"కొందరి జీవనరాగాలూ అంతే.
"వస్తుత! మంచివారైనా పరిస్థితుల ప్రాబల్యంతో చెడ్డపేరు తెచ్చుకొనే రూపవంటివాడు కొల్లలు. వారి జీవన సంగీతంలో అపశ్రుతి కల్పించిన పరిస్థితులూ, పరిసరాలూ ఎలాంటివో పరిశీలిస్తే అసహ్య తిరస్కారాలకిబదులు శ్రద్ధ, సానుభూతి కలుగుతాయి. చీమకు కూడా హాని తలపెట్టని కోమలహృదయ రూప. ఈనాడు ఒకరికి జన్మశత్రువుగా భావింపబడుతున్న దంటే ఆమెను వంచించిన పరిస్థితులేవో చూడండి. ఒక ఉత్తమ పురుషుడికి ఇల్లాలై పండంటి బిడ్డను కని పూలబాట కావలసిన జీవితం సర్వనాశనమై పోయి పతితగా నిలబడవలసి వచ్చింది, విధి వైపరీత్యంవల్ల! మాతృస్థానం అలంకరించి కూడా ఆమె ఆ ఆనందాని కైనా నోచుకోకుండా దగాపడింది. ఆమె విషాద జీవితంలో ఆశలన్నీ అంతరించిపోయినా, బాబును తిరిగి చూచింది మొదలు మమత చివురులెత్తింది. బాబును తిరిగి తీసుకోకుండా ఉండలేకపోయింది. తన వస్తువును తాను తీసుకొంటున్నానన్న ధ్యాసే గాని అందువల్ల ఒకరి జీవితం అంధకారమవుతుందని ఆలోచించలేదు.
"బాబును శాశ్వతంగా కోల్పోయి పిచ్చిదైపోయింది. ఉద్యోగం పోయి ఊరు చేరింది. కిషన్ కుటీరం వదిలేది కాదు. ఏముంది అక్కడ? కిషన్ ఉన్నప్పుడు చూచిన వారు ఇప్పుడు చూస్తే కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. అతడు నివసించిన కుటీరం శిథిలమైపోయింది. అతడు పెంచిన తోట పాడుపడింది. అతడు సాకిన జింకలూ, పావురాలూ ఎక్కడికో పోయాయి. రూప ఎప్పుడూ అక్కడే పడి ఉండేది. ఇంటికి రమ్మని ఎవరు బలవంతం చేసినా లాభం లేకపోయింది. తిట్టి బెదిరించబోతే బాబును, బాబు తండ్రిని తలుచుకొని రాగాలు పెట్టి ఏడ్చేది. గుట్టుగా మాసిపోతుందనుకొన్న కథ అంతా లోకానికి తెలిసిపోయింది. లోకంతోపాటు తల్లిదండ్రులూ అసహ్యించుకొన్నారు. కూతురు చచ్చినా, బ్రతికినా సమానమే వారికి. అంతా తెలిసినా అన్నగారు మాత్రం చెల్లెల్ని దూరం చేసుకోలేకపోయారు. కిషన్ కుటీరం బాగుచేయించి, అందులో తిరిగి తోట వేయించి చెల్లెలు అక్కడ ఉండడానికి సర్వసౌఖ్యాలు కల్పించారు. సదా ఒక దాసినీ, నౌకరునూ ఉంచారు. ఉదయం, సాయంకాలం నేనో, ఆయనో వెళ్ళి చూసేవారం. పక్షులతో, చెట్లతో మాట్లాడుతూ పాములకోసం తిరుగుతూ పూర్తిగా పిచ్చిలోకంలో పడిపోయింది. కిషన్ మరణంతో ప్రారంభమైన మూర్చలు తరచుగా వచ్చేవి. ఆమె ఆరోగ్యంకోసం ఒక డాక్టర్ని కుదిర్చారు ఆయన. పురిటికి వస్తూ నాతో తీసుకువచ్చాను. అదీ, బలవంతాన్నే. ఎప్పుడో కన్నుగప్పి అడివిదారి పడుతుంది. ఏంచెయ్యం, డాక్టరుగారూ? కంటిపాపవలె ఎంత జాగ్రత్తగా కాపాడుకొంటున్నా నీ క్షణంలో మాకంటి ముందునుండి అంతర్ధానమవుతుందోనని బెంగటిల్లి పోతున్నాం. చెల్లెలు ఒక ఇంటిదై పిల్లా పాపలతో కలకలలాడే దినం చూడాలనుకొన్న ఆయన ఆశలు ఏనాడో గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు పిచ్చిదైనా ఏమైనా చెల్లెలు కళ్ళముందు ఉంటే చాలునని తాపత్రయపడుతున్నారు. దైవం ఎలా చూస్తాడో తెలియదు."
కల్యాణ్ ఒక నిట్టూర్పు విడిచి, అన్నాడు: "నాలో రెండుగంటల సంఘర్షణ జరిగాక మనిషిగా నా కర్తవ్యం నెరవేర్చ నిశ్చయించాను. 'మనిషి పాపపుణ్యాలకు దండన సత్కారాలు ఇవ్వవలసింది మనిషి కాదు. అందుకు అంతర్యామి ఉన్నాడు' అన్న భావంతో తిరిగివచ్చాను......రఘు వస్తూండాలి ఈపాటికి."
అంటూ ఉండగానే ఇంటిముందు కారు ఆగింది. డాక్టర్ ఆనంద్ తో లోనికి వచ్చిన రఘు, కళ్యాణ్ ను చూచి విస్మయం పొందాడు.
ఆనంద్ రఘుకు స్నేహితుడేకాదు; కల్యాణ్ తో కూడా మంచి పరిచయం ఉన్నవాడు. కళ్యాణ్ తో కరచాలనం చేసి "నువ్వు ఇక్కడ ఉండే నన్ను రప్పించావేం?" అన్నాడు.
కళ్యాణ్ ఇబ్బంది తొలగిస్తూ, నవ్వుతూ అంది రత్న: "వారు సమయానికి ఇక్కడ లేరు. మీకోసం రావలసి వచ్చింది. వస్తే ఏమైంది లెండి? ఈరోజు మా అతిథ్యంలో గడిపి మరీ వెళ్ళండి."
"మీరు కొంచెం నాతో రండి." కళ్యాణ్ రత్నను పిలిచి గది బయటికి వచ్చాడు. "ఇలాంటి పరిస్థితిలో ఆమెకు నేను కనిపించడం మంచిదికాదు. నన్ను చూస్తే ఆమెకు బాబు స్మృతి బలీయం కావచ్చు. కాంపౌండర్ ను పంపించి ఆమె పరిస్థితి తెలుసుకుంటూ మందులు మారుస్తుంటాను,"
ఇంకా విస్మయంనుండి తేరుకోక అక్కడికి వచ్చిన రఘు భుజంతట్టి "భయపడేదేమీలేదు, మిస్టర్ రఘూ! పట్టి జ్వరం. తగ్గిపోతుంది. కంగారు పడవద్దు" అన్నాడు ధైర్యం ఇస్తూ.
రఘు రత్నల కృతజ్ఞతావందనాలు అందుకొని వెళ్ళిపోయాడు కళ్యాణ్.
14
ఆస్తాద్రిని అలంకరించబోతూన్న సూర్యభగవాను నికి వీడ్కోలిస్తూన్న ప్రకృతి కన్య కపోలాలు సిగ్గుతో ఎర్రబడ్డాయి.
కొలను నీటిలో సుందరంగా ప్రతిఫలిస్తూన్న అరుణరాగం కలవచెలుల చెక్కిలిపై కొంటెగా చిటిక వేసి క్రమంగా కరిగిపోతూన్నది.
కొలనునీటిలో తను ప్రతిబింబాలు చూచు కొంటూన్న తాళవృక్షాలు నలుదిక్కులనుండి కమ్ముకువస్తూన్న తమస్సులో అదృశ్యములవుతూన్నాయి.
రేకులు నిచ్చిన కలవలేమలు వేయి కన్నులతో వెదుకుకొంటున్నాయి, అంబరంలోని అందాలరాయని కోసం, క్రమంగా దట్టంగా కమ్ముకువస్తూన్న నీలిమొయిళ్ళు కంచలకు కాంతుని దర్శనం కానియ్యడం లేదు; విరహంతో ఉసూరుమంటున్నాయి.
దూరంగా అస్పష్టంగా గోచరమౌతూన్న నీలికొండ లలో తటిల్లత త్రుటికాలం గోచరమౌతూన్న నీలికొండ లలో తటిల్లత త్రుటికాలం తళుక్కుమని మాయమైంది. అప్పుడప్పుడు గర్జిస్తూన్నది శ్రావణ మేఘం.
ట్రాన్సిస్టర్ లో సుశ్రావ్యంగా ప్రసారమౌతున్న పాట వింటూ పరవశమౌతూన్న మనస్సుతో కను వెలుతురు ఉన్నంతవరకూ ప్రకృతి చిత్రం గీస్తూ కొలను గట్టుమీద కూర్చొన్న కళ్యాణ్,మ్ చీకటి పడ్డాకకూడా నిశీథ ప్రకృతిని పరికిస్తూ, సమీపంగా ఉండే వెదురుపొదలనుండి వినవస్తూన్న గాలి సంగీతం వింటూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
ఎక్కడినుండో వచ్చి ముఖంమీద పడింది టార్చి లైట్ కాంతి. ఆశ్చర్యంగా అటుదిక్కు మరల్చాడు దృష్టి. చెట్టు చాటునుండి దగ్గిరికి వచ్చిన వ్యక్తిని గుర్తించి, "కంగ్రాచ్యులేషన్స్, మిస్టర్ రఘునాధ్! మాస్టర్ రఘునాద్ అవతరించాడని విన్నాను. బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి సుమా!....ఆఁ తల్లీ బిడ్డలు కులాసాయేనా" అని, "ఏమిటి చీకటి పడ్డాక ఇటుకేసి రావడం?" అంటూ ప్రశ్నించాడు.
"ఏమని చెప్పను?" దీర్ఘంగా నిట్టూర్చాడు రఘు. "నిండుపున్నమి అయినా పండువెన్నెలను పొందలేని రాత్రులు ఉంటాయి కదూ? కొడుకు పుట్టాడని సంతోషం లేకుండా చేసి పోయింది రూప. ఉదయం నుండీ వెదుకుతున్నాం."
"కనిపెట్టే ఉంటారుకదా? ఎలా వెళ్ళగలుగుతుంది ఇలా మధ్య మధ్య?"
"రత్న నొప్పులు పడుతూంటే అందరూ ఆ హడావిడిలో పడిపోయారు. బాబును చూపడానికి రత్న పిలిస్తే ఎక్కడ ఉంది? ఎప్పుడో వెళ్ళిపోయింది. పురిటి ఖర్చుకోసం తెచ్చిన డబ్బు, అయిదు వందలూ అల్మైరాలో లేవు. రూప సూట్ కేసూ కొన్ని బట్టలు కూడా లేవు."
"స్టేషనుకు వెళ్ళిందేమో?"
"అయిదుమైళ్ళ దూరం. ఎప్పుడు చేరుకుంటుంది? చూచుకొన్న తక్షణం సైకిల్ మీద మనిషిని పంపించాం, స్టేషన్ కు. రూపలాంటివారు ఎవరూ స్టేషన్ కు రాలేదని చెప్పారట స్టేషన్ మాస్టరూ, మరికొందరూ. స్టేషన్ కు రంగన్ని పంపించి అక్కడే ఉంచాం, వస్తే ఇంటికి తీసుకురమ్మని. ఈ పిచ్చిది ఏ అడివి పట్టి వెళ్ళిందీ తెలియదు."
"ఉదయంనుండి వెదకగా దొరకనిదీ, ఈ రాత్రి ఎక్కడ ఉందని వెదుకుతారు?"
"అలాగని ఇంట్లో ఎలా నిలవగలను? ఫలితం ఎలాంటిదైనా అన్వేషణలో తృప్తి ఉన్నది."
ముందుకు వెళ్ళబోతూన్న రఘును ఆపి, "నేనూ వస్తాను ఉండండి" అంటూ లేచి ట్రాన్సిస్టర్ భుజాన తగిలించుకుని, కాగితం పెన్సిల్ జేబులో వేసుకొని, పాంట్ జేబునుండి టార్చిలైట్ బయలుదేరాడు.
"ఇంతవరకూ ఇక్కడ కూర్చొని బొమ్మలు గీస్తున్నారా?" నవ్వడానికి ప్రయత్నించాడు రఘు. "మిమ్మల్ని చూస్తూంటే నాకు కిషన్ గుర్తు వస్తున్నాడు. డబ్బున్నవారు అందరూ సుందరమైన జీవితం గడపలేరు. నిర్మలాంతఃకరణలోనే చక్కటి అభిరుచులూ, మృదువైన భావాలూ, మధురమైన ఊహలూ కలిగేది. అలాంటి మనస్సు కలవాడు దరిద్రుడైనా, ధనవంతుడైనా సౌందర్యపూర్ణమైన సరదాజీవితం సృష్టించుకోగలడు.
"మీవలెనే చక్కటి అభిరుచులు కిషన్ వి. మీ రిద్దరూ ఏ జన్మలోనో అన్నదమ్ములై ఉంటారని అనిపిస్తూంటుంది నాకు. రూప రెండు చోట్లా వంచితురాలైంది. దురదృష్టవంతురాలు!"
పూర్తిగా చీకటి పడిపోయింది. నాడు పౌర్ణమి అయినా చంద్రకాంతి బయటికి రాకుండా కాల మేఘాచ్చాదితం అయింది ఆకాశం. అంతకంతకు ఉరుములు, మెరుపులు అధికమైనాయి.
భయంకరమైన ఆ నిశీధినిలో ఆ యువకులిద్దరూ టార్చిలైట్లు పట్టుకొని గుట్టలూ, పుట్టలూ, కొండలూ, కోవలూ వెదికారు, పన్నెండు గంటలవరకూ ఏ దిశ ఎటు అయిందీ తెలియకుండా అడవులు చుట్టారు.
ఎక్కడ కనబడుతుంది రూప?
దిశలు మారుమ్రోగే "రూపా! రూపా!" అన్న రఘు పిలుపులతో "ఓ" అన్న సమాధానం ఎందుండి వస్తుంది?
"లాభంలేదు. ఇక ఎంత వెదికినా ఇంతే. ఇంటికి మరలండి."
"పచ్చి బాలెంతరాలు రత్న. రూప వెళ్ళిపోయిందన్నప్పటినుండి ఒకటే ఏడుపు. అందులో రూప దగ్గిర డబ్బు ఉన్నదని మరీ భయపడుతూంది, ఏ దొంగ ఏం చేసిపోతాడోనని. ఎక్కడ ఉన్నా వెదికి తీసుకురండని, ఎంతో నమ్మకంగా పంపింది నన్ను. ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను? రూప ఏమైందని చెప్పను?" కదలలేని కాళ్ళతో ఓ బండమీద కూలబడి పోయి విలపించాడు రఘు.
"ఈ రాత్రికి ఇంటికి పదండి. ఉదయం నా కారు తీసుకొని వెదుకుదాము." బలవంతాన లేవదీశాడు రఘును, కళ్యాణ్.
ఊరు అంచుకు వచ్చేసరికి కుంభవృష్టిలా వరంకురిసింది. పెళపెళార్భాటంతో, పెద్ద మెరుపుతో దూరాన పిడుగుపడింది.
"కొన్ని పరిస్థితులలో మానవుడు కొన్ని భయాలు జయిస్తాడనుకొంటాను. ఉరుములు చెవిలో పడకుండా చెవిలో వేళ్ళుదూర్చి గదిలో కూర్చుండిపోయేవారం నేనూ, రూపా. ఇప్పుడు ఆ భయమేమీ నన్నంటడం లేదు" అన్నాడు రఘు.
యజమాని కోసం కాచుకొని ఉన్న రంగడు, కళ్యాణ్ అవతారం చూచి కంగారు పడుతూ "ఏమైంది బాబూ? తడిసివచ్చారు?" అన్నాడు.
"రఘునాద్ చెల్లెలు పరారీ అయింది, రంగన్నా! అతడితో కలిసి వెదుకుతూంటే ఇంత రాత్రి అయింది. సరేకాని దబ్బున ఇన్ని నిప్పులు చేసి ఇటుతే. ఒంట్లో వణుకుపుట్టుకు వస్తున్నది".
"మణిలాంటి పిల్లకి పిచ్చి ఎక్కింది. వాళ్ళకు అదో గ్రహచారం!" రూపసంగతి ఇదివరకే తెలిసి ఉన్న రంగడు నిట్టూర్చి వెళ్ళిపోయాడు.
