Previous Page Next Page 
శంఖారావం పేజి 22

 

                                   4

 

                 

    ఉదయ కళ్ళలో మెరుపులు ....
    సీతమ్మ వెనుకే ఉన్న వేదాంతం ఆమె రూపులు చూశాడు.
    అతడి గుండెలో ఉరుముల చప్పుడు....
    "భోజనానికి రండి - " అంది సీతమ్మ.
    ఉదయ ముందడుగు వేసింది.
    వేదాంతం సీతమ్మను దాటి ముందుకు వచ్చాడు.
    అతడిప్పుడు విశ్వనాద్ కు ఎదురుగా ఉన్నాడు.
    ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
    వేదాంతం మొఖంలో హెచ్చరికతో కూడిన కోపం వుంది.
    విశ్వనాద్ తప్పు చేసినవాడిలా తల దించుకున్నాడు.
    "ఏ మంత్రం వేసి మిమ్మల్నింత వాళ్ళను చేశానో -- ఆ మంత్రమే ఇప్పుడూ వేశాను. నేను మీకు తల్లిని --' అన్న సీతమ్మ మాటలూ -- అమ్మ మాట కాదనడం కష్టం -- ' అన్న కులభూషణ్ మాటలూ --
    వేదాంతం చెవుల్లో గింగురు మంటున్నాయి.
    ఉదయ కళ్ళల్లో ఇంకా మెరుపులున్నాయి.
    వేదాంతం గుండెల్లో అవింకా ఉరుములు చప్పుడు వినిపింప జేస్తూనే ఉన్నాయి.

                                     ***

    రాత్రి పదకొండు గంటల సమయం.
    సీతమ్మ , ఉదయ ఓ గదిలో రెండు మంచాల మీద పడుకున్నారు.
    మరో గదిలో మూడు మంచాలున్నాయి.
    వాటిలో ఒకటి ఖాళీగా ఉంది.
    మిగతా మంచాల మీద ఇద్దరూ మెలకువగానే ఉన్నారు.
    ఆ ఇంట్లో ప్రతి మనిషికి ఒక గది ఉంది. ప్రతి గదికి ఒక అటాచ్డ్ బాత్రూం ఉంది. మొత్తం అయిదు గదులు.
    పడుకుందుకు మాత్రం ప్రస్తుతం రెండే గదులు.
    మగవాళ్ళు ముగ్గురూ ఒక గదిలో ..... ఆడవాళ్ళు  ఇద్దరూ మరో గదిలో ....
    అది సీతమ్మ చేసిన ఏర్పాటు కాదు.
    నిద్రపట్టే వరకూ కబుర్లు చెప్పుకునేందుకు వాళ్ళలా జంటలుగా విడిపోయారు.
    ఒక గదిలో సీతమ్మ నిద్రపోతుంది. ఉదయ మెలకువగా ఉంది.
    జీవం నింపుకున్న మనిషిగా ప్రేమను భూతులనుభావిస్తున్నదామె.
    రెండో గదిలో ఇద్దరూ మెలకువగానే ఉన్నారు.
    "నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు -- " అన్నాడు వేదాంతం.
    'అయ్యాం సారీ --"
    "ఉదయను నువ్వు పెళ్ళి చేసుకుంటావా ?"
    "చేసుకోను -"
    "ఉదయను నువ్వు ప్రేమిస్తున్నావా ?"
    "లేదు?"
    "మరెండుకామేలో ఆశలు పెంచుతావు ....?"
    "పొరపాటు ...."
    "నీ పొరపాటు నాకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది --"
    "ఎలా ?"
    "ఉదయను నేను ప్రేమిస్తున్నాను. పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను. నీకు విముఖంగా తయారు చేయడానికి నేను చేసే ప్రయత్నాలు నీ కారణంగా భగ్నమయ్యాయి. ఆమె నన్ను విలన్ లా భావించి అసహ్యించు కుంటుంది..." అన్నాడు వేదాంతం.
    "సారీ చెప్పానుగా ...."
    "సారీ చెబితే సరిపోదు ..."
    "ఇంకెప్పుడూ ఇలా జరక్కూడదు ...."    
    "విశ్వనాద్ మాట్లాడలేదు.
    "ఉదయను నువ్వే నీకు వ్యతిరేకంగా తయారు చేసుకోవాలి...."
    'అందువల్ల నాకు ప్రయోజనం ?"
    "నువ్వు నీ లక్ష్యాన్ని సాధించగల్గుతావు ...."
    విశ్వనాద్ మాట్లాడలేదు...."
    "నీ లక్ష్యం దేశపు ప్రగతి. అందుకు ధనుష్టంకారం చేసి స్వార్ధ పరులను హెచ్చరిస్తానన్నావు.....మర్చిపోయావా ?"
    "లేదు --"
    "మరి ఉదయపై మమకారం పెంచుకోకు ...."
    విశ్వనాద్ మాట్లాడలేదు.
    'అలాగని నాకు మాటివ్వు ...." వేదాంతం చేయి సాచాడు.
    విశ్వనాద్ మాట్లాడలేదు.
    "మాటివ్వు ....' వేదాంతం రెట్టించాడు.
    "సాధ్యం కాదు ?"
    "ఎందుకని ' అన్నాడు వేదాంతం.
    'అమ్మ మాటను కాదనడం కష్టం ...."
    అప్పుడు వేదాంతం మనసులో ఉదయ మెదిలింది. ఆమె కళ్ళలో మెరుపులు స్పురించాయి. అతడి గుండెలో ఉరుములు.....
    వేదాంతం చేయి వెనక్కు తీసుకుని కళ్ళు మూసుకున్నాడు.
    "ఈ సమస్య నేదో విధంగా పరిష్కరించాలి ....'
    అతడి బుర్ర తీవ్రంగా పని చేస్తోంది .
    అప్పుడు....
    మెత్తటి పాదాల ధ్వని ....
    కొద్ది క్షణాల అనంతరం "బావా!' అన్న సన్నని పిలుపు.
    వేదాంతం కళ్ళు తెరవలేదు.
    ఉదయ గదిలోకి వచ్చినట్లర్ధమయిందతడికి.
    విశ్వనాద్ -- "ఊ" అన్నాడు.
    "మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకుందాం -- ' అంది ఉదయ.
    "వేదాంతం నిద్రపోతున్నాడు...." అన్నాడు విశ్వనాద్.
    "పెరట్లో కూర్చుందాం ...."
    ఈసారి మెత్తటి పాదాల ధ్వనికి కరకుటడుగుల చప్పుడు తోడైంది.
    అడుగుల చప్పుడు దూరమయ్యాక వేదాంతం కళ్ళు తెరిచాడు.
    గదిలో తానొక్కడే ఉన్నాడు.
    అతడి హృదయంలో శూన్యం....

                                        ***
    మర్నాడు .....
    ఉదయ తన గదిలో బాత్రూం లో ఉంది.
    ఆమె బట్టలు విప్పుకో బోతుండగా ...."అప్పుడే కాదు -" అన్న మాటలు వినిపించి ఉలిక్కి పడింది.
    బాత్రూం విండో లోంచి లోపలకు దూకాడు వేదాంతం.
    "వాటీజ్ దిస్ ?" అంది ఉదయ కోపంగా.
    "నేను దురుద్దేశ్యంతో ఇక్కడ అడుగు పెట్టలేదు ...."
    "మరైతే ఇలా ఎందుకొచ్చావు "
    "నీతో మాట్లాడాలి ......చాలా అర్జంటు...."
    "అయితే ఇక్కడా మాటలు ?"
    "ఏం చెయ్యను ?" మరెక్కడా వీలు కావడం లేదు...."
    "ఎందుకు...."
    "ఎప్పుడూ నువ్వమ్మనే అంటి పెట్టుకునే ఉంటావు. పిలిస్తే ఓ నిమిషంలో పారిపోతున్నావు. అందుకే రాత్రంతా అలోచించి ఈ ఉపాయం పన్నాను. నా బాత్రూం విండో కే నీ బాత్రూం విండోకి అద్దాలు తొలగించి తలుపు దగ్గరే వేశాను. నువ్విక్కడ బాత్రూం లో ప్రవేశించే సమయానికే అక్కడ నేనూ స్నానానికి వేడుతున్నట్లు చెప్పాను. ఇప్పుడు నా కోసం నీ కోసం కూడా అమ్మ వెతుక్కోదు. చాలా సేపు కబుర్లు చెప్పుకోవచ్చు...."
    "నాకిష్టం లేదు...."
    "ఒకసారి నా మాటలు పూర్తిగా విని అప్పుడిష్టాయిష్టాల విషయం చెబుదువు గాని ...' అన్నాడు వేదాంతం.
    ఉదయ మాట్లాడలేదు.
    "విశ్వనాద్ అంటే నాకు ప్రాణం. నీకంటే చిన్న వయసు నుండి వాడు నాకు పరిచయం. వాడి మనసుకు కష్టం కలిగించే పనేది చేయలేను నేను. వాడికి నువ్వు ప్రాణం కంటే ఎక్కువ. అమెరికాలో బయల్దేరే ముందు కూడా వాడు నీ గురించే ఆలోచించాడు. ముందు తన జీవితాన్ని నీకే అంకితం చేసి ఆ తర్వాత దేశ సేవకు పాల్పడాలనుకున్నాడు. అందుకు నేనూ అనుమతించాను. మనస్పుర్తిగా వాడికి సహకరించాలను కున్నాను. తెలిసినప్పట్నించి నేనూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. కాని విశ్వనాద్ కోసం ఆ ప్రేమను చంపుకున్నాను. వాడి కోసం ప్రేమనే కాదు నా జీవితాన్నే త్యాగం చేయగలను. అలాంటి నేనిప్పుడు వాడుండగానే నిన్ను కోరుతున్నాను. అందుకేదో బలమైన కారముంటుందని ఊహించలేవా ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS