తెల్లచీర దెయ్యం !
వసుంధర
"రాత్రి నేను దెయ్యాన్ని చూశాను" అన్నాడు ప్రతాప్.
ఆ మాట అంటున్నపుడు మాటతో పాటు శరీరం కూడా వణికిందతనికి.
సూర్యం అతని వంకే పరిశీలనగా చూసి "అసలేం జరిగిందో చెప్పు!" అన్నాడు.
"సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ....' అని చెప్పబోయి ఆగాడు ప్రతాప్. జరిగింది గుర్తుకు వచ్చిందేమో అతడి కళ్ళలో భయం స్పష్టంగా కనపడింది.
"త్వరగా చెప్పు" విసుగ్గా అన్నాడు సూర్యం.
ప్రతాప్ త్వరగా చెప్పలేకపోయాడు. కాని అతడు చెప్పిన దాంట్లో సారాంశం.
నిన్నరాత్రి గదిలో ప్రతాప్ ఒక్కడూ పడుకుని ఉన్నాడు. ఒక రాత్రి వేళ కిటికీ తలుపులు దబదబా బాదిన శబ్దం వినబడింది. ప్రతాప్ ఉలిక్కిపడి లేచాడు. కిటికీ తలుపులు అలా బాదబడుతూనే వున్నాయి. ఎవరది అని అరిచాడు ప్రతాప్. సమాధానం రాలేదు. కానీ కిటికీ దగ్గర చప్పుడు మాత్రం కొద్ది క్షణాల పాటు ఆగి మళ్ళీ ప్రారంభమైంది.
ప్రతాప్ కు పూర్తిగా నిద్రమత్తు వదలలేదు. చేయి చాపి అందుబాటులో వున్నా స్వేచ్ నొక్కాడు. గదంతా ప్రకాశ వంతమైంది. అప్పుడతడికి కిటికీకి అవతల వున్న ఆకారం ఒకటి కిటికీ అద్దాల్లోంచి కనబడింది. నల్లగా ఉందది. ముఖం స్పష్టంగా తెలియడం లేదు. చేతులకు వాడి గోళ్ళున్నాయి. తల మీద ఓ రెండు కొమ్ములు , ఆకారం తలుపుపై బాదుతుంటే ఆ చేతుల కదలిక అత్యంత భయంకరంగా వుంది.
ప్రతాప్ ఒక్క క్షణం మాత్రం ఆ ఆకారాన్ని చూసి వెంటనే భయంతో కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికి శబ్దం ఆగిపోయింది. ప్రతాప్ ధైర్యం తెచ్చుకుని కళ్ళు తెరిచి కిటికీ వంక ఓరగా చూశాడు. అక్కడ ఆకారం లేదు. కానీ ప్రతాప్ లైటు అర్పలేదు. అతనికి ఓ పట్టాన నిద్ర రాలేదు. ఆ ఆకారం దయ్యమని అతడు బావిస్తున్నాడు.
"నువ్వు ధైర్యం చేసికిటికి దగ్గరకు వెళ్ళి తలుపులు తెరచి చూడాల్సింది. దయ్యం అసలు కధ బయటకు వచ్చేది అన్నాడు సూర్యం.
"దూరాన్నించి చూశాను కాబట్టి గుండె వేగంగా కొట్టుకోవడంతో సరిపోయింది. అదే దగ్గర్నుంచి చూస్తె గుండె కొట్టుకోవాలసిన అవసరమే ఉండేది కాదు అన్నాడు ప్రతాప్.
'చాలా బాగుంది. నా దగ్గరంటే అన్నావు కాని ఈ దయ్యం సంగతి కేవరికీ చెప్పకు. నిన్నేవరైనా అట పట్టించగలరు" అన్నాడు సూర్యం.
"అయితే నా కధను నువ్వు నమ్మడం లేదా ?" అన్నాడు ప్రతాప్.
"కధల నేవరైనా విని ఆనందిస్తారు కాని నమ్ముతారా?? అన్నాడు సూర్యం.
"నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజే నాకో సాయం చేయాలి" అన్నాడు ప్రతాప్.
"అడుగు -----"
"ఈ రాత్రికి నువ్వు నా గదిలో సాయం పడుకోవాలి" అన్నాడు ప్రతాప్.
"ఏడిసినట్లుంది . మాములుగా అయితే ఒప్పుకునే వాడినేమో గాని ఇంత చచ్చు కారణానికి మాత్రం నా సాయం కావాలంటే ఒప్పుకోను...." అని ప్రతాప్ ముఖం చూసి ఆగిపోయాడు సూర్యం. అతడి ముఖం అత్యంత దయనీయంగా వున్నది. "ప్రతాప్ నువ్వు నిజంగా భయపడుతున్నావా?" అన్నాడు.
"నిన్న జరిగిన లాంటి సంఘటన ఈరోజు కూడా జరిగితే నేనేమై పోతానోనని భయంగా వుంది."
సూర్యం జాలిగా నవ్వి "నువ్విదివరలో ఎన్నడూ హాస్టల్లో ఉండలేదా?" అన్నాడు.
"లేదు -- ఏం?"
"హాస్టల్లో ఇలాంటివి సర్వసాధారణం. కాస్త లోకువగా కనిపించే వాళ్ళను ఎడ్పించడం కోసం యిలాంటి ట్రిక్కులు వేస్తుంటారు. లేకపోతె ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలేమిటి?" అన్నాడు సూర్యం.
"నువ్వు దయ్యాన్ని చూడలేదు కాబట్టి అలా అంటున్నావు. చూశాను కాబట్టి నాకు గుండె దడగా ఉంది" అన్నాడు ప్రతాప్.
"నా అనుభవం ఒకటి చెప్పాలా?" అన్నాడు సూర్యం. చెప్పమనకుండానే అతడు చెప్పసాగాడు కూడా.
సూర్యం చదువుకునే రోజుల్లో కొత్తగా హాస్టల్లో చేరినప్పుడక్కడ భూతం వుందని కొందరు సీనియర్లు బయపెట్టారుట. సూర్యం పెంకి మనిషి కావడం వల్ల విషయాన్ని పట్టించుకోలేదు. ఒకరోజు అతను తన గదికి వెళ్ళేసరికి గదిలో వస్త్గువులన్నీ తలక్రిందులు చేసి వున్నాయి. మంచం, పెట్టె, జోళ్ళు, పుస్తకాలు .....ఒకటేమిటి ....మొత్తం అన్నీ తలక్రిందులై వున్నాయి.
సూర్యానికది ఎవరో కొంటె తనంతో చేసిన పనయంటుందని అనుమానం వచ్చి వస్తువులన్నీ మళ్ళీ యధాప్రకారం సర్దేశాడు. కాసేపటికి ఇద్దరు సీనియర్లు అతడి గదిలోకి వచ్చి పలకరించారు. సూర్యం వాళ్లతో మాములుగానే మాట్లాడాడు. వాళ్ళు కాసేపు అతడికి అవీ ఇవీ మాట్లాడి భూతం ప్రసక్తి తెచ్చారు.
"భూతాల గొడవొద్దు" నాకు వాటి మీద నమ్మాకం లేదు " అన్నాడు సూర్యం.
'అయితే దాని చేష్టలేమీ నీకు అనుభవంలోకి రాలేదా?" అన్నాడు ఓ సీనియర్.
"లేదు" అన్నాడు సూర్యం.
"దాని చేష్టలు చాలా విచిత్రంగా వుంటాయి. ఒకసారి అది గదిలోని వస్తువులన్నీ తలక్రిందులు చేసి పోతుంటుంది. అలాంటి అనుభవం ఏదైనా జరిగిందా నీకు" అన్నాడింకో సీనియర్ .
"ఇంతవరకూ లేదు" అన్నాడు సూర్యం.
సీనియర్సిద్దరూ గదిని పరీక్షించి "వాటం చూస్తుంటే ఈ గదిని ఇప్పుడే సర్దినట్లుంది. అబద్దం చెప్పకు. మెహర్బానికి దాస్తున్నావు గాని భూతం నీ గదిలోని వస్తువుల్ని తలకిందులు చేస్తే యిప్పుడే సర్ధావు గదా" అన్నాడు.
"పదిరోజల్నుంచి ఈ గదిలో నేను పూచికపుల్ల కూడా కదల్చలేదు" అన్నాడు సూర్యం.
సీనియర్స్ ముఖంలో రవంత నితురుత్సాహం కనబడింది. వాళ్ళు క్షుణ్ణంగా గదంతా పరిశీలించి అలమారా పైన వున్న ఇత్తడి చెంబోకటి తీసి "ఇత్తడి చెంబు ఎవరైనా అల్మారా పైన పెడతారా -- ఇది తప్పకుండా భూతం పనే" అన్నారు.
సూర్యం ఆ చెంబు నిందాకా చూసుకోలేదు. అయినా చలించకుండా అతను "నేను ఇత్తడి చెంబును వాడను. అందుకే అదిక్కడ నేనే పెట్టాను" అన్నాడు.
సీనియర్స్ ఇద్దరూ ముఖముఖాలు చూసుకుని "నువ్వు చాలా ఘటికుడివి. ఇదే పధకంతో ఇప్పటికి పదిమందిని హడలగొట్టాం మేము. ఇందాకా నీరూము కూడా చిందర వందర చేశాం" అని ఒప్పేసుకుని అతణ్ణి కూడా తమలో ఒకడిగా చేసుకున్నారు.
'చదువుకునే రోజుల్లోనే బ్రహ్మచారుల కంత తీరుబడి వుంటే ఇంక ఉద్యోగం చేసే బ్రహ్మచారుల మాట చెప్పాలా?" అని తన కధ ముగించాడు సూర్యం.
అది వ్యాపారదృష్టితో ఓ పాతిక మంది బ్రహ్మచారు లుండడానికి కట్టించబడ్డ భవనం. దానికి రెండతస్తులున్నాయి. పైన పన్నెండు, క్రింద పదమూడు పోర్షన్ లున్నాయి. అందులో వుండే వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులే. ఊరికి కాస్త చివర ఉన్నప్పటికీ - అక్కణ్ణింఛి బస్సు సదుపాయాలుండడం వల్ల చాలామంది ఇంట్లో వుండడానికి కిష్టపడతారు. ఎందుకంటె నూటయాభై రూపాయల అద్దెకు వసతులుండే ఇళ్ళు దొరకవు. అదీకాక పెళ్ళైన వారు కూడా ఏదైనా ఇల్లు దొరికే వరకూ ఆ ఇంట్లోనే భార్యతో వుండవచ్చు. దంపతుల ఇళ్ళలో వుండడానికి ఇంటి యజమాని పెద్దగా అభ్యంతరం లేదు. కానీ అంతమంది బ్రహ్మచారుల మధ్య ఎక్కువ రోజులు తన భార్య నుంచడానికి ఏ భర్త కూడా ఇష్టపడడు.
ఇంటి యజమాని ఒకప్పుడు బ్రహ్మచారిగా వుండి ఇల్లు దొరక్క అవస్థ పడ్డాడుట. అందుకని అయన బ్రహ్మచారుల కోసం ఈ ఇల్లు ప్రత్యేకంగా కట్టించి ఫస్టు ఫ్రిఫేరేన్సు వాళ్ళకే యిస్తాడు. ఇంట్లో వున్న బ్రహ్మచారులకు పెళ్ళైతే అక్కడ దంపతుల్నుండనిస్తాడు తప్పితే దంపతులుగా యిల్లు వెతుక్కుంటూ వస్తే రానివ్వడు. అందికాయన చెప్పే ఇంకో కారణం "బ్రహ్మచారి కొంపలు శుభ్రంగా వుంచడు. అందువల్ల ఇంటికేమీ నష్టం లేదు. గృహిణి యిల్లు నీటుగా సర్దాలనుకుంటుంది. అదే ఇల్లు పాడుచేస్తుంది. అల్మారా తయారు చేయించాడమో, గోడలకు మేకులు కొట్టడమో లాంటి మార్పులు గృహిణుల కారణంగానే జరిగితాయి."
ఇలాంటి ఇంట్లో నిన్నరాత్రి ఓ దెయ్యం ప్రతాప్ ని భయపెట్టింది. సూర్యం దాన్ని ఎవరో ఆటగా కొట్టి పారేశాడు.
"నీ మాటలు నాకు దైర్యాన్ని స్తున్నాయి" అన్నాడు ప్రతాప్.
