Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 22

 

    'అయితే ఓ విషయం మర్చిపోకూడదు నువ్వు. సుదర్శనరావు ది హత్యనీ, హంతకుడివి నువ్వనీ తెలిసిన ఏకైక వ్యక్తిని నేను. అందువల్ల నా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు."
    రాము చిరాగ్గా వెంకట్రావు వంక చూసి - "ఎందుకీ పనికి మాలిన బెదిరింపులు ? సుదర్శనరావుది హత్య అని రుజువు చేయడం ఎవరితరమూ కాదు. మృత్యుకళ ను కనిపెట్టగలిగిన వాడిని కాబట్టి నాకు తెలిసింది. నీకు చెప్పాను. అంతమాత్రాన నన్ను హంతకుడను కోవడం నీకు ఆరోగ్యం కాదు. ముఖంలో మృత్యుకళ కనిపించిందంటే చావడానికి రెండు రోజులు కూడా పట్టదు. అది రాకుండా జాగ్రత్త పడు ...." అన్నాడు.'        
    "ఇంతకీ ఇప్పుడు నా ముఖంలో మృత్యుకళ వుందా ?" అన్నాడు వెంకట్రావు.
    "ప్రస్తుతానికి లేదు. కనిపించినపుడు నే స్వయంగా చెబుతాను" అని అక్కడ్నించి వెళ్ళిపోయాడు రాము.
    "నీలాంటి వాడ్ని తెలివిగా ఉపయోగించు కుంటాం కానీ, తెలివి తక్కువగా చంపుకుంటామా?" అనుకున్నాడు వెంకట్రావు.

                                         5
    బీచి వద్ద ఒంటరిగా కూర్చుని వుంది స్వాతి. ఆమె కళ్ళలో విచారం గూడు కట్టుకున్నట్టుంది. ఆ విచారం వెనుక ఏదో ఆలోచన కూడా కనబడుతోంది. ఆ సమయంలో ఎవరో పలకరిస్తే ఉలిక్కిపడి తలెత్తి చూసింది స్వాతి.
    "నేను తెలుసు కానీ నా పేరు మీకు తెలియదు. అందుకే చెబుతున్నాను. నా పేరు రాము. నన్ను మీరు  యేరక్క పోయినా మీ పేరు నాకు తెలుసు. స్వాతీ" అన్నాడు రాము.
    "మీరు నాకు బాగా తెలుసు . చాలా కాలంగా నా వెంటపడుతూ నన్ను విసిగిస్తున్నారు " అంది స్వాతి చిరాగ్గా.
    'అందుకే నన్ను మీరేరుగరని చెప్పాను. నేను రోడ్డు పైన రోమియోనని మీరను కుంటున్నారు. కానీ షేక్స్ పియర్ రోమియో నని మీకు తెలియదు."
    "ఎవరో ఒకరు, మీరంటే నాకిష్టం లేదు"అంది స్వాతి.
    "మీ వెంటబడడమే నేను చేసిన తప్పయితే అదే మీ అయిష్టానికి కారణమయితే మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. కానీ ఈ ఒక్క రోజుకూ నాతొ కాసేపు మాట్లాడండి. నా బాధ అర్ధం చేసుకోండి. నాకో అవకాశమివ్వండి" అన్నాడు రాము.
    "చెప్పండి " అంది స్వాతి.
    "మీరు అందంగా వుంటారు. చాలామంది అందంగా వుంటారు. మీ అందం నాకు నచ్చింది. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. అది తప్పంటారా ?"
    "కాదు."
    "మీకు నేను నచ్చని పక్షంలో అందుకు కారణం తెలుసుకోగోరుతున్నాను . తప్పంటారా ?"
    "కాదు, కొన్నింటికి కారణాలుండవు. ఉన్నా కొందరికి చెప్పే శక్తి వుండదు. కొందరికి ఎన్టీ రామారావంటే ఇష్టం. కొందరికీ నాగేశ్వరరావంటే ఇష్టం. నాగేశ్వర్రావును అభిమానించే వారికి రామారావు బాగా నటించినా నచ్చదు. రామారావు అభిమానులకు నాగేశ్వర్రావు బాగా నటించినా బాగుండదు. అందుక్కారణం అడిగితె ఏమిటి చెప్పడం? టెస్టు.... అంతే! మీ ప్రవర్తన నాకు సంతృప్తి కరంగా అగుపించలేదు. మీరేమిటి? ఆమాట కొస్తే నాకు మగవాళ్ళేవరన్నా మంటే! ఆడదాని వంక మ్రుగాల్లా చూస్తుంటారు" అంది స్వాతి.
    "నేను మీకు నచ్చలేదు. అయినా  నేను మిమ్మల్ని అరాదిస్తున్నాను. తప్పా?"
    "తప్పు కాదు."
    "అయితే  నా యీ చిన్న కానుకను స్వీకరించి నన్ను ధన్యుడ్ని చేయండి" అంటూ ఓ చిన్న పెట్టె స్వాతికి అందించాడు. స్వాతి అప్రయత్నంగా ఆ పెట్టె అందుకుని చూసి అదిరిపడింది. అందులో డైమండ్ నెక్లెస్ ఉంది.
    "డైమండ్ నెక్లెస్. చాలా ఖరీదుంటుంది?" అంది స్వాతి ఆశ్చర్యంగా.
    "దాని ఖరీదు పాతిక వేలు మాత్రమే! కానీ దాని విలువ నా ప్రేమతో పోలిస్తే చాలా స్వల్పం" అన్నాడు రాము.
    "ఈ కానుక ఇవ్వడంలో మీ ఉద్దేశ్యం ?"
    "దురుద్దేశ్యం మాత్రం కాదు. మిమ్మల్ని డబ్బుతో కొనలేనని తెలుసు. మీ తాహతుకు తగ్గ బహుమతివ్వ గల స్తోమత నాకు లేదు. అయినా ధైర్యం చేశాను."
    స్వాతి మనసులో అతని పట్ల రవంత ఆదరభావం కలిగింది. పాతికవేలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని ఆరాధనతో కూడిన కానుకగా సమర్పించుకుంటున్న ఆ యువకుడి వంక కొత్త రకమయిన కుతూహలంతో చూసిందామె. ఆమె చూపులు రామును నిజంగా పరవశం కలిగించాయి.
    "మీరేం చేస్తుంటారు?" అనడిగిందామే.
    "పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్నాను. ఏమీ పని లేదు. మిమ్మల్ని చూసేవరకూ నా జీవితానికో లక్ష్య మంటూ లేదు. మిమ్మల్ని చూసేక మీ ప్రేమను సంపాదించడమే నా జీవిత లక్ష్యంగా తోచింది. మీకీ కానుకను ఎప్పుడో సమర్పించుకావలసింది. కానీ తండ్రి పోయిన దుఃఖం లో ఉంటారని భావించి మిమ్మల్ని సమీపించడాని క్కూడా యింతకాలమూ సాహసించలేక పోయాను"అన్నాడు రాము.
    "నా తండ్రి చావు గురించి దుఃఖించాలో కూడదో తెలియని స్థితి నాది" అంది స్వాతి.
    "అయన డబ్బు అన్యాయంగా కూడ బెడుతున్నాడు. డబ్బు కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు. అయన పద్దతులు నాకు నచ్చక ఆయన్నసహ్యించుకుంటుంటాను. కానీ నా అసహ్యన్నాయన లెక్కచేయడు. నేనంటే అయన కెంత ప్రేమో చెప్పలేను. నేనెన్ని తిట్టినా అయన కోపగించు కునేవాడు కాదు.
    ఒక్క ధన సంపాదన విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నూ నా ఇష్ట ప్రకారమే మసలు కునేవాడు. ఈ విషయం నేనన్నప్పుడల్లా - స్వాతీ , నీకు తెలియదమ్మా !డబ్బు సంపాదించడం చాలా కష్టం. లక్ష్మీ చంచలమయినది. ఎవరికీ , ఏవిధంగా లభిస్తుందో చెప్పలేం. కొందరికి నీతి ప్రవర్తన లభించవచ్చు. కొందరికి అవితీతి లభించవచ్చు. కొందరు నీతి కారణంగా నిర్భాగ్యులయిపొతే మరికొందరు అవినీతి కారణంగా అన్నీ పోగొట్టుకోవచ్చు. మనకు కలిసి వచ్చిన పద్దతిని విడనాడ్డం నాకిష్టం లేదు. డబ్బు విలువ అది పోయినప్పుడు గానీ తెలియదు, నీకు డబ్బు విలువ తెలియజెప్పడం కోసం కూడా డబ్బు పోవడం నా కిష్టం లేదు- అంటుండేవాడు నా తండ్రి.
    అన్యాయపు ధనంతో నా శరీరం పెరుగుతోందనీ ఊపిరి పీల్చు కుంటోందని అర్ధమై నాకు చాలా బాధగా వుండేది. అందుకని ఇప్పుడు నేనొక విచిత్రావస్థలో వున్నాను. అయన పోయినందున సంతోషించాలా, విచారించాలా అన్నది తేలలేదు. మనసుకు మాత్రం బాధగానే ఉంది."
    స్వాతి అంత వివరంగా మాట్లాడుతుందని రాము అనుకోలేదు. తననామే అత్మీయుడిగా భావించిందని అతను గ్రహించి సంతోషించాడు.
    "న్యాయానికీ, అన్యాయానికీ సరయిన అర్ధాలు లేవు. మనిషి మనిషికీ మారిపోతాయవి. మిమ్మల్ని ప్రేమించిన మీ తండ్రిని మీరూ ప్రేమించాలి. అయన ఎలా డబ్బు సంపాదిస్తేనేం -- సమాజంలో గౌరవం సంపాదించుకున్నాడు కదా! సమాజానికి మాత్రం అయన పద్దతులు తెలియవు గనుకనా. సమాజం ఆమోదించినది న్యాయమే అవుతుంది. అందువల్ల మీరు మీ తండ్రి అవినీతికి పాల్పడుతున్నాడని విచారించడం అనవసరం!" అన్నాడు రాము.
    "పోనీ అలా సరిపెట్టుకుందామన్నా లాభం లేదు . నా తండ్రి పాల్పడిన అవినీతి కారణంగానే నేనిప్పుడు చిక్కుల్లో పడ్డాను" అంది స్వాతి.
    "ఎన్నో లక్షలకు వారసురాలైన మీకు చిక్కులా?" అన్నాడు రాము.
    'అవినీతికి పాల్పడిన మా తండ్రి గారికి అన్నీ చిక్కులే. అయన గోవిందరావు గారి భాగస్వామి. నాన్నగారు పోవడంతో వ్యాపారాలన్నీ అయన చేతిలోకి వెళ్ళిపోయాయి. ఈ క్షణంలో అయన తలచుకుంటే మమ్మల్ని వీధిలో నిలబెట్టగలడు. కానీ అలా చేయడు. అంతకంటే దారుణమైన షరతు పెట్టాడు " అంది స్వాతి.
    "ఏమిటది?"
    'అయన కొడుకు ప్రభాకర్నీ పెళ్ళి చేసుకోవాలిట."
    రాము తేలిగ్గా నవ్వేసి "ఈడు జోడు బాగానే వుంటుంది గదా !" అన్నాడు.
    "డబ్బున్న చోట అవినీతి వుంటుంది. దాన్నించి తప్పించుకోవాలన్నదే నా ఆశ. ప్రభాకర్ సంగతి నాకు బాగా తెలుసు. అతడికి లేని దురలవాటు లేదు."
    "అయితే చేసుకోకండి.'
    "నేనీ పెళ్ళి చేసుకోకపోతే మా అమ్మ అన్నయ్య ఇబ్బంది పడతారు. వాళ్ళ గురించిన ఆలోచన లేకపోతే నాకే  బాధ లేదు" అంది స్వాతి.
    "మీరలా మమకారాలు పెంచుకోకూడదు. మీ తండ్రి కిలాగే మిగతా బంధువులు కూడా చచ్చిపోవచ్చు. వాళ్ళ గురించి మీ ఆశలు చంపుకోకండి.
    "నా ఆశల కోసం నా బంధువులు చావాలని నేననుకోవడం లేదు. అంతకంటే సులభమైన మార్గాలుంటాయి."
    'అది కాదు, మీ నాన్నగారు హత్య చేయబడ్డారు కదా. అలాగే మీ కుటుంబంలోని సభ్యులోక్కోక్కరే హత్య చేయబడితే?" అన్నాడు రాము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS