Previous Page Next Page 
మేఘమాల పేజి 23

 

                                  12
    
    రాజేశ్వరి, త్యాగరాజు ఓ పెద్ద షాపు లోకి వెళ్ళారు.
    ఇద్దరూ బాలీసు ల మీద కూర్చున్నారు.
    'కాంచీవరం పట్టుచీర లేవైనా చూపించండి!' అడిగింది రాజేశ్వరి.
    'పెద్ద అంచా?'
    "మీడియం సైజ్!'
    కుప్పలు కుప్పలుగా చీరెలు ముందుకు వచ్చి పడ్డాయి.
    అందులో ఓ చీరే -- నీలి ఆకాశపు రంగులో -- అక్కడక్కడా జరీ పువ్వులతో ఎంతో అందంగా కనబడింది?
    త్యాగరాజే దాన్ని కుప్పలో నుండి బయటకు లాగాడు.
    'ఇది చాలా బాగున్నది!'
    రాజేశ్వరి నవ్వి, 'నాకు శ్రమ తగ్గించారన్నమాట!' అంటూనే చేతిలోకి తీసుకున్నది. దాన్ని పరిశీలనగా చూచి , తృప్తిగా , 'దీనికి సరిపడే బ్లౌజ్ పీస్ కూడా కావాలి!' అన్నది.
    'మరి నీకు నచ్చిందా?' అడిగాడు ఆశగా ముందుకు వంగి.
    'ఆ....' నిండుగా అన్నది.
    అదే రంగులో బ్లౌజ్ పీస్ గూడా తీసుకున్నారు.
    బట్టలు ప్యాక్ చేసి బిల్లు యిచ్చారు.
    నూట యాభై ఆరు రూపాయలు!
    ఇద్దరూ మళ్ళా రిక్షా ఎక్కారు.
    'మీ సెలక్షన్ చాలా బాగున్నది!' అన్నది రాజేశ్వరి చిన్నగా నవ్వి.
    క్షణం త్యాగరాజు సిగ్గు పడుతున్నట్లుగా ఆగి, 'నేను ఒకటి రెండు కేసులు చూదాను.... భర్తకు నచ్చి తెచ్చినవి భార్యకు నచ్చక పోవటం ....మన వివాహానంతరం కొన్న మొదటిదే ఇద్దరికీ నచ్చటం మనముందు జీవితానికి వో శుభ సూచకంగా వున్నది!' అన్నాడు తృప్తిగా.
    రాజేశ్వరి నవ్వి ఊరుకున్నది.
    త్యాగరాజు కొద్దిగా పాశ్చాత్తాప కంఠంతో, 'నేను చాల తెలివితక్కువ పనిచేశాను... ఈ బహుమానాన్ని నీచేత అడిగించుకోకుండా నా అంతట నేనే కొంటె ఎంతో బాగుండేది!' అన్నాడు.
    రాజేశ్వరి త్వరత్వరగా , 'ఇది నాకు కాదు!' అన్నది.
    'మరి?' నుదురు ముడి వేశాడు.
    'ఎవరి కోసమని కొన్నావ్?'
    'ఇప్పుడే చెప్పాలా?' అన్నది ఓరగా చూస్తూ.
    'నీ యిష్టం.... నీ యిష్టం!' అన్నాడు కొద్దిగా నీరసపు కంఠంతో.
    రిక్షా యింటి ముందు ఆగింది.
    ముందు త్యాగరాజు దిగాడు.
    దిగి ఇంటి వైపుకు చూచిన మరుక్షణం లోనే అప్రతిభుడయ్యాడు.
    ఇల్లు తాళం వేసి వున్నది.
    'సత్యవతి ఎక్కడకు వెళ్ళింది?' కలవర పడుతూ అన్నాడు.
    అప్పటికే రిక్షా దిగిన రాజేశ్వరీ అదే పరిస్థితిలో వుండి పోయింది.
    అతడి మేనుని భయం నల్లని మేఘం లా ఆవరించింది.
    'ఆమె ఏ అఘాయిత్యం చేయలేదు గదా?'
    కంఠం వణికింది.
    రాజేశ్వరి నోట మాట లేక, పాలిపోయిన మొఖంతో తమ యింటికి వేసి వున్న తాళం వంక చూస్తున్నది.
    'డబ్బులివ్వండి బాబూ! వెళ్ళిపోతాను !' రిక్షావాడి మాటలకు ఉలిక్కిపడి, జేబులో వున్న చిల్లర డబ్బులు తీసి ఆతడి చేతిలో పడవేశాడు.
    'ఒంటరిగా - ఒకసారి తమ ఎదుటనే ఘోరానికి తలపడ్డ ఆమెను-- వదిలి వెళ్ళటం ఎంతో పోరాబాటయింది!' అనుకున్నారు యిద్దరూ.
    గుండెలు దడదడ లాడుతున్నాయి.
    తమ జీవితంలో ఒక శుభ దినాన ఎలాంటి దుర్ఘటన జరిగింది.
    సరిగ్గా అటువంటి సమయంలోనే ఆ యింటి యజమానురాలు తలుపు తీసుకు బయటకు వచ్చి, 'అరె వచ్చారా మీరు!..... సత్యవతి తాళం చెవి యిచ్చింది!' అంటూ తాళం తీసుకురావటానికి లోపలికి వెళ్ళబోయింది.
    'ఆమె ఎక్కడకు వెళ్ళింది?' ఇద్దరూ ఒకేసారి అడిగారు.... కంపిస్తున్న కంఠలతో ఆత్రంగా ముందుకు అడుగులు వేస్తూ.
    'తెలియదు!'
    ఆమె తాళం చెవి తెచ్చి ఇచ్చింది .
    ఇంట్లోకి వెళ్ళాలంటే ఇద్దరికీ భయంగానే ఉన్నది.
    రాజేశ్వరి తాళం తీసి తలుపులు లోపలకు నెట్టింది.
    తల వంచుకొని త్యాగరాజు మెట్లేక్కాడు.
    - ముందుగా తలుపు తీసిన రాజేశ్వరి దృష్టి ఇంటి మధ్యలో చాప మీద పెట్టి వున్న కాగితం మీదా, అది ఎగిరి పోకుండా బరువుగా వుంచిన గాజు గ్లాసు మీద పడింది.
    ఆత్రంగా దాన్ని తీసుకోబోతున్న రాజేశ్వరి చేతిని తోసేస్తూ, ఆ కాగితాన్ని లాక్కుంటూన్నట్లుగా తీసుకొని వడివడిగా చదవసాగాడు త్యాగరాజు.
    'త్యాగరాజు గారికి,
    ముందుగా క్షమాపణలు కోరుకోవటం నా విధి. మీరు నన్ను మన్నించాలి--
    ఈనాడు నేను చేస్తున్నది తప్పో, ఒప్పోనాకయితే తెలియదు గాని అలా చేయటంలో నా తెలివి నంతా ఉపయోగించాననే అనుకుంటున్నాను-- అందువలన లోకం దృష్టి లో తేలికై పోననేదే నా భావన!
    వెన్నెల నీడలో, నా భావి జీవితాన్నంతా ఎలాంటి ఒడుదుడుకులూ లేకుండా గడప వచ్చనే ధైర్యం నాకున్నా-- దానిని కాదని, కాలదన్ని ఈ నిర్ణయానికి వచ్చి-- ఆ వెన్నెల నీడకు దూరమయి-- రాళ్ళూ, రప్పలతో గూడిన బాటలో కాలు పెడుతున్నాను-- దాని కష్టనష్టాలకు సంపూర్ణంగా బాధ్యురాలను నేనే!
    ఈనాటి లోకం తీరు ఇది-- చూడంది చూచినట్లుగా కల్పించటం -- వ్యక్తులను, అందునా దయామూర్తులు, ధర్మ మూర్తులు దేవుళ్ళ లాంటి మనుష్యుల మీద అభాండాలు వేయడం -- అంతేగాదు జీవచ్చవంలా బ్రతుకుతున్న వ్యక్తులను వాళ్ళ ఊహబంధాలతో బంధించి, మెలితిప్పి రచ్చ కీడ్వటం.....
    ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే-- దేవుడి లాంటి మీదగ్గర నా శేష జీవితాన్ని గడపటం కంటే నాకు కావాల్సినాదేం వున్నది?- నేను కోరుకునేదే వున్నది. కాని, ఎన్నాళ్ళు ఉండేది అలా....నన్ను ఎన్నాళ్ళు భరించగలుగుతారు మీరు?-- లోకుల దృష్టిలో మనం ఎన్నాళ్ళు శాంతిగా వుండగలుగుతాం?
    నావలన మీలాంటి వ్యక్తుల గుండెల్లో సుడిగుండాలు ఏర్పడటం నేను సహించలేనన్నయ్యా!
    -- మీలాంటి అన్నయ్య నాకున్నందుకు నేనెంత గానో సంతోషిస్తున్నాను-- గర్విస్తున్నాను గూడా!
    నేటి మన సమాజం ఒక కోనేరు లాంటిది.
    అందులోని నీరు పచ బారినా , పాచి పట్టినా ఆ నీటిని తోడేసి కొత్త నీటితో నింపటం అసాధ్యం మాత్రం కాకపోయినా, తేలిక మాత్రం కాదు. అలాగే మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని భావాలు మారాలన్నా, అంత తేలిక కావేమోననిపిస్తోంది-- వో మానసిక విప్లవం లాంటిది వస్తే గాని.....
    ఉదాహరణకు మీరే వున్నారు--
    వాసన వచ్చే నీటికి దాపులో కోనేటి  నడుమ చిన్న దేవాలయం వుంటుంది....దేవుంటాడు.... ఆ దేవుని మొఖం చూస్తూ కూర్చుంటే మనకు ఎంతో ప్రశాంతి లభిస్తుంది.
    ఈ సమాజంలో అలాంటి దేవుళ్ళలో  ఒకరు మీరు....ఇది అతిశయోక్తి కాదు!
    --కానీ, దేవుళ్ళు తప్పు చేస్తారని, తప్పుదోవలు తోక్కుతారని పురాణ గాధలు చెబుతాయి....అందుకు నిదర్శనం మీరు గూడా!
    రాణి వెళ్ళిపోయింది.
    ఆమె భావి జీవితానికి, వెలుగూ, వసంతమూ చేకూర్చుకునేందుకుగాను పునాదులు వేసుకుంటూ.....వేసుకున్నది గూడా.... ఆమె ఊహించుకున్న హర్మ్యాలన్నీ సువర్ణమండపాలే అయినాయి-- ఆమె సుఖిస్తోంది...జీవితాంతం సుఖిస్తుంది గూడా....
    కాని, మీరు ఆమెను ఏవగించుకుంటున్నారు....కసిరి కొడుతున్నారు.... దూర దూరాలకు నెట్టి వేస్తున్నారు.
    ఎందుకని?....
    ఆమె ముందు జీవితపు బాటలో ముళ్ళు, రాళ్ళు లేకుండా చేసుకో ప్రయత్నించటం ఆమె చేసిన నేరము?....
    నిజం చెప్పాలంటే ఆ విషయంలో నేను మిమ్మల్ని మెచ్చలేకుండా వున్నానన్నయ్యా!
    వదిన గారికి నా నమస్కారములు. త్వరలోనే మీ వివాహం జరుగుతుందని ఆశిస్తాను.... జరగాలని గూడా కోరుకుంటున్నాను. (ఒక్కమాట ; కోపగించుకోకండి --మీరు రాణి ఏదో తీసిందని ఏవగించుకున్నారు-- రాజేశ్వరీ కే వో అన్నగారు వుంటే ఆమె చర్యను అయన ఏవిధంగా భావించి వుండేవారు -- నన్ను క్షమించగలరనే నా ధైర్యం!)
    నేను వర్కింగ్ గరల్స్ 'హాస్టల్స్ జేరాను-- రాణి ద్వారా'.... ఆమె బావగారు జయరాం గారి సహాయంతో -- కాగితాల మీద వారి కంపెనీ లో పని చేస్తున్నట్లుగా సృష్టించుకొని-- త్వరలోనే నిజంగానే ఉద్యోగస్తురాలని అవ్వగలననే ఆశతో!
    మీరేమీ భయపడవద్దు. నేను మీకు హామీ యిస్తున్నాను..... జీవితంలో మరెన్నడూ పది రోజుల క్రితం ఆనాటి అర్ధరాత్రి సిగ్గువిడిచి చేసిన అఘాయిత్యాన్ని చేయను!
    --నేను జీవిస్తాను....తిరిగి మీరు నాకు జీవితాన్ని ప్రసాదించినందుకైనా , అవసరమొస్తే జీవితంలో పోరాడి విజయ సాధనకు ప్రయత్నిస్తాను....
    --నాకు మా అన్నగారి సహాయ సహకారాలు ప్రతిక్షణం ఎంతో అవసరం!
    అందుకే మీ ఆశీర్వాదాలు ఆశిస్తూ
                మీ చెల్లెలు
                సత్యవతి....

                           *    *    *    *
    మధ్యాహ్నం మూడు గంటలయింది.
    రాజేశ్వరి కాఫీ కాచి తీసుకువచ్చి అతడికి ఎదురుగా పెట్టింది.
    ఆరోజు మధ్యాహ్నం సత్యవతి ఇంట్లో వుంచి వెళ్ళిన ఉత్తరం చదువుకున్న తరువాత మనస్సులోని వేదన కొద్దిగా తగ్గినా -- యిద్దరికీ అన్నం సహించలేదు.
    అసలు వారి జీవితంలోని ఆ శుభ దినాన అన్నమే తినేవారుగాదేమో!
    కాని ఆహ్వానితుడైన స్వామి రాగా అతడితో పాటు కూర్చొని చాలా మౌనంగా భోజనం చేశారు.
    స్వామి వారి మౌనాన్ని గుర్తించినా దాని వెనుక విషయాన్ని అడిగే ధైర్యమూ, చనువూ లేక మెదలకుండా ఊరకుండి పోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS