Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 21

 

    అనుకున్న పని సాధించడం కోసం వలలు పన్నడమూ, జిత్తులు వేయడమూ, రంగులు మార్చడమూ సుదర్శనరావు అలవాటు. అవి అమలు చేయడం వెంకట్రావు పద్దతి.
    సుదర్శనరావు ను చంపించాలని గోవిందరావు తీసుకున్న నిర్ణయం ఆవేశం వల్ల కలిగినది కాదు. ఆయనలో ఎంతో కాలంగా రేగుతున్న అనుమానాలా రోజు దృవపడ్డాయి.
    ఒక మనిషిని ఒకే స్థితిలో ఎక్కువ కాలముంచడం వల్ల అతడు ప్రమాదకారిగా పరిణమించే అవకాశమున్నదని ఆయనకు తెలుసు. "సెక్స్ అండ్ ఓన్లీ సెక్స్" నైట్ క్లబ్ కు కొత్త యజమానిని ఆయన నిర్ణయించి కొద్ది కాలం అయింది. సుదర్శనరావు నా స్థానం నుంచి ఎలా తొలగించాలా అని అయన ఆలోచిస్తున్నాడు.
    వెంకట్రావు కు తన కోరిక చెప్పాడాయన. వెంకట్రావు కు అనుకోకుండా రాముతో పరిచయం లభించింది. లక్ష రూపాయలకు బేరం పెట్టాడు. రెండు లక్షలకు గోవిందరావుకు చెప్పాడు.
    'ఈ వ్యవహారం లో ఒక లక్ష లాభం. కానీ లాభాన్ని రెండు లక్షలుగా కూడా చేయావచ్చేమో చూడాలి...." అనుకున్నాడు వెంకట్రావు.
    
                                    3
    "నమస్కారమండీ -- నా పేరు రాము" అన్నాడు రాము.
    సుదర్శనరావు చిరాగ్గా అతని వంక చూసి , "నాకు మీకేం పని?' అన్నాడు.
    రాము కంగారుగా అయన వంక చూసి "ఏమీ అనుకోవద్దు. మీ ముఖంలో మృత్యుకళ కనిపిస్తోంది. ఒకటి లేక రెండు రోజుల కంటే మీరు బ్రతకరనుకుంటాను...."అన్నాడు.
    సుదర్శనరావు ముందు కంగారు పడ్డా తమాయించుకుని "కారెక్కుతావా?" అన్నాడు.
    "మీరెక్కమంటే -- అలాగే!" అంటూ కార్లో కూర్చున్నాడు రాము. కారులో యింకెవ్వరూ లేరు. కారును సుదర్శనరావు డ్రైవ్ చేస్తున్నాడు.
    "నే నెవరో తెలుసా?" అన్నాడు సుదర్శనరావు.
    "తెలియదండి."
    "తెలిసే వుండాలి. లేకపోతె నా చావు గురించి ఎందుకు చెబుతావు?"
    "ఊరికే పని లేకుండా ఇక్కడ నిలబడ్డానండి. ఇంతలో మీరు కనబడ్డారు. చూడగానే మీ ముఖంలో మృత్యుకళ కొట్టచ్చినట్లు కనబడింది. వెంటనే చెప్పాలనిపించి చెప్పేశాను. మీరేమో కారేక్కమన్నారు " అన్నాడు రాము.
    "నీ మాటలు నేను నమ్మను. నువ్వు గోవిందరావు మనిషివి....' అన్నాడు సుదర్శనరావు. రాము గోవిందరావెవరో తెలియదన్నట్లుగా ఆశ్చర్యంగా ముఖం పెట్టడంతో..
    "నువ్వు నటిస్తున్నావు...." అన్నాడు సుదర్శనరావు.
    "పెద్దవాళ్ళ గొడవలు నాకు తెలియవు. మీకు నా మీద ఎందుకు అనుమానంగా వుందో తెలియడం లేదు. ఇంతవరకూ నేను మృత్యుకళ ఉందని చెప్పిన వాళ్ళెవ్వరూ బ్రతకలేదు. మీకు ముందుగా కాస్త సమయం ఉంటుందని చెబుతున్నాను. ఏమయినా వీలునామా వగైరా బాకీలుంటే తొందరగా రాసేసుకోండి. నామాట అబద్దం కాదు. నమ్మండి. మీకోసం చెబుతున్నాను..." అన్నాడు రాము.
    "నిన్ను పోలీసులకు అప్పజేపుతాను ." అన్నాడు సుదర్శనరావు.
    'అందువల్ల మీ ప్రాణాలు రక్షించబడవు. మిమ్మల్నేవ్వరు హత్య చేయ్యబోవడం లేదు. మీకు చావు వచ్చేస్తోంది. మిమ్మల్వేవ్వరూ రక్షించలేరు. రక్షిస్తే ఆ పరమ శివుడే మిమ్మల్ని రక్షించగలగాలి.  వెళ్ళి ఆ శివుడికో కొబ్బరికాయ కొట్టుకుని అందులో నాకో చిన్న ముక్క పెట్టి తినగలిగినంత మీరు తినండి. అదృష్టం బాగుంటే ప్రాణాలు దక్కుతాయి. లేదూ కర్మ ఫలాన్ని తప్పించలెం...." అన్నాడు రాము.
    సుదర్శనరావు అతని మాటలకూ జవాబివ్వకుండా ఆలోచనలో పడ్డాడు. ఎవరీ మనిషి? ఎందుకిలా నన్ను పలకరించి భయపెడుతున్నాడు? గోవిందరావు పంపిన మనిషి కాకపోతే ఇతనిలా ఎందుకు చెబుతున్నాడు? నిజంగానే తన ముఖంలో మృత్యు కళ కనబడుతోందా? అన్ని విధాల ఆరోగ్యంగా ఫీలవుతున్న అతను ఎందుకు చచ్చిపోతాడు?
    ఇలా ఆలోచిస్తూనే సుదర్శనరావు కారును అప్రయత్నంగానే ఓ శివాలయం ముందు ఆపాడు. గుడి ముందు కొబ్బరి కాయలు అమ్ముతున్నారు. సుదర్శనరావో కాయ కొని గుళ్ళో కి వెళ్ళాడు. రాము ఆయనతో పాటు గుడిలోకి వెళ్ళలేదు. అయన కోసం బయటే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. కాసేపటికి చేతిలో కొబ్బరి చెక్కతో తిరిగి వచ్చాడు సుదర్శనరావు.
    "నాక్కాస్త ప్రసాదం పెడితే నా దారిన నేను పోతాను....' అన్నాడు రాము.
    సుదర్శనరావు అక్కడి కక్కడ చెక్క బద్దలు కొట్టి తానో ముక్క నోట్లో వేసుకుని రాముకో ముక్క యిచ్చాడు. "వెంటనే ఇంటికి వెళ్ళి వీలునామా రాసుకోండి. మీ ముఖంలో మృత్యుకళ పెరుగుతోంది " అన్నాడు రాము.    
    ఈసారి సుదర్శనరావు కు నిజంగానే భయం వేసింది. అయన కారెక్కి స్పీడుగా డ్రయివ్ చేసుకుంటూ ఇల్లు చేరాడు.
    ఇల్లు చేరాక ఆయనకు చాలా  ధైర్యం వచ్చింది. తనింట్లో  తనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. పరిస్థితులు చూస్తుంటే తానో రెండు మూడు రోజుల పాటు ఇల్లు కదలక పోవడం మంచిదే మోనని ఆయనకు అనిపించింది.
    ఎందుకయినా మంచిదని అయన లాయర్ కి కూడా ఫోన్ చేశాడు.

                                     4
    "డబ్బు సిద్దంగా వుందా?" అన్నాడు రాము.
    "పని పూర్తయ్యాకనే కదా డబ్బిస్తానని చెప్పాను" అన్నాడు వెంకట్రావు.
    "పని పూర్తయింది గాబట్టే డబ్బు సంగతి అడిగాను"  అన్నాడు రాము.
    "ఏడిసినట్లుంది . ఈరోజు సుదర్శనరావు ఇల్లు కదలలేదు ."
    "శవం కదలడం ఎక్కడయినా విన్నారా?"
    "లేదు."
    'అయితే సుదర్శనరావు ఇల్లు కదలడు."
    వెంకట్రావు ఆశ్చర్యంగా రాము వంక చూస్తూ -- 'అయితే సుదర్శనరావు శవంగా మారేడంటావ్ ?" అన్నాడు.
    "ఓసారి వాళ్ళింటి కి ఫోన్ చేసి చూడండి" అన్నాడు రాము.
    వెంకట్రావు వెంటనే రిసీవర్ ఎత్తి ఓ నంబర్ డయల్ చేసి "హలో, సుదర్శనరావు గారున్నారా , అర్జంటుగా మాట్లాడాలి" అన్నాడు. అవతలి నుంచి వచ్చిన సమాధానం వింటూనే అతను తడబడి "అయాం వెరీ సారీ" అంటూ ఫోన్ పెట్టేసి రాము వంక అదోలా చూశాడు.
    ఈ పర్యాయం అతనికి రామును చూస్తె భయం కలిగింది. గుండెలు తీసిన బంటులా కనిపించాడు. రాము అతనికి.
    'చాలా ఆశ్చర్యం గా వుందే , ఎలా చేశావీ హత్య ?" అన్నాడు వెంకట్రావు .
    "నేను హత్య చేయడమేమిటి? సుదర్శనరావు చచ్చి పోయాడు. అంతేగా ."
    'అవును, కానీ అయన చచ్చి పోతాడని నీకు ముందే తెలుసు...."
    "చచ్చి పోయేముందు మనుషుల ముఖాల్లో మృత్యు కళ వస్తుంది. అది అందరూ కనిపెట్టలేరు. ఓ గురువుకు శుశ్రూష చేసి నేర్చుకున్ననది, సుదర్శనరావు ముఖంలో మృత్యుకళ చూసేకనే నేను మీ దగ్గరకు వచ్చాను -" అన్నాడు రాము.
    'అతన్ని నేను చంపాలను కుంటున్నట్లు నీకెలా తెలుసు?"
    రాముకు జవాబెమీ తోచినట్లు లేదు. 'అది మీకు చెప్పకూడదు రహస్యం " అని వూరుకున్నాడు.
    "ఇప్పుడు నేను నీకు డబ్బివ్వను . ఏం చేస్తావ్ ?" అన్నాడు వెంకట్రావు.
    "నిన్ను చంపేస్తాను " అన్నాడు రాము కోపంగా.
    "చంపితే జైలుకు వేడతావ్"
    "సుదర్శనరావు చస్తే వెళ్ళాను గనుకనా, నిన్ను చంపితే వెళ్ళడానికి ?"
    'అంటే సుదర్శనరావు ను చంపినట్లే, నన్నూ చంపుతావన్నమాట. దీన్ని బట్టి హత్య చేయడానికి నీకేదో విచిత్రమైన పద్దతి ఉన్నదనిపిస్తోంది. మృత్యుకళ అన్నమాట అబద్దం."
    రాము నవ్వాడు. "నాకిప్పుడు నీ ముఖంలో మృత్యు కళ కనిపిస్తోంది. బహుశా నువ్వు కూడా ఒకటి రెండు రోజుల కంటే బ్రతకవేమో?"
    వెంకట్రావు కంగారుగా " నీ డబ్బు నీకిస్తాను గానీ ఆ మాట మాత్రం అనొద్దు" అంటూ వోసారి లోపలికెళ్ళి చొన్న సంచీతో తిరిగి వచ్చాడు.
    "సరిగ్గా లక్ష . లెక్కపెట్టుకో " అన్నాడు వెంకట్రావు.
    రాము లెక్క పెట్టుకుని తృప్తిగా తలాడించాడు.
    "అడ్వాన్స్ తీసుకోకుండా పని చేశావ్. మోసం చేస్తే ఏం చెద్దువు?" అన్నాడు వెంకట్రావు.
    "ఏదయినా వెధవ పని చేయడానికి నువ్వో మాంత్రికుడి సాయం తీసుకున్నావనుకో. ఆ మాంత్రికుడి శక్తులు స్వయంగా తిలకించేక వాణ్ని మోసం చేయాలంటే నీకు భయంగా వుంటుంది. నా విషయంలోనూ అంతే! నేను మాంత్రికుడి లాంటి వాణ్ని " అన్నాడు రాము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS