Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 21


    "ఎవరతను?" అంది దేవీబాల.
    "అతడి పేరు సురేంద్ర. అతడు అచ్చం మీకులాగే వుంటాడు. అందుకే అతన్ని నేనూ ప్రేమించాను-" అని ఆగింది అప్సర.
    "మిస్ అప్సరా-ఇదంతా నాకెందుకు చెబుతున్నట్లు?"
    "ఈపాటికి అర్ధమయే వుంటుందనుకుంటాను. సురేంద్ర నేను ప్రేమించుకోవడంతో-కథ కొత్త మలుపు తిరిగింది. నా పెళ్ళికి కట్నమివ్వాలిగదా-బదులుగా కట్నమక్కర్లేకుండా అన్నయ్య మిమ్మల్ని చేసుకోదల్చుకున్నాడు-" అంది అప్సర.
    "బాగుంది. అవుననడానికీ కాదనడానికీ అంతా ఒకరిష్టమే నేమిటీ?" అంది దేవీబాల అదోలా.
    "అంతేననుకుంటాను. ప్రస్తుతం మా యింట్లో నా అన్నయ్య. మీ అన్నయ్యలతోపాటు మీ అమ్మగారు కూడా వున్నారు-ఎవరెవరికీ ఏయే ఇష్టాలున్నదీ అక్కడే చెప్పుకోవచ్చు-" అన్నది అప్సర.
    
                                       5

    "తలుపు తాళంతీసుకుని లోపలకు వెడుతున్నారు. మీవాళ్ళెవరూ ఊళ్ళో లేరా?" అన్న పలకరింపుకు సుబ్బారావు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి అప్రయత్నంగా" "మీరా?" అన్నాడు.
    "అవును మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని చెప్పానుగా-అందుకే మళ్ళీ వచ్చాను-" అన్నాడు నాగు.
    "నేనేదో మర్యాదకు వెళ్ళిరండన్నాను. నిజంగానే మళ్ళీ వచ్చారు మీరు-అనవసరపు శ్రమ-" అన్నాడు సుబ్బారావు.
    "అనవసరంగా నేను శ్రమపడనులెండి-" అన్నాడు నాగు.
    "లోపలకు రండి-మీరెంత తెలివైనవారైనా జామచెట్టుకు ఆపిల్ కాయలు కాయించలేరు-" అంటూ లోపలకు దారితీశాడు సుబ్బారావు. నాగు ఆయన్ననుసరిస్తూ-"మీకు సత్యబాబుగారు తెలుసుననుకుంటాను. ఆయన ఏ చెట్టునుంచైనా ఏ కాయైనా కోయగలరు-" అన్నాడు.
    "అది దైవశక్తి-" అన్నాడు సుబ్బారావు.
    "ఏదో ఒక శక్తి-మనమనుకున్నది చేయించగలుగుతున్నదంటారా-లేదంటారా?"
    "కూర్చోండి-" అన్నాడు సుబ్బారావు తనూ ఓ కుర్చీలో కూర్చుంటూ.
    నాగు కూర్చుంటూ - "నేనంటే మీకిష్టంలేదు. అయినా లోపలకు రమ్మన్నారు. కూర్చోమన్నారు. చూశారా-మీకిష్టంలేని పనులు మీ చేతే ఎలా చేయిస్తున్నానో!" అన్నాడు.
    "మీరు పొరబడ్డారు..మీ ఆలోచనలు తప్పుదారిలో నడుస్తున్నాయి. వాటిని సక్రమమైన మార్గంలోనికి మళ్ళించడంకోసం నేనిప్పుడో ఉపన్యాసమిచ్చే ఉద్ధేశ్యంలో వున్నాను. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. కూర్చోమన్నాను. నా ఉపన్యాస ప్రభావం మీకు తెలియదు. అది తలచుకుంటే నా భార్యా బిడ్డలు వణికిపోతారు. ఇంతవరకూ నా ఉపన్యాసం పూర్తిగా నే నా కాళ్ళు పట్టుకుని-ఉపన్యాసం ఆపమనీ, బుద్ధి వచ్చిందనీ అనేయాల్సిందే-మొహమాటం లేనివాళ్ళెవరైనా ఉపన్యాసాన్ని సుత్తి అని కూడా అంటారు-"
    నాగు నవ్వి-"నేను కూడా మీ సుత్తి పూర్తిగా వినబోవడం లేదు-" అన్నాడు.
    "చూశారా-మీలో అప్పుడే భయం మొదలయింది" అన్నాడు సుబ్బారావు.
    "భయం కాదండీ-కాస్త ఇది చూడండి-" అంటూ నాగు జేబులోంచి ఒక పొట్లంతీసి సుబ్బారావు కందించి "ఇది కాస్త జాగ్రత్తగా విప్పిచూడండి. ఇందులో చాలా తెలివైన వస్తువులున్నాయి. అలాగని తేలిక చేయకండి. అడిగినమీదట వివరాలు చెప్పగలను. ఆ వివరాలు విన్నాక మరి మీరు సుత్తి కొట్టగలరని నేననుకోను-" అన్నాడు.
    సుబ్బారావు తిరస్కారంగానే పొట్లాన్నందుకున్నప్పటికీ దాన్ని జాగ్రత్తగానే విప్పాడు. ఆ కాగితం పొట్లంలో ఒక చిన్న గోరు, తల వెంట్రుక వున్నాయి.
    "ఏమిటది?" అన్నాడు సుబ్బారావు అసహనంగా.
    "మీ అమ్మాయి దేవీబాల మా యింట్లో వున్నదనడానికి సాక్ష్యం-"
    సుబ్బారావు ఉలిక్కిపడి-"మా అమ్మాయి మీకు తెలుసా?" అన్నాడు.
    జేబులోంచి మరో రెండు పొట్లాలు తీశాడు నాగు. వాటిని కూడా సుబ్బారావు కందిస్తూ-"శ్రీమతి సులోచన, మిష్టర్ సురేంద్రలకు సంబంధించినవీ పొట్లాలు, మీరు తప్ప మిగతా మీ కుటుంబ సభ్యులందరూ మా ఇంట్లో వున్నారని తెలుపడానికి గర్విస్తున్నాను...." అన్నాడు.
    సుబ్బారావు పొట్లాలు విప్పాడు. వాటిలోనూ అవేగోరు, వెంట్రుక.
    "ఏమిటి మీ ఉద్దేశ్యం?" అన్నాడాయన కోపంగా.
    "గోళ్ళు మనం చేతులు శుభ్రంగా ఉండడంకోసం వారానికోసారి తీసుకుంటూనే వుంటాం. వద్దనుకున్నా తల దువ్వుకునే సమయంలో కొన్ని తల వెంట్రుకలు రాలిపోతుంటాయి. శరీరంనుంచి బాధ కలిగించకుండా వేరుచేయగల భాగాలివి. ప్రస్తుతం నేను వాటి జోలికి మాత్రమే వెళ్ళాను. అంటే మీవాళ్ళింకా ప్రమాదంలో లేరని అర్ధం. అయితే వాళ్ళు ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. అది మీ చేతుల్లో వుంది. ఆలోచించుకోండి-నాకు సుత్తికొడతారో-జామచెట్టుకు ఆపిల్సు కాయిస్తారో!" అన్నాడు నాగు గంభీరంగా.
    సుబ్బారావు నాగువంక పరీక్షగా చూశాడు. అతడి కళ్ళలో భయమన్నది ఎక్కడా కనబడ్డంలేదు. అనుకున్నది సాధించగలనన్న నమ్మకం ఆ కళ్ళలో కనిపిస్తున్నది.
    సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు. నాగు సామాన్యుడు కాడు.
    "లోన్ గురించేకదా మీ రభస అంతా-మీ కాగితాలన్నీ చూపించండి ఒకసారి చూస్తాను...." అన్నాడు సుబ్బారావు.
    "ఈ ప్రశ్న మీనుంచి చాలా ఆలస్యంగా వచ్చింది. అయినా ఫరవాలేదు లెండి. కానీ ఒక్క విషయం ముందుగానే తమకు మనవి చేసుకుంటున్నాను. కాగితాలన్నీ సక్రమంగా లేవు. మీరు చూసీచూడనట్లూరుకుంటే తప్ప లోన్ శాంక్షనవదు-"అన్నాడు నాగు.
    "అలా కుదరదు-అప్పుడు నా ఉద్యోగానికే ముప్పువస్తుంది!"
    "ఇంకాస్త దారిలో పడుతున్నారు. తప్పుచేస్తున్నా ననికాక-తప్పు మీకు తేబోయే ముప్పు గురించి భయపడుతున్నారు. మీకు ఏ ముప్పురాకుండా నేను  చూసుకుంటాను. అదెలాగంటే......రేపు నేను మీ ఆఫీసుకు వస్తాను. ఈ వేషంలోకాదు. మారువేషంలో. నా పేరు రంగనాథ్ అని చెబుతాను. మీతో కబుర్లు చెబుతూ రెండుగంటలవరకూ కాలక్షేపం చేసే అవకాశం నాకివ్వండి. మధ్యలో వాచ్ మన్ ని పిలిచి నాకు పరిచయమయ్యేలా చూడండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. మీకే ఇబ్బందీ వుండదు. మీ అమ్మాయి పెళ్ళి వాసుదేవరావుతో జరిగిపోతుంది-" అన్నాడు నాగు.
    "ఇంతకీ మావాళ్ళెక్కడున్నారు?" అన్నాడు సుబ్బారావు.
    "ఈ రాత్రికి రారు. మీ అబ్బాయి కూడా అక్కడే వున్నాడు కాబట్టి మీకే అనుమానాలూ అక్కర్లేదు. వాళ్ళను మర్యాదగా చూసుకునేందుకు ఏర్పాట్లు చేశాను. రేపు నా పని ముగియగానే వాళ్ళు క్షేమంగా మీ యింటికి చేరుకుంటారు...." అన్నాడు నాగు.
    "చేరుకోకపోతే-" అన్నాడు సుబ్బారావు అనుమానంగా.
    "వాళ్ళతో నాకేం పని-కేవలం లోన్ కోసమేగదా నేనీ తంటాలు పడుతున్నది-" అన్నాడు నాగు.
    "నిజమే-కానీ నా అభయం నాకుండవచ్చుగదా-" అన్నాడు సుబ్బారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS