Previous Page Next Page 
మేఘమాల పేజి 22

 

    ఊరికినే తిన్నగా పోర్లుతున్నాడు.
    ఏవిటో కుడుతున్నాయి.
    దోమల యిందీ తెలియటం లేదు-- అవి ఎక్కడ వున్నట్లూ కనబడటం లేదు.
    ఒక్కొక్కసారి అవేవీ కావు అనిపిస్తోంది!
    -మనసులో తెలియని తపన!
    నిద్ర పట్టటం లేదు.
    దుప్పటిని నిలువెల్లా బిగించుకొని, బలవంతాన కళ్ళు మూసుకు పడుకున్నాడు.
    --పిచ్చి పుచ్చి ఆలోచనలు....
    ఆ అలోచనల నడుమ ....లేచిపోయిన రాణి.... ప్రమాదంలో అందవిహీన అయిన శకుంతల... ఒక కన్ను పోగొట్టుకున్న స్వామి... చచ్చిపోయిన చంద్రం.... సర్వం కోల్పోయిన సత్యవతి.... కళ్ళ ముందు గిరగిర తిరుగుతున్నారు!
    అలా ఎంతసేపయిందో అతడికే తెలియదు.
    మనిషి కదిలిన చప్పుడయింది!
    '--రాజేశ్వరి లేచింది గాబోలు!' అనుకున్నాడు. తలెత్తి చూడ్డామనిపించి గూడా బద్దకంగా అలాగే కదలకుండా పడుకున్నాడు.
    వంట యింట్లో లైటు వేసిన చప్పుడు.
    'రాజేశ్వరీ ! కాసిని మంచినీళ్ళు పట్టుకురా!' అందామనుకొని గూడా, పెద్దగా ఇంత దూరం నుండి అరవటం దేనికి, దగ్గరకు వచ్చిన తరువాత చిన్నగా  చెబుదాం లే అనుకున్నాడు.
    -ఆమె రాకకోసం ఎదురు చూడసాగాడు.
    నిజంగా రాజేశ్వరి అనుకోకుండా చాలా యిరకాటంలో పడిపోయింది....
    అక్కడ తను ఊళ్ళో చెడ్డపేరు తెచ్చుకొంటుంది.
    ఇక్కడ పరిస్థితులు అనుకూలించటం లేదు....
    -- అవును! తల్లి బాధపడటం లో ఎలాంటి అసహజత్వమూ లేదు!
    'పెళ్ళి కాని ఆమె ఇలా ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ పరాయి మనుష్యుల దగ్గిర ఉంటె ఎవరైనా అలాగే అనుకుంటారు!
    కాని, తను పవిత్రత వారికెలా తెలుస్తుంది?
    నిజం!
    ఇంకా రాజేశ్వరి వంట యింట్లోంచి రాలేదు.
    -- అక్కడ లైటు గూడా అర్పినట్లు లేదు!
    "ఏం చేస్తున్నదబ్బా!' అనుకుంటూ నిండా కప్పుకున్న దుప్పటి ని తొలగించి ఆ వంట గది వైపుకు చూచాడు.
    లోపల లైటు వేలుగుతుండగా , తలుపు దగ్గరకు వేసి వున్నది....
    తల పక్కకు తిప్పి ఆమె పడుకున్న చాప వైపు చూచాడు.
    అతడికి ఆశ్చర్యానికి అంతులేదు.
    రాజేశ్వరి అక్కడే వున్నది!
    సత్యవతి చాప వెక్కిరిస్తున్నట్లుగా ఖాళీగా కనబడింది.
    విచిత్రంగా అ వైపుకు చూస్తూ లేచి కూర్చున్నాడు.
    వంట యింటిలో నుండి ఏదో సన్నని శబ్దం ...డబ్బాలు కదిలిస్తున్నట్లు..... దేనికోసమో వెతుకుతున్నట్లు.....
    అర్ధం కాలేదు!
    -సత్యవతి ఏం చేస్తున్నది లోపల?
    త్యాగరాజు ను ఏదో అనుమానం అవరించగా భయంతో ఊగిపోయాడు.
    ఇక తాత్సారం చేయడానికి వీల్లెదన్నట్టుగా , కాళ్ళు తడబడుతుండగా లేచాడు.
    రాజేశ్వరిని లేపటానికా అన్నట్లుగా అటు వైపు అడుగులు వేశాడు గాని, మరల మనస్సు మార్చుకున్నట్లుగా వంట యింటి వైపే వడివడిగా అడుగులు వేశాడు.
    -మరే ఆలోచనా లేకుండా బిగుసుకు పోయి , భయంకరమైన ఆలోచనలకూ మత్తును కలిపి త్రాగుతూ దగ్గరకు వేసి వున్న తలుపులను ఒక్క ఉదుటున లోపలికి నెట్టాడు....
    అక్కడి దృశ్యాన్ని చూస్తూనే అప్రతిభుడయ్యాడు త్యాగరాజు.
    'సత్యవతీ!' పెద్దగా , పిచ్చిగా అరిచాడు.
    త్యాగరాజును చూస్తూనే సత్యవతి మొఖం నల్లబడి పోయింది.
    భయంతో గిలగిల లాడింది.
    ఓ చేతిలో వున్న కిరసనాయిల్ సీసా నూ, మరో చేతిలో వున్న అగ్గిపెట్టెను అలాగే జారవిడిచింది.-- పెద్ద శబ్ధమయ్యేలా....
    -మొఖాన్ని చేతులతో కప్పుకొని ముందుకు పడిపోయి వెక్కివెక్కి ఏడ్వసాగింది!
    
                           *    *    *    *
    ఉదయం పదకొండు గంటలప్పుడు త్యాగరాజు, రాజేశ్వరి శకుంతల వాళ్ళింటికి వెళ్ళారు.
    ఆ క్రితం రోజే శకుంతల హాస్పిటల్ నుండి -- అందరూ ఎంత వద్దన్నా వినకుండా పోరాడి ఇంటికి వచ్చేసింది.
    శరీరం మీద కాలిన చోట మంటలయితే కొద్దిగా తగ్గినయి గాని పుండ్లు ఏమాత్రమూ తగ్గలేదు.
    -- ఒక విధంగా ఇంకా లేచి తిరగటం లేదు గూడా!
    హాస్పిటల్లో పడుకున్నట్లే ఇంట్లోనూ పడుకొని వున్నది.
    త్యాగరాజునూ, రాజేశ్వరీ ని చూస్తూనే సాదరంగా ఆహ్వానిస్తూ పక్క మీద నుండి లేవబోయింది గాని, 'పడుకో లేవబోకు!" అన్నాడు త్యాగరాజు.
    శకుంతల తల్లిని పిలిచింది.
    'అమ్మా! కుర్చీలు ఇలా పట్టుకురా!
    'నీకెలా వున్నది శకుంతలా!' అడిగింది రాజేశ్వరి.
    -ఆమె ముఖంలో కొట్టోచ్చినట్లుగా కనబడుతున్న నూతనత్వం శకుంతలకు వింత గొలిపింది. ఒక్క క్షణం ఆమెను పరిశీలనగా చూస్తె అది ఏవిటో అర్ధమయింది.
    'మీరిద్దరూ నా అభినందనలు స్వీకరించండి!'
    'కృతజ్ఞులం!' యిద్దరూ ఒకేసారి అన్నారు.
    'ఆ మాటతోనే సరిపోదు.... ఈరోజున నేను చెప్పినట్లుగా చేయాలి.... మా యింట్లో ఆతిధ్యం స్వీకరించాలి!' అన్నది శకుంతల చిన్నగా నవ్వుతూ.
    రాజేశ్వరి జాలిగా శకుంతల మొఖం లోకి చూచింది.
    'నీవు ఇలా ఉండగానేనా?'
    'ఏం....ఇంకెలా వుండాలి నేను... ఏం ఫరవాలేదు... మీరు కాదూ అనగూడదు!'
    'వద్దు రాజేశ్వరీ? .... మరో రోజు తప్పకుండా వస్తాం....నిన్ను మొదటిరోజు ఆసుపత్రి లో చూడటమే తప్ప నేను మళ్ళీ రాలేదు.... ఇంటికి వచ్చావు ఎలా వున్నావో చూచి వెళ్దామని ....ఆయన్ను తీసుకొని వచ్చాను!' అన్నది అనునయంగా. 'అందునా దేవాలయం నుండి ఇటు నుండి ఇటే వచ్చాం!'
    'దేవాలయానికి వచ్చారా?'
    రాజేశ్వరి సిగ్గు పడింది.
    మొఖం ఎర్రబడగా 'ఒక గంట క్రితమే మా వివాహ మయింది!' అన్నది.
    ఆమె తల వంగిపోయింది. చిరుదరహాసం పెదాలను ఆక్రమించుకున్నది.
    'దంపతులయి మొట్టమొదటి సారిగా మా యింటి కొచ్చేరన్నమాట!..... నాకు చాలా సంతోషంగా వున్నది!' హృదయ పూర్వకంగా అన్నది ఆ మాటలను శకుంతల.
    ఓ పావుగంట తరువాత రాజేశ్వరి అక్కడే వుండగా వంట యింటి వైపుకు వెళ్ళి గడప పక్కగా పీత వాల్చుకు కూర్చుంటూ, 'బాగున్నారా, అమ్మా!' అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా శకుంతల తల్లిని.
    ఆమె ఎన్నో చెప్పుకున్నది. అలా చెప్పుకుంటున్నప్పుడు చాలా మాటలకు కంటి వెంట కన్నీరు గూడా కార్చుకొన్నది.
    త్యాగరాజు ఆమెకు ఎంతగానో ధైర్యం చెప్పాడు.
    'నేను ఇక్కడే ఉద్యోగంలో జేరాను.... అంతేగాదు , ఇక్కడే నా స్థిర నివాసం గూడా ఏర్పరుచుకోవాలను కుంటున్నాను.... మీకే అవసరమొచ్చినా , కాకితో కబురంపినా క్షణాల మీద వచ్చి మీ ముందు వాలుతాను..... మీరు ఏ విషయానికీ భయపడనక్కర లేదు!' అంటూ అభయహస్తమిచ్చాడు.
    వాళ్ళింటి నుండి బయల్దేరేటప్పటికి సరిగ్గా పన్నెండు గంటలయింది.
    'ఇప్పుడు భోజనం చేయకుండా వెళ్ళటం నాకేం బాగోలేదు!' అన్నది శకుంతల కష్టంగా.
    'పొద్దున్నే అన్నీ తయారు చేసుకు పెట్టుకు వచ్చాం.... పాడాయి పోతాయి గదా! తరువాత మరోసారి తప్పకుండా వస్తాం....నీఅరోగ్యం కోలుకొని ఉద్యోగంలో జేరిన మరునాడు నీవు కబురుచేయి!' అన్నది రాజేశ్వరి.
    'మీయిష్టం!' అన్నది నిష్టూరంగానే శంకుంతల. రాజేశ్వరి నవ్వేసి బయట కొచ్చింది.
    ఆమె వెనుకనే 'వస్తాం శకుంతలా!' అంటూ బయట కొచ్చాడు త్యాగరాజు.
    ఇద్దరూ ఆ యింటి ముందు చిన్న మురికి కాలవ మీద వేసిన నాపరాతిని దాటి రోడ్డెక్కారు.
    ముచ్చటగా ఆ నూతన దంపతులు అలా రోడ్డు వెంట నడుస్తుంటే - శకుంతల బోర్లా పడుకొని మోచేతుల మీద తలను పెట్టుకొని కిటికీ లో నుండి ----ఆనందమూ, నిరాశా నిండిన తడి కళ్ళతో చూడసాగింది.
    పోతూ పోతూ త్యాగరాజు ఒక్కసారి ఆ కిటికీ లో నుండి ---ఓడిపోయి బందీ అయిన మహారాజ్ఞి లా వున్న శకుంతలను చూచి విచలితుడయ్యాడు.
    బరువుగా వో నిట్టుర్పు విడిచాడు.
    'ఈరోజున స్వామిని మన యింటికి విందుకు పిలుచుకు వెళ్దామనుకున్నాం.... గుర్తున్నదా?' అడిగాడు రాజేశ్వరి కళ్ళల్లోకి చూస్తూ-- యిరుగ్గా వున్న రిక్షాలో తలవంచుకు కూర్చున్నారు యిద్దరూ.
    రాజేశ్వరికి అలా అతని పక్కన ఒదిగి కూర్చోవటం ఓ వింత అనుభూతి.
    ఆమె మనస్సు ఆనంద పారవశ్యంతో ఆకాశ వీధుల్లో అందాలు చిమ్మే తెల్లని మేఘంలా పరుగెడుతుంది.
    'గుర్తున్నది!' అన్నది సగం కళ్ళు మూసుకొని-- ఈరోజున ఆమె కంఠం చాలా హుందాగా వున్నదనిపిస్తోంది.
    'హోటల్ కు వెళ్ళి పిలుచుకు వెళ్దాం!
    రాజేశ్వరి రిక్షాలోనే కూర్చోబెట్టి హోటల్లోకి వెళ్ళాడు త్యాగరాజు.
    స్వామికి ఆఫ్ అయితే ఓ మూల చీకటి గదిలో పడుకొని నిద్రపోతున్నాడు.
    అతడికి అసలు విషయం చెప్పి వెంటనే బయల్దేరమన్నాడు త్యాగరాజు.
    'రాజేశ్వరి వాకిట్లో రిక్షాలో కూర్చొని ఉన్నది!' అన్నాడు తొందర చేస్తూ.
    'అయితే మీరు ముందు వెళుతూ వుండండి.... నేను వెనకాలే ఓ పది నిముషాల్లో సైకిల్ మీద వస్తాను!
    త్యాగరాజు బయటకు వచ్చి రిక్షా ఎక్కాడు.
    'స్వామి లేడా?'
    'వస్తానన్నాడు ఓ పది నిముషాల్లో!'
    రిక్షా రేయ్ మంటూ నున్నటి సీమెంటు రోడ్డు మీద పారాడసాగింది.
    పల్లం లోకి పోతున్నప్పుడు ఒళ్ళు జలదరించగా చటుక్కున త్యాగరాజు చేతిని పట్టుకున్నది రాజేశ్వరి.
    ఆమెను అర్ధం చేసుకున్నట్లుగా త్యాగరాజు, చ'చిన్నగా పోనివ్వమని చెప్పేదా!' అడిగాడు.
    'అక్కరలేదు....పక్కన మీరుండగా భయం దేనికి?' అన్నది తన్మయత్వంగా అతడి ముఖంలోకి చూస్తూ.
    వో నిముషం  తరువాత, 'ఇప్పుడు మీ జేబులో డబ్బెంత వున్నది?'  అని అడిగింది -- రోడ్డు పక్కన వున్న దుకాణాల వంక తదేకంగా చూస్తూ.
    'రెండు వందల పైన వుండవచ్చు!' అన్నాడు. తిరిగి ఆత్రంగా , 'దేనికి?' అని అడిగాడు ఆమె ముఖంలోకి చూస్తూ.
    'నాదో కోరిక మన్నిస్తారా?' తలవంచుకొని అడిగింది.
    ఒక్క క్షణం తటపటాయిస్తున్నట్లుగా ఆగి, 'ఈరోజు ఉదయం నుండి నాకంటూ ప్రత్యేకంగా ఏవీ లేదు. ఉన్నవన్నీ మనిద్దరివీను..... ఈ డబ్బును ఖర్చు పెడదాం అనుకోవటం.... మన డబ్బును ఖర్చు పెడదాం అనుకోవటమే-- అటువంటప్పుడు ప్రత్యేకంగా నీవు కోరటం , నేను తీర్చటం అనేది ఏవీ వుండదు!' అన్నాడు.
    'కృతజ్ఞురాలీని!' అన్నది కళ్ళు ఆనందంతో మెరుస్తుండగా.
    'ఇంతకీ అలా ఎందు కడిగావో చెప్పనే లేదు!' అన్నాడు ఆసక్తి తో. 'ఏవైనా కొనాలా....రిక్షా అపించేదా?....'
    'అవును.... వో పెద్ద గుడ్డల షాపు ముందు ఆపించండి!'
    రిక్షావాడికి ఆ మాట చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS