Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 22


    "చాలా మంచివాడని విన్నాను."
    "అలాగే కనపడుతున్నది" అన్నాడు.
    "అదేమిటీ , ఫోనులోనా" అంది ప్రియ పరిహాసంగా.
    రవి బిగ్గరగా నవ్వి, "కాదండీ, ఇంక అంత అడ్వాన్సు కాలేదు. మాటను బట్టి అలా అనుకున్నాను" అన్నాడు.
    రవికి బిగ్గరగా నవ్వేఅలవాటు కొత్తగా వచ్చింది.
    తరవాత ప్రియ వైపు తిరిగి, "రవీంద్ర ఏమంటున్నాడు? బాగున్నాడా?' అన్నాడు.
    "ఆ! మొన్ననే ఉత్తరం రాశాడు. మీ సంగతి తెలిసి చాలా సంతోషించాడు." ఆ ప్రయత్నంగా అనేసింది.
    రవి వదనం కొంచెం వన్నె తిరిగింది. మాట మారుస్తూ "సురేఖ ను చూడాలనీ నాకు బాగా ఉంది. అసలు ఈ ఊళ్లోనే ఉందా?' అన్నాడు.
    డానికీ ఎవరూ జవాబు చెప్పలేదు. సురేంద్ర మాత్రం "నెలరోజుల క్రితం వరకు ఇక్కడనే ఉంది. తరవాత నాకు కనిపించలేదు" అన్నాడు.
    "నాటకాలు వేస్తున్నదా?' అని అడిగాడు రవి చిన్నగా నవ్వుతూ.
    "ఈ మధ్యన ఏం వేయనట్లున్నదే?' రాజగోపాలం సురేంద్ర వైపు తిరుగుతూ తెలుసుకొనే ధోరణి లో అన్నాడు.
    "లేదు. ఆమె నాటకాల్లో వేషం వేయడం మానుకుంది." బరువుగా అన్నాడు సురేంద్ర.
    "అదేం?" అన్నాడు ఆశ్చర్యంగా రవి.
    "ఏమో మరి?" చెప్పటానికే ఇష్టం లేనట్లుగా ఆ మాటతో సురేంద్ర ఆ సంభాషణ ను తుంచి వేశాడు.
    రవి ఇక ఏం మాట్లాడలేదు. అతనికి ఆప్రయత్నంగా ఆనాడు రోడ్డు మీద సురేఖ ఏడవటం జ్ఞాపకం వచ్చింది.
    "సురేఖను చూస్తె బాగుండును.' అతని మనసు పదేపదే ఆక్రోశించింది.
    ఆ సాయంత్రం రవిచంద్ర కోసం కారు వచ్చింది.
    నాగపూర్ పట్టణానికి కొంచెం దూరంగా ఉన్న "ఆఫీసర్ల క్వార్టర్స్ " లో ఒకటి రవిచంద్ర కోసం కేటాయించారు.
    రవిచంద్ర బయలుదేరుతూ , "రండి , మా క్వార్టర్స్ కూడా చూద్దురు గాని" అని రాజగోపాలాన్ని , ప్రియం వదను బలవంతం చేశాడు.
    "సురేంద్ర ను అడగరేం?' అంది చలోక్తిగా ప్రియ.
    "వాడి మొహం, వాడు నన్నడగటమేమిటి? నేను డిఫాక్ట్ అసిస్టెంటు కలెక్టరునయితే. నేనే అడగాలి వాణ్ణి. రా,రా మా క్వార్టర్సు లో ఉందువు గాని" అన్నాడు సురేంద్ర.
    అందరూ నవ్వుకుంటూ కార్లో కూర్చున్నారు.
    తతిమ్మా క్వార్టర్స్ కు దూరంగా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశం మీద విసిరేసినట్లుగా ఉంది రవికి ఎలాట్ చేసిన క్వార్టర్స్. ఆ చిన్న డాబా చుట్టూ అందంగా పూల మొక్కలు నాటబడి ఉన్నాయి. డాబా ముందు చాలా విశాలమైన ఆవరణ ఉంది. కారు పోర్టికో లో ఆగడంతోనే ఇద్దరు బంట్రోతులు లోపలి నుంచి ఎదురు వచ్చారు.
    కారులోంచి అంతమంది దిగేసరికి వాళ్లకు అసలు వ్యక్తీ ఎవరో అర్ధం కాలేదు. తెల్లబోయి చూస్తూ, వాళ్ళందరూ లోనికి వెళుతున్న సమయంలో కారు డ్రైవరు ను "మన దొర ఏడీ" అని మరాఠీ లో అడిగారు.
    రవిచంద్ర ను చూపించి, "అరుగో, అయన" అన్నాడు వాడు.
    వాళ్ళిద్దరూ కంగారుగా ఎదురేగి అతనికి వంగి వంగి సలాములు చేశారు.
    డ్రాయింగు రూం చూడటానికి ముచ్చటగా ఉంది. ఆ ఇంటికి కావాల్సిన ఫర్నిచరు అప్పటికే అమర్చబడి ఉంది. డ్రాయింగు రూం లో ఖరీదైన సోఫా సెట్టు, అందమైన టీపాయి, వాటితో బాటు న్యూసు పేపర్లు పెట్టుకోటానికి మరో చిన్న టబుల్ -- వెటి స్థానాల్లో అవి అమర్చ బడి ఉన్నాయి.
    సోఫాలలో కూర్చుంటూ , "హమ్మయ్య! రవిచంద్ర గారింటికి ఇన్నాళ్ళ కు రాగాలిగాము. చూడండి, నాగపూర్ లో ఇన్నేళ్ళ నించి ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాము ఈ మూల ఉందన్న సంగతి" అని ప్రియ అంటుంటే అందరూ పెద్దగా నవ్వారు.
    బంట్రోతు ట్రేలో కప్పులు , టీ పాట్ పట్టుకొని వచ్చి ముందుంచాడు.
    ప్రియ టీ కలిపి అందరికీ ఇస్తుండగా ఉదయం స్టేషన్లో కలిసిన వ్యక్తీ అదుర్ద్గాగా వస్తూ రవిచంద్రను చూసి నమస్కారం చేసి, "క్షమించండి, ఆలస్యమయింది" అన్నాడు.
    "ఫర్వాలేదు. మీరు....' రవిచంద్ర ప్రశ్నను అర్ధం చేసుకొని, "నేను మీ పర్సనల్ క్లర్కు ను" అన్నాడు.
    "ఐ.సి" అన్నాడు రవిచంద్ర.
    "ఆ ఇద్దరు బంట్రోతుల్లో ఒకడు వంట చేస్తాడు. అన్ని సామాన్లు మీరు పంపిన ఎడ్వాన్సు తో తెప్పించే ఉంచాను. పాత్ర సామాగ్రి కూడా ఉంది. ఇదిగోండి బిల్సు. ఇవి మిగిలిన డబ్బులు" అని రవికి చాలా వినయంగా వాటిని అందజేశాడు.
    "థాంక్యూ.....కారు...."
    "మీకేమన్నా అవసరం ఉంటె ఉంచుకోమని కలెక్టరు గారు చెప్పారు. ఇప్పుడు అక్కర్లేక పొతే ఉదయం వస్తుంది, ఆఫీసు వేళకు."
    "థాంక్యూ."
    అతను అలాగే నిల్చున్నాడు.
    "కాఫీ తీసుకోండి" అంటూ రవిచంద్ర కాఫీ కప్పును అతనికి అందివ్వ బోయాడు.
    అతను "అక్కర్లేదు , సార్. థాంక్యూ.....ఇప్పుడే...."అంటూ ఏదో నసగబోయాడు.
    "ఫర్వాలేదు, తీసుకోండి" ఆని సురేంద్ర అనేసరికి మాట్లాడకుండా తీసుకున్నాడు.
    "మీరందరూ ఇవ్వాళ నా అతిధులు" అన్నాడు రవిచంద్ర , అందరి వైపు మందహాసంతో చూస్తూ.
    "చచ్చాం, మీ బంట్రోతు ళ వంట మాకు రుచి చూపిస్తారా ఏం?' అంది ప్రియ.
    "మిమ్మల్ని ఫస్ట్ విక్టిమ్స్ గా చేద్దామను కున్నాను. మేమిద్దరమే ఎందుకు సఫరవ్వాలి?" అన్నాడు రవి సురేంద్ర వైపు తిరిగి.
    సురేంద్ర "భయపడకండి. వంటకు నేను దర్శకత్వం నిర్వహించగలను కాని ప్రియంవద గారు మాత్రం దర్శక పర్యవేక్షణ చేయక తప్పదు" అన్నాడు.
    "ఓ యస్ , అలాగే" అంది ప్రియ.
    అందరూ నవ్వుకున్నారు. ప్రియ, సురేంద్ర లోనికి వెళ్ళారు. రవి, రాజగోపాలం ఇల్లంతటిని కలియ చూసిన  తరవాత వచ్చి మళ్ళీ డ్రాయింగు రూంలోనే కూర్చున్నారు.
    ఇంకా ఆ పర్సనల్ క్లర్కు అలాగే నిల్చుని ఉన్నాడు.
    "మీరు వెళ్ళండి. ఉదయం ఆఫీసులో కలుద్దాం" అన్నాడు రవి.
    అతడు 'థాంక్యూ , సార్" అంటూ వెళ్ళిపోయాడు.    
    రాజగోపాలం అతన్ని కుతూహలంగా చూస్తూ, "మిమ్మల్ని అభినందిస్తున్నాను. మనిషిని మనిషిగా గౌరవిస్తున్నారు. చాలామంది వాళ్ళు చేసే ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మర్యాద నివ్వటం అలవాటు చేసుకున్నారు" అన్నాడు.
    ఈ ఆకస్మికాభినందనకు రవిచంద్ర కొంచెం తట్టుకోలేనట్లు ముఖం పెట్టి , "మీరీమధ్య అనవసరంగా అందర్నీ పొగడడం అలవాటు చేసుకున్నట్లుంది చూడబోతే." అన్నాడు.
    అందర్నీ కాదు, కొందర్నే" అన్నాడు రాజగోపాలం నవ్వుతూ.
    ఇద్దరి మధ్య కాసేపు మాటలు పెగల్లేదు.
    "అక్కడ చలి ఎక్కువ ఉంటుందను కుంటాను" అన్నాడు రాజగోపాలం.
    "అవును , ఇక్కడే అనుకుంటే, ఇక్కడి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాని, ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజుల్లో. ముఖ్యంగా తెల్లవారు ఝామున మంచు పడుతున్నప్పుడు చూడాలి. వండర్ ఫుల్!' రవి జ్ఞప్తి చేసుకొని తన్మయత చెందుతూ అనసాగాడు.
    ఇద్దరి మధ్య క్షణకాలం నిశ్శబ్దం.
    రవి అందుకున్నాడు" "ఇవ్వాళ పేపరు చూశారా? మద్రాసు లో హిందీ విషయంలో చాలా గొడవగా ఉంది."
    "అవును, ఆత్మ పరిత్యాగం అంటూ తమను తాము కాల్చుకోవటం చాలా చిత్రంగా ఉంది. సమస్య ఎలాంటిదైనా సరే , క్షుణ్ణంగా పరిస్థితులు అర్ధం చేసుకొని గవర్నమెంటును ఒత్తిడి చేయటం వేరు విషయం కాని, ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో శాంతిని కాపాడుకోవలిసిన అవసరం ఎంతో ఉంది."    
    "బాగా చెప్పారు. మన హక్కులతో బాటు మన బాధ్యతలు కూడా ఉన్నవన్న సంగతి జనం మరిచి పోతున్నారు. హిందీని మనం ఏనాడో జాతీయ బాషగా గుర్తించినప్పుడు దాని కోసం ఇంత గొడవ చేయటం కొంచెం ఎబ్బెట్టు గానే ఉంది." రవి కొంచెం ఆవేశంగానే అన్నాడు.
    "మీరన్నది నిజమే కానీ హిందీని నెత్తి మీద రుద్దుతున్నారు అనే భావన ఎప్పుడైతే దక్షిణాది వారిలో కలుగుతుందో అప్పుడు వారిని కంట్రోలు చేయటం కష్టం." రాజగోపాలం తన సహజ ధోరణి లో నెమ్మదిగా మాట్లాడ సాగాడు.
    "గొడవ హిందీ వరకే పరిమితమై ఉంటె బాగుంటుంది. ఏ భాష అయినప్పటికీ మనందరం నివసించేది ఒకే దేశంలో అన్న విషయం జ్ఞాపకం ఉన్నప్పుడు మనిషి ఇంకాస్త ఎత్తుకు ఎదిగి మనకు మనం నిర్మించుకున్న ఈ కృత్రిమమయిన గోడలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. చివరకు పాపం, ఏమీ తెలియని అమాయైకపు పోలీసు ఆఫీసర్ల నుశాంతిని పరిరక్షించటానికి ఉన్నవాళ్ళను మంటల్లో వేసి కాల్చారట! పేపర్లో అది చూసినప్పుడు మాత్రం నా =హృదయం ఆ అమాయికుల కోసం ఆక్రోశించింది. మనం ఎటు వెళ్ళుతున్నాం? ఏమిటి ఈ వైపరీత్యం అనే ప్రశ్నలకు జవాబులు లేవు మనదగ్గిర."
    రాజగోపాలం అతణ్ణి కుతూహలంగా చూస్తూ కాస్సేపటి వరకూ ఏమీ మాట్లాడలేదు. తరవాత నెమ్మదిగా అనసాగాడు.
    "ప్రజాస్వామ్యం మనం ఒప్పుకున్నప్పుడు వీటన్నిటిని గూడా స్వీకరించాలి. మన దేశం అద్భుతమైన మార్పును ఎదుర్కొంటున్న ఈ సమయంలో మరి ఇటువంటి సంఘటనలు సహజమేమో అనిపిస్తున్నది. నా ఉద్దేశ్యంలో ఇవ్వన్నీ తాత్కాలిక మనిపిస్తున్నాయి. 'తరవాత తప్పకుండా ఇవన్నీ సమసి పోతాయి' అనే గట్టి నమ్మాకం నాకేండుకనో ఉంది." చిరునవ్వుతో అతను అంటున్న మాటలను రవిచంద్ర ఆసక్తిగా వింటున్న సమయంలో సురేంద్ర లోపలి నించి హడావిడి గా వచ్చాడు. వెనువెంటనే ప్రియంవద కూడా వచ్చేసింది.
    "ఏమిటీ హడావిడి?" రాజగోపాలం అడిగాడు .
    ప్రియ నవ్వుతూ, "ఆయన్ని అడగండి " అంది సురేంద్రను చూపిస్తూ.
    సురేంద్ర "ఏమీ లేదండీ. బంట్రోతు అన్నీ సక్రమంగానే చేస్తున్నాడు. కాని నాకుండ బుద్ది కాక గరిటె తో ఏదో కలియ బెట్టబోయాను. ఆ గరిటె కాలుతున్న సంగతి తెలియక, కాలి కొంచెం డ్యాన్సు లాంటిది చేశాను. అంతే. డానికి వీరు నవ్వుతున్నారు." అన్నాడు.
    ప్రియ నవ్వు ఆపుకోవడానికి అవస్థ పడుతున్నది.
    "ఊ! అయితే 'గరిటె తో వాతలు' అనే చిత్రంలో యాక్టు చేశారన్న మాట!" అన్నాడు రాజగోపాలం.
    నవ్వులతో ఆ ఇల్లు ప్రతిధ్వనించింది రాజగోపాలం అన్న మాటలకు.
    "వంట ఎంతవరకు వచ్చింది?" అన్నాడు రవి సురేంద్ర వైపు తిరిగి.
    "ఇంకా నోటి వరకు రాలే. కాస్త అలస్యముంది" అన్నాడు సురేంద్ర.
    మళ్ళీ అందరూ నవ్వుకున్నారు.
    నిశ్శబ్దం కాసేపు రాజ్యం చేసిన తరవాత రవి మళ్ళీ సంభాషణ కుపక్రమించాడు.
    "అక్కడ ముస్సోరీ లో ట్రెయినింగ్ లో నా మిత్రుడొకడితో ఈ విషయం లో నేను చాలా ఘోరంగా డిఫర్ కావలిసి వచ్చింది. నా వాదన ఏమిటంటే, హిందీ ఏ ఒక్కరికీ సంబంధించింది కాదని, అది అందరి భాష. హిందీ కేవలం ఉత్తరాది వారికే చెందిందనుకోవటం దక్షిణాది వారి భ్రమ. మన దేశం బాగుపడాలంటే, సమైక్యం అప్పుడు చాలా అవసరం. ఆ సమైక్యం సాధించే ఆయుధం హిందీ అని నా అభిప్రాయం. ఈ విషయం లో భాషాభిమానాలు, ప్రాంతాయాభిమానాలు ఉండటం కేవలం అవివేకం. అట్లా అని నేన్నందుకు అతను చాలా బాధపడ్డాడు. అతను  దక్షిణాది వాడు కాబట్టి ఆ విధంగా అన్నానంటూన్నాడు. మరి నా సంగతో ? నేను దక్షిణాదివాణ్ణి కానా? అని అడగవలసి వచ్చింది."    
    "దక్షిణాదికి నీవు విడాకులు ఇచ్చిన సంగతి అతనికి తెలియదు కాబోలు " అన్నాడు సురేంద్ర యధాలాపంగా.
    ప్రియ కూడా తన సహజ ధోరణి లో నవ్వింది.
    టక్కున తగిలినట్లనిపించింది రవిచంద్ర కు . చాలా తీవ్రంగా చెబుతున్న విషయాన్ని అపు చేశాడు. ముఖం కొంచెం గంబీరంగా మారిపోయింది.
    రాజగోపాలం అతనిలో మార్పు పసికట్టి సంభాషణ పొడిగించలేదు.
    సురేంద్ర కు ఈ ఆకస్మికమయిన మార్పు అర్ధం కాకపోయినా నచ్చలేదు. గబగబా లోనికి వెళ్లి వచ్చి "డిన్నర్ రెడీ, లేద్దమా?' అన్నాడు.
    అందరు లేచారు. డిన్నర్ టేబుల్ పై అన్ని పదార్ధాలు చాలా నీటుగా అమర్చారు ఆ ఇద్దరు బంట్రోతులు. కూర్చున్న తరవాత సురేంద్ర కూర అందరికీ వడ్డిస్తూ , "పదార్ధాలు బాగుంటే ప్రియంవద గారిని పొగడడం, బాగులేకపోతే నన్ను గానీ, ఆ బంట్రోతులను గాని తెగడడం చేశారంటే నేను ఒప్పుకోను. మంచి చెడ్డలు ఈక్వల్ గా షేరు చెయ్యవలిసిందే " అన్నాడు.
    "ఆ విషయంలో నా సపోర్టు మీకు పూర్తిగా ఉంటుంది." రాజగోపాలం అందుకున్నాడు.
    "సరే, మంచిది. రేపు ఈ కూర బాగుంది , ఆ కూర బాగుందని ఇంట్లో ఎలా పోగుడుతారో చూస్తానుగా! అన్నీ చెడగొట్టి కూర్చుంటాను. వచ్చే చెడ్డ పేరు ఎలాగూ వస్తూనే ఉండే!" అంది ప్రియ హాస్య ధోరణి లో భర్తను బెదిరిస్తూ.
    "చూశారా, రవిచంద్ర గారూ! మీ ఇంట్లో డిన్నరు నా ఫ్యూచర్ ఈటింగ్ ప్రాస్పెక్ట్ మొత్తాన్ని చెడగొట్టింది." అన్నాడు రాజగోపాలం చలోక్తిగా.
    రవి సురేంద్ర లు బిగ్గరగా నవ్వారు. బంట్రోతులు ఖాళీ అయిన గ్లాసులో నీళ్ళు భర్తీ చేశారు.
    రవి భోంచేస్తూ అన్నాడు సురెంద్రతో. "నీ సామాను ఆ గదిలో ఎందుకు? రేపు ఉదయం మనిషిని పంపించి ఇక్కడకు తెప్పిద్దాం!"
    "ఓ యస్! ఒక యాభయి రూపాయలు కూడా ఆ మనిషితో పంపించు. పోయిన నేల అద్దె కూడా చెల్లించలేదు' అన్నాడు సురేంద్ర పరిహాసంగా.
    మళ్ళీ నవ్వుకున్నారు అందరు.
    డిన్నర్ కులాసాగా గడిచిపోయింది. మళ్ళీ కాస్సేపు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్న తరవాత రాజగోపాలం , ప్రియంవద వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి సిద్దమయ్యారు.
    'అల్ ది బెస్ట్, రేపు డ్యూటీ లో జాయిన్ అవబోతున్నారుగా " అన్నాడు రాజగోపాలం.
    "థాంక్యూ . మీ బెస్ట్ విషెస్ ఊరికే పోవు లెండి" అని రవిచంద్ర జవాబు చెప్పిన తరవాత రాజగోపాలం ప్రియం వద అక్కడి నించి కదిలారు.
    గేటు దాకా రవిచంద్ర, సురేంద్ర వారిని సాగనంపి కారు అక్కడ నించి కదిలెంత వరకు అలాగే నిల్చుని నెమ్మదిగా లోనికి వచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS