Previous Page Next Page 
ఆరాధన పేజి 23


    మూర్తి నవ్వాడు." ఆ-అందుకే ధైర్యంగా ఆటాడబోయాడు. తమ్ముడేకదా చదివించుకుంటే ఏం పోయిందనుకుంది అమ్మ. తీరా చూస్తే మొదటికే మోసం వచ్చింది..."
    పోనీయ్....ఆమెకైనా తెలి వొచ్చింది.....మంజు సానుభూతి చూపింది.
    "తండ్రి చండశాసనుడు, ఇంతకాలం భయపడి తండ్రిమాట కెదురుచెప్పలేక వూరుకుంది. ఇప్పుడు తెగించింది. నీకో దమ్మిడీ యివ్వనంటాడేమో... "మూర్తితోపాటు అందరూ నవ్వారు. ఖాన్ గంభీర వదనం చూచి మూర్తి గ్రహించాడు.
    "ఇకనేం- ఏదో బాధ కుతకుతలాడుతోంది.-ఔనా-చెప్పేసెయ్.
    "నేను రిజైను చేయబోతున్నాను" ఖాన్ ఠక్కున చెప్పాడు. హఠాత్తుగా వినేసరికి ముగ్గురు దిగ్భ్రమ చెందారు. తేరుకునే సరికి కొన్ని నిమిషాలు దొర్లిపోయాయి.
    "అక్కడికే వెళ్ళి పెదనాన్నగారి డిస్పెన్సరీ చూచుకోవాలి. డబ్బు ప్రోగుచేశాడాయన-కాబట్టి నేను కేవలం రోగులకు చికిత్స చేయటం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంటాను. లేనిపోని కల్పనలలో డబ్బు గడించాలన్న అవసరం లేదు-
    "మంచిపని చేశావు" మూర్తి అభిప్రాయం.
    "బాగా తీర్మానించుకున్నావు' కుమార్ పల్కాడు.
    "పోనీ...మీ ఇద్దరు ఒకటౌతారు. అంతేచాలు" మంజు అంది.
    "అంతా బావుంది- కాని నాకీ హాస్పిటల్ ను. మిమ్మల్నందర్నీ విడిచివెళ్ళటం బొత్తిగా ఇష్టం లేదు.
    "సరి - సరి - ఆ బాధ తప్పదు- రెండూ ఎలాగూ లభింపవు.....ఏదో ఒకటి నిర్ణయించుకున్నావు. మొదట్లో ఇబ్బందిగా వుంటుంది. కాని అదే అలవాటవుతుంది....కుమార్ సముదాయింపుగా మాట్లాడినా అంతరాంతరంలో ఖాన్ వెళ్తున్నాడని బాధగానే వుంది.
    "శ్రీమతికూడా రాబోతోంది. నువ్వు వీళ్ళిద్దర్నీ కాస్త కనిపెట్టుకుని వుండు. "ఖాన్ సాధారణ మైన ధోరణిలో అన్నా-మూర్తి గ్రహించాడు-మంజులను తన కప్పగిస్తున్నట్లు అతనికేకాదు అక్కడ చేరిన అందరికీ ఇదొక అప్పగింతలా తోచింది ఖాన్ మాటల్లోని నిగూడార్ధం గ్రహించిన అందరు మౌనం దాల్చారు.
    ఖాన్ పెళ్ళికి కుమార్. మంజు పాప మూర్తి, మూర్తిభార్య లక్ష్మి వెళ్ళారు. ఒక్క రోజు మాత్రం వుండ అంతా తిరిచ్చారు. మళ్ళీ హాస్పిటల్ లో చేరాక గాని ఖాన్ లేని వెలితి వాళ్ళకు బోధపడింది కాదు. అందరు అలవాటు పడ్తున్నారు- కుమార్ కు ఏదో అసంపూర్ణంగా వుండిపోయిందన్న భావనతో నిరాశకల్గేది. మూర్తి తన కప్పగించిన బాధ్యత నెంతవరకు నెరవేర్చగలనా- అని రోజు ఒకమాటు ఆలోచించుకొనేవాడు- అధైర్యపడేవాడు, అది తన శక్తికి మించిన వనేమో, అనిఆత్మ స్థైర్యం కోల్పోయే వాడు. లక్ష్మి రావటంతో తన జీవితం నూత్న శోభతో విరాజిల్లుతోంది- రాచబాటలో పయనిస్తోంది. కాని లక్ష్మికి కుమార్. మంజులపై ప్రత్యేకాభిమానంలేదు. వారు కేవలం పరాయివారు. అంతే ఆ కుటుంబీకులు వారిపై యింత ఆదరాభిమానాలెందుకు చూపుతున్నాం- అని ఆశ్చర్యపోయి విసుక్కునేది ఆమెకు సూటిగా అనకపోయినా అందరకీ తెలుసు ఒక్కటి రెండుసార్లు అత్తగారితో క్వాచిత్కంగా మాట్లాడినది. కాని ఆమె గట్టిగా జవాబు చెప్పేసరికి మౌనం దాల్చింది. మూర్తికి అంతా తెలుసు. అంతా గ్రహించాడు. ఏమని తెల్సుకున్నాడు! లక్ష్మికి వారిపై ఈర్ష్య. అది పైకి కనబడని గుప్తంగా ఉన్న భావన. ఆమెను ఏమీ అనటానికి వీల్లేదు.
    లక్ష్మి రాకతో రాకపోకలు ఎక్కువౌతాయనుకున్నదంతా ఒట్టిధైంది. మూర్తి వచ్చినా ఎక్కువ సేపు వుండలేకపోతున్నాడు. లక్ష్మి ఒకసారి వచ్చింది కుమార్ వాళ్ళ ఇంటికి భార్యా సమేతంగా వెళ్ళకపోతే కుమార్ వాళ్ళు నొచ్చుకుంటారు లక్ష్మిరాదు లక్ష్మి భావాలను గ్రహించినవీళ్ళు ఏవో నెపాలు సృష్టించి వెళ్ళటం మానుకుంటున్నారు.
    మధ్యలో కళ్యాణి ఇరకాటంలో పడిపోయింది. అక్క రాకపోయినా తను- బాబుతోసహా వెళ్ళివస్తుండేది. మూర్తి తల్లి కూడా వచ్చి చూచివెళ్ళేది.
    ఇదంతా మూర్తి మస్తిష్కంలో మెదిలేది; తను అన్యాయం చేస్తున్నాడేమో- అని విచారించేవాడు.

                              *    *    *

    కుమార్ ఎమ్. ఎస్. చేస్తున్నాడు. మంజుల అదే హాస్పిటల్ లో పనిచేస్తోంది. పాప తప్పటడుగు లేస్తోంది. వచ్చీరాని ముద్దు ముద్దు చిన్న మాటలు.
    తెల్లవారింది. కుమారి ఎడమ చేత్తో షేప్ చేసికొంటున్నాడు. ఎడమచేత్తోనే సబ్బు నురుగు బాగా పట్టిస్తున్నాడు. దాదాపు పనులన్నీ ఎడమ చేత్తో చేయటం అలవాటు చేసుకొంటున్నాడు. కత్తితో పండ్లుకోయటం, చెక్కుతీయటం, షూ లేసులు ముడివేయటం. విప్పటం. టైకట్టుకోవటం అన్నీ ఎడమ చేత్తోనే ముఖ్యం గా సూది, దారంతో చిన్నకుట్లు వేసి ముడి వేయటం, అతను ఖాళ్లీ సమయాల్లో చేసి "హాబీ" అయి కూర్చుంది.
    సర్జన్ గా కుమార్ రెండుచేతులు ఒకే శక్తి కల్గివుండాలి. ఆపరేషన్ లలో ఎడమ చేతికికూడా ప్రాముఖ్యత వుంది. వెంట్రుక అంతసన్న "దారంతో" అతి సున్నితమైన అవయవాల్లో కుట్లు వేయాలంటే అ డాక్టర్ వ్రేళ్ళు అతి మెలకువగా, హుషారుగా వుండాలి.
    ఇంటికి రాగానే మంజు ఉత్తర మొకటి అందించింది. అది చిన్నచెరువు గ్రామంనించి వచ్చింది. కవరుమీది దస్తూరి ఎక్కడో చూచిన గుర్తు. కానీ పోల్చుకోలేకపోయాడు లోపల తెలుగులో వ్రాయబడిన లేఖ సంతకం చూచి కాంపౌండర్ రాసిన లేఖ అని తేల్చుకున్నాడు. చాలా సంతోషం వేసింది.
    బూట్లు విప్పుకుని-పాపను ఒడిలో కూర్చుండ బెట్టుకుని చదువుకున్నాడు....డాక్టరుగారూ వేల రోజులక్రితమే మీకొక విషయం రాయాలను కున్నాను. కాని ఆలస్యం చేశాను. ఆసుపత్రి తోటమాలి కూతురు - రామయ్య మూడవ భార్య పోయిననెలపండంటి కొడుకును ప్రసవించింది: ఆ పిల్లతండ్రి అనుకున్నట్లు గానే ఆ యింటికి రానై కూర్చుంది. ఆ బిడ్డను పెద్ద తల్లులిద్దరూ అతి ముద్దు మురిపంతో అతిగారాబంతో చూచుకుంటున్నారు! ఆశ్చర్యంగా లేదండీ మనమడు పుట్టినరోజు వీరన్న వచ్చి నాకాళ్ళు పట్టుకుని వెళ్ళాడు! ఎందుకో మీకు తెలుసుగా? తలతీసేసినంతగా బాధపడ్తున్నాడు..... ఎలాగో సర్దిచెప్పి మరేం ఫర్వాలేదని పంపించి వేశాను..... పిల్ల మనం అనుకున్నంత అమాయకురాలుకాదు. ఇంకా తెలుసు. ఆ బిడ్డతండ్రి ఎవరు? అని నిలేసి అడిగాను. నాముందు సందేహించాడు-కానీ ఆ తర్వాత తేల్చి చెప్పాడు. మీరు ఊహించగలరా! ... జి. బో. ప్రె....
    "ప్చ్" అన్న శబ్దం బిగ్గర గానే విన్పించింది మంజులకు.
    కుమార్ చలించిపోయాడు. అబ్బ త ఏం నాటక మాడారు. ఆనాడు జరిగినదంతా కళ్ళకు కట్టినట్లుంది. ఒక దాని తర్వాత ఒకటి వరుస క్రమంలో స్మృతి పథంలో మెదిలింది. ప్రెసిడెంట్ మీదికి మనసు మళ్ళింది. డబ్బు - పలుకుబడి కలవాడు. ఎలాగో ఫైనుతో తప్పించుకున్నాడు- అతని కుటుంబానికీ కొన్ని వేలిచ్చాడుట ఎంతటి ఉదార స్వభావం- దయ - జాలి: అనుకుందిలోకం. లోపలమాత్రం చీదరించుకుంది. ఇది వారిద్దరికి మంజుతో కలసి ముగ్గురికి తెలిసిన రహస్యమేనా: నిజంగా ఇది రహస్యమేనా? లేక- లేక ...మారు మాట్లాడకుండా మంజు కందించాడు ఉత్తరాన్ని.
    మంజు అంతా చదివి పకపక నవ్వింది.
    కుమార్ పెదాలు రేఖా మాత్రంగా ముడిచి "ఏమిటి" కనుబొమ్మ లెగరేశాడు.
    ఐతే ఈ విషయం మీకు. కంపౌడర్ గారికి ముందే తెలుసన్నమాట."
    "నీకూ తెలుసా? కుమార్ అత్యశ్చర్యంతో ప్రశ్నించాడు.
    "ఆ....తెలుసు....సుబ్బమ్మ చెప్పింది," మూడు మాటల్లో చెప్పేసింది. కానీ.... ఆనాడు ఆ విషయం తెలిసికొన్న మంజు హృదయం ఎంతగా గాయపడిందో మాత్రం చెప్పలేదు. దేహీ - అని ఒకరిని యాచించటానికి వ్యతిరేకించిన హృదయం డబ్బుకోసం - ఇదిగో తీసికో - అని- డబ్బు చేతిలో పడగానే 'లైన్ క్లియర్" అని. పేదరాశి పెద్దమ్మే అయింది హృదయంలో దాచుకో లేక తనతో అన్నది. సుబ్బమ్మ మీద మునుపున్న గౌరవం. జాలి కర్పూరంలా కరిగిపోయింది.....కడుపు మంట -ఆకలి బాధ. ధనలేమి అటువంటిది ధనం చేయించలేని నీచకార్యం ఏముంది కడుపు తీసి ఒప్పుకోని అవినీతి ఏముంది - మంజు నిట్టూర్చింది.
    "చాల తమాషాగా వుంది. ఇద్దరం ఈ విషయాన్ని గూర్చి తెలిసినా చెప్పుకోలేదు.....వైద్య ధర్మం అలాంటిది!"
    కుమార్ పాపను దింపి లోపలికెళ్ళాడు.
    ఆ మరుసటి రోజు మంజు హాస్పిటల్ లో వుంది. గంగమ్మ పాపను చంకలో వేసికొని వస్తుంటే చూచి ఆశ్చర్యపోయింది. కుర్చీలోంచి లేచి బేసిన్ లో వున్న లోషన్ నీళ్ళలో చేతులు కడుక్కుని తువాలును తుడుచుకుంటూ ఎదురెళ్ళింది. పాప తల్లిని చూచి మీదికి చూపబోయింది. మంజు ఒకడుగు వెనక్కువేసింది.
    "అమ్మా....మీ అన్నయ్యలు-పిల్లలు-వదినలు వచ్చారు.
    మంజు డాక్టర్ అన్నపూర్ణకు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళింది. దారిలో ఆమెను వేదించని ప్రశ్నలేదు. వారెందుకొచ్చినట్లు? ఇన్ని సంవత్సరాలకు నిజంగా తనను చూడాలన్న కోర్కెతో వస్తున్నారా? తనను చెల్లిగా గౌరవించి, తన భర్తను బావగా గౌరవించబోతారా- లేక అవమానకరంగా వ్యవహరిస్తారా? వీళ్ళ నెవరురమ్మన్నారు.ఏడాది కావస్తోంది. అమ్మ చెప్పి ఎందుకొస్తున్నట్లా ఆలోచిస్తూ గేటు తీసికొని వెళ్తోంది.
    మంజు తెల్లచీరకు నీలపు రంగు అంచుగల నూలు చీరకట్టింది. తోటనిండా పూలు విరియ బూసి వున్నా తలలో పువ్వులేదు. మెడలో మంగళ సూత్రం తాడు! ఎడమ చేతికి వాచ్. కుడిచేతికి ఒక్క ఎరుపు గాజు, చెవులకు ముత్యాల దుద్దులు-పెట్టుకుని వస్తున్న చెల్లిని చూచి మెట్టుమీద నవ్వుతూ నుంచున్నారు. పెద్ద వదిన ఎప్పుడూ కించపరచినట్లే ఈనాడు కూడా లోకువగా, ఎగతాళిగా అంది.
    "పెద్దడాక్టరు పెళ్ళానివి-డాక్టరమ్మవు - ఇటు అటుకూడా బాదరబందీ లేదు నీకు. ఇలా వున్నావేమ్మా..."
    మంజు పేలవంగా నవ్వింది. "నా నగలను తర్వాత చూపిస్తానులే వదినా! డాక్టర్ల వేషమే యిది. డాబుసరిగా తయారై పార్టీకి వెళ్తున్నట్లు వెళ్ళమంటావేమిటి? మా పెద్ద లేడీ డాక్టర్ను చూద్దువుగానిలే - చేతులకు గాజులుకూడా వేసుకోదు-ఐనా..." అదంతా ఎందుకులే - ఎలా వున్నారు?.....వీళ్ళంతా నాకు తెలియని క్రొత్తవాళ్ళు కాబోలు -చిన్న వదిన ఇంకా మారలేదు......మీరిద్దరు మాత్రం బాగా ఒళ్ళు చేశారు.....పదండి.....స్నానాలు చేద్దురు గాని.....అన్నలిద్దరు-వారి భార్యలు మంజు ధోరణికి చిన్నబుచ్చుకున్నారు. "ఎన్నాళ్ళకు నా మీద జాలి కల్గింది?" ఇన్ని రోజులకి మీ చెల్లి గుర్తొచ్చిందా? నేనొకత్తి నున్నానని ఇప్పటికి జ్ఞాపక మొచ్చిందా? మిమ్మల్ని చూస్తోంటే నాకెంత ఇదిగా వుందో చెప్పలేనన్నయ్యా" అంటుందేమో అనుకున్నారు. ఆనంద భాష్పాలు రాలుస్తూ ఏడుస్తుందేమో - ఏ విధంగా ఓదార్చాలో అంతా మనసులోనే రిహార్సల్ చేసుకున్నారు ఎవరికీ వారు. కానీ మంజు హృదయాగత భావాలెలా వున్నాయో వారి కర్ధం కాలేదు. మౌనంగా ఆమె ననుసరించాడు.
    పైకి, మంజు ఎంత అంటీ అంటనట్టు మాట్లాడినా లోపల మాత్రం అవ్యక్తానందం పొందింది. ఎంతేనా-తన అన్నయ్యలు! ఎన్నాళ్ళకో చూస్తోంది?- అట్టే వారిని చూస్తోంటే దుఃఖం పెల్లుబుకుకుంది!- అది దుఃఖం కాదు కానీ ఆనందం. అలా బైటపడకూడదనే తను అత్యంత ప్రయాసతో నిగ్రహించుకుని ఏదో మాట్లాడి లోపలికి దారితీసింది.
    "అన్నయ్యా-నేను వెళ్ళాలి.....ఈ వేళ ఆపరేషన్ థియేటర్ లోనే వుండాలి. మధ్యాహ్నం ఇంట్లో వంటలేదు నాకు నర్సస్ క్వార్టర్స్నించి భోజనం వస్తుంది. అన్నీ వంటింట్లోవున్నాయి. ఏవమ్మా వదినగార్లూ. ఏమీ అనుకోకుండా స్నానాలు ముగించుకుని. వండుకుని తినండి. నేను వచ్చేసరికి రెండు దాటవచ్చు" వారు తన మాటలకేం జవాబు చెబుతారో కూడా వినకుండా "వస్తా మరి" అని పాపను దూరం నించి ముద్దుచేసి వెళ్ళిపోయింది.
    ఆమె నటు పోనిచ్చి ఇల్లంతా ఓ మాటు తిరిగారు. కుమార్ ను ఫోటోలోనైనా చూద్ధామని వెదికారు. కుమార్ స్టడీ రూమ్ లో వారి పెళ్ళి ఫోటో వుంది. అందరు ఎగబడి చూచారు.
    చిన్న వదిన అంది "బాగానే వున్నారు."
    "ఆ....ఆ మాత్రం అందం ఏ మగాడికైనా వుంటుంది" అని అన్నదేగాని పెద్దావిడ-నిజంగా ఆ ముఖంలో ఏదో ప్రత్యేకమైన కళ ఉన్నదని గ్రహించలేకపోలేదు.
    "ఇంతకూ అతగాడు ఏడీ?"
    "ఏమో....ఎక్కడికెళ్ళినట్లు? హాస్పిటల్ లో పని చేస్తున్నట్లు రాసింది కళ్యాణి. మరి భోజనం    తయారు చేయరంది -తనకు మాత్రం భోజనం వస్తుంది-అంది....దీని అర్ధం ఏమిటో" పెద్దన్న అనుమానం-అది కాస్తా బిగ్గరగానే అన్నాడు.
    "ఆమాత్రం తెలీదూ, ఏదో బెడిసినట్టుంది.....అంత హుషారుగా కనిపించలేదు చూచారూ! మధ్యాహ్నం వస్తుందిగా నిలవేసి అడుగనూ! ఏమి సుఖ పడ్తోందో?" అందరూ మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS