వినీత ఇంకా అలా తెల్లబోయి చూస్తోంది.
"మన చుట్టూ వున్న వాళ్ళు మనకు చెయ్యని నేరాన్నంటగడుతున్నారు. చేయని పాపభారాన్ని మన మెందుకు మోయాలి?" అన్నాను.
"అయితే ఏం చేయలి?" అందామె అమాయకంగా.
"వాళ్ళ ఆరోపణల్ని నిజం చేద్దాం. మొండివాడు రాజుకన్నా బలవంతుడు. అప్పుడు వాళ్ళు మనని ఏమీ చేయలేరు...."
"మీరు దేవుడువంటివారని జగన్నాధంగారు చెప్పారు. అంతా యేమనుకున్నా ఫరావాలేదు. మీరు మాత్రం పాపపుటాలోచనల్ని మీలోకి రానివ్వకండి. ఇంతరవకూ పెడదారులు తొక్కని మీ బుద్ధి నా కారణంగా చెడిపోతే-నేను పాపిష్టిదాన్నని నన్ను నేనే నిందించుకోవలసి వస్తుంది-" అంది వినీత.
ఆమె నాకు మెత్తగా బుద్ధి చెప్పాలని చూసింది. తను పవిత్రంగా ఉంటూ ఉద్యోగం నిలబెట్టుకోవాలని చూసింది.
కానీ ఆమె బలహీనతలు నాకు తెలుసు. లేకుంటే వ్యాపారంలో ఇంత పైకి రాలేనుకదా!
నేనామెను సామదానభేద దండోపాయాలతో లోబర్చుకోవాలని చూశాను. కానీ ఆమె సామాన్యురాలు కాదు.
మంచి మాటలకు మంచిగానే సమాధానమిచ్చింది. ఆశపెడితే రవంత కూడా ప్రలోభ పడలేదు. తన కీ బ్రతుకు చాలంది.
మగాడికి అందిన ఆడపిల్ల పురుగుతో సమానం. అందని ఆడపిల్ల చందమామ. ఆ చందమామను నేలకు దింపాలని నా విశ్వప్రయత్నం.
వినీతకు నా కంపెనీలోనే పనిచేయాలని వుంది. ఇక్కడున్న సదుపాయాలు, జీతం మరెక్కడా లభించవు పైగా నేను జగన్నాథంగారికి భయపడతానని ఆమె నమ్మకం. మరోచోట ఆమెకలాంటి రక్షణ లేదు.
వినీత నన్ను తప్పు అంచనా వేసింది.
ఒకరోజున నేనామెతో - "నువ్వు వైభవంగా జీవించు. నీ కొడుకును గొప్పవాణ్ణి చేయి. అంతేగాని అర్ధంలేని విలువలకు పోయి నీ కొడుకును నీ అంత సామాన్యంగా వుంచకు...." అన్నాను.
ఆమె ఎప్పటిలాగే నవ్వి-"మీరు నన్ను పరీక్షిస్తున్నారు మీరు నిప్పులాంటి మనిషని జగన్నాధంగారు చెప్పారు-" అంది.
అది ఆమె తరచుగా నామీద వాడే అస్త్రం.
ఈసారి నేను ఆ అస్త్రానికి లొంగకుండా-"నువ్వు నా ఒడిలో వాలినా జగన్నాధంగారు నా గురించలాగే అంటారు-" అన్నాను.
వినీత తడబడింది. ఆమె చూపులనుబట్టి కొత్త అస్త్రం గురించి ఆలోచిస్తోందని అర్ధమయింది.
నేను వెంటనే-"వినీతా! అనవసరంగా నీ తెలివిని తప్పుదారికి మళ్ళించకు జీవితం నీటిబుడగలా అశాశ్వతమైనది. నీ నీతి నీ జీవితాన్ని కష్టాలలో నింపుతుంది తప్ప మరెందుకూ పనికిరాదు. బ్రతికినంతకాలం సుఖంగా జీవించు. ప్రపంచంలో రాముడొక్కడే నీతిగానూ జీవించలేదు, రావణుడొక్కడే దుర్మార్గానికి ఒడిగట్టనూలేదు. సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్లు చేసే పనులకు ప్రచారం లభించి వారు చరిత్రలో కలకాలం వుండిపోతారు. వారి గురించి జరిగే ప్రచారమంతా నిజమనుకునేటందుకూ లేదు. ప్రచారం చేసేవాడి అభిరుచి, శక్తిసామర్ధ్యాలను బట్టి మనిషి తప్పొప్పులు నిర్ణయించబడతాయి. ఈ ప్రపంచంలో యెందరో రాముళ్ళు, రావణులు ప్రచారంలేక మరుగునపడి వుండిపోయారు. కాబట్టి ఆదర్శాలను నమ్మకు. నా మాట విను. నన్ను కాదనకు...." అన్నాను.
"నా ఆదర్శం చరిత్రలో పేరుతెచ్చుకుందుక్కాదు. నా తృప్తికోసం, కొందరికి రోజూ రసగుల్లాలు తింటే తృప్తిగా వుంటుంది-" అంది వినీత.
"అయితే ఈ రోజు ఇంటికి వెళ్ళు. ఏం జరిగిందో తెలుసుకో ఆ తర్వాత కూడా కావాలనుకుంటే ఆదర్శాలను నమ్ముదువు గాని-" అన్నాను.
వినీత రవంత కూడా కలవరపడలేదు. నేనాశ్చర్యపడి "ఏం జరిగిందని నన్నడగవేం?" అన్నాను.
"నేను సిద్దేంద్రస్వామి భక్తురాలిని నేను మనుషులకు భయపడను-" అంది వినీత.
సిద్దేంద్రస్వామి పేరు విన్నాను నేను ఆయన ప్రత్యక్షదైవం. ఆయన భక్తుల్లో యెందరో గొప్పవాళ్ళున్నారు. ప్రజల మనసులు క్షాళనంచేసి-సమజంలో పవిత్రతను నింపడానికి కంకణం కట్టుకున్న యోగి ఆయన. ఆయన గాలిలో ఎగురగలడు. నీటిపై తేలగలడు. శూన్యంలోంచి వస్తువులను సృష్టించగలడు. ఆయనకు మనదేశంలోనే కాక విదేశాల్లో కూడా పేరుంది.
ఒకవిధంగా నేను నాస్తికుణ్ణి వ్యాపారావసరాల కోసం నా భావాలను నేను ధైర్యంగా ప్రకటించలేక పోయినా-నాకు దేవుడన్నా, ప్రత్యక్ష దైవాలన్నా నమ్మకంలేదు.
వినీత సిద్దేంద్రస్వామి భక్తురాలని తెలిసి ఆశ్చర్యపడి ఆమె నా స్వామి గురించి మరికొన్ని వివరాలడిగాను.
వినీత భర్త సిద్దేంద్రస్వామి భక్తుడు. ఆయన కారణంగానే వినీత సిద్ధేంద్రస్వామికి భక్తురాలయింది. వినీత భర్త ఉద్యోగ రీత్యా యేదో పెద్ద తప్పుచేశాడు. ఆ తప్పు కారణంగా కొన్ని వందల కుటుంబాలకు ఆధారం లేకుండా పోయింది. అందుకాయ నెంతో బాధపడి సిద్దేంద్రస్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి ఆయనకు "నీ తప్పు నిన్ను అల్పాయుష్కున్ని చేస్తుంది. ఒక యేడాదిపాటు జాగ్రత్తగా వుండు. ఏడాది గడిస్తే భగవంతుడు నీ తప్పు క్షమించినట్లే!" అని చెప్పాడు. ఏడాది తిరక్కుండానే వినీత భర్త పోయాడు.
ఒక్కసారి మాత్రం వినీతకు స్వామిదర్శనమయింది. కాపురం పెట్టిన కొత్తలో భర్త ఆమెను దీవెనలకై స్వామి ఆమెతో "హిందూనారీ ధర్మం మన కట్టూ బొట్టులో లేదు. త్రికరణశుద్ధిగా పవిత్రతను నమ్మడంలో వుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పవిత్రతను కాపాడుకో. నా దీవెనలు నీకెప్పుడూ వుంటాయి. భగవంతుడు నిన్ను రక్షిస్తాడు...." అని చెప్పాడు.
వినీత గుడ్డినమ్మకంతో ఆదర్శాలననుసరిస్తోందంటే అందుకు సిద్దేంద్రస్వామి కారణం!
ఆమె మాటలు విని నాలో నేను నవ్వుకున్నాను. ఈ రోజు వినీత నాకు లొంగక తప్పదు.
జగన్నాధంగారింటికి డాక్టర్ వీరభద్రరావు వెళ్ళాడు. నేను పంపగా! ఎన్నో వ్యవహారాల్లో నేను, ఈ డాక్టరు తోడు దొంగలం!
డాక్టర్ వీరభద్రరావు జగన్నాధాన్ని కలుసుకుని "నాకు వినీత ఫోన్ చేసింది. బిడ్డ ఆరోగ్యం బాగుండడం లేదుట..." అంటాడు. తర్వాత బిడ్డను పరీక్షించి-"కేసులో కాంప్లికేషన్సున్నాయి. నర్సింగ్ హోంకు తీసుకుని వెడతాను-" అంటాడు.
వినీత కొడుకు నర్సింగ్ హోం చేరుకుంటాడు. బిడ్డ తిరిగి తల్లిని చేరుకోవాలంటే షరతు నాది!
నా షరతు వినీతకు తెలుసు!
వినీత తన బిడ్డ ప్రాణాలతో ఆడుకోగలదా?
3
మర్నాడు వినీత మామూలుగా ఆఫీసుకు వచ్చింది. తన సీట్లోకి వెళ్ళి కూర్చుని పని ప్ర్రారంభించింది.
నేనామెను నా గదిలోకి పిలిచాను....వచ్చింది.
"ఇంటి దగ్గర విశేషాలేమిటి?" అన్నాను.
"మీకు చాలా థాంక్స్. బాబుకు వంట్లో బాగోలేదని వెంటనే నర్సింగ్ హోంకు పంపించారు-" అందామె.
"ఎలా వున్నాడో వెళ్ళి చూశావా?" "డాక్టర్ వీరభద్రరావుగారు వీల్లేదన్నారు. కొన్నాళ్ళపాటు తల్లి బిడ్డకు దూరంగా వుండడమే బిడ్డకు క్షేమమన్నారు...."
"ఎన్నాళ్ళో అడిగావా?"
"అడిగాను...."
నేను నవ్వి-"ఆయన నీకు చెప్పలేడు. ఎందుకంటే నేనాయనకు చెప్పలేదు కాబట్టి..." అన్నాను.
