Previous Page Next Page 
డాళింగ్ పేజి 23

 

    ఆ సమయంలో విమల్ ని ప్రశ్నించటం మాధురికి ఇష్టం లేదు .
    కార్ పార్కింగ్ దగ్గర కొచ్చారు విమల్.
    అంతవరకూ మాధురి చెయ్యి, విమల్ బలమైన పిడికిలిలోనే ఉంది. కారు దగ్గరకు రాగానే ఆ పిడికిలి వదులయ్యింది.
    "కూర్చో......" కారు డోర్ తెరిచి పట్టుకుని అన్నాడు.
    "విమల్....." ఏదో చెప్పబోయింది మాధురి.
    "డోంట్ .....టాక్ ........" ఆమెను కారు బేక్ సీట్లో కి తోసేసి , డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్టు చేసాడు.
    కారు స్టూడియోస్ లోంచి విసురుగా బయటకొచ్చింది. ఫ్లోర్లోంఛి బయటికొచ్చిన జనం, ఆ దృశ్యాన్ని నిశ్చలంగా చూడటం తప్పించి మరేం చెయ్యలేకపోయాడు.
    కారు స్టూడియోలోంచి బయటికొచ్చింది.
    "ఏ హోటల్లో దిగావు." గేరు మారుస్తూ అడిగాడు విమల్.
    "గంగా ఇంటర్నేషనల్." నెమ్మదిగా చెప్పింది మాధురి .
    పదినిమిషాల్లో.
    గంగా ఇంటర్నేషనల్ హొటల్ పోర్టికోలో ఆగింది కారు.
    కారు లోంచి దిగింది మాధురి.
    "మీరెప్పుడోచ్చారు హైదరాబాద్" అడిగింది మాధురి.
    "నువ్వోచ్చింది ఈ బోడి సోప్ యాడ్ తో యాక్ట్ చెయ్యడానికేనా" విసురుగా అన్నాడు విమల్.
    "యాక్టు చేస్తే ఏమైంది" ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూస్తూ అంది.
    "యాక్టింగ్ ని ప్రొఫెషన్ గా తీసుకున్నాక అన్నీ ఒకటే కదా......"
    "మళ్ళీ అంది"
    "ఎస్ అన్నీ ఒకటే కానీ"
    "నిన్ను అసభ్యంగా తెరమీద చూడటం నాకిష్టం లేదు......"
    జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తున్నాడు విమల్.
    ఒక్కక్షణం మాధురి కళ్ళల్లో ఒక ఆనందపు మెరుపు మెరిసింది.
    తనని ఆ యాడ్ లో ఆఫ్ న్యూడ్ గా ఎక్స్ ఫోజ్ చేస్తున్నారా? మొట్ట మొదటి సారి ఆ ప్రశ్నను వేసుకుంది మాధురి.
    షూటింగ్ సమయంలో తడిసిన తన దుస్తులు గుర్తుకొచ్చాయి.
    అవునేమో!
    "సీన్ సహజంగా ఉండటం కోసం ఆ మాత్రం తప్పదు కదా!"
    ఆ మాటంటే విమల్ ఒప్పుకోడు!
    "మాధురీ ....." గబగబా ముందుకొచ్చి , ఆమె రెండు భుజాలను పట్టుకుని, కళ్ళల్లోకి చూస్తూ........
    "నువ్వు ఇలాంటి సీన్ లలో నటించడం నాకిష్టం లేదు గుర్తుంచుకో మరొకసారి ఇలాంటి సీన్ నేను చూస్తే ఊరుకునేదిలేదు."
    ఆ మాటల్లో ఎంతో ప్రేమ, ఎంతో ఆత్మీయత, ఎంతో ఆరాధన పోసేసివ్ నెస్ కన్పించాయి మాధురికి.
    ఆమె కళ్ళు చటుక్కున అర్ద్రీభూతమయ్యాయి.
    "ఏం చేస్తారు ......" అతని కళ్ళల్లోకి చూస్తూ అంది.
    "ఆ ఫ్లోర్ నీ, స్టూడియో ని బాంబులతో పెల్చేస్తాను."
    చేతిలోని సిగరెట్ ను విసిరేస్తూ అన్నాడు.
    "మీలో క్రిమినల్ మెంటాలిటీ కూడా వుందా" నవ్వుతూ అంది మాధురి.
    "నీ కోసం అవసరమైతే క్రిమినల్ నీ కూడా అవుతాను......."దృడంగా అన్నాడు విమల్.
    విమల్ సున్నితంగా పూలరేమ్మలా కనపడే విమల్, మెత్తని సుకుమారమైన స్వభావంతో అందర్నీ ఆకట్టుకునే విమల్, ఎప్పుడో అవసరమైతేనే గాని మాట్లాడని విమల్........
    చల్లని చక్కని నిశ్శబ్దపు చీకటి సమయంలో , ఉద్యేగంగా విమల్ వేపు ప్రేమగా చూసింది మాధురి.
    విమల్ మనసును ప్రతిరోజూ ఓ కొత్త కోణంలో చూస్తోంది మాధురి. అదామెకు ఆనందంగా ఉంది.
    ప్రతిరోజూ ఓ కొత్త దనం.
    విమల్ కు దగ్గరగా జరిగింది. అతని కుడిచేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
    పెదాలకు ఆనించింది.
    చప్పుడు చెయ్యని నిశ్శబ్దపు ముద్దు.
    ఆ ముద్దు --
    యుగయుగాల తరతరాల ప్రేమకు భాష్యంగా ఉంది!
    అద్భుతమైన ప్రేమ భావనకు ఆకృతి లేని అనుభూతిలా ఉంది.
    "సారీ......విమల్....మరోసారి మిమ్మల్ని బాధ పెట్టను.......సరేనా........"
    నెమ్మదిగా అంది.
    విమల్ తో చటుక్కున కోపం మాయమైపోయింది.
    రెండు క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్ధం.
    "అసలు .......మీరు .......హైదరాబాద్ ఎందుకొచ్చారు........మద్రాసులో షూటింగ్ లో ఉన్నారు కదా.......'
    "షూటింగ్ మధ్యలో నువ్వు జ్ఞాపకానికి వచ్చావు..........మీ ఇంటికి ఫోన్ చేసాను..........యాడ్ ఫిల్మ్ కోసం హైదరాబాద్ వెళ్ళావని చెప్పారు.......సడన్ గా చూడాలనిపించింది...వచ్చేసాను....."
    సడన్ గా చూడాలని పించింది.......
    ఆ మాటకు , మాధురి మనసు నిండా అనందం తొణికిసలాడింది సంతోషపు నెమలి పురులు.......
    రకరకాల రంగుల స్వప్న లోకం.
    ఆ లోకంలో వాళ్ళిద్దరే
    ఒకే ఒక క్షణం తన్మయత    
    ఆ తన్మయత లోంచి తేరుకునే సమయానికి విమల్ కారు స్టార్ట్' చేస్తున్నాడు.
    గబుక్కున ముందుకడుగేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS