Previous Page
మేఘమాల పేజి 24

 

    - ఎంతో సరదాగా గడిచి పోతుందనుకున్న రోజు చాలా నీరసంగాను, నీర్జీవం గానూ తయారయింది.
    'నేను చాలా భయపడ్డాను. ఏం అఘాయిత్యం చేసిందోనని!' అన్నాడు త్యాగరాజు- ఆ ఉత్తరం చదివిన తరువాత ఆ విషయం మీద మొట్ట మొదటిసారిగా మాట్లాడుతున్నట్లుగా.
    'నేనూ అలాగే అనుకున్నాను.... మనకు కష్టం కలిగించేదే అయినా ...ఆమె జీవిత గమనానికి మంచి ప్రాతిపదికనే వేసుకున్నదని అనుకుంటాను! ఓ నిట్టుర్పు విడిచింది రాజేశ్వరి.
    ' ఆ ఏర్పాటుకు ఆమె ఇక్కడి నుండి వెళ్ళి పోవాల్సిన అవసరమేం వున్నది.... ఇక్కడే వుండి టైపు నేర్చుకోవచ్చునే, కాదంటే చదువుకోవచ్చును గూడా. ఉద్యోగం ఒకటి ఆమెకు మనం చూడలేకపోయేవాళ్ళమా?'
    అతడు ఆ మాటలను ఎంతో అభిమానంగా అన్నా అతడి కంఠంలోని జీరకు అర్ధం ఆమెకు తెలుసు!
    'రాణి ద్వారా ఈ పని జరగటం అయనకు కష్టంగా వున్నది!-' అనుకున్నది.
    చిన్నగా నవ్వుకున్నది లోలోనే.
    'మన ప్రమేయం లేకుండానే మన మనస్సుకు బాధ కలిగే సంఘటన ఒకటి అనుకోకుండా ఈనాడు జరిగింది-- అంతే గాదు, ఎంతో ఉల్లాసంగా గడపవలసిన ఈ సమయంలో మీ మనస్సుకు కష్టం కలిగించే మరో పని గూడా నేను చేస్తున్నాను!' తలవంచుకుని అన్నది రాజేశ్వరి.
    'ఏమిటది?' అన్నాడు నిర్లిప్తంగా.
    'మీరు కోపం తెచ్చుకోగూడదు....నా వివాహసమయాన నా ముద్దు కోరికగా భావించి, తీర్చండి!' అన్నది దీనంగా చూస్తున్నట్లుగా అతడి ముఖంలోకి చూస్తూ.
    'చెప్పు రాజూ!' అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ, పేలవంగా నవ్వి.
    ఆమె చెప్పటానికి సంశయిస్తున్నట్లుగా ఒక్క క్షణం తటపటాయించి , 'రాణి ఒట్టి మనిషి గాదు...... అందుకే ఈ  ఇంటి అడబడుచుగా ఆమెకు మన వివాహసందర్భంలో కొత్త చీరెను, పసుపు కుంకుమలతో ఇచ్చి వద్దామనుకుంటున్నాను!' అన్నది.
    అలా అంటూనే భయంభయంగా అతడి మొఖంలోకి చూచింది.
    'నీ యిష్టం!' ఏలాంటి భావనా వ్యక్తీకరించకుండా చాలా మాములుగా అని, ఆ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిలువెల్లా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు.
    ఆ విషయంలో మరి రెట్టించలేదు రాజేశ్వరి.
    లేచి నిలబడి తాను చేయదలుచుకున్న కార్యక్రమానికి ఆయత్తమవ్వసాగింది.

                        *    *    *    *
    సాయింత్రం ఆరు గంటల సమయంలో త్యాగరాజు వంటరిగా, బరువైన గుండెతో తెరిచి వున్న తలుపు గుండా రోడ్డు మీద వచ్చే పోయే జనాన్ని చూస్తూ కూర్చున్నాడు చాప మీద.
    రాజేశ్వరి రాణి గృహం నుండి వస్తూనే త్యాగరాజును చూచి నవ్వింది.
    త్యాగరాజు మొఖం తిప్పుకున్నాడు.
    వచ్చి చాప మీద అతడికి ఎదురుగా కూర్చున్నది.
    "ఈరోజున అన్నీ మీ మనస్సుకు కష్టం కలిగించే పనులే జరుగుతున్నాయి.... వాటిలో కొన్నిటికి నేనే బాధ్యురాలి నెమో గూడా!' అన్నాది చిన్నగా తలవంచుకొని.
    'అలా ఎందుకనుకోవాలి?' అడిగాడు చిన్నగా నవ్వి 'కష్టాల్లో పుట్టినవాడు సుఖాల్లో జీవిస్తాడేవో!'
    రాజేశ్వరి భావగర్బిటంగా నవ్వి 'మీరెలాగైనా అనుకోండి.... నా ఈ మాటలు మీకు యిష్టం లేని నాలోని మరో కోరికకు ప్రాతిపదికలు!' అన్నది.
    'ఏవిటా కోరిక?' గంబీరంగా అడిగాడు.
    'తీర్చేటందుకు రెడీనా?'
    'కోరికలు తీర్చటం మీద నా భావనలేవో నీకు ఉదయాన్నే చెప్పాను!'
    'అవి కొన్నిటికీ చెల్లవచ్చు.... ' ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తన ఊహల్లో తన్మయురాలౌతున్నట్లుగా ఆగి, మిమ్మల్ని ఈ ఉదయాన నా భర్తగా  పొంది నా జీవితానికి ధన్యత్వం చేకూర్చుకున్నాను... మీచేత డబ్బు ఖర్చు పెట్టించి కొన్ని రోజులుగా నాలో పేరుకుపోతున్న కోరికను కొద్ది గంటల క్రితమే తీర్చుకున్నాను.... ఇప్పుడు నాకిష్టమైన ఓ ప్రోగ్రాం కు మీ కాలాన్ని మన ధనాన్ని గూడా వృధా చేస్తూ ముమ్మల్ని తీసుకు వెళ్ళి ఆనందపు అమృతం లో ముణిగి పోయే ఆ కోరికనూ తీర్చుకోబోతున్నాను!' అన్నది.
    ఆమె కళ్ళు సగం మూసుకొని మసక మసకగా భర్త ముఖంలోకి చూస్తూ ఓ అందమైన ఆనందమైన మేఘామాలను సృష్టించుకోసాగింది.....
    త్యాగరాజు ఉత్సాహంగా ముందుకు వంగి ఏం ప్రోగ్రామది ....ఎక్కడ?' అడిగాడు.
    'ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మీ పాట కచేరీ రవీంద్ర భారతిలో!' అన్నది కళ్ళు తెరిచి భర్త ముఖంలోని భావాలను ఆదుర్దాగా వెతుకుంటూ.
    భార్యను తొలినాడే నిరుత్సాహపరచటం యిష్టం లేదన్నట్లుగా 'వెళ్దాం పద!' అన్నాడు లేస్తూ.
    రాజేశ్వరి అత్యుత్సాహంతో లేచి, పరుగేడుతున్నట్లుగా పనులన్నీ పూర్తీ చేసుకొని పావుగంట లోనే 'రెడీ' అన్నది.
    'ఈపూట వంట గూడా చేయటం లేదు!' అన్నది అప్పుడే అల్లుకున్న జడను విసురుగా వెనక్కు వేసుకుంటూ.
    'మొదటి రోజే భర్త గారికి పస్తా?' అడిగాడు వింతగా కళ్ళు పెద్దవి చేసుకొని.
    'లేదు....హోటల్లో స్పెషల్ డిన్నర్!' తల ఎగరేస్తూ ఏదో విజయం సాధించి నట్లుగా అన్నది.
    యిద్దరూ రిక్షా లో రవీంద్ర భారతి కి వెళ్ళేటప్పటికీ సరిగ్గా ప్రోగ్రాం మొదలు పెట్టేందుకు ఇంకా పది నిముషాల టైం వున్నది.
    హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులయినా -- బయట నుండి ఎన్నోసార్లు చూచినా -- రవీంద్ర భారతి లోపలికి వెళ్ళటం ఇదే ప్రధమం!
    ఆ ఆవరణంతా చిన్న కార్లతో నిండి పోయి వున్నది.
    రవీంద్ర భారతి ఎత్తు మెట్లెక్కుతూ ఒక్కసారి అ పరిసరాలను వెనుదిరిగి  చూచాడు-- ఎంతో ప్రపుల్లంగా కనబడింది అక్కడ నుండి ఆ పరిసర ప్రదేశం!
    ముందుకు తిరిగితే ముందుగా నాలుగు మెట్లు పైకేక్కిన రాజేశ్వరి వెనుదిరిగి తన వంకే చూస్తూ కనబడింది.
    లైటు గచ్చకాయరంగు పూల పుల్ వాయిల్ చీరలో అదే రంగు జాకెట్టు తో .... పొడువైన వాలుజడ లో ఒకే ఒక గులాబీ తో అందంగా పొడుగ్గా , సన్నగా , మాధవీ లతలా వున్న ఆమె, బుగ్గలు సొట్టలు పడేలా నవ్వుతూ అతడి గుండెల్లో వెయ్యి దివ్వెలు వెలిగిస్తోంది....
    'ఇన్నాళ్ళూ రాజేశ్వరి లో ఈ అందం ఏవైంది?--' వడివడిగా ఆమెను అందుకోవాలన్నట్లుగా ఆత్రంగా పైకి అడుగులు వేశాడు.
    మెయిన్ గేటు దాటి లోపలికి వెళుతుండగా, దగ్గరిగా వచ్చి ఆమె భుజం మీద వంగుతూ, 'టిక్కెట్లు తీసుకోవద్దూ?' అన్నాడు.
    'ఇందాకనే తెప్పించాను!'
    'ఎప్పుడు - ఎక్కడ?' అని గూడా అడగకుండా ముందుకు ఆమెను అనుసరించాడు.
    మొదటి ద్వారం గుండా లోపలకు వెళ్ళి స్టేజీ కి దాపులో వున్న కుర్చీల వైపు కు నడవసాగారు.
    అప్పటికే హాలు జనంతో నిండి పోయి కిటకిట లాడుతోంది.
    ఖాళీ కుర్చీలు ఎక్కడ ఉన్నాయా అని  ఆత్రంగా వెతుక్కోసాగాడు త్యాగరాజు.
    'ఆపైన వున్నాయి-- వెళ్దాం పదండి!' అంటూ ముందుకు నడిపించింది త్యాగరాజుని, కాంతి వంతమైన కళ్ళతో.
    చల్లగా, చలి పుట్టేలా వున్న ఆ వాతావరణం లో రెండు వరసల నడుమ, కాళ్ళు ముడుచుకుంటున్న మనుష్యులను తప్పుకుంటూ ఖాళీ కుర్చీల దగ్గరకు నడిచాడు.
    ఖాళీ కుర్చీల దగ్గరకు రాగానే అటు ఎవరో స్త్రీ ఉన్నట్లుగా గమనించి రాజేశ్వరీ ని అటు కూర్చోమనబోతుంటే ఉలిక్కిపడ్డాడు.
    అక్కడ కూర్చున్నది రాణి!
    -ఉదయం తాను ఎంతో బాగుందని కొన్న నీలి ఆకాశపు రంగు చీరే లో ముడుచుకు పోయిన ఆమె తన వంకే జాలిగా చూస్తున్నది.
    ఇబ్బంది పడుతున్నట్లుగా వెనుదిరిగి రాజేశ్వరికి ఏదో చెప్పబోయాడు.
    రాజేశ్వరి సైగలతో కూర్చోమంటోంది.
    ఇంతలోనే లైట్లు డిమ్ అయ్యాయి. స్టేజి మీది తెరలు తొలుగుతున్నాయి. మైక్ లో ఎవరో ఏదో చెబుతున్నారు.....
    జనం గోల కేకలు....'కూర్చోండి... కూర్చోండి....!'
    త్యాగరాజు చటుక్కున కూర్చున్నాడు-- అంత చల్లటి వాతావరణం లోనూ పడుతున్న చెమటలను అసహనంగా జేవురుమాలుతో తుడుచుకుంటూ.....
    కూర్చున్న తరువాత ఒక్క క్షణం తీక్షణంగా ఆలోచిస్తే, ఇంత పెద్ద హాలులో రాణి పక్కనే రెండు సీట్లు ఖాళీగా వుండటం -- అందునా తమ కోసమే అన్నట్లుగా -- అతణ్ణి చకితుణ్ణి చేసింది!
    అనుమానంతో పక్కకు తిరిగి నిశితంగా రాజేశ్వరి ముఖంలోకి చూస్తె ఆమె పెదాల చివర విరుస్తున్నట్లుగా వున్న నవ్వు అసంఘటనకు ఏదో భాష్యం చెప్పింది.....
    --అతడు కొద్దిగా కష్టంగా చిన్నగా మూలిగాడు.
    పాటకచ్చేరి ప్రారంభమయింది.
    త్యాగరాజుకు పాటలు రావు!
    --అంతే గాదు పాటలన్నా, పాటలు పాడే వాళ్ళు అన్నా గూడా అంత ఆసక్తి లేదు.
    అందుకనే -- ఆ గానకచేరీ లో ముణిగిపోయిన మనుష్యుల నడుమ కూర్చొని -- అతడి ఆలోచనలతో అతడు లీనమై పోయాడు.
    అతడి చుట్టూ మేఘాలు సృష్టించుకుంటున్నాడు. అందులో అందమైనవీ, తెల్లనివీ,...హృదయం గగుర్పొడిచేలా నల్లనివి....పెద్దవి....వికృతమైనవి.....
    మేఘాలు ఎవరు ఎలా ఊహించుకుంటే వాళ్ళకు అలాగే కనిపిస్తాయి.... వాటిల్లో రాక్షసులను చూడవచ్చు.... కామధేనువు లను చూడవచ్చు.... అరణ్యాలను చూడవచ్చు.....అందాలను చూడవచ్చు....విరిగి పోయిన కోటలే కనబడితే....తళతళలాడే తాజమహలె గుర్తుకు చేసుకోవచ్చు.....
    అలాగే.....
    తడబడ్డాడు త్యాగరాజు.
    తనకు తారసపడిన వ్యక్తులూ, వాళ్ళ చేష్టలూ గూడా---తను ఏవేవో అర్ధాలు కల్పించు కున్నప్పుడు -- తనకు వాళ్ళు అలాగే కనపడ్డారు...మంచివారుగా ఊహించుకున్న వారి విషయంలో వారు చేసిన పనులు గూడా ఎంతో మంచిగానే కనబడినాయి.
    అంతదాకా ఎందుకు--
    తానె ఒక మేఘమనుకుంటే -- జీవితంలో పయనిస్తూ ఎంతోమందిని చూచాడు....అందులో మంచివారు వున్నారు ....చెడ్డవారు వున్నారు.... చూడదగ్గవారు వున్నారు.....చూడదగని వారు వున్నారు.... మేఘంగా తన కర్తవ్యమ్ ఆ వ్యక్తుల్నీ , వాళ్ళ చేష్టల్నీ చూసి చూడకుండా పోవటమే.
    వాళ్ళని ఎదుర్కొనటం అవలన గానీ, కించ పరచటం వలన గాని తాను సాధించే దేవిటి?
    తాదాప్యం చెంది ఆ ప్రశ్నకు పదేపదే గొణుక్కోసాగాడు.
    'న్యాయా న్యాయాలు నిర్ణయించే అధికారం తనకు వున్నదా?.....'
    ఆ క్షణంలో సత్యవతి వ్రాసిన పొడవైన ఉత్తరం కళ్ళ ముందు  గిరగిర తిరిగింది.
    విచలితుడయ్యాడు.
    గిలగిల లాడాడు.
    -తను తప్పుదారిన పోతున్నడా?
    సరిగ్గా ఆ సమయంలోనే--
    తన చల్లని చేతి మీద మరో చల్లని చేయి పడినట్లనిపించింది-- అతడికి.
    ఉలిక్కిపడ్డట్టుగా చూచాడు.
    ఆ చేయి వణుకుతున్నది.
    ఆ చేతికి వున్న బంగారు గాజులు వణుకుతున్నాయి.....
    ఆ చేయి ఎవరిదో ఆ వ్యక్తీ నరవరం వణుకుతున్నట్లే అనిపించింది.... తన చేయి ఆ చేతిలో బిగుసుకు పోతోంది.
    'అన్నయ్యా! అన్నయ్యా!' ... చిన్నగా చాలా చిన్నగా ఓ కంపిత కంఠం నుంచి వెలువడినాయి ఆ మాటలు.
    అతడి మనస్సు విలవిల లాడింది -- పగిలి ముక్కలయింది.
    ఎన్నాళ్ళయింది రాణి అలా పిలిచి?
    - ఓ మధుర భావన ఎన్నడో మూసుకు పోయిన హృదయకవాటాల్ని చీల్చగా, 'చెల్లీ! ' పెదాలు కదిలినాయి.
    అతడి కళ్ళ వెంట నీరు గిర్రున తిరిగింది.
    'నీ వెన్నాళ్ళయింది నన్ను అలా పిలిచి చెల్లీ?' అతడు ఆవేశపు ఉరవడి లో పదివిహీనుడయ్యాడు.
    'రాణీ....రాణీ....రాణీ!' హృదయానికి హత్తుకుందామా అనిపిస్తోంది.
    అదే సమయంలో--
    రాణికి అటువైపుగా కూర్చున్న  సుందరమూర్తి, జయరాం కళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా రాజేశ్వరి వైపుకు చూస్తున్నాయి.
    రాజేశ్వరి తేలిగ్గా ఏదో భారం తీరినట్లుగా నిట్టుర్పు విడిచింది--
    --లేకపోతె , తమ వివాహ సందర్భంలో ఎంత వద్దన్నా వినకుండా ఓ పెద్ద హోటల్లో సుందరమూర్తి ఏర్పాటు చేసిన విందుకు-- రాణి, బలవంతాన త్యాగరాజును తీసుకొని రమ్మనమని నెత్తిన రుద్దిన భారం-- తీర్చుకోలేక ఆబాసు పాలయి ఉండేది తను!

                                (అయిపోయింది)


 Previous Page

WRITERS
PUBLICATIONS