Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 22


                                    31
    తల్లీ కొడుకులు ఇద్దరూ సుదీర్ఘంగా అలోచించి, సేతుపతి గారి సలహా పాటించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చారు.
    "నువ్వేం భయపడకురా నాన్నా! అక్కడ కూలి వెధవలు నిన్నేమైనా చులకనగా చూశారంటే , నాతొ చెప్పు. సుబ్బారావు గారితో చెప్పి, డిస్ మిస్ చేయించి పారేస్తాను!" అంది చాముండేశ్వరి రఘుకు ధైర్యాన్ని కలగజేస్తూ.
    కానీ, మరునాడు రఘు ఉద్యోగంలో చేరబోయేముందు జరిగిన సంఘటన తో, చాముండేశ్వరే కాకుండా, నౌకర్లు కూడా కటకట లాడిపోయి, కన్నీళ్ళ పాలై పోయారు. పాపం, లేకుంటే....ఆగర్భ శ్రీమంతుడైన ఆ కొడుకు , ఫ్యాక్టరీ లోని మామూలు కూలీల్లా కాకి దుస్తులు వేసుకోవలసి రావడమేమిటి? ఎందుకు కొడుకు విషయంలో సేతుపతి గారు ఇంత నియంతృత్వాన్ని ప్రదర్శిస్తూన్నారు?
    అసలు ఆనాడు జరిగిందేమిటంటే సేతుపతి తన కారులో కూర్చుని, "టై మయింది. త్వరగా బయలుదేరమను!" అంటూ కబురు పెట్టారు. రఘు వచ్చాడు. ఎలా? మామూలుగా తాను కాలేజీ కి వెళ్ళే దుస్తుల్లోనే.
    "ఏమిటీ వేషం?' అన్నారు సేతుపతి అధికార పూర్వకంగా.
    రఘు ఏమంటాడు? బిక్క మొహం వేశాడు.
    "మిస్టర్ అయ్యంగార్!"
    "సర్?"
    "వాడి డ్రెస్సు , మీరు వాదికివ్వ లేదా?"
    "మన్నించండి సార్! మరిచిపోయాను!"
    "మరిచి పోయారా?....ప్రోప్రయిటర్ గారి అబ్బాయికి ఆ గుడ్డలు వేసుకునే కర్మ ఏమిటనుకున్నారా? కమాన్! గెట్ డౌన్! వాడికా గుడ్డలివ్వండి! మరో అయిదు నిమిషాల్లో మీరిద్దరూ ఇక్కడ ఉండాలి!" అంటూ ఆదేశించారు సేతుపతి.
    కాకి నిక్కరూ, కాకి షర్టు వేసుకునే సరికి పేదరికం ఒక్క పెట్టున రఘును అవరించినట్ట యింది. అందరూ ఘోల్లు మన్నారు. చాముండేశ్వరి మరీను! పాపం, రఘు కళ్ళు కూడా చెమ్మ గిల్లాయి. దీన్నంతటినీ చూడాలే. అయ్యంగారు వెళ్లి కారు వద్ద నిలుచున్నాడు.
    "వాడేడీ?"
    "వస్తున్నారు సర్!"
    "ఇక్కడ ఇంటి దగ్గర అంటే అన్నారు. పొరపాటున వర్క్ స్పాట్ లో వాడి కంత మర్యాద ఇచ్చేరు! మీరంతా నన్నెందు కర్ధం చేసుకోడ లేదో, నాకేం తెలియడం లేదు. డ్రైవర్ , హారన్ ఇవ్వు!"
    రెండు మూడు తడవలు హార్న్, కొట్టే లోగానే, రఘు అవసరవసరంగా వచ్చాడు. వచ్చి, తండ్రి పక్కన కూర్చోబోయాడు.
    "అగు, మిస్టర్ అయ్యంగార్. మీరిలా రండి. నువ్వు వెళ్లి డ్రైవర్ పక్కని కూర్చో!"
    "అల్ రైట్!" అన్నాడు రఘు ఉన్న అక్రోశాన్నంతటి ని తనలోనే అణిచి ఉంచుకోడానికి ప్రయత్నిస్తూ.
    "అల్ రైట్ కాదు, అల్ రైట్ సర్! ఇంట్లో నేను నీకు తండ్రి నయినా, బయట నేను నీ బాస్ ని! ఆ విషయం ఏనాడూ మరిచి పోవద్దు!"
    "అల్ రైట్ సర్!" అంటుండగానే రఘు గొంతు బొంగురు పోయింది. చెక్కిళ్ళ వెంట బొటబొట కన్నీళ్ళు దుమికాయి.
    "గో డ్రైవర్!" డ్రైవర్ స్టార్ట్ చేసే లోగానే రఘు ఆదరా బాదరా వెళ్లి, ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు . కారు కదిలింది.
    "ఒక్క విషయం జ్ఞాపక ముంచుకో రఘూ, ఒక సైకిలిచ్చి , నిన్ను ఫాక్టరీ కి రాకపోకల్ని సాగించమందామనుకున్నాను. అలవాటు లేనివాడవనీ....అంతదూరం సైకిల్ తొక్క లేవనీ.....ఎలాగయినా ఫ్రంట్ సీట్ ఖాళీగానే ఉంటుందనీ .....ఈ కన్సెషన్ ఇచ్చాను! గెట్ దగ్గిర దిగిపో. పని అయిపోగానే గేట్ దగ్గిరికి వచ్చి కాచుకో!"
    'అల్ రైట్ సర్!"
    "లంచ్ తెచ్చుకున్నావా?"
    "లేదు సర్!"
    "డబ్బులున్నాయా?' రఘు జేబులు తడుము కున్నాడు.
    "లేవండీ! విడిచేసిన గుడ్డల్లో ఉండిపోయింది పర్సు."
    "అల్ రైట్, అయ్యంగార్ అర్ధరూపాయి ఇస్తారు. ఫాక్టరీ కాంటీన్ లో భోం చెయ్యి ఈ పూట!"
    "ఎస్ సర్!"
    "ఇంకో విషయం. ఫాక్టరీ కి వస్తూ వస్తూ నీ పర్సు మోసుకు రావలసిన అవసరం లేదు. అర్ధరూపాయ కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు నీ జేబుల్లో!"
    "అల్లాగే సర్!"
    కారు పోతూనే ఉంది. పాపం అంత పెద్ద చెన్నపట్టణం కూడా కన్నీటి లోనే మునిగి తెలుతూన్నట్లుంది రఘుకు! అయ్యంగారే తన కళ్ళను జేబురు మాలుకు అప్పజెప్పాడు.
    "మీరలా అనవసరంగా కంట నీరు పెట్టుకోకండి!"
    "ఎస్ సర్" అంటూ అయ్యంగార్ జేబు రుమాలు జేబులో ఉంచుకున్నాడు.

                                         32
    అరుణ కేం తెలుసు ఈ ఇంట కలలో కూడా తలచడానికి వీలులేని ఇంత మార్పు జరిగినట్టు? వచ్చింది. హాలులో ఎవ్వరూ లేరు. నాయర్ ఏదో పని మీద అలా వచ్చి, "వణక్కం అమ్మా!" అన్నాడు.
    "వణక్కం , వణక్కం! నవనీతం చేత ఒక కప్పు స్పెషల్ మలబార్ టీ పంపించు నాయర్!" అంటూ టకటక మేడ మెట్లు ఎక్కింది అరుణ. అకస్మాత్తుగా ఆమె తనకంటే ముందు క్రూదాయిర్ తో ....గ్రీజు తో మలినమైన కాకిగుడ్డలు తొడుక్కుని, ఎవరో బరువుగా పైకి పోతుండడం గమనించి ఆగిపోయింది!
    "ఏయ్! ఎవరు నువ్వు?"
    ఆ వ్యక్తీ ఆగలేదు. వెను తిరిగి చూడలేదు.
    "ఎవరు నువ్వంటుంటే ? అరె! అగు!"
    ఆ వ్యక్తీ ఆగాడు!
    "ఏం పనుండి నీవు మేడ పైకి పోతున్నావు?"
    ఆ వ్యక్తీ జవాబివ్వ లేదు.
    "ఇటు చూడు, ఊ! మిస్టర్ సంబంధం, నాయర్, వీడెవడో......." అంటూనే ఉంది రఘు. జీవం లేని చిరునవ్వుతో తన ముఖాన్ని అలంకరింప జేసుకుని రఘు ఈలోగానే అరుణ వైపు తిరిగాడు.
    "నమస్కారమండీ , సెక్రటరీ అమ్మగారూ!" అన్నాడు రఘు చిలిపి గానే, నిజంగా తమాషాకే.
    అరుణను ఎవరో కొరడాతో కొట్టినట్టయింది. ఆమె గుండె త్రిశూలంతో గుచ్చినట్టయింది!
    "రఘూ!" అంటూ తానెం చేస్తున్నదీ తనకే తెలియని స్థితిలో , అరుణ అతణ్ణి దాదాపు కౌగలించు కుంది.
    "ఏమిటిది?"
    "ఏది?"
    "ఈ వేషం రఘూ?"
    "ఉద్యోగం చేస్తున్నాను, మేడం! అప్రెంటిస్ మెకానిక్ గా నెలకు నలభై అయిదు రూపాయల జీతం! సేతుపతి గారి సుపుత్రుడ్ని కాబట్టి, ఇక్కడ వసతీ, భోజనమూ ఫ్రీ! ఇంటి దగ్గర నించి ఫ్యాక్టరీ గేటు వరకూ కారులో లిప్టు కూడా ఇస్తున్నారు!"
    "రామచంద్ర! మామయ్యగారికి ఇదేం పిచ్చి? అబ్బబ్బ.....నిన్నీ వేషంలో చూడలేక పోతున్నాను. పద! స్నానం చేసి , ముందా గుడ్డలు మార్చుకో. ఇందుకా నన్ను బొంబాయి పంపించింది? రఘూ, నిన్ను గురించి నిజంగా నేనెంత విచారిస్తున్నానో ఆ సర్వేశ్వరునికే ఎరుక! పద, పద! నా రూం కు రా, కలిసి టీ తీసుకుందాం!"
    "అలాగేనండీ సెక్రెటరీ అమ్మగారూ!"
    "సెక్రటరి ఎవరూ ....వాడి అమ్మ ఎవరు? నావద్ద ఈ పిచ్చి వేషాలు వేశావంటే .....నేనసలు మంచిదాన్ని కాను! నడు!" అంటూ నవ్వులాటకే అతని వీపు మీద ఒక్క చరుపు చరిచింది!
    "అబ్బ ! ఆరూ....."
    "ఆ ....అదీ సంగతి. అందుకనే దేవుడి కైనా నా దెబ్బే గురువు అన్నారు! కాబట్టి , నాతొ జాగ్రత్తగా మామూలుగా మాట్లాడు, నడు!"
    అంతా ఓ పది పన్నెండు నిమిషాల్లో రఘు స్నానం ముగించి , దుస్తులు మార్చుకుని , అరుణ గదిలో అడుగు పెట్టాడు.'    
    "హేయ్ ...ఆరూ!" అన్నాడు రఘు బాగా ఉత్సాహంగానే! ఏవేవో సుదీర్ఘమైన ఆలోచనల్లో పడి, కిటికీ గుండా ఇంటి ముంగిట ఉన్న తోటలోని పచ్చని శూన్యంలోకి చూస్తున్న అరుణ అదిరిపడింది!
    "ఆ? ....ఓహో ...యువరాజా వారా? ఏమిటా పిలుపు అమెరికన్ కౌ బాయ్ లాగా? సెక్రటరీ అమ్మగారేమయ్యారు?"
    "ఆ దుస్తుల్లో ఉన్నప్పుడే నేను అప్రేంటీస్ మెకానిక్ ని! ఈ వేషం వేసుకోగానే రఘుని! అది కూడా ఉంది మా అగ్రిమెంట్ లో!"
    "మంచి అగ్రిమెంటు లే! అయినా, నువ్వెందుకు ఒప్పుకున్నావు రఘూ? ఇక మీదట బాగా చదువు కుంటానని మ్ సిన్సియర్ గా ఒక మాట అనలేకపోయావా? నీకెందుకూ....ఉండు, మామయ్యగార్ని రానీ!"
    "మీరు నాపరంగా వాకాల్తా పుచ్చుకోనక్కర్లేదండీ అరుణగారూ! చదువు కొడం నాకిష్టం లేదు. ఈ పని చెయ్యమన్నారు. మొదట కాస్త కష్టంగానే ఉండింది. కానీ... ఇప్పుడు పరమానందంగా ఉంది. కార్మికులంటే ఎవరు? నిజంగా వారికున్న శక్తి సామర్ద్యా లేమిటి? వారి కష్ట సుఖాలేమిటి? వారి బ్రతుకేమిటి? ....ఇటువంటి వన్నీ ఇప్పుడిప్పుడు కొంత కొంత అర్దమవుతున్నాయి!"
    "ఈ పది పదిహేను రోజుల్లోనే అంత పాండిత్యం సంపాదించావా. లేబర్ మీద?"
    "అక్షరాబ్యాసం చేశాను. నిజంగా పాండిత్యం కాదు. అది సంపాదించిన నాడు నేను ఇలా వెల్ సెట్ సోఫాల మీదా.... యం యం. ఫోం రబ్బరు కుషన్ల మీదా కూర్చుని కబుర్లు చెప్పను! నేనూ వారితోటే ....వారున్న చోటే ఉంటాను!"
    "శభాష్ , పిచ్చి కుదిరింది , రోకలి తలకు చుట్ట మన్నాడట నీలాటి వాడు! కీల్సాక్ కి ఫోన్ చేయ్యమన్నావా?' అంది అరుణ నవ్వుతూ.
    రఘు తన సమాధానం ఇచ్చే లోగానే , సేతుపతి గారు ఆ గదిలో కాలు పెట్టారు. రఘు , దిగ్గున లేచి నిలుచున్నాడు.
    "కూర్చో బాబు, కూర్చో!" అంటూ, అరుణతో "ఏమమ్మా అరుణా, ఎంత సేపయిందీ వచ్చి?" అన్నారు.
    "అంతా ఓ అరగంట అయిందండీ."
    "జంషెడీ సపోటా వాలా అగు పడ్డారా?"
    "అమ్మ బాబో! అయన మీకంటే బిజీ మనిషి. ఈవేళ రూర్కెలా....రేపు బరోనీ....ఎల్లుండీ దిబ్రూఘర్....అసలు ఫోన్ లో కాంటాక్టు చేద్దామన్నా ఆయనగారు ఎప్పుడు ఎక్కడ ఉండేదీ ఎవరూ చెప్పలేక పోయారు. అనవసరంగా అయిదారు వేలు దండుగ!"
    "పోనీలేమ్మా! బిగ్ బిజినెస్ లో ఇటువంటి వాటిని గురించి అసలు ఆలోచించరాదు! ఇన్ కంటాక్స్ లెక్కలకు పనికి వస్తుందిలే ఈ ఖర్చు!"
    "ఏం? ఇదంతా వర్కర్స్ కి ఏదో రూపంలో పంచి పెడితే పాపమా?" అనాలని రఘుహృదయం గిజగిజ లాడింది! ధైర్యం చేసి అనలేక పోయాడు.
    "ఆ.....అన్నట్టు , మన రఘు ఉద్యోగం చేస్తున్నాడమ్మా ఇప్పుడు!" అన్నారు సేతుపతి... కాస్త కత్తి మీద సాము చేస్తున్నవాడిలానే!
    "అందుకనే కదండీ మామయ్యగారూ , మీరు నన్ను  బొంబాయి కి రవాణా చేసింది?" పాపం , అరుణ తన మనసులోని మాట అక్కడే దాచుకోలేక పోయింది!
    "నీకు కూడా ఇష్టం లేనటుందే? ఇప్పటి వాడి ఉద్యోగం కేవలం శిక్షణ కోసమేనమ్మా! రేపో మాపో అంతా వాడే మేనేజ్ చేయవలసి వచ్చినప్పుడు, ఈ అనుభవం వాడి కేంతయినా ఉపయోగ పడుతుంది. అందుకనే ఆ నిర్ణయానికి వచ్చాను అరుణా."
    ఈలోగా నవనీతం టీ ట్రేతో వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS