Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 22

 

    రాధను నెమ్మదిగా తీసుకు వచ్చి వెనక సీట్లో పడుకో బెట్టారు. జయరాజు, డ్రైవర్ ముందు సీట్లో కూర్చున్నారు. టాక్సీ బస్ స్టాండు వదిలిపెట్టింది.

                                      3
    స్కూల్లో వుండగా పేర్రాజుకి కబురొచ్చింది ఇంటి దగ్గర్నుంచి . అతడి భార్య వర్ధనమ్మ పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది. పేర్రాజు హెడ్మాస్టారు కి చెప్పి ఇంటికి వచ్చేశాడు.
    'అమ్మాయి యింట్లో లేదేమండీ - పక్కింటి వాళ్ళ నడిగితే నా దగ్గర కొచ్చిందంటారేమిటి?' అన్నది వర్ధనమ్మ మొదటి ప్రశ్న. అది పిడుగులా తగిలింది పేర్రాజుకు.
    "తెలిసే అడుగుతున్నావా , వేళాకోళమాడుతున్నావా?" అన్నాడు పేర్రాజు కంగారుగా.
    వర్ధనమ్మ కూడా పేర్రాజు వేళాకోళ మాడుతున్నాడనుకుంది టెలిగ్రాం కబురు విని, ఇద్దరూ కూడా వేళాకోళలాడుకోవడం లేదని గ్రహించేక ఇద్దరికీ కాళ్ళూ చేతులు ఆడలేదు.
    జరిగింది చెప్పాడు పేర్రాజు.
    వర్ధనమ్మ గుండెలు బాదుకుంది.
    ఓ పావుగంట సేపు ఇద్దరూ అయోమయ వస్థలో వుండిపోయారు. ఏం చేయాలో ఇద్దరికీ పాలుపోలేదు.
    ఇప్పుడు రాధా ఎక్కడుంది?
    అప్పటికి టైము సాయంత్రం నాలుగయింది. భార్యా భర్త లిద్దరూ ఈ విషయమై ఏం చేయాలో తర్జన భర్జన చేశారు.
    "ఆడపిల్లను ఒక్కదాన్నీ ముక్కు మొహం తెలియని వాడితో యెలా పంపించారండీ - ఇదంతా వాడు పన్నిన మాయే అయుంటుంది. ఇప్పుడెం చేయాలి?" అంది వర్ధనమ్మ.
    "ఆ జయరాజు నమ్మించి గొంతు కోశాడు. ఆ పరిస్థితుల్లో యెవ్వరూ వాడ్ని మోసగాడను కోరు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం-- ఎదిగిన ఆడపిల్ల- భయమేముంటుంది లే అనుకున్నాను" అన్నాడు పేర్రాజు.
    "ఎదిగిన ఆడపిల్ల కాబట్టే నండీ భయపడాల్సింది" అంది వర్ధనమ్మ.
    "నిజమేననుకో -- ప్రాజ్ఞురాలైన పిల్లని పదిమందీ చూస్తుండగా వాడు మాత్రం ఎలా యెత్తుకు పోగలడే?" అన్నాడు పేర్రాజు.
    "దొంగ టెలిగ్రాం ఇప్పించిన వెధవ ఎంతకైనా తెగించగలడు. వాణ్ని మీరెలా నమ్మారండీ బాబూ -" అంది వర్ధనమ్మ.
    "ఎక్కడో మారుమూల పల్లెటూరిలో వున్న మనమ్మాయి నేత్తుకు పోవడం కోసం పట్నం నుంచి పధకం వేసుకొని ఎవరో వస్తాడని నేను మాత్రం కలగన్నానా చెప్పు! ఇవన్నీ తర్వాత.... ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఆలోచించాలి!" అన్నాడు పేర్రాజు.
    సరిగ్గా అప్పుడే పోస్టు మాన్ వచ్చి పేర్రాజు కో కవరు యిచ్చి వెళ్ళాడు. దాని పైన "ఫ్రం రాధ"అని రాసి వుంది. అది చూస్తూనే పెర్రాజూ కళ్ళు మెరిశాయి. 'అమ్మాయి దగ్గర్నుంచి --" అని భార్యకి చెప్పి కవరు చింపి ఉత్తరం బైటకు తీసి చదివాడు.
    "పుజ్యునీయులైన నాన్నగారికి మీ కూతురు
    రాధ నమస్కరించి వ్రాయునది --
    నేను జయరాజుతో లేచిపోయాను. నా గురించి  మీరు ఏ రిపోర్టులు ఇవ్వొద్దు. మళ్ళీ నేనుత్తరం రాసేవరకూ మీరు నా గురించి ఆలోచించకండి. నేను వేసింది తప్పటడుగని మీరు భావిస్తుంటే నన్ను క్షమించండి.

                                                                                   మీ దీవెనలు కోరే
                                                                                             రాధ-"
    "ఎంత పని  చేశావే తల్లీ!" అంటూ శోకాలు ప్రారంభించింది వర్ధనమ్మ.
    "నువ్వాట్టే అరవకు. ఈ విషయం బైటకు పోక్కనివ్వ కూడదు --" అన్నాడు పేర్రాజు.
    "మరేం చేయాలి?"
    "ముందా జయరాజు గురించి నేను వాకబు చేస్తాను -" అన్నాడు పేర్రాజు. అయన ప్రెసిడెంటు భద్రయ్య  ఇంటికెళ్ళి కాకినాడ శేషయ్య గురించి అడిగాడు.
    "కాకినాడ శేషయ్య -- వాడెవడు?" అన్నాడు భద్రయ్య.
    "వాడెవడో తమరికి తెలుసు-" అన్నాడు పేర్రాజు.
    "ఇందింకా బాగుందయ్యా పంతులూ!' అంటూ చిరాకు పడ్డాడు భద్రయ్య.
    పేర్రాజప్పుడు జయరాజు గురించి చెప్పాడు. అదంతా విని -"ఎవడో నీకు టోకరా ఇచ్చాడు. వాడుండగానే నువ్వు నా దగ్గర వస్తే నిజం బైట పడుండేది -" అన్నాడు.
    అది నిజమేననిపించింది పేర్రాజుకు. జయరాజు కావాలనే ఈ నాటకం సృష్టించాడు. అది బయటపడుతుందనే తనను భద్రయ్య ఇంటికి వెళ్ళనివ్వలేదు.
    ఎందుకైనా మంచిదని కూతురి విషయం మాత్రం పేర్రాజు భద్రయ్యకు చెప్పలేదు. ఆయన ఇంటికి తిరుగు ముఖం పడుతుండగా దారిలో ఓ మనిషి ఎదురయ్యాడు. వాడు భద్రయ్య మనిషి. జయరాజు కిమ్మని పెట్టె ఇచ్చింది వాడే! వాణ్ని చూడగానే పేర్రాజులో మళ్ళీ ఆశలు చిగురించాయి, ఆపి - పలకరించాడు.
    వాడు పేర్రాజుకు దణ్ణం పెట్టాడు.
    "దణ్ణాలు తర్వాత-- నువ్వేమో భద్రయ్య గారిచ్చాడని నాకో పెట్టె ఇచ్చావు. ఆభద్రయ్య ఏమీ తెలియదంటున్నాడు. అసలు విషయం చెప్పు-" అన్నాడు పేర్రాజు.
    వెంటనే చెప్పకపోయినా కాసేపు తటపటాయించి ఆఖరికి ఆ మనిషి అసలు విషయం చెప్పేశాడు. జయరాజు వాడికి వంద రూపాయలిచ్చాడు. వాడు జయరాజు చెప్పినట్లు చేశాడు. ఇందులో భద్రయ్య ప్రమేయం ఏమీ లేదు.
    "నీ మూలంగా నాకు చాలా నష్టం జరిగింది. వందరూపాయలకు ఆశపడి ఊళ్ళో వాళ్ళకి ద్రోహం చేస్తావా. భద్రయ్య గారి దగ్గరకు పద- నీ సంగతీ తేలుస్తాను --" అన్నాడు పేర్రాజు.
    ఆ మనిషి పేర్రాజును లెక్కచేయలేదు. తన కసలు ఏమీ తెలియదనీ అంతా పేర్రాజు కల్పించిన నాటకమనీ అనేసి వెళ్ళిపోయాడు.
    వాడింక నిజం ఒప్పుకోడని తనే అనవసరంగా రొష్టు పడాలనీ అర్ధమైంది పేర్రాజుకి. అయన నీరసంగా ఇల్లు చేరాడు. భార్య అయన తెచ్చే కబురు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. తెచ్చిన కబురు విని నీరస పడిపోయి -- "ఆ జయరావేవడండీ-- మనపిల్ల గురించి వాడికెలా తెలిసిందండీ- " అంటూ శోకాలు మొదలెట్టింది.
    "దీనంతటికీ కాకినాడలో శేషయ్య నేవాడు కారణం. వాడి గురించి వివరాలు సంపాదిద్దాం. నాకేమో సెలవు ల్లేవు. అమ్మాయేమో లేచిపోయానని ఉత్తరం రాసింది. ఇంక వెతికి మాత్రం ప్రయోజన మేముంది. మనోరివాళ్లైవాడైనా కాకినాడ వెడితే ఆ శేషయ్యేవడో తెలుసుకు రమ్మంటాను-" అన్నాడు పేర్రాజు.
    "అవతల వాడు అమ్మాయి నేం చేస్తాడో ఏమో- దాన్ని చంపినా చంపెయగలడు. అభం శుభం తెలియని పిల్ల అది. దాని గురించి నాకు చాలా బెంగగా ఉందండీ--" అంది వర్ధనమ్మ దిగులుగా.
    "నాకూ ఉంది దిగులు. కానీ కావాలని లేచిపోయాన పిల్లని మనమేం చేయగలం? ఎలా రక్షించగలం? అది అనుభవించక తప్పదు-" అన్నాడు పేర్రాజు.
    "అది కావాలని లేచిపోయిందంటారేంటండీ -- వాడు మోసం చేసి తీసుకుపోయాడేమోనని నా అనుమానం. మనది నిప్పులాంటి వంశం --" అంది వర్ధనమ్మ.
    "రాజమండ్రి బస్సు స్టాండు లో దిగి ఇంకో బస్సు మారలది. అందులో వాడు చేయగల మోసమేముంది? దానికీ ఇష్టమై కులుకుతూ వెళ్ళింది. అసలు నేను పట్టించుకోలేదు గానీ ప్రయాణమైనప్పట్నించి కూడా ఉషారుగా ఉందది-"
    'అయితే మీరు దాని కోసం ఏమీ చేయరా?"
    "లేచిపోయిన ఆడపిల్ల చచ్చిందానితో సమానం-" అన్నాడు పేర్రాజు కోపంగా.
    అయినా పేర్రాజు తన ప్రయత్నాలు మానలేదు. అయన అక్కణ్ణించి కాకినాడ వెళ్లి వచ్చే వాళ్ళ ద్వారానూ, తనకు తెలిసిన ఒకరిద్దరు మాజీ విద్యార్ధుల ద్వారానూ కాకినాడ శేషయ్య గురించి వాకబు చేయించాడు.
    కాకినాడలో శేషయ్యలుంటే ఉండవచ్చు కానీ ప్రముఖుల్లో ఎవరూ శేషయ్యల్లేరు.
    "ఆ జయరాజు అన్నీ అబద్దాలే చెప్పాడు--" అన్నాడు పేర్రాజు.
    "వాడి ఆనవాళ్ళు, పేరూ చెప్పి ఏ పోలీసు కైనా ప్రయివేటు డిటెక్టివ్ కైనా యిస్తే?" అంది వర్ధనమ్మ.
    'అయినా వాడి పేరు మాత్రం నిజమని నమ్మకమేమిటి? ఇన్ని అబద్దాలు చెప్పినవాడు తన అసలు పేరు చెప్పి ఉంటాడనుకోవడం కూడా తెలివితక్కువే!" అన్నాడు పేర్రాజు.
    "మీరన్నది నిజమే - ఆ మాటకొస్తే వాడిక్కడికి మారువేషంలో రాలేదన్న నమ్మకమేమిటి? ఆనవాళ్ళూ పనికిరావు-- " అంది వర్ధనమ్మ.
    "వర్ధనం మనకిన్ని తెలివితేటలిచ్చాడు దేవుడు. కానీ అమ్మాయినీ రక్షించుకునెందుకు పనికి రావడం లేదు-" అన్నాడు పేర్రాజు దిగులుగా.
    దంపతులిద్దరూ అలా రెండ్రోజులు దిగులు పడ్డారు. మూడో రోజు కూడా దిగులు పడవలసిందే-- కానీ వాళ్ళింటికి ఓ కొత్త వ్యక్తీ వచ్చాడు.

                                     4
    వచ్చిన వ్యక్తీ యువకుడు, నిండా పాతికేళ్ళు వుండవు.
    "ఎవరు కావాలి బాబూ నీకు?' అనడిగేడు పేర్రాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS