Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 23

 

    "ఇది పేర్రాజు గారిల్లె కదా ?" అడిగాడు యువకుడు.
    పేర్రాజు ఆశ్చర్యంగా ఆ యువకుణ్ణి చూశాడు. వచ్చినవాడు చూడ్డానికి ధనికుదిలాగున్నాడు. వెతుక్కుంటూ తనింటి కెందు కొచ్చాడు--"ఇది నా యిల్లు , నా పేరు పేర్రాజు. ఈ ఊరి కమిటీ స్కూల్లో మేస్టర్నీ !" అన్నాడాయన.
    "మీ అమ్మాయి పేరు రాధ కదూ?" అన్నాడు యువకుడు.
    "అవును , నీకెలా తెలుసు?" అన్నాడు పేర్రాజు రెట్టించిన ఆశ్చర్యంతో.
    "ఎందుకు తెలియదు? నేనామెను ప్రేమించాను-" అన్నాడా యువకుడు.
    ఒక్కక్షణం పేర్రాజుకు నోటమాట రాలేదు. ఎవరీ కుర్రాడు? తన దగ్గరికి వచ్చి తన కన్న కూతుర్ని ప్రేమించానని ధైర్యంగా చెబుతున్నాడు? ఎప్పుడూ ఈ ఊరు దాటి వెళ్ళని రాదని తానెప్పుడు చూశాడు? ఎలా ప్రేమించాడు?
    "నువ్వనుకునే రాధ ఎవరో? పొరపాటున నువ్విక్కడికి వచ్చావను కుంటాను. నా కూతురీ ఊరొదిలి ఎక్కడికి వెళ్ళలేదు--" అన్న వాక్యం పూర్తీ చేశాక పేర్రాజుకో పెద్ద అనుమానం వచ్చింది. ఇప్పుడు రాధ ఇంట్లో లేదు. ఇంట్లోనే కాదు - ఊళ్ళో కూడా లేదు. జయరాజుతో లేచిపోయింది. జయరాజుతో లేచిపోయిన రాధ ఈ యువకుడి కళ్ళ బడిందా? తన వివరాలతడికి చెప్పిందా?
    "నేనెప్పుడూ ఏ విషయంలోనూ పోరబడను. అందుకే ముందుగా మీ పేరు కూడా అడిగాను-" అన్నాడు యువకుడు నమ్మకంగా.
    "నీ పేరు!"
    "శేషారావు!" అన్నాడాయువకుడు.
    ఎక్కడో విన్నట్లని పించి ఉలిక్కిపడ్డాడు పేర్రాజు. శేషరావు కాదు కానీ అలాంటిదే పేరు.....శేషయ్య .... కాకినాడ శేషయ్య ...పేరు విన్నాడతను.
    "అంటే నువ్వేనా కాకినాడ శేషయ్యవి!" అనడిగాడు పేర్రాజు.
    "కాకినాడ శేషయ్య -- వాడెవడు ?" అన్నాడు ఆశ్చర్యంగా.
    పేర్రాజు క్షణం పాటు తమాయించుకున్నాడు. తన బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. అనవసరంగా ప్రతివాడి దగ్గరా తన గుట్టు రట్టు చేసుకోవడమెందుకు? అసలీ కుర్రాడేవరో , తన కూతుర్నేప్పుడు - ఎలా ప్రేమించాడో -- ఇప్పుడిక్కడికి ఎందుకోచ్చాడో తెలుసుకోవాలి.
    "నిన్నేక్కడా చూసిన గుర్తు లేదు. మా అమ్మాయి నన్నొదిలి ఏ ఊరూ వెళ్ళలేదు. నువ్వు దాన్ని ఎప్పుడు చూశావు-- ఎక్కడ చూశావు- అన్నది నాకు తెలియడం లేదు--" అన్నాడు పేర్రాజు.
    "అమలాపురం లో సుబ్బాయమ్మ పెళ్ళిలో చూశాను" అన్నాడు శేషారావు.
    సుబ్బాయమ్మ పేర్రాజు దూరపు బంధువులమ్మాయి. ఆ పెళ్ళికి పేర్రాజు వెళ్ళలేదు. అతడికా సమయానికి ఎలక్షన్ డ్యూటీ పడింది. వర్ధనమ్మ, పిల్లలు వెళ్ళారా పెళ్ళికి!
    జవాబు విన్నాక పేర్రాజు మనసు తేలికపడింది. కూతుర్ని శేషారావు తప్పుడు స్థలాల్లో చూడలేదు. పెళ్ళిలో చూశాడు-- "నువ్వు రాధతో మాట్లాడేవా?"
    "లేదు. కానీ మాట్లాడాలని అనుకున్నాను. ఆమె నాకు ఒంటరిగా దొరకలేదు. ఆమె అందచందాలు నచ్చాయి. ఆమె గురించి వాకబు చేశాను. మీ అడ్రసు సంపాదించాను. ఇప్పుడు మీ అనుమతి కోసం వచ్చాను" అన్నాడు శేషారావు . అతడి కళ్ళు రాధ కోసం వెతుకుతున్నాయి.
    "సుబ్బాయమ్మ పెళ్లై చాలా కాలమయింది-- నువ్విప్పుడోచ్చావా?' అన్నాడు పేర్రాజు.
    "రాధను చూడగానే మా యింట్లో చెప్పాను. దాంతో పెద్ద యుద్దమైంది. ఇంట్లో ఒక్కరు కూడా నాకు అనుకూలురుగా లేరు.  అయినా ధైర్యంగా అందర్నీ ఎదిరించాను. అది ముగియడాని కింతకాలం పట్టింది-" అన్నాడు శేషారావు.
    "పెళ్ళి గురించి అంత యుద్దమెందుకు?"
    "నా పెళ్ళికి నాన్నగారు యాభై వేల కట్నం ధర కట్టారు. అది పలికే మాటయితే కోతి పిల్లయినా ఫరవాలేదాయనకు. అందుకే యుద్ధం. రాధ బడిపంతుల పిల్లని అయన మండి పడ్డారు -"
    పేర్రాజు ముఖం కాస్త మాడింది -- " ఇంతకీ మీ నాన్న గారి పేరు?"
    "కొండల్రావు!" అన్నాడు శేషారావు.
    "ఏ కొండల్రావు?' అన్నాడు పేర్రాజులిక్కిపడి.
    శేషారావు చెప్పాడు. పేర్రాజుకు నోటమాట రాక కొంతసేపు అవాక్కయి శేశారావు వంకనే చూస్తూ వుండి పోయాడు. కాసేపటికి అతికష్టం మీద గొంతు పెగిల్చి --"నువ్వు ....నువ్వు....మీరు ....కొండల్రావు గారి అబ్బాయా?' అన్నాడు.
    కొండల్రావు పేర్రాజుకు బంధువే -- కానీ అలా చెప్పుకుంటే అది పేర్రాజు సాహసమే అవుతుంది. ఆయన్ను కన్నెత్తి చూడడం గాని, పల్లెత్తి పలకరించడం గానీ చేయలేడు పేర్రాజు. అంతస్థులలో వారికున్న బేదాలలాంటివి. కొండల్రావుకి బంగారు ఇనప్పేట్టెలు నాలుగున్నాయని చెప్పుకుంటారు. అందులో నిజం ఎంతున్నా దాన్ని బట్టి అయన ఆస్తిని అంచనా వేయవచ్చు.
    "మీరు పెద్దలు, నన్ను గౌరవించకూడదు. ఇందాకటి లాగే పిలవండి --" అన్నాడు శేషారావు.
    పేర్రాజు శేషారావు ను మరిన్ని వివరాలిడిగాడు.
    రాధ కోసం ఇంటినీ, ఆస్తిని , బంధువులనీ తెగ తెంచుకుని వచ్చేశాడు శేషారావు.
    "ఇప్పుడెం చేస్తావ్?" అన్నాడు పేర్రాజు.
    "మీ అనుమతి తీసుకుని రాధను పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు శేషారావు.
    ఏ ఆడపిల్ల తండ్రి కైనా ఇది శుభవార్త! అయితే ఎటువంటి శుభవార్త కైనా అశుభం ఆపాదించబడేది అ ఘడియను బట్టే! పేర్రాజు కిప్పుడు శుభ ఘడియలు లేవు. శేషారావు వచ్చినవి శుభ ఘడియలు కావు.
    ఇప్పుడు తనేం చేయాలి? కూతురు జయరాజుతో లేచిపోయిందని శేషారావు కు చెప్పాలా? లేక ప్రస్తుతానికి ఊళ్లోలేదని అబద్దమాడాలా?" రెండోదే చేశాడు పేర్రాజు.
    "ఏ ఊరేవెళ్ళింది?"
    అత్తారి ఊరి పేరు చెప్పాడు పేర్రాజు.
    "అయితే అక్కడికి వెడతాను -- " అన్నాడు శేషారావు.
    "ఎందుకని ?'
    "ఆమెకు నేనంటే ఇష్టముందో లేదో తెలుసుకోవాలని ఆత్రంగా వుంది నాకు" అన్నాడు శేషారావు.
    "బాగానే వుంది. అది తెలుసుకోకుండానే ఇంత కాలం మీవాళ్ళతో యుద్ధం చేశావా?" అన్నాడు పేర్రాజు.
    "నా ప్రతిపాదన మావాళ్ళు ఖండించాగానే ఏం చేయాలో నాకు తెలియలేదు. ఆ బంధాలన్నీ తెంచుకు వచ్చాక ఇంతకాలం నాదిఏకపక్ష ప్రేమగా ఉండిపోయిందని స్పురించింది. కానీ నాకు నమ్మకముంది - ఆమె కాదనదని"అన్నాడు శేషారావు.
    "అంత నమ్మకమున్నప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్లాడమెందుకు?"అన్నాడు పేర్రాజు.
    "పేర్రాజు మామయ్యగారు -- మీకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేనెక్కడికి వెడతాను ? నాకింకేవరున్నారు?" అన్నాడు శేషారావు దీనంగా.
    హటాత్తుగా పేర్రాజుకి అనుమానం వచ్చింది. 'అసలు నువ్వు కొండల్రావు గారబ్బాయి వన్న నమ్మక మేమిటి?
    "మీరు నమ్మి ప్రయోజన మేమిటి? నేనా యింటితో అన్ని బంధాలు తెంచుకు వచ్చేశాను. నేనింక కొండల్రావు గారబ్బాయిని కాదు" అన్నాడు శేషారావు.
    "చూస్తూ చూస్తూ నా కూతుర్ని బికారి చేతుల్లో పెట్టలేను గదా" అన్నాడు పేర్రాజు.
    "నేను బికారిని కాదు. రెండేళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను. నా తండ్రికి సంబంధించిన లక్షల ఆస్తికి వారసత్వం పోగొట్టు కున్నా- నా దగ్గర రెండు లక్షల దాకా ఉన్నాయి. దీనికి ఋజువు మీ కెప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వగలను. నాతొ రామచంద్రాపురం రండి --" అన్నాడు శేషారావు.
    పేర్రాజు నాలిక్కరుచుకున్నాడు. కుర్రాడి ధీమా చూస్తుంటే ఉన్నావాడి లాగే వున్నాడు. మిగతా విషయాలు తెలుసుకొనడం అంత కష్టమేం కాదు. ఉన్న ఇబ్బందల్లా అసలు రాధ నతడికి చూపెదేలా? తన సమస్య అతడికి చెప్పుకునేదేలా?
    శేషారావు జాలిగా పేర్రాజు వంక చూసి "మీరు నన్ను నమ్మండి. నాతొ రామచంద్రాపురం రండి. నా స్థితి గతులు చూశాకనే మనమిద్దరం కలిసి రాధ ఉన్న వూరు వెడదాం. మీతో వెడితేనే నాకు అన్ని మాటలూ సక్రమంగా అవుతాయి. నా ప్రేమకూ మీ అమోదముందన్న విషయం రాధకు తెలియాలి. అదీకాక...." అని ఆగాడు.
    "అదీకాక....?" అన్నాడు పేర్రాజు.
    "నేను ఇల్లోదిలే ముందు నాన్న నన్ను బెదిరించాడు. ఏ అమ్మాయి కోసం నువ్వు మమ్మల్నందర్నీ వదిలి వెడుతున్నావొ అ అమ్మాయి నీకు దక్కతుందని అనుకోకు. మన జయరాజుండనే ఉన్నాడు- అన్నాడు-"అన్నాడు శేషారావు.
    పేర్రాజు లిక్కిపడి - "ఏమన్నావ్?" అన్నాడు.
    శేషారావు మళ్ళీ అదే మాట చెప్పి -- "అందుకే నేను కంగారుగా రాధ కేమయిందోనని వచ్చాను" అన్నాడు.
    పేర్రాజు తల పట్టుకుని-- "అయితే ఇంక నీ దగ్గర దాచి లాభం లేదు. అంతా ఇప్పుడర్ధమవుతోంది . ఇదంతా కొండల్రావు గారి పన్నాగమన్న మాట. ఇప్పుడు నా కూతురు జీవితం బుగ్గి పాలయింది. అసలు దానికి నూరేళ్ళు నిండాయేమోనని భయంగా కూడా వుంది" అన్నాడు అయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS