"అదేవిటిరా , భోజనం చేసి వెళ్ళు!' జానకి వెంటపడింది.
"శాంత కిచ్చివస్తానక్కా! శారద ఇంటికే కదూ వెళ్ళింది?"
"అవును గాని, తిండి తిని పోరా?"
"ఇప్పుడే తిరిగి రానూ?" ప్రకాశం పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడక సాగించేడు.
వీధి చావిట్లో నే శారద తల్లి కనిపించింది.
"మా శాంతా ఉందా? ఓసారి పిలుస్తారా ?" అన్నాడు ప్రకాశం వినయంగా.
"శాంతా? ,మా ఇంటికి రాలేదే. మా శారద కూడా భోజనం చేసి రుక్మిణి ఇంటికి వెళ్ళింది." అన్నదామె.
ఆవిడ మాట విని ప్రకాశం తెల్లబోయేడు. శారద భోజనానికి రమ్మన్నదని శాంత చెప్తే, ఈవిడ శారద భోజానం చేసి వవెళ్ళిందంటుందేమిటి? అనుకొన్నాడు. శారదను కలుసుకొని మాట్లాడితే తెలుస్తుందన్న ఉద్దేశంతో , రుక్మిణి ఇంటి అడ్రసు తెలుసుకొని అటు వెళ్ళేడు. ప్రకాశం అక్కడికి వెళ్లేసరికి శారద రుక్మిణి , మాట్నీ ని వెళ్ళేరని తెలిసింది. వాళ్ళలో శాంత ఉన్నదీ లేనిదీ ఆ ఇంటి వాళ్ళకు తెలియదు.
వెనుతిరిగి ఇంటికి పోవాలనుకొన్న ప్రకాశం మనసు మార్చుకొని సినిమా హాలు వైపు వెళ్ళేడు. పన్నెండు గంటల అట పూర్తయెందుకు టైమున్నది. పక్కనున్న కాఫీ హోటల్లో కాఫీ తాగి, బయలుదేరి వచ్చేడు. కాస్త సేపు అటు ఇటు తిరిగేసరికి హాలు లోపలి నుండి జనం రావడం మొదలు పెట్టేరు. గేటు పక్కగా నిల్చి వస్తున్న వాళ్ళందరి ని చూస్తున్నాడు ప్రకాశం. శారద రుక్మిణి చేతులు పట్టుకు నడిచి వస్తున్నారు.
"మా శాంత మీతో రాలేదా?' ప్రకాశం శారదను ప్రశ్నించేడు.
"లేదండి! ఈరోజు సినిమాకి వెళ్దాం రమ్మని నిన్న పిలిస్తే, మీ బంధువుల ఇంట ఏవో శుభకార్యం ఉందిట కదూ? అక్కడికి వెళ్ళాలని చెప్పింది?" అన్నది శారద.
ఉదయం నుండి తిండి లేకుండా తిరుగుతున్న ప్రకాశానికి ముఖం తిరిగినట్లయింది. కాస్త సేపు అక్కడ ఉన్న గట్టు మీద కూర్చుని లేచాడు. సినిమాకు వచ్చిన వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయేరు . కొద్ది నిమిషాలకు ముందు మనుష్యులతో కిక్కిరిసి ఉన్న స్థలం కాళీగా విశాలంగా ఉంది.
ఆరోజు ప్రకాశం ఎంత ఉత్సాహంగా లేచాడో, అంత చికాకుగా తయారయింది. శాంతకు కొన్న చీర అందివ్వలేక పోయేనన్న ఆరాటం ఒక పక్క, శారద ఇంటికి వెళ్తున్నానని అబద్దం చెప్పి శాంత ఎక్కడికి వెళ్ళిందనే అనుమానం ఇంకొక పక్క ప్రకాశాన్ని ఊదరగొట్టేయి.
ఇంక, అప్పుడు ఇంటికి వెళ్ళబుద్ది కాలేదు ప్రకాశానికి. శాంత కన్న ముందు తను వెళ్తే ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి రాద్దాంతం చేసే అన్నయ్య దాని మీద మరో ఫార్సు లేవదీస్తాడు. కాస్త సేపు కొట్లో కూర్చుని పొతే శాంత అప్పటికి ఇల్లు చేరుకొంటుంది. తను వివరాలు చెప్పవలసిన అవసరం ఉండదు-- అనుకొన్నాడు.
ఏదో పుస్తకం చూస్తూ బల్ల మీద పడుకొన్న ప్రకాశానికి కళ్ళు బరువెక్కి నిద్ర ముంచుకు వచ్చింది. తెలివి వచ్చి చూసేసరికి, వీధుల్లోంచి ఎండ తప్పుకొన్నది. కొట్టుకు తాళం వేసి ఇంటికి బయలుదేరాడు.
పార్కులో జనం పలచగా పలచగా ఉన్నారు. ఇంకొక గంట పొతే ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా పోగులు పోసినట్లుంటారు మనుష్యులు. రెడియో లో ఖాజీ భాయి కార్యక్రమం వస్తున్నది. ప్రకాశానికి దేశభక్తి గేయాలంటే చాలా ఇష్టం. పార్కులోకి వెళ్ళి ఒక బెంచి మీద కూర్చుని ఆసక్తిగా పాటలు వింటున్నాడు . శాంత కోసం, అప్పుడప్పుడు ఆ తోటమాలికి పది పైసలిచ్చి, యేవో నాలుగు పువ్వులు తీసుకుంటుండడం అతనికి అలవాటు. తోటమాలి కోసం ఇటు అటు చూస్తున్న ప్రకాశం చూపులు అకస్మాత్తుగా ఓకే దగ్గర ఆగిపోయేయి.
"అవును శాంతే" మెదడు మేలుకోల్పింది.
మెల్లిగా అడుగులు వేసుకుంటూ అటువైపు నడిచేడు. గుబురుగా పెరిగిన సంపంగి చెట్టును అనుకోని కూర్చున్నది శాంత. చేతిలోని రుమాలును విలాసంగా గాలిలో తిప్పుతూ, ఉత్సాహంగా మాట్లాడుతున్నది. పది గజాల దూరానికే ఖరీదైన సెంటు వాసన సన్నగా పరిమళిస్తున్నది.
పలుచని , ఎర్రని పెదవులు, చెంపలు తాకే కళ్ళు, గాలికి ఎగిరెగిరి పడుతున్న ముంగురులు, ఆ మెర్క్యురీ లైట్ల కాంతి లో మిలమిల మెరుస్తున్న శరీరం.... ఎవరి దృష్టి నైనా ఇట్టే ఆకట్టుకొనే రూపుతో ఉన్నది శాంత. ఆనాటి ఆమె కళ్ళలోని మెరుపు ప్రకాశం ఏనాడూ చూడలేదు.
"మా శాంత ఇంత చక్కనిదా!" అనుకొన్నాడు ఆశ్చర్యంగా.
పక్కవాటుగా వస్తున్న ప్రకాశానికి శాంత చేతుల్ని పెనవేసుకున్న మరి రెండు చేతులు కనిపించేయి. ఆమె మాటలో, మాట కలిపి నవ్వుతున్న మరొక కంఠం వినిపించింది.
"ఎవరది? ఎవరది?' ప్రకాశం లోని సనాతన హైందవ రక్తం ఉరకలు పెట్టింది. శరీరం లోని కండరాలన్నీ బిగదీసు కొన్నాయి. గొంతుకలో కోపం గురగురలాడింది.
అదంతా క్షణం మాత్రమే. మరుక్షణం లో ప్రకాశం తన నిజ స్థితికి వచ్చేడు. ఆరోజు, వెనుదిరిగి తనతో మాట్లాడుతున్న అక్క భుజం మీద గోవిందబాబు చెయ్యి వేసి, "పద, జానకి" అన్నప్పుడు తనలో రాని భావన , ఈరోజు శాంత చేతులతో మరి రెండు పురుష హస్తాలు కలిసి ఉంటె ఎందుకు వచ్చింది? అనుకొన్నాడు. అది అక్క, శాంత ల మధ్య ఉన్న వ్యత్యాసంవల్లనా? పరిసరాలు పరిస్థితుల ప్రాబల్యం వల్లనా? అని ప్రశ్నించుకొన్నాడు.
ఎదుట పడిన ప్రకాశాన్ని చూసి, శాంత తత్తర పాటుగా లేచి, నించుంది. ఆ వ్యక్తీ రెండడుగులు వెనక్కు వేసేడు.
"ఈయన.... ఈయన....' శాంత ఏదో చెప్పబోయి తడబడింది.
"ఎవరో స్నేహితులై ఉంటారు." ప్రకాశం మాట అందిచ్చేడు.
"అవునండి.... అవునండి... మీరు సరిగ్గా గ్రహించేరు. శాంతాదేవికి, నాకూ చాలా స్నేహమండి! నేను చిన్నప్పటి నుంచి ఒకే స్కూలులో కలిసి చదువుకొంటున్నామండి.... నాలుగో క్లాసో... అయిదో క్లాసో.... సరిగా జ్ఞాపకం లేదు. అప్పటి నుండి.... అంతేకదండీ, శాంతాదేవీ?"
'అవునవును....అంతే.... అంతేనండి...." శాంత ముఖాన్ని రుమాలుతో తుడుచుకుంటూ అన్నది.
ప్రకాశం వారిద్దర్నీ చూసి ఫక్కున నవ్వేడు. ఇద్దరూ భయం, భయంగా ప్రకాశం వైపు చూసేరు.
"నాలుగో క్లాసు నుండి కలిసి చదువుకొంటున్న ఆప్తమిత్రులు, అండి...గిండీ ....అని పిలుచుకుంటారుటండీ? అ. మీరేమిటో నాకు తెలియదు గాని, మిస్టర్" అన్నాడు.
"మా పేరాండీ ? సుదర్శనం."
"నా పేరు ప్రకాశం. శాంత అన్నని. మీరు కాస్త తీరుబడి గా ఉంటె, ఇలా కూర్చోండి. మా శాంత మిత్రులతో స్నేహం చేసుకోడం నాకు చాలా ఇష్టం. కాస్త సేపు ముగ్గురం సరదాగా మాట్లాడుకొందాం." అన్నాడు ప్రకాశం.
సుదర్శనం తన రిస్టు వాచీ వైపు చూసుకొన్నాడు.
"లేదండీ నేను స్టేషనుకి వెళ్ళాలి. మా అమ్మా వాళ్ళూ వస్తున్నారు. మళ్ళా కలుద్దాం. నమస్కారం." అంటూ పరుగు అందుకొన్నాడు.
ఆ వ్యక్తీ కనుచూపు దూరం పోయే వరకు ఆటే చూసేడు ప్రకాశం.
"శాంతా! ఏమిటీ నాటకం?" అన్నాడు కోపంగా.
"అది కాదు అన్నయ్యా! సుదర్శనం గారు చాలా మంచివారు, అన్నయ్యా! తన క్లాసులో ఎప్పుడూ ఆయనదే ఫస్టు మార్కు. చాలా తెలివైనవారు. ఈ బియస్సీ అయిపోగానే మద్రాసు వెళ్ళి ఇంజనీరింగు చదువుతారుట."
శాంత మాటల మీద ప్రకాశానికి నమ్మకం కుదరలేదు. అసలు ఆ మనిషి గురించి శాంతకు కూడా అంతగా తెలియదనిపించింది. అతని వేషధారణ చూస్తె కాలేజీ స్టూడెంట్ అన్న భావం కలుగలేదు ప్రకాశానికి. ఫస్ట్ ఇయర్ బి.యస్. సి లో ఉన్న శాంతకు అతడు ఏ విధంగాను క్లాసు మేట్ కాలేడని నిర్ధారించుకొన్నాడు.
మనిషి వేషం చూస్తె కాస్త డబ్బు , దస్కం ఉన్న వాడిలాగే పైకి కనిపిస్తున్నాడు. ఉంటె ఉండచ్చు కూడా. దానితోనే శాంతను తన వైపుకి లాక్కొని ఉంటాడు. రెండు, మూడు సార్లు మంచి హోటలుకు తీసుకెళ్ళి కాఫీ టిఫిను తినిపిస్తే, హైక్లాసు టిక్కెట్టు తీసుకొని ఒకటి రెండు సినిమాలు చూపిస్తే శాంత లాటి పిల్లలు పొంగిపోతారు. చిన్న చిన్న ప్రజంట్లు కూడా కొనిచ్చి ఉండచ్చు. మరింకేం? సుదర్శనం గారంత మంచివాళ్ళు మరి ఈ ప్రపంచంలో కనిపించరనే భావం కుదిరి ఉంటుంది శాంతకు - అనుకొన్నాడు ప్రకాశం.
మరునాడు శాంత ఇంట్లో లేనప్పుడు ఆమె పెట్టె మారు తాళంతో తెరిచి చూసేడు. రెండు సిల్కు రుమాళ్ళు. ముందు రోజు శాంత రాసుకున్న లాటి సెంటు బాటిలు, ఇంకా అందమైన తలపిన్నులు , ఏవో ఇటువంటి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. గ్రంధం చాలావరకు సాగినట్లే అనిపించింది ప్రకాశానికి. ఈ పరిచయం నిన్న మొన్నటిది కాక, బాగా వెళ్ళు నాటుకున్నదిలా కనిపిస్తున్నది అనుకొన్నాడు.
కాలేజీ కి పోయి ఆ పిల్లాడిని గురించి, శాంత చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో కనుక్కు రావాలని బయలుదేరేడు. ఆ పిల్లాడికి శాంత పట్ల నిజమైనా ప్రేమ ఉంటె అన్నయ్యతో చెప్పి, పెళ్ళి ప్రయత్నాలు చేయించాలనుకొన్నాడు.
కాలేజీకి వెళ్ళి బి.ఎస్.సి అన్ని సబ్జెక్టు లలో ఉన్న పిల్లల గురించి వాకబు చేసేడు. ఆ పిల్లలతో సుదర్శనం అన్న పేరు గల కుర్రాడు ఒకడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆ పిల్లాడిని అట్టే శ్రమ లేకుండానే కలుసుకొన్నాడు ప్రకాశం. ముందురోజు శాంతతో పాటు ఉన్న వ్యక్తీ అతడు కాదు. "సుదర్శనం పేరుతొ నేను తప్ప ఇంకెవరూ లేరండీ' అన్నాడు.
భయంకొద్దీ తనతో తప్పు పేరు చెప్పెడెమో అని, ఆ కుర్రాడి రూపు రేఖలు వర్ణించి , ఈ పోలికలతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని చాలామందిని ప్రశ్నించేడు. మాకు తెలిసినంత మట్టుకు ఎవరూ లేరు-- అని సమాధానం చెప్పేరు విద్యార్ధులు.
ఆ రాత్రి శాంతను చాటుగా పిలిచి చీవాట్లు పెట్టేడు. వాడితో ఎటువంటి సంబంధం పెట్టుకో వద్దని హెచ్చరించేడు. ఇంకోసారి నిన్నటి లా మీ ఇద్దరూ కలిసి కనుపిస్తే , ఇంట్లో అందరితో చెప్పేస్తానని బెదిరించాడు.
"లేదన్నయ్యా! అయన అలాటి వారు కాదన్నయ్యా! నువ్వు పొరపాటుగా విని ఉంటావు!" శాంత ఇంకా పెనుగులాడుతున్నది.
"ఇది నా పొరపాటు కాని, నీ గ్రహపాటు గాని ఇక మీదట ఆ కుర్రాడితో నీ కెటువంటి సంబంధం ఉండిందికి వీలులేదు. నువ్వు అతన్ని తిరిగి కలుసుకునే ప్రయత్నం చెయ్యకూడదు . తెలిసిందా?" అన్నాడు.
ఎప్పుడూ బఫూను లా యేవో ఒకటి వాగుతూ ఇంట్లో తిరుగుతుండే అన్నయ్య, ఇంత పరుషంగా మాట్లాడగలడనీ , ఇంత కఠినంగా శాసించగలడనీ శాంత ఎప్పుడూ అనుకోలేదు. ఆమె ఆశ్చర్యం నుంచి కోలుకొని చూసేసరికి ప్రకాశం అక్కడ లేడు'.
