Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 22


    "నాకు మనుషులమీదనేగానీ వాళ్ళచుట్టూ వుండే కథల మీద ఆసక్తి లేదు. నాకిష్టమైన మనిషి ఏ వాతావరణంలో వున్నా, ఎలాంటిదైనా-నా స్వంతం చేసుకునేందుకు వెనుకాడను. ఈరోజు మిమ్మల్ని చూసేక మీరు లేకపోతే నా జీవితం వ్యర్ధమనిపించింది...." అన్నాడు విఠల్.
    అప్పుడే ఆ స్వల్పపరిచయంలోనే అతను చాలాదూరం వచ్చేశాడని ఆమె గ్రహించింది.
    "మీ కిష్టం లేకపోయినా నా వివరాలు చెప్పక తప్పదు. మా తల్లిదండ్రులకు ఒక్కర్తే సంతానాన్ని నేను. అలాగని మేము ధనికులమూ కాము. ఏదో నాలుగువేళ్ళు నోట్లోకి పోతున్నాయి. నేను ఇంటర్ ప్యాసై టైపూ షార్టూహ్యాండూ నేర్చుకుని ఉద్యోగం చేస్తున్నాను ప్రస్తుతం. నెలకు నాలుగొందలు వస్తున్నాయిప్పుడు. అందువల్ల వివాహం గురించి బెంగపడవలసిన అవసరం లేదు. మంచి వరుణ్ణి ఎన్నుకోగల సామర్ధ్యమూ వుంది. ఈ రోజుల్లో చాలామంది యువకులు అందమైన ఆడపిల్ల కనబడగానే వెంటబడి తమ ఆశయాలూ ఆదర్శాలూ వల్లించి పెళ్ళి చేసుకుంటామని ఆశపెట్టటం మామూలైపోయింది. అటువంటి ఆశలకు లోబడే దీనస్థితిలో నేను లేను. ఈ విషయం మీరు గుర్తించాలి....."
    "నన్ను గురించి అలా యెందు కనుకున్నారు మీరు.....?"
    "ఏ పరిచయమూ లేని ఆడపిల్లదగ్గర పెళ్ళిమాటలాడే ధైర్యం మీ మగవాళ్ళకి-ఎలా వస్తుందో నాకు తెలుసు కాబట్టి! అసహాయశూరులమని విర్రవీగే చాలామంది అబ్బాయిల శూరత్వం అసహాయులవద్ద మాత్రమేనని అనుభవపూర్వకంగా తెలుసు నాకు...." అంది కుసుమ.
    "నేనలా కాదు...." అన్నాడు విఠల్.
    "ఆ విషయం ఋజువుచేసుకునే అవకాశముంది మీకు. ఎందుకంటే ఈ ఊళ్ళోనే మా బావ వున్నాడు...." అంది కుసుమ.
    "మీకో బావున్నాడా? అదీ ఈ వూళ్ళో-" నిరుత్సాహంగా అన్నాడు విఠల్.
    "అవును. మీ సంగతి తెలియదుకానీ నన్ను చాలా చాలా యెక్కువగా ప్రేమిస్తున్నాడు నా బావ. నేను ఊఁ అంటే యెప్పుడో మా యిద్దరకూ పెళ్లైపోయేదికానీ ఈ విషయంలో నాకో సరదా వుండడంవల్ల ఇంతవరకూ నా అంగీకారం చెప్పలేదు...." కుసుమ ఓ నిముషం ఆగింది "నన్ను పెళ్ళిచేసుకోవడంకోసం ఏమైనా చేస్తానంటాడు బావ. అతను కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. చాలా అందంగా వుంటాడు. చలాకీ అయినవాడు. పేరు గణపతి. అమ్మా, నాన్నలకు గణపతితో పెళ్ళి జరిపించాలనే వుందికానీ-ఏకైక సంతానాన్ని కావడంవల్ల నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీచేయరు వాళ్ళు. బావకెవ్వరూ లేరు. చిన్నప్పట్నించీ మా యింట్లోనే ఉన్నాడు. ఆ విధంగా మా అనుబంధంకూడా చెప్పుకోదగ్గది. ఏ విధంగానూ బావను కాదనడానికి లేదు. కానీ....." మళ్ళీ ఆగింది కుసుమ.
    "చెప్పండి...." అన్నాడు విఠల్. కుతూహలాన్నాపుకోవడం కష్టంగా వుందని అతమీ ముఖం చూసి తెలుసుకోవచ్చు.
    "నాకోసం ఏమైనా చేయగలనన్న బావ మాటల్లో నిజం తెలుసుకోవాలన్న కోరిక నాకుంది. అందుకే ఇంకొకరెవరైనా నన్ను ప్రేమించానంటూ వస్తే ఆ వ్యక్తిని ప్రోత్సహించాలనే నిశ్చయించుకున్నాను. ఎటొచ్చీ ఆ వ్యక్తి నాక్కూడా నచ్చేలాగుండాలి. బావకు పోటీగా నాకు నచ్చిన ఇంకో వ్యక్తి బయటపడితే-అతన్ని నేను నిరుత్సాహపరచకపోతే-అప్పుడు బావ ఏం చేస్తాడో చూడాలనుంది నాకు..." అంది కుసుమ.
    విఠల్ ఆశ్చర్యంగా భయంగా ఆమెవంక చూసి-"సరదా బాగానే వుందికానీ ఇది జీవితాలతో ఆట. చాలా భయంకరమైన కోరిక మీది. ఇద్దరినీ పెళ్ళిచేసుకోవడం సాధ్యపడదు కాబట్టి-ఇద్దరిలో ఒకడు మీ కారణంగా సర్వనాశనమైపోతాడు. బహుశా పిచ్చివాడైపోయినా ఆశ్చర్యంలేదు...." అన్నాడు.
    "ఇద్దరిలో ఒకడన్న ప్రసక్తిలేనేలేదు. బావ బ్రతికుండగా ఇంకొకన్ని పెళ్ళిచేసుకునే ఆలోచనే లేదు...." అంది కుసుమ తాపీగా.
    "అంటే?" అన్నాడు కంగారుగా విఠల్.
    "ఈ ప్రాక్టీసు పూర్వం ఫారిన్లో ఉండేది. ఇద్దరబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించారనుకోండి. ఇద్దరూ రివాల్వర్లో. కత్తులో తీసుకుని ఊరి చివరకు వెళ్ళి- ద్వంద్వయుద్ధం చేసేవారు. ఇంగ్లీషులో డ్యుయెల్ అన్న మాట. మిగిలిన వాడా అమ్మాయిని పెళ్ళి చేసుకునే వాడు...."
    "ఇదా మీ కోరిక?" అన్నాడు విఠల్.
    "అవును. ఇదే నా కోరిక! మీకు ధైర్యముంటే ప్రయత్నించండి. నాకు మీరు నచ్చారు. మీరు, బావ తలపడి ద్వంద్వయుద్ధంచేస్తే-ఎవరు మిగిలినా నేను బాధపడను. సంతోషంగా వివాహానికంగీకరిస్తాను....."
    "పాణాల విలువ తెలుసా మీకు?" కసిగా అన్నాడు విఠల్.
    "తెలుసు. కానీ ప్రేమ విలువ తెలుసుకోవాలనుంది నాకు!" అని ఓ క్షణం ఆగి "ఇష్టమైతే రేపు సాయంత్రం ఇదే సమయానికి బీచికి రండి, బావా, నేనూ మీకోసం ఎదురుచూస్తుంటాం..." అంది కుసుమ.
    
                                           2

    "అతను వస్తాడంటావా?" అన్నాడు గణపతి.
    "వస్తాడేమోనని భయంగా వుందా?...." అంది కుసుమ.
    "భయమా-నాకున్నదల్లా ఒక్కటే భయం. నా కుసుమ నాకు దక్కదేమోనని...."
    "నీ కుసుమ అయితే నీకు దక్కకుండా యెందుకు పోతుంది?"
    "కుసుమను నా దానిగాతప్ప నేనూహించుకోలేను....." అని-"అతనెవరో యిటే వస్తున్నాడు. అతనేనా విఠల్ అంటే?" అన్నాడు గణపతి.
    "అవును. కానీ వస్తాడని నేనూ అనుకోలేదే!" అంది ఆశ్చర్యంగా కుసుమ. అంతలోనే విఠల్ వారిని సమీపించాడు.
    "మీరు వస్తారని నే ననుకోలేదు!" అంది కుసుమ.
    "అనుకోకపోతే యిక్కడి కెందుకొస్తారు?" అని నవ్వాడు విఠల్-"వీరేనా మీ బావ గణపతిగారు.....?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS