Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 21

 

    ఆ నాటి నుంచి శ్రీధర్ బాబు నేను మళ్ళీ ఎన్నడూ వాగ్యుద్ధం చేయలేదు. అతను నన్ను పంతులూ అని మరి పిలవనందువల్ల నేనతన్ని బావా అనవలసిన అవసరం కూడా రాలేదు. మా స్నేహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినా శ్రీధర్ బాబు కు మూర్కత్వముందనీ అతను కాస్త ప్రమాదకరమైన వ్యక్తీ అనీ అన్న విషయం మాత్రం నేను విస్మరించ లేదు....
    జరిగిన విషయం ఈరోజు మధ్యాహ్నం నా చెవిన పడింది. నిన్న సాయంత్రం ప్రపుల్ల అనే అమ్మాయిని శ్రీధర్ బాబు చేయి పట్టుకుని లాగి కన్ను కొట్టాడట. పుల్లారావు ప్రపుల్లకు అన్న. అతను తన మిత్రబృందం సమక్షంలో శ్రీధరబాబు చెల్లెలికి తనద్వారా నడి రోడ్డుపై -- అలనాడు దౌపదికి జరుగబోయి ఆగిపోయిన అవమానం - ఆగకుండా జరుగబోతుందనీ- అందుకోసం తను బయల్దేరి శ్రీధర బాబు ఊరికే వెళ్ళ బోతున్నాననీ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన రాకెట్ కంటే వేగంగా పయనించి శ్రీధర్ బాబుని చేరుకుంది.
    ఆ రాత్రి గదిలో నావంక చూసి --"వాడికి మూడింది!" అని శ్రీధర్ బాబు అన్నప్పుడు వాడంటే పుల్లారావని నాకు అర్ధమైంది. పైకి అనకపోయినా --"శ్రీధర్ బాబు -- నీ ప్రవర్తన మూలంగా నీ చెల్లెల్ని నలుగురి నోళ్ళల్లోనూ పారవేస్తున్నావు.... అనుకున్నాను నాలో నేనే.
    ఆ మర్నాడు చావు తప్పి కన్ను లోట్టపోయిన దశలో బైట పడ్డాడు పుల్లారావు. శ్రీధర బాబు చాలా తెలివిగా వ్యవహరించి మరీ పగ తీర్చుకున్నాడు. కొట్టినదేవరో సాక్ష్యం దొరక కుండా పుల్లరావును ఒంటరిగా [పట్టాడు. పోలీసు పద్దతిలో వళ్ళంతా కుళ్ళ బొడిచి వదలి పెట్టాడు. ఏమన్నా గొడవ చేసినా మరోసారి తన చెల్లెలి ప్రసక్తి తీసుకువచ్చినా -- ప్రాణాలు దక్కవని హెచ్చరించాడు.
    
                                     2
    చాలా కాలం తర్వాత శ్రీధరబాబు ని మళ్ళీ చూశాను. అనుకోకుండా అతను కళ్ళబడగానే ఈ పాత జ్ఞాపకాలన్నీ మెదడులో కదిలాయి.
    నా ఉద్యోగానికి సంబంధించిన ఒక పని మీద నేనా ఊరు వెళ్ళడం సంభవించింది. రైల్వే స్టేషన్ లోనే అనుకోకుండా శ్రీధర్ బాబు నాకు తటస్థపడ్డాడు. నన్ను చూస్తూనే గుర్తు పట్టి -- 'అరె! నువ్వా --" అన్నాడు నమ్మలేనట్లుగా.
    "అవును, నేనే --" అన్నాను నేనూ అనుకోకుండా మా కలయిక జరగడానికి ఆశ్చర్యపడుతూ.
    ఇద్దరం ఓక నిముషం పిచ్చాపాటి మాట్లాడుకున్నాం . అతను ఒక కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. ఒక ఊరంటూ స్థిరం లేదు. ఎప్పుడూ ఏ క్షణంలో ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుందో తెలియని ఉద్యోగమది. తన మనస్తత్వానికి సరిపడ్డ ఉద్యోగమని అతనన్నాడు. గతవారం రోజులుగా ఈ ఉళ్ళో ఉంటున్నాడట. ఏదో మేగజైను ఎక్కడా దొరక్క స్టేషన్లో దొరుకుతుందేమోనని చూద్దామని వచ్చి నాకు తటస్థ పడ్డాడు. నాకు ఆ ఉళ్ళో రెండు మూడు వారాల పాటుంటే పని ఉన్నదని విన్నాక అతను నేను మరెక్కడికి వెళ్ళడానికి వీలులేదని తన గదికి వచ్చి అక్కడే ఉండాలనీ పట్టు పట్టాడు.
    నేను అతని గదికి వెళ్ళాను. అక్కడ కాస్సేపు ఇద్దరం పాత జ్ఞాపకాలు వేసుకున్నాం. అప్పుడు నాకు అతని చెల్లెలు పార్వతి గుర్తు కొచ్చి -- ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంటున్నదీ అడగలాని పించి నోటి చివరి దాకా ప్రశ్న లాగా తమాయించుకుని మానేశాను.
    'అప్పటికీ ఇప్పటికీ నా జీవితంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదోయ్ , సత్రం భోజనం -- మఠం నిద్ర ! ఒక టైముకి ఆఫీసుకు వెళ్ళాలని లేదు. ఈరోజు సెలవు అని చెప్పుకుందుకా ;లేదు- నా ఉద్యోగం ఫలానా ఉళ్ళో అనుకుందుకు లేదు,. నా అలవాట్లు మారలేదు.పద్దతులు మారలేదు --" అన్నాడతను.
    "అదృష్టవంతుడివి! నువ్వు కోరుకునే పద్దతి జీవితం నీకు లభించింది. నాది మామూలు రొటీన్ జీవితమే అనుకో! ఏ థ్రిల్స్ లేవు" ఈ మాటలన్నప్పుడు సుమారు ఓకే రోజు వ్యవధిలో నేనూహించని థ్రిల్స్ నా జీవితంలో ఎదురు కానున్నవన్న సంగతి నిజంగా నాకు తెలియదు.
    ఆరోజుకు విశ్రాంతి తీసుకున్నాను. శ్రీధరబాబు తన కాలమంతా ఆరోజు నాతోనే గడిపాడు. ఇద్దరం హోటల్ భోజనం చేశాం. ఓ చెత్త సినిమా చూశాం. అన్నింటికీ శ్రీధర బాబే డబ్బు పెట్టాడు.
    ఆ రాత్రి ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కాలం గడిపి కాస్త అలష్యంగానే నిద్రకు పడ్డాం.
    మర్నాడు లేవడానికి బద్ధకం అనిపించింది . కానీ నేను నా ఆఫీసు వ్యవహారం నిమిత్తం బయటకు వెళ్ళవలసి ఉన్నది. అందువల్ల పదయ్యే సరికి తెమిలి ఇంట్లోంచి బయట పడ్డాను. శ్రీధరబాబు నాకు తన రూము డూప్లికేట్ తాళం ఇచ్చి తను మళ్ళీ నిద్ర కు పడ్డాడు.
    నా పనులు తెమిలి రూమ్ కి వచ్చేసరికి సాయంత్రం మూడున్నర గంటలైంది. నేను వెళ్ళే సరికి గది తాళం వేసే ఉంది. నేను తాళం తీసి గదిలో అడుగు పెట్టాను. తలుపులు వేసుకుని నెమ్మదిగా బట్టలు మార్చుకోబోతుండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది.
    తలుపు తీశాను. పోస్ట్ మాన్ ఒక టెలిగ్రాం నా చేతి కందించి నా చేత సంతకం పెట్టించుకుని వెళ్ళిపోయాడు. టెలిగ్రాం శ్రీధర బాబుకి. ఏం కొంప మునిగే విశేషమోనని విప్పి చదివాను. "మీట్ సిస్టర్ సెవెన్ టీన్త్ హైదరాబాద్ ఎక్స్ ప్రెస్" అని ఉంది అందులో.
    ఆ ప్రయత్నంగా నేనొకసారి నావాచీ చూసుకున్నాను. పదహారవ తేదీ చూపిస్తోంది. మళ్ళీ తలుపులు వేసి- శ్రీధర బాబు చెల్లెలు రేపు ఇక్కడకు రాబోతుందన్న మాట -" అనుకున్నాను.
    నిజం చెప్పొద్దూ నాకు అతని చెల్లెల్ని చూడాలన్న కాంక్ష చాలా కాలంగా ఉంది. శ్రీధరబాబుకి ఒక సంవత్సరం పాటు రూమ్ మేటుగా ఉన్నప్పటికీ నాకు అతను కనీసం తన చెల్లెలి ఫోటో అయినా చూపలేదు. చూపవలసిన అవసరముందని కాదు కానీ ఎన్నో పర్యాయాలు మా ఇద్దరి మధ్యా ఆమె ప్రసక్తి రావడం కారబంగా నాలో ఆమెను చూడాలన్న కుతూహలం నానాటికీ బలపడి శ్రీధరబాబు కనీసం ఆమె ఫోటో అయినా నాకు చూపలేదే అని బాధపడుతూ ఉండేవాడిని. ఏమయితేనేం ఇన్నాళ్ళకు నాకోరిక నెరవేరబోతోంది.
    టెలిగ్రాం టేబుల్ మీద పెడదామని వెళ్ళి ఉలిక్కి పడ్డాను. టేబిల్ మీద శ్రీధర బాబు రాసిన ఉత్తరమొకటి కనపడింది. అది అతను నన్నుద్దేశించి రాసినది. అనుకోకుండా అతను ప్రయాణం కట్టవలసి వచ్చిందట. తను తప్పక రెండు మూడు రోజుల్లో వెనక్కి రాగలనని అంత వరకూ నేను తన గదిలోనే ఉండవలసిందని అతను రాశాడు.
    చాలా తమాషా అయిన సందర్భం ఏర్పడినట్లు నాకు తోచింది. తీవ్రంగా ఆలోచనలో పడ్డాను.
    శ్రీధరబాబు ఉంటున్న వాటా మొత్తం రెండు పెద్ద గదులు ఒక చిన్న వంటిల్లు. ఎవరైనా ఒక రిద్దరు అతిధులుగా వస్తే ఆదరించడానికి సరిపడ్డ నివాసమే అతనిది. అయితే అతను లేని సందర్భంలో అతని చెల్లెలు వస్తే మేమిద్దరం అదే వాటాలో ఉండడం కష్టమే మరి.
    ఇంతకీ ఆమెను స్టేషన్ కి వెళ్ళి రిసీవ్ చేసుకునేదేలా? ఆమెను నేనెన్నడూ చూసి ఉండలేదు. ఆమె తనకు తానుగా సరాసరి గదికి రాగలదో లేదో తెలియదు. ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాల్సి ఉంటుంది?
    ఏం చేయ దల్చుకున్నా బాగా ఆలోచించాకే ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది. ఎందుకంటె ఇది శ్రీధర బాబు చెల్లెలితో వ్యవహారం!
    నేను మళ్ళీ చొక్కా వేసుకొని టెలిగ్రాం చేత్తో పట్టుకుని తలుపులు తీసుకొని గది బయటకు వచ్చాను. వెదక బోయిన తీగ కాలికి తగిలినట్లుగా నిన్ననే నాకు పరిచయమైన ఇంటాయన కనపడ్డాడు. నన్నూ నా చేతిలోని టెలిగ్రాం నూ చూస్తూ అయన గాబరాగా - "ఏమిటీ మళ్ళీ మరో టేలిగ్రామా?" అన్నాడు. అయన మాట వినగానే నాకూ గాబరా కలిగింది. శ్రీధర బాబు కి గాని కొంప తీసి ఇంకో టెలిగ్రాం వచ్చి ఉండలేదు గదా - అని కంగారు పడ్డాను.
    ఇంటాయన నా చేతులోంచి లాక్కొన్న విధంగా టెలిగ్రామ్ తీసుకుని చదివి తేలిగ్గా నిట్టూర్చి -- "హమ్మయ్య -" అని ఒక్క నిమిషం ఆగి - "పొద్దున్నే నాకు ఓ టెలిగ్రామ్ వచ్చింది - మా ఆవిడకు సుఖ ప్రసవమై కొడుకుని కన్నదని , అంత మంచి వార్త వచ్చిన తర్వాత మరో టెలిగ్రామ్ వెంటనే వచ్చిందంటే గాబరా కలగడం సహజమే కదండీ! ఏమయితేనేం -- మీతో సరదాగా ఓ రెండు రోజులు కాలక్షేపం చేయడానికి లేకుండా నేను మా అత్తారింటికి వెళ్ళ వలసి వస్తోంది --"అని హటాత్తుగా ఏదో గుర్తు కొచ్చిన వాడిలా - "ఇంతకీ మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు!" అన్నాడు.
    నిన్ననే ఇంటాయన అన్నాడు నన్ను చూసి --"నేనూ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, కాబట్టి ఓ రోజు సరదాగా మనమంతా అడ్డాటలో కూర్చుందాం -" అని అది గుర్తుకొచ్చి మన మెప్పుడెం చేయబోయేది మనకే తెలియదు గదా అనుకున్నాను. నేను వచ్చిన పని ఇప్పుడీయనకు చెప్పి ప్రయోజనం లేదు. శ్రీధర్ బాబు వచ్చేవరకూ అతని చెల్లెల్ని అతని వాటాలో మకాం పెట్టించి- నేనీయనతో కాలక్షేపం చేద్దామనుకున్నాను. ఊరి ప్రయాణం హడావుడిలో ఉన్న ఈయనకు శ్రీధరబాబు లేని సమయంలో అతని చెల్లెలు రాబోతున్న సందర్భం తెలియనివ్వడం అనవసరమని తోచింది. అందుకే కాస్త మాట మర్చి -- "అబ్బే ఏమీ లేదు. ఉబుసు పోక వచ్చాను. అంతా నా పాదం మంచిదంటారు. చూశారా, నేను మీ ఇంట్లో కాలు పెట్టాను మీరు కొడుకు పుట్టిన వార్తా అందింది. కంగ్రాచ్యులేషన్స్!" అన్నాను.
    "థాంక్సండీ-" అన్నాడాయన.
    "ఇంతకీ ప్రయాణమంటున్నారు- ఎన్నాళ్ళు ఏమిటీ మకాం!"
    "మూడు వారాలు!" అన్నాడాయన.
    "హతోస్మీ!" అనుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS