Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 22


    ఊరు దరిదాపుల్లో టాక్సీట్రబులిచ్సింది. రమేష్ టాక్సీ అతనికి డబ్బులిచ్చి బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు. అతను పూర్తిగా తనసామాను వెనక్కు తీసుకురాలేదు. వీరయ్య గారిని స్వయంగా హెచ్చరించి ఒకటి రెండురోజుల్లో మళ్ళీ వెనక్కు వెళ్ళాలని అతని ఉద్దేశ్యం.
    రమేష్ ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నాడు. భార్య అరుణ గుర్తురావడం మొదలయింది. మూడు నెలల విరహం తమది. మధ్యలో ఇంటికి వెళ్ళాలని తను చాలా ప్రయత్నించాడు. కానీ ఏదో ఒకపని తనవల్లా వెంటాడుతూనే వుంది. కొడుకులిద్దరూ తరచుగా తనకోసం అడుగుతున్నారని అరుణ ఉత్తరం రాసింది.
    తను బయల్దేరేముందు ఇచ్చిన డబల్ ఎక్స్ ప్రెస్ టెలిగ్రాం ఇంట్లో అందేవుంటుంది. ఉత్సాహంగా ఆశగా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.
    రమేష్ అడుగులు పడుతూనే వున్నాయి. ఇంతలోనే అతని వీపుకి చల్లగా ఏదో తగిలింది. అతను వెనక్కు తిరగబోయేలోగా, "వెనక్కు తిరగడానికి ప్రయత్నించకు. దారి రోడ్డు మీదనుంచి పక్కకు మళ్ళించు. ఆ తోటలో నీతో చాలా మాట్లాడాలి....." అన్నమాటలు వినిపించాయి.
    రమేష్ ఆశ్చర్యపోయాడు. అతను ఎవరైవుంటారు? రఘురామయ్య మనిషా! రఘురామయ్యకు తనమీద అనుమానం కలిగిందా?
    ఆలోచిస్తున్నకొద్దీ రమేష్ లో భయం కలగసాగింది. అతనికి తన తెలివితక్కువహనం ఇప్పుడిప్పుడే అర్ధంకాసాగింది. రఘురామయ్యకు విదేశీగూఢచారుల సహాయముండివుంటుంది. దేశద్రోహులకి సంబంధించిన కాగితాలు ఒకసారి తన చేతిలో పడ్డాక అంత సులువుగా తనని వదుల్తారా? బహుశా తననుగురించి వచ్చేవుంటారు.
    రమేష్ తోటను సమీపించేక-"వెనక్కు తిరగవచ్చా? నాతో ఏం మాట్లాడాలి?" అన్నాడు.
    జవాబుగా "ఢాం" అన్న చప్పుడైంది. రమేష్ గావు కేకపెట్టి నేలమీద పడిపోయాడు.

                                       2

    "అల్లరిచేస్తే నాన్నగారు రారు...." అంటూ బెదిరించింది అరుణ.
    పిల్లలిద్దరూ వెంటనే నోరుమూసేశారు. తండ్రిని చూడాలనీ, కలుసుకుని కబుర్లు చెప్పాలనీ వారిద్దరికీ తహతహగా ఉంది. పెద్దపిల్ల పద్మ వయస్సయిదేళ్ళు. ముద్దుగా ఇంట్లో అంతా బేబీ అని పిలుస్తారు. రెండోవాడు రాజు వయస్సు మూడున్నర. ఇద్దరికీ స్పష్టంగా మాట్లాడడం వచ్చు.
    అరుణ కూడా భర్త రాకకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. నిజానికామెకు టెలిగ్రాం వచ్చేవరకూ భర్త ఈరోజే రాబోతున్నాడని తెలియదు. మూడు నెలల విరహమొకపక్కా, కొన్ని సంవత్సరాలు కలిసిమెలసి కాపురం చేసిన కారణంగా ఏర్పడిన ప్రేమాభిమానా లొకపక్కా జతగూడి ఆమెను భర్తకోసం ఎదురుచూసేలా చేస్తున్నాయి.
    టెలిగ్రాం రాగానే మరిది సురేష్ కు ఫోన్ చేసి చెప్పిందామె. సురేష్ కూడా ఈ వార్తవిని చాలా ఆనందించాడు. తనూ కొద్దిసేపట్లో బయల్దేరి వస్తున్నానని అతను చెప్పేడు.
    రమేష్ తండ్రి రామనాధంగారి కీమధ్య ఆరోగ్యంబాగుండడంలేదు. ఆయన వయస్సు సుమారు అరవై ఏళ్ళుంటుంది. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారాయన.
    రామనాధం భార్య శచికి యాభైఏళ్ళుపైబడ్డా ఆవిడ ఆరోగ్యం మాత్రం నిక్షేపంలా ఉంది. ఆవిడ ఆరోగ్యం అరుణ అదృష్టం. భర్త సేవలతోపాటు ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడే కచూసుకుంటుంది. ఆవిడ కోడల్నీ, మనుమడూ, మనుమరాల్నీ కంటికి రెప్పలా చూసుకుంటుంది.
    ఈ కారణాలవల్ల ఆ ఇల్లొక స్వర్గధామంలా ఉంటోంది. ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళి కొంతకాలం గడపాలని ఇంట్లోని ఏ సభ్యుడూ అనుకోడు. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా లేకపోతే ఇల్లంతా వెలితిగా ఉంటుంది. ప్రస్తుతం రమేష్ లేక ఆ ఇంట్లో చాలా వెలితిగా ఉంది. అందుకే అందరూ రమేష్ కోసం ఎదురుచూస్తున్నారు.
    అరుణ ఫోన్ చేసిన గంటకు సురేష్ ఇంట్లో అడుగుపెట్టాడు. వస్తూనే అతను వేసిన ప్రశ్న-"అన్నయ్యొచ్చాడా?" అని.
    "లేదయ్యా-ఇంకా రాలేదు. టాక్సీలో బయల్దేరి వస్తున్నానని రాశారు. ఈపాటికి వచ్చేయాలి మరి....." అంది అరుణ ఆదుర్దాగా.
    సురేష్ వేళ్ళు మడిచి లెక్కలు గణించి-"అవును-ఈపాటికి వచ్చేయాలి మరి-" అన్నాడు.
    మరిది అలా అనగానే అరుణముఖంలో ఆత్రుత పెరిగింది-"ఏమైనా జరిగిందంటావా?" అంది.
    "అని నేననుకొను-అన్నయ్యకీ ప్రయాణాలు కొత్త కాదు. ఊళ్ళో దిగీ దిగగానే ఎవరైనా తగిలి ఉండవచ్చు-"అన్నాడు సురేష్.
    అప్పటికి మళ్ళీ పిల్లలు ఆటల్లో పడిపోయారు. వాళ్ళ అల్లరి భరించలేక-"అయితే నాన్నగారు రావడం మీ కిష్టంలేదా!" అని గసిరింది అరుణ.
    "ఏంకాదు? అన్నీ అబద్ధాలు ఈవేళ నాన్నగారు రారు" అంది పద్మ.
    "ఛీ-వెధవమాటలూ నువ్వూనూ...." అంటూ విసుక్కుంది అరుణ.
    రాత్రి భోజనాల సమయమైనా రమేష్ రాలేదు. అరుణ తప్ప మిగతా అందరూ భోంచేశారు. అత్తగారెంత బలవంతపెట్టినా అరుణ మాత్రం భోజనానికి కూర్చోలేదు. ఆమెకు భర్త తప్పక వస్తాడని ఆశగా ఉంది. ఎందుకు రాలేదోనని బెంగగా ఉంది.
    రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాల ఆ ఇంట్లోకి ఎవరో వచ్చారు-
    ఆ వ్యక్తిని వెళ్ళి పలకరించినవాడు సురేష్.
    "రమేష్ గారిల్లిదేకదండీ...." అన్నాడు ఆ వ్యక్తి.
    సురేష్ అతన్ని పరిశీలనగా చూసి-"అవును-ఇదే!" అన్నాడు.
    ఆ వ్యక్తికి సుమారు ముఫ్ఫై ఏళ్ళుంటాయి. గెడ్డం కొద్దిగా మాసివుంది. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. బాగా చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు.
    "నాపేరు త్రినాధరావు. ఇంటికి బయల్దేరి వస్తున్నట్లు రమేష్ గారు మీకు టెలిగ్రాం ఇచ్చారేమో కదా...." అన్నాడు.
    అప్పటికి అక్కడకు అరుణకూడా చేరుకుంది. ఇంటికెవరు వచ్చినా వీధి గుమ్మం దగ్గరకు రావడాని కామె కెంతోసేపు పట్టడంలేదు-అతని ప్రశ్నవిని-"అవును-మీకెలా తెలుసు?" అంది ఆత్రుతగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS