మూడోనెల కావస్తూంది. శాంత విషయం తెలుసుకోవాలనే ఆరాటం అణిగిపోయిందనే చెప్పుకోవాలి. అప్పటికింకా శాంత పుట్టింటికి రాలేదు. ఓనాడు రేణూ నేనూ కలిసి మాయింట్లోనే వున్న సమయంలో శాంత దగ్గిర్నుంచి వుత్తరం వచ్చింది. నిజంగా ఆ క్షణం ఎంత సంతోష మైందో చెప్పలేను. రేణు కవరు తనే చించి చదివి విన్పిస్తానంటుంది-"అదేం వీల్లేదు. ఎడ్రస్ నాదీ." అని నేనూ-" ఐతే నాకక్కరే లేదు" అని దాని పేచీ.
అఖరికి కవరు రేణే చించింది. ఉత్తరం ఇద్దరం పట్టుకొని ఒడిలో వుంచుకొని మధ్యమధ్య కబుర్లు చెప్పుకు నవ్వుకుంటూ సర్దాగా చదువుకున్నాం.
ప్రియమైన కృష్ణవేణీ! రేణూ!
మీరు క్షేమమని తలుస్తాను. నేనూ సంతోషంగా వున్నాను. ఆమధ్య మీరు రాసిన వుత్తరాలు అందాయికానీ జవాబేం రాయాలో తోచక వూరు కున్నాను. నేను త్వరలో మనవూరు వస్తున్నాను. బావగార్ని గురించి తెలుసుకోవాలని వుందని వుత్తరాలు రాశారు. నేను వచ్చినప్పుడు కలిసి చెప్పుకొంటే సర్దాగా వుండేదికానీ ఈసంతోషం ఎంత తొందరలో మీరూ పంచుకుంటారా అనే ఆతృతతో వుత్తరమే రాస్తున్నాను-పెళ్ళయిన మర్నాడు వుదయమే బయల్దేరి వచ్చాం కదా? ఇంటిలో అడుగుపెట్టేసరికి సాయంత్రం కావస్తూంది. ఇల్లంతా పరిశుభ్రంగా-నిశ్శబ్దంగా వుంది. ఇంటినిండా చుట్టాలు బిలబిల్లాడుతూ వుంటారేమో అనుకున్నాను కానీ అదేం లేదు. ఓవంటమనిషి, పనిమనిషి మాత్రం ఎదురు చూస్తున్నారు.
"స్నానంచేసి పైకివెళ్ళి కాస్సేపు పడుకోమ్మా! అన్నారు అత్తయ్య ఆవిడే పైకి తీసికెళ్ళి గది చూపించి కాస్సేపు నిద్రపొమ్మని హెచ్చరించి మిగిలిన పనుల్లో జొరబడిపోయారు. నేను పడుకోగానే ప్రశాంతంగా నిద్రపట్టింది. లేచే సరికి దీపాలు వెలుగుతున్నాయి. ఆరాత్రి అత్తయ్యే భోజనం పైకి తీసుకొచ్చారు. తింటున్నంతసేపూ దగ్గిరే కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పారు. ఆవిడంటే నాకు చూసినప్పుడే అభిమానం ఏర్పడింది. శ్రద్దగా వింటూ కూర్చున్నాను.
పది కావస్తూంటే ఆవిడమళ్ళీ నాదగ్గరకొచ్చి చాల చనువుగా నెమ్మదిగా-"మంచి చీరకట్టుకోమ్మా!" అన్నారు. నాకు అర్ధమైంది. మవునం వహించాను.
"విడిపూలు కూడా వున్నాయి. జడనిండా కట్టుకుంటావా? మాలే వుంచుకుంటావా?' "మాలే వుంచుకుంటాను." చెప్పాలికదా?' "సరే మళ్ళా వస్తాను. తయారవుతావు కదూ?' అంటూ తల నిమిరి క్రిందికెళ్ళిపోయారు. నేను చాలాసేపు అలానే కూర్చున్నాను. నాకేమిటో చాలా లోటనిపించింది - ఆ సమయంలో నాకై నేను ముస్తాబుకావటం మీరిద్దరూగానీ- పెళ్ళికొచ్చిన వదినలుగానీ వుంటే ఎన్ని హాస్యాలతో ఎంతగొడవ చేసేవారో!
కొండంత గొడవనే సంతోషంగా అంగీకరించి ఇంత చిన్న విషయానికి మధనపడటం ఏమిటని నన్ను నేనేసరిపెట్టుకున్నాను. జడలేసుకొని మల్లె పూలు నిండుగా ముడుచుకున్నాను. మల్లెల్ని వెక్కిరించేటటువంటి తెల్లని చీర కట్టుకున్నాను. వెర్రిగా దిద్దుకోటం ఏమిటో నాకిష్టముండదు కదా! శరీరమంతా చిరుచెమటలు పోస్తూంటే కిటికీదగ్గిరకు పోయి నించున్నాను. కిటికీ చువ్వలకీ తల ఆన్చి నించుంటే ఎన్నో ఊహలు దొర్లుకుపోయాయి. అది నాజీవితానికి ముఖ్యమైన రాత్రి! మధురమైన రాత్రి అని కూడా చెప్పుకోటానికి అవునోకాదో నాకే తెలీదు. నేను కావాలనీ నేను రావాలనీ, ఆవ్యక్తి ఎదురు చూడటంలేదు. పైగా ఆ వ్యక్తి ఏనాడో తన మనసంతా పరాధీనంచేసి పరాయివాళ్ళందర్నీ తిరస్కరించే పరిస్థితిలో వున్నారని నాకు తెలుసు. ఇక నాలో వుత్సాహంగానీ, వుద్రేకం గానీ ఎందుకుంటాయి? ఏదో పరీక్షకి హాజరవుతున్న భయం తప్పా మరే భావమూ లేదు నాలో- అత్తయ్య వచ్చారు.
"చాల పొద్దుపోయింది. రఘు గదిలోకి వెళ్ళిపడుకో." నేను తలదించుకున్నాను. ఆవిడ ఆప్యాయతతో తలమీద చేయివేసి-"నీకేం భయం లేదమ్మా! నేనున్నాను కదా? వాడేమైనా అన్నాధైర్యంగా వుండు. ఏం? భయంగా వుందా?" అన్నారు.
"లేదండీ!" అన్నట్టు తల ఆడించాను. ఆవిడ వెనకే నడిచి ఆగదిముందు కెళ్ళాను.
"నేను వెళ్తానుమరి." అంటూ ఆవిడ చిన్న నవ్వుతో వెళ్ళిపోయారు. నేను వూపిరి బిగబట్టి చాలసేపు తలుపులు దగ్గిరే నించున్నాను. గదిలో లైటు వెలుగుతూనే వుంది. మనిషివున్న అలికిడేమీ లేనట్టుంది. నెమ్మదిగా తలుపు తీసుకు లోపల అడుగుపెట్టాను. ఆయన మంచం మీద కూర్చుని చదువుకొంటున్నారు. నా గాజుల చప్పుడికి కాబోలు ఒక్కసారిగా తలెత్తి చూశారు. నేనూ అదేక్షణం ఆయన మొహంలోకి చూసి తలదించుకుని గడపలోనే నించుండిపోయాను-కొంతసేపటి వరకూ ఆయనకేసి నేను చూడక ఆయనేం చేస్తున్నారో తెలీలేదు. నేను ధైర్యం చేసి దగ్గిరికీ వెళ్ళలేకపోయాను.
"ఎందుకిక్కడ నించుంటావ్? నీ గదిలో కెళ్ళు." ఉన్నట్టుంటి నాకామాటలు విన్పించాయి. తలెత్తి చూశాను. ఆయన కిటికీ దగ్గర నిలబడి వున్నారు.
నన్నుచూస్తూ మళ్ళీ - "వెళ్ళు. నీగదిలో కెల్లిపడుకో." అన్నారు. నేను తలదించుకు నేలచూపులు చూస్తూ వుండిపోయాను. నాకేం అనాలో-ఏం చెయ్యాలో తోచటంలేదు.
"నీకేకదూ చెప్పేది? ఎందుకిక్కడ? నాకు నిద్రొస్తూంది. పడుకోవాలి. వెళ్ళు." ప్రతీ మాటలోనూ విసుగు ధ్వనిస్తూంది. తప్పనిసరై ఆయనమొహంలోకి చూస్తూ-"మీ అమ్మగారే ఇక్కడికెళ్ళి పడుకోమన్నారు." అన్నాను వినీవినబడనట్టు.
క్షణం ఆగి-"సరే అయితే" అంటూ తను వెళ్ళి మంచంమీద పడుకున్నార. నేను అక్కడే చాలాసేపు నించుని కాళ్ళు నొప్పులు పెడుతూంటే నించున్నచోటే కూర్చుండిపోయాను. మరి కొంతసేపు గడిచాక చేతిమీద తలవుంచుకుని కూర్చున్నచోటే పడుకున్నాను-అప్రయత్నంగా కళ్ళు చమర్చాయి. ఏడుపు ముంచుకొచ్చింది. నేను కోరుకున్న దాని ఫలితమే ఆరాత్రి-నన్నెవరూ మభ్యపెట్టనూ లేదు. మోసగించనూ లేదు. అలానే జరిగి తీరుతుందని అనుకోకపోయినా అలాంటిదే ఏదో జరుగుతుందని మాత్రం అనుకోకపోలేదు. మొదటిరాత్రి మొదటిరాత్రిలా గడిపేభాగ్యం నాకు లేకపోయింది. ఎప్పుడో ఎన్నాళ్ళకో ఒకరోజు వస్తుందనీ- ఆరోజు ఆయన అనురాగం అందుకోగలననీ-అంత వరకూ శాంతం ధైర్యం మాత్రం నేను పెంచుకోవాల్సిన గుణాలనీ నన్ను నేనే ఓదార్చుకున్నాను.
ఉదయంలేచి నాగదిలోకి వెళ్ళిపోయాను. అత్తయ్య వచ్చారు. "ఏమైనా మాట్లాడాడా అమ్మా!" అన్నారు ఆతృతగా.
"లేదండీ. అసలు ఆ గదిలోంచి వెళ్ళిపొమ్మన్నారు. మీరు వెళ్ళమన్నారని చెప్తే వూరుకు న్నారు. మరేం మాట్లాడలేదు,"
"ఎక్కడ పడుకున్నావ్?"
"కిందే పడుకున్నాను".
"కింద పడుకున్నావా?" ఆవిడెంతో బాధ పడ్డారు- "మనసేమీ పాడుచేసుకోకమ్మా! కొన్నాళ్ళు నీకూనాకూ కూడా ఇలా బాధపడటం తప్పదు-పిచ్చినాయనకి నేనంటే అగౌరవం లేక. పోతే నేననుకున్నట్టేదీ చెయ్యగలిగేదాన్ని కాదు. తనకెంత ఇష్టంలేకపోయిన అమ్మామాట కెప్పుడూ ఎదురుచెప్పడు. సరోజనిని తల్చుకుంటే నామతి పోతుందమ్మా శాంతా! మానవుల్లో వుండవలసిన మనిషికాదు. న్దుకే దక్కకుండా పోయింది. మొగుడికి ఎన్నో నీతులు అదే చెప్పేది. కన్నకూతురుకూడా ...." ఆవిడ గొంతు బొంగురు పోయింది. చాలాసేపు సరోజ కబుర్లే చెప్తూ కూర్చున్నారు. నన్నెన్నోవిధాల ధైర్యంగా వుండాలని హెచ్చరించారు. ఆవిడ అనునయమే లేకపోతే నేను చాలా నిరాశపాలయ్యే దాన్నేమో! మరి రెండురాత్రులు కూడా అలానే ఆయన గదిలో నేలమీదే పడుకున్నాను. ఒక్కసారి మాత్రం ఆయన చిరాకుపడుతూ - "ఏమిటా నేలమీద పడక? వెళ్ళి నీగదిలో మంచంమీద పడుకోకూడదూ?" అన్నారు.
"ఫర్వాలేదు. నావిషయం ఏదీ మీకక్కర్లేదుగా?" అన్నాను. ఆయనతో నాకు ఏవిధంగానూ పరిచయం లేకపోయినా ఆయనపట్ల ఏదోచనువు ఏర్పడుతున్నట్టే అనిపించేది. ఆయన్ని కంటితో చూస్తూనే దైర్యం పెంచుకొనేదాన్ని. ఆయన వైఖరి చూస్తూంటే జాలనిపించేది. ఎంతసేపూ, ఒంటరిగా, మవునంగా ఆగదిలోనే గడపటం ఆయనకి అలవాటైపోయింది. ఆరెండు రోజులూ ఆయన్ని పగలు చూసింది లేదు. నేను -మూడోరాత్రి తెల్లవారుజమున నాకు మెలకువ వచ్చింది. బద్ధకంగా గదంతా కలియ జూస్తూ అలానే పడుకున్నాను. గడచిన మూడురాత్రులూ గదిలో కొచ్చి గడపదగ్గిరే కూర్చుని అక్కడే పడుకుని వుదయం వెళ్ళిపోవటం తప్ప ఆ గదిలో ఎక్కడేమి వున్నాయో చూడలేదు-ఆయన దోమ తెరదించుకు నిద్రపోతున్నారు. బెడ్ రూం లైట్ కాంతి పల్చగా గదంతా నిండి వుంది. నాలుగు వైపులా కలియజూస్తూన్న నాకళ్ళు ఓచోట అప్రయత్నంగా ఆగిపోయాయి. ఆయన మంచానికి ప్రక్కనేవున్న గోడకి నిలువెత్తు సిల్కు చీర వేలాడుతోంది. లైటు కాంతికి మిసమిసా మెరుస్తోంది. ఏమై వుంటుందబ్బా! అనుకొంటూ ఆతృతగా లేచివెళ్ళి తెర తొలగించాను.
