.jpg)
అక్కడే ఉన్న క్యాలెండరు చూసిన భార్గవి కి గుండె ఝల్లుమంది. ఇంక నాలుగు రోజుల్లో శ్రావణ మాసం వస్తున్నది. అయ్యో! అన్నయ్య ఏమయిపోయినట్టు? నిర్మల పెళ్ళి కని తనతో రమ్మన్న అక్కయ్య మాట కాదని వచ్చినందుకు ఎంత శిక్ష విధించాడు భగవంతుడు? అసలు అన్నయ్యకేమైంది. ఇన్ని రోజులయింది -- కబురాయినా తెలియలేదు...." అని బాధపడ సాగింది భార్గవి. ఇంతలో రంగడు ఒక పాకెట్ తీసుకొచ్చి భార్గవి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.
భార్గవి ప్యాకెట్ విప్పతీసింది.
బంగారు రంగు జరీలతో ఎంబ్రాయిడరీ చేసిన తెల్లని చీర అది. అందులో చిన్న చీటీ ఉంది.
భార్గవీ నాతొ మాట్లాడటం కూడా మానేశావు. ఇవ్వాళ పుట్టినరోజు నువ్వీ చీర కట్టుకోవాలి. అర్జంటు పని మీద నేను బయటకు వెళ్తున్నాను. రాత్రి ఇంటికి వచ్చేసరికి పొద్దు పోవచ్చు. నాలో ఏ మాత్రం మంచితన్నానయినా నువ్వు ఫీల్ అయితే నువ్వీ కానుకను స్వీకరించటమే సాక్ష్యం"
ముత్యాల్లాంటి అక్షరాలతో వ్రాసి ఉంది.
అటూ ఇటూ తిప్పి దాని ఖరీదు చూసిన భార్గవి కి మతి పోయింది.
అంత ఖరీదు పెట్టేందుకు? పది నిముషాలు ఆలోచించిన మీదట భార్గవి ఒక నిర్ణయానికి వచ్చింది.
తలంటి పోసుకుని అతను పంపిన కొత్త చీర కట్టుకుంది. సూట్ కేస్ తెరిచి దానికి మాచింగ్ గా ఉన్న బంగారు రంగు బ్లౌజు తీసి వేసుకుంది. ఒంటిపేట ముత్యాల దండ తీసి మెళ్ళో వేసుకుంది.
"రంగా!" అని కేకేసింది. వాడు పిలిచిన వెంటనే హాజరయ్యాడు.
"దొడ్లో పూలేమయినా ఉన్నాయ్యోమో చూడు" అని పురమాయించింది.
తను వంట గది వైపు వెళ్ళి వంటకాలన్నీ దగ్గరుండి శ్రద్దగా చేయించింది. ప్రత్యేకంగా రెండు రకాల స్వీట్సు చేయించింది.
సాయంత్రం స్నానం చేసి రంగడు తెచ్చిన జాజులు , కనకాంబరాలు కలిపి దండ కట్టి తల నిండా పెట్టుకుంది.
రాక్ లోంచి చేతి కందిన నవలొకటి తీసుకుని చదువుతూ కూర్చుంది. పది గంటలు అయినా శేఖరం రాలేదు. వేడిగా వుండాలని అన్నం అప్పుడే వండి పెట్టి వంటవాడు "వేలు" వెళ్ళి పోయాడు. చూసీ చూసీ అలిసిపోయి భార్గవి అట్లాగే సోఫాలో పడుకుంది.
పన్నెండవుతుండగా వచ్చాడు శేఖర్. బూట్ల చప్పుడు వింటూనే లేచి కూర్చున్నది భార్గవి.
అలిసిపోయిన ముఖంతో, నలుగిన బట్టలతో ఉన్న శేఖర్ ని చూడగానే భార్గవి కి జాలి కలిగింది.
రండి భోజనం చేద్దాం!" అంది.
ఆమె కట్టుకున్న చీర వంక తృప్తిగా చూస్తూ -- "వద్దు భార్గవీ! నాకు కడుపు నిండిపోయింది. నా మనసు ఎంతో తృప్తిగా ఉంది. ఇదుగో మీ అన్నయ్య దగ్గరి నుంచి ఉత్తరం వచ్చింది. వెళ్ళబోయే ముందన్నా నాకీ కాస్త మనశ్శాంతి నైనా నువ్వు ఇవ్వ గలిగినందుకు సంతోషిస్తున్నాను. నిజంగా నువ్వీ చీర కట్టుకోకపోతే నేనే స్థితిలో ఉండేవాడినో తెలుసా?' అన్నాడు.
భార్గవి మాట్లాడలేదు.
"భార్గవీ! నా దగ్గర ఉన్న ఈ కొద్ది రోజుల్లో నువ్వు నష్ట పోయిందేమీ లేదు కాని-- రోజూ నిన్ను చూస్తూ నేను చాలా నష్టపోయాను. ఒక వేళ ఈ నష్ట పోవటమే శాశ్వతమైతే ఇక జీవితంలో ఆ నష్టం పూడదు"
అతను గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. భార్గవి అతన్ని తలుపు తట్టి పిలిచింది. కానీ, అతను తలుపులు తియ్యలేదు. బయటకు రాలేదు. వండిన పదార్ధాలన్నీ అట్లాగే చల్లారి పోయినాయి.
* * * *
తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని ఆత్రంగా భార్గవి కవరు చించింది.
నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా ఏ రకమైన ఉద్రేకమూ లేకుండా చదువు నిన్ను కావాలనే శేఖర్ దగ్గర వదిలి పెట్టాను. నిజంగా నాకు ఉద్యోగానికి సంబంధించిన పనేమీ లేదు.
భార్గవీ! శేఖర్ ఎవరో కాదు. నీకు జ్ఞాపకం ఉండటానికి అవకాశం లేదనుకో -- అక్కయ్యా వాళ్ళు అనుకుంటుంటారే , కలకత్తా అత్తయ్య అని జ్ఞాపకం వచ్చిందా -- ఆ కలకత్తా అత్తయ్య కొడుకే శేఖరం. నాన్నకు పినతల్లి కూతురు ఆవిడ. తల్లి దండ్రులకు ఇష్టం లేని పెళ్ళి చేసుకోవటం వల్ల రాకపోకలు లేవు. అయన కూడా ఏదో వ్యాపారమంటూ అంతదూరం వెళ్ళిపోవటం వలన వాళ్ళెప్పుడూ అసలు ఇటు రాలేదు. అది కాకుండా అభిమానం గల శేఖర్ తండ్రి భార్యని ఎప్పుడూ ఈ ప్రాంతానికి పంపలేదు. అందుకని వాళ్లనేప్పుడూ మనం చూడలేదు. భోగభాగ్యాలతో తులతూగే వాళ్ళని- పెళ్ళిళ్ళ లో మన చుట్టాలందరూ అదొక విచిత్రంగా కధలు చెప్పుకోవటమే తప్ప వాళ్ళని గురించిన వివరాలేమీ మనకు తెలియదు.
మాటల సందర్భంలో -- అంటే ఆరోజు నువ్వు మందులు తేవటానికి వెళ్ళిన రోజన్న మాట. నిన్ను మళ్ళీ ఇక్కడ దింపటానికి వచ్చిన రోజు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మనల్ని గురించి వాళ్ళమ్మ ఎప్పుడూ చెప్తుండేదిట. ఆ రకంగా ఒకళ్ళ నొకళ్ళము తెలుసుకున్నాం.
"నిన్ను పెళ్ళి చేసుకుంటానని-- అందుకు నీ అభ్యంతరం ఏమైనా ఉందా' అని ఆరోజే అడిగాడు. నిజంగా ఆలోచిస్తే అభ్యంతరం ఎందుకు? అన్ని విధాలా యోగ్యుడైన శేఖర్ నిన్ను కావాలని కోరుకుంటుంటే అంతకన్నా కావలసిందేముంది? నీ అంగీకారం తీసుకుంటానన్నాను. కాని, అందుకతను అంగీకరించలేదు. ఏ కారణం వల్లో నీవు అతనంటే అంత ఇష్టం కనబర్చవేమోనని అతని అనుమానం, అంతే కాకుండా అతని డబ్బు, హోదా , ఇవన్నీ కాక- అతనుగా అతని వ్యక్తిని కోరుకునే భార్య కావాలని అతని కోరిక. అందుకని తనకీ అవకాశాన్నివ్వమన్నాడు. ఆడపిల్లను ఒంటరిగా అతనితో ఏకాంతంగా వదిలి పెట్టడం ఇష్టం లేకపోయింది నాకు. అయినా అతని వ్యక్తిత్వం- అతని మంచితనం నాలో నమ్మకాన్ని కలిగించినయి.
అందుకని భార్గవీ -- నేను అదృష్టంతో లాటరీ వేశాను. నిన్నక్కడ వదిలానన్న మాటే గాని అనుక్షణం నేనెంత బాధపడుతున్నానో తెలుసా! ప్రతిరోజూ శేఖర్ నన్ను కలుస్తూనే ఉన్నాడు. అతని ముఖంలో నిరాశ. నిస్పృహ చూసినప్పుడు నా గుండె జాలితో నిండిపోయేది. కానీ భార్గవీ! అర్ధం లేని మూర్ఖత్వంతో విలువ కట్టలేని శేఖర్ ని కోల్పోతున్నావన్న విషయాన్ని నువ్వు గుర్తించటం లేదు. అనుభవం లేని నేను చేసిన పని తెలివి తక్కువదే కావచ్చు. నువ్వు మాత్రం శేఖర్ ని ఒక దృష్టి తోనే చూస్తున్నావు అతనెంతో సహృదయుడమ్మా! ఏదైనా కోరి తనంతట తను వస్తే చులకనగానే ఉంటుంది. శేఖర్ కంటే నాకు స్వార్ధం ఎక్కువ. శేఖర్ లాంటి వ్యక్తీ కోరి నీ చెల్లెల్ని భార్యగా స్వీకరిస్తానన్నప్పుడు నాకా మాత్రం స్వార్ధం ఉండటం తప్పంటావా భార్గవీ!
నేను ఎంత ఖర్చు పెట్టినా ఎంత తిరిగినా నీకు శేఖర్ లాంటి భర్తను తెగలనా-? నా వల్ల నీకు కష్టం కలిగితే నన్ను క్షమిస్తావు కదూ? ఇంకో విషయం ఈ ఉత్తరంలో నేనిదంతా వ్రాసినట్టుగా తెలియనివ్వకు. ఇప్పటికే ఒకరకంగా అతని మనసు దెబ్బతిని ఉన్నది. ఇవాళ కాకినాడ నుంచి ఉత్తరం వచ్చింది. బావగారికి అనారోగ్యంగా ఉన్నదిట. పెళ్ళికి మూహూర్తం నిశ్చయం చేశారుట. శుభలేఖలు ఇక్కడే ప్రింటు చేయించాలిట. సరే-- ఆ విషయం గురించి తీరుబడిగా మాట్లాడుకుందాం.
నేను రెండు రోజుల్లో వచ్చి నిన్ను తీసుకెళ్తాను. నీ మనసు మార్చుకుని శేఖర్ ని అర్ధం చేసుకుంటావనుకుంటా"
ఆశీస్సులతో అన్నయ్య.
ఉత్తరం చదివిన భార్గవి తల దిమ్మెక్కింది. ఈ విషయం అన్నయ్య తనతో ఎందుకు చెప్పలేదు. భార్గవి ఆలోచించ సాగింది. అందంలో, ఐశ్వర్యం లో , గుణం లో ఎందులోనూ శేఖర్ తీసిపోడు. అన్నయ్య కి ఆ మాత్రం తెలియదా? తను శేఖర్ ని పొరపాటుగా అర్ధం చేసుకుంది. పాపం! తన ప్రవర్తన వల్ల ఎంత బాధపడి పోయాడో...."
తలుపు తట్టిన శబ్దం కావటంతో ఉత్తరం మడిచి దిండు కింద పెట్టి తలుపు తీసింది.
శేఖర్ లోపలికి వచ్చాడు. భార్గవి మంచం దగ్గరనే నిలబడి ఉంది.
క్షణ కాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.
భార్గవి శరీరంలోకి వెచ్చని గాలి వచ్చింది.
భార్గవీ! నేను ఓడిపోయాను. ఒక రకంగా నీతో అలిసిపోయాను. ఇదిగో మీ అన్నయ్య ఉత్తరం వ్రాశాడు. బహుశా రేపు వచ్చి నిన్ను తీసుకు వెళ్తాడనుకుంటా. నిన్ను ఇంకొక్క క్షణం కూడా భరించలేను" ఇక చెప్పవలసిందేమీ లేనట్లు వెళ్ళిపోబోయాడు శేఖరం.
"ఏమండీ! బొంగురు పోయిన గొంతుతో పిలిచిన భార్గవి పిలుపుకి వెనుదిరిగాడు . ఆమె కళ్ళు మేఘల్లా వర్షిస్తున్నాయి. "భార్గవీ!ఇంకా ఎందుకంత విచారపడతావు. చెప్పానుగా రేపు మీ అన్నయ్య వస్తాడని- ఈ ఒక్క రాత్రి ఎలాగో భరించక తప్పదు"
"అది కాదు ...నేను మీ పట్ల ఎంతో అనుచితంగా ప్రవర్తించాను. మిమ్మల్ని అర్ధం చేసుకోలేక ఎంత అశాంతి ని మీకు కలిగించానో తలుచుకుంటేనే నాకు సిగ్గేస్తున్నది...."
"ఓ అదా! ఫరవాలేదు. ఒక రకంగా నేనే పొరబడ్డాను. నీ మనసు తెలుసుకోకుండా నిన్ను ఇబ్బందిలో పెట్టి మితిమీరి ప్రవర్తించాను. అందని పళ్ళకు ఎగబాకి దగా పడ్డాను. ఇప్పుడీ ముఖ ప్రీతి మాటలు మాట్లాడి ఇంకా ఎందుకు నన్నవమానిస్తావు?'
"నా ఉద్దేశం అది కాదు. నన్ను సాంతం చెప్పనీయండి...."
"ఇంకా నీ ఉద్దేశ్యం నేను ప్రత్యేకంగా తెలుసుకోవలసింది ఏముంది. నీ ప్రవర్తన ద్వారా తెలుస్తూనే ఉందిగా -- ఈ విషయాన్ని ఒక పీడ కలగా మర్చిపో" శేఖరమనే వాదొకడుండే వాడనే విషయం నువ్వు...."
"ఆగండి-- నేను పొరపాటుగా తెలివి తక్కువగా ప్రవర్తించాను. అవన్నీ మర్చిపోయి నన్ను...."
"క్షమించమంటావు -- అంతేనా?"
"అంతేకాదు....మీ కష్టసుఖాల్లో భాగం పంచుకునే అదృష్టాన్ని నాకిమ్మని కూడా కోరుతున్నాను."
