయాలి-"
"ఇలాంటి చీడ పురుగుల్ని ఒకటొకటిగా ఏరే బదులు- ఆ హోటల్ సంపెంగ మీద ఓ బాంబు వేస్తె సరిపోతుంది-" అంది గిరిజ.
"ప్రపంచాన్ని రిపేర్ చేయడం నా వల్ల కాదు. నా కళ్ళెదుటే నా భార్యను అవమానించిన వాణ్ని వదిలిపెట్టను. పద్మనాభం కాక అలా చేసినవాడు రవికిశోర్ ఒక్కడే! వాడు కూడా చస్తే కానీ నేను సుఖంగా నిద్ర పోలేను--" అన్నాడు రామం.
"అయితే ఏమంటారు?"
"పద్మనాభం విషయంలో హత్య జరిగాక నాకు సాయపడ్డావు నువ్వు. ఇప్పుడు హత్య జరగడానికి సాయపడాలి నువ్వు. నా దగ్గర పధకం సిద్దంగా వుంది-" అంటూ ఇదివరలో తను రవికిశోర్ ను ఎలా చంపాలనుకున్నాడో చెప్పాడు.
'అయితే విలియమ్స్ తెలుసా మీకు?" అంది గిరిజ ఆశ్చర్యంగా.
"తెలుసు -- " అన్నాడు రామం -- "కానీ వాడికి నేను తెలియదు. పద్దతి నాకు తెలుసు. విలియమ్స్ కి నేనో వుత్తరం రాస్తాను. రాసిందెవరో వాడికి తెలియక్కర్లేదు. ఫలానా చిరునామాలో వుంటున్న యువతీ డబ్బు అవసరం లో వుంది-- అని రాస్తే చాలు. మిగతా వ్యవహారం వాడే నడుపుతాడు. అందులో వాడు అందే వేసిన చేయి--"
గిరిజ ఆలోచనలో పడింది. కాసేపాగి -- "నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి. ఇది చాలా ప్రామదకరమైన వ్యవహారంలా తోస్తోంది నాకు--"అందామె.
గిరిజకు ఏం చేయాలో తోచలేదు. విషమ సమస్య వచ్చినట్లే అనుకుందామే. సుఖంగా నడిచి పోతున్న సంసారంలో చిక్కులు తెచ్చి పెట్టవద్దని భగవంతుడిని ప్రార్ధించింది.
భగవంతుడామే ప్రార్ధనలు విన్నాడో లేదో తెలియదు కానీ ఆ దంపతులకు కొత్త ఉపద్రవం వచ్చిపడింది.
ఓరోజు రామం ఇంటికి వచ్చేసరికి గిరిజ దిగులుగా అతడికి ఎదురై --"కొంప మునిగి పోయిందండీ -" అంది.
"ఎమిటయింది ?" అన్నాడు రామం కంగారుగా.
