Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 22


    'మన్నించండి! అని ఎంత తేలిగ్గా అన్నారు ఆమాట! రామనాధంగారూ మిమ్మల్ని నేను మన్నించినంత తేలిగ్గా నన్ను మన్నించేవాళ్ళుండద్దూ! సరే! వెళ్ళండి! నా తిప్పలు నేను పడతాను! ఇకముందు మటుకు ఇల్లాంటి ప్రేమ కబుర్లు చెప్పక లక్షణమైన అమ్మాయిని పెళ్ళిచేసుకోండి!' రూక్షంగా కఠినంగా అంది కామేశ్వరి. రామనాధం తల వొంచుకుని ఇవతలకు వొచ్చాడు. వికసితమైన ముఖంతో కేశవ కనపడ్డాడు! ఇద్దరూ మౌనంగా మేడ దిగారు! ఒకళ్ళ మనోగతాలు ఒకళ్ళు అర్ధం చేసుకున్న స్నేహితులు వాళ్ళు ఇప్పుడు!

                            *    *    *

    అనుకోకుండా వచ్చిన 'తల్లి'ని చూసి ఆశ్చర్యపోయింది కామేశ్వరి.
    'వచ్చే నెలలో నేనే వద్దామనుకుంటున్నాను! అంతా కులాసాయేనా?' అంది. కూతురు మాటకి జగదాంబ-'
    'అంతా కులాసాయే తల్లీ! నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను!' అంది.
    సీతమ్మ, వసుంధర వుండటం నించి కాబోలు, కూతురికి జగదాంబ పెట్టలేని సారే చీరలుగురించి మాట్లాడలేదు! అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసారు. నళినికూడా ఇవ్వాళ ఇంటిపట్టునే వుంది!
    'ఇవ్వాళ మా ఇల్లు పెళ్ళివారిల్లులా వుంది!' అంది సీతమ్మ ఆమెకి ఇంటినిండా జనం వుండాలని, అందరికీ షడ్రసోపేత మైన భోజనం తను వండిపెట్టాలనీ వుంటుంది!
    'నళినికి పెళ్ళిసంబంధం కుదిరితే పెళ్ళివారిల్లే అవుతుంది!' వసుంధర అంది.
    'ఏదన్నా సంబంధం చూస్తున్నారా?' అంది జగదాంబ!
    'చూసేము అత్తగారూ! ఈవూళ్ళోనే ఒక సంబంధం చూసేం! మా ఆడపడుచు తోటికోడలి పుట్టింటివాళ్ళకి ఏదో సంబంధంట! పెళ్ళికొడుకు ఇంజనీరింగ్ కోర్సు ప్యాసైవాడు, విదేశాలకు కూడా వెళ్ళుతాడు!' అంది వసుంధర.
    'నాతల్లి! నీవే చూస్తావు! కాస్త మా రెండో అమ్మాయి క్కూడా ఏదయినా సంబంధం చూసిపెడుదూ! నీకు పుణ్య ముంటుంది!' అంది జగదాంబ.
    వసుంధర నవ్వింది. 'నాకు తెలుసున్నంతలో ఏమీలేవు అత్తా! అయినా మనస్సులో మీ భద్రమ్మని తల్సుకుంటూనే ప్రయత్నిస్తాను లెండి!' అంది. కామేశ్వరి వెంపు కుచ్చితంగా చూసింది నళిని. ఈ మధ్య కామేశ్వరి చాలా సరదాగా, చలాకీగా వుంటోంది!  రెండు మూడు సార్లు కేశవతో కలిసి సినిమాలకు కూడా వెళ్ళింది! కేశవ, కామేశ్వరితో సినిమాకు వెళ్ళటం, నళినికి ఏవగింపు కలిగించింది! సీతమ్మ సంతోషించింది. 'ఏదో వున్న ఒక్క కొడుకూ, నాలుగు కాలాలపాటు భార్యతో సుఖంగా వుండటం, పిల్లా పాప లతో కల కల్లాడుతోంటమే కదా నాక్కావల్సింది?' అనుకుని మురిసిపోయింది. కేశవ కూడా కామేశ్వరిపట్ల చాలా ఉదారంగా ప్రవర్తిస్తున్నాడు! రాజేశ్వరితో అతను ఎక్కడికన్నా సరదాగా షికార్లు వెళ్ళాలన్నా, రాజేశ్వరికి తన మహిళా సభలూ, సాహిత్య సమావేశాలకే టైం సరిపోయేది కాదు ఇంక భర్తతో కులాసాగా గడపటానికి ఆమెకి టైం ఎక్కడ వుంటుంది? కామేశ్వరికి, కేశవ సరదాలు తప్ప, ఆమెకేమీ ప్రత్యేకమైన సరదాలు వుండేవి కావు!
    'సినిమాకి వెళదామా ?" అనేవాడు కేశవ!
    'మీ ఇష్టం !' అనేది కామేశ్వరి.
    'పోనీ బీచ్ వెంపు షికారు పోదామా? అనేవాడు.
    'మీ ఇష్టం!' అనేది.
    'ఇంట్లో డాబా మీద కుర్చీలు వేసుకుని కూర్చుందామా?'    
    'మీ ఇష్టం!'
    'ఇంక అన్నీ నా ఇష్టమేనా కామేశ్వరి! నీకేమీ ఇష్టాలంటూ లేవా?' అనేవాడు కేశవ!
    'ఒకవేళ నీకేమన్నా సరదాలున్నా పైకి వ్యక్త పరుస్తే బాగుండదు అని బిడియ పడుతున్నావా కామేశ్వరి!'
    'నాకు చిన్నప్పట్నించీ ఒకళ్ళు చెప్పి నట్లు వినటమే అలవాటు అయ్యింది!' అనేది కామేశ్వరి!
    'అయితే సిగజుట్టుకొని సిగచుట్టూ జాజుల చెండు అమర్చుకొని తెల్లని చీర, తెల్లని జాకెట్టూ ధరించి కామేశ్వరీ! మీ బంగారు కూచమ్మని! కేశవ మాట ఆజ్ఞగా పాలించేది. కామేశ్వరి వచ్చేక-
    'నువ్వు నా ప్రక్కన వున్నప్పుడు సిగ జుట్టుకుని వుంటేనే అనిపిస్తుంది కామేశ్వరీ! నీవు నా వయసుకి తగినదానివిలా వుండాలంటే, నీవు సిగ చుట్టుకుంటేనే నప్పుతుంది! బారుజడ వేసుకుంటే బొత్తుగా చిన్నపిల్లలా వుంటావు! వేసు అల్లాంటప్పుడు నీకు తాతయ్యలా వుంటాను! అప్పుడు మనిద్దర్నీ చూసిన వాళ్ళందరూ నిన్నుచూసి జాలిపొందుతారు! పాపం! ముసలాడు అమాయకురాలైన చిన్నపిల్లని వల్లో వేసుకున్నాడు అంటారు!' అనేవాడు కేశవ.
    'అల్లా ఏం అనుకోరు! ఇంత నల్లని పిల్ల, ఇంత అనాకారి నాగమ్మా, కారూ హోరూ వున్న ఇంత పచ్చటి పసిమి ఛాయ గల పెద్దమనిషిని ఎల్లా లొంగదీసు కుందో పాపం! ఆయన మంచి విద్యావేత్త! ఈ పాడుపిల్ల వలలో పడిపోయేరు!' అనుకుంటారు' అనేది కామేశ్వరి!
    'అబ్బో నీకు మాటలు వచ్చునే! రావేమో అనుకున్నాను!' అనేవాడు కేశన.
    'నళిని'కి తండ్రి పతనమై పోయాడనే బాధ పట్టుకుంది! చిన్నవయస్సువాళ్ళల్లా ఈ వయసులో ఈ సొగసుకత్తెని వెంట వేసుకుని ఈ వూళ్ళో షికార్లు తిరగటమేమిటి? పెళ్ళి చేసుకోవటమే చాలు భగవంతుడా! అని తాను సిగ్గుపడుతూంటే, దాన్ని వెంటేసుకుని తిరగడం కూడా ఎందుకు? తన్ని చంపటానికి కాకపోతే!' అని విసుక్కునేది.        
    మధ్యాహ్నం కూతురు వంటిగా వున్న సమయంలో అంది జగదాంబ!
    'సుభద్ర ఏం చేసిందో తెలుసా నీకు!'
    'ఏం చేసింది?' బహుశా మళ్ళీ చదువు కుంటావని పేచీ పెట్టి వుంటుందని వూహించింది.
    'ఏం చెప్పనూ! నీకు నా నోటితో చెప్పలేకుండా వున్నాను తల్లీ! అన్నాళ్ళు పెళ్ళికాకుండా ఇంట్లో వున్నావు! ఎప్పుడన్నా ఇల్లాంటి నీచపు బుద్దులు నీకు పుట్టాయా? అందుకనే భార్యా రూపవతీ శత్రు: అని పెద్దవాళ్ళు అన్నారు! దాని అందం అడుక్కుతినా! ఎంత అప్రతిష్ఠ పని చేసిందీ?' అంటూ ఒక దండకం చదివింది. తల్లి ఇంత దండకం చదివినా కామేశ్వరి కేమీ అర్ధంకాలేదు!
    'ఇంతకీ చెల్లి ఏంచేసిందే!' అంది.
    'చెల్లి! ఆ కులపాతకప్పీనుగ, నీకు చెల్లేమిటే! కన్నదాన్ని నాకే దానిమాట తల్చుకుంటే ఏవగింపు కలుగుతోంది! నీ కాలిగోరుకి కూడా ఇది సరికాదు! దాన్ని నీవు చెల్లి అనకు!' అంది కంట గింపుగా జగదాంబ.
    కామేశ్వరికి కళ్ళు గిర్రుమని తిరిగి నట్లయినాయి! కన్నతల్లిచేత కూడా ఈసడించబడుతూన్నంత పాతకం తన అందాలబొమ్మ సుభద్ర, చిన్నారి చెల్లి ఏం చేసిందీ!
    'అసలు సంగతి చెప్పమ్మా!' దీనంగా అంది కామేశ్వరి!
    'ఏం చెప్పుకోనూ! ఈమధ్యల్లా అది వీధిగదిలో చదువుకుంటూ వుంటానంటూ మకాం వేసింది! పోనీలే గది ఖాళీయే గదా చదువుకుంటుంది కాబోల్ను అని వూరు కున్నాను! మరి ఎవర్ని రప్పించుకుందో నాకు మటుకు తెలీదు! ఇప్పుడు మూడోనెల వచ్చేసింది! నాకు తెలీనీకుండా, ఏవేవో మందులు మింగేది కాబోల్ను! ఉప్పెనగా జ్వరమూ అదీ ముంచుకు వచ్చేసేది! హాస్పిటల్ కి అది వద్దంటున్నా వినకుండా బలవంతంగా ఈడ్చుక వెళ్ళితే తేలింది అసలు సంగతి! ఆ వెధవ ఎవడో చెప్పనే దరిద్రపు ముండా! అంటే ఏడుస్తుంది తప్ప చెప్పలేదు! ఇంకేం చేస్తాను! కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది అనుకొని ఇంట్లోనే ఏవేవో మందులు పోసాను! ఎన్ని మందులు వేసినా, ఆ ముష్టిపిండం రాలటం లేదు! గట్టి మందులు పోస్తే అదే చస్తుందేమో అని భయం! నాటుమందులకి లొంగటం లేదు! పెళ్ళి ఏదన్నా కుదురుతుందేమో అంటే ఒక్కళ్ళూ దిగిరావటం లేదు! ఏం చేయాల్నో తోచి చావటంలేదు! చక్కగా వుంటుంది! ఏ పెద్ద ఉద్యోగస్థుడో కళ్ళ కద్దుకుని, పెళ్ళాడతాడని ఆశపడ్డాను! నా ఆడపిల్లలకు సిరీ సంపదలకు లోటు వుండదని మురిసిపోయేను కామప్పా! నా కడుపులో చిచ్చు పెట్టటానికి ఇల్లాంటి పాపిష్టిపని చేసింది! దరిద్రపు పీనుగ!' అంటూ జగదాంబ కళ్ళమ్మట వీళ్ళు పెట్టుకుంది!
    కామేశ్వరికి, సుభద్ర మీద జాలివేసింది! అంతులేని కోరికలతో అసహాయస్థితిలో వున్న బాలికలు ఇల్లాంటి అవేశాలకు ఇట్టే లొంగిపోతారు! చిన్నారి సుభద్ర ఈనాడు తల్లి కాబోతూంది! అయినా తన కన్నతల్లి కారుణ్యానికి నోచుకోలేదు! అదే మామూలుగా పెళ్ళి అయి, ఆ పరిస్థితికి వస్తే ఎన్ని వేడుకలు జరిపించేవారు? ఇరువర్గాల వారూ, ఎంత ఆత్యీయత ప్రదర్శించే వారు? సృష్టిలో ఒక ప్రాణి ఆగమనాన్ని ఇంత ఆనందంగా తిలకిస్తారు! ఒక ప్రాణి నిర్గమనాన్ని అనంత వేదనగా పరిగణిస్తారు! సుభద్ర తల్లిగా ఎందుకు వుండకూడదు? తండ్రి ఎవరో తెలీని ఆ శిశువు ఎందుకు పెరగకూడదు? సుభద్ర మనస్సు ఎంతగా తల్లడిల్లిపోతూందో! పిచ్చిపిల్ల! ఏకాకి అయిపోయిన తన అందాల చెల్లికి ఈ విపత్తు ఎల్లా గడుస్తుంది?
    'అమ్మా! సుభద్రని నువ్వుకూడా ఈసడించుకుంటే ఎల్లా బ్రతుకుతుంది! ఏదో చిన్నతనంలో తెలియక కాలుజారింది. నువ్వు దాన్ని క్షమించాలి! అవకాశాలు రాక కానీ, కన్నెవయసులో అందరికీ కోరికలుకలుగుతాయి! అవకాశాన్ని వినియోగించుకోవటానికి భయపడేవారూ, అవకాశాలు వారివద్ధకు రానివారూ, పెద్ద నీతిమంతుల్లా కబుర్లు చెప్పుతారు! ఇంక బాగా డబ్బున్న పెద్దమనుషులు కూడా నీతికి అంతప్రాధాన్యత ఇయ్యనే ఇయ్యరు! ఇదీ అని నిర్వచించలేని నీతికి కట్టుబడి కన్నకూతుర్ని తూలనాడటం అవివేకం! అమ్మా! భద్రిని ఏమీ అనకు! దాని కింక ఏమందులూ పోయకు! దాన్ని క్షేమంగా ప్రసవం చేయించాల్సిన బాధ్యత నీదే! దాన్ని ఇరుకు బెట్టావంటే, ఏదో అఘాయిత్యం చేసుకుంటుంది!' అంది కామేశ్వరి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS