Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 21


    "ఛా-ఆఖరికి కన్నతండ్రిని అనుమానించే స్థితికి దిగజారేడన్నమాట!" అంది సుజాత బాధగా.
    "అవునే తల్లీ - ఆ పిల్లగురించి వాడు బెంగపెట్టుకుని పిచ్చివాడైపోతున్నాడు. వాడనే మాటలకు ఆయనేమో కుమిలిపోతున్నారు. ఇద్దరి బాధా చూడలేక నేను అవస్థ పడుతున్నాను. నువ్వు కొన్నాళ్ళిక్కడ వుండి వాణ్ణి మనుషుల్లోకి తీసుకురావాలి" అంది సుజాత తల్లి.
    "మీవల్ల కానిపని నావల్ల అవుతుందా?" అంది సుజాత సందేహంగా.
    "నువ్వంటే వాడికి అభిమానం ఈ ప్రేమ వ్యవహారమంతా నీకు తెలియదు. కాబట్టి వాడికి నీ మీద అనుమానం కూడా వుండదు. వెళ్ళు వాడితో మాట్లాడు."
    "అన్నయ్యెక్కడున్నాడు?" అనడిగింది సుజాత.
    తల్లి చెప్పింది.

                                     5

    రవి పడక్కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. అతడి గెడ్డం బాగా మాసింది. కళ్ళు లోతుకు పోయివున్నాయి.
    "అన్నయ్యా!" అని పిలిచింది సుజాత. కానీ రవికి వినబడినట్లులేదు. ఆమె రెండుమూడుసార్లు పిలిచేక అతను ఉలిక్కిపడి సుజాతను చూశాడు. కానీ వెంటనే గుర్తు పట్టలేదు. అతని మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లులేదు. "ఎవరూ?" అన్నాడు.
    "నేను అన్నయ్యా సుజాతను!" అంది సుజాత.
    రవిలో చలనం కలిగింది. అతను చటుక్కున కుర్చీలోంచి లేచి "నువ్వా-ఎప్పుడొచ్చావే?" అన్నాడు.
    సుజాత ఒక్కపరుగున అన్నయ్యను సమీపించి "ఇదేమిట్రా ఇలాగైపోయావ్?" అంది.
    రవి హఠాత్తుగా భోరున ఏడ్చేశాడు. సుజాత యిది ఊహించలేదు. అతను వెక్కి వెక్కి ఏడుస్తూంటే ఆమెకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి కాని మౌనం వహించింది.
    "ఏం జరిగిందన్నయ్యా?" అడిగిందామె.
    "నాన్న నాకు చాలా అన్యాయం చేశాడు. ఈ జన్మకు సుఖంలేకుండా చేసేశాడు" అన్నాడు రవి ఇంకా ఏడుస్తూనే.
    "అసలేం జరిగింది?" అంది సుజాత.
    రవి క్లుప్తంగా ఆమెకు జరిగింది చెప్పాడు. అతను చెప్పిందానికీ తల్లి చెప్పిందానికీ సరిపోయిందని సుజాత గ్రహించింది.
    "పెళ్ళికి ఒప్పుకుంటే మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నా డనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నాతో నవ్వుతూ మాట్లాడి-చాటుగా నా శాంతిని మూడోకంటికి తెలీకుండా హత్య చేయించేశాడు. ఇప్పుడేమో ఏమి ఎరుగని నంగనాచిలా తనకేమీ తెలీదంటున్నాడు" అన్నాడు రవి.
    "నువ్వు అనవసరంగా నాన్నను అనుమానిస్తున్నావేమోరా" అంది సుజాత.
    "నీకు తెలియదే - ఆయన కోల్డుమర్డరర్!" అన్నాడు రవి.
    రవి ఇలా అంటాడని ఊహించని సుజాత "నువ్వు ఊహిస్తున్నావా, నీ కళ్ళతో ఏమైనా చూశావా?" అని అడిగింది.
    "నిప్పులేందే పొగరాదు. నాన్న ఎంతటి నయవంచకుడో ఊరందరికీ తెలుసు. అలాంటి వాడికి కొడుకుగా పుట్టడం నా దురదృష్టం" అన్నాడు రవి.
    "మన ఐశ్వర్యాన్ని చూసి ఊళ్ళో వాళ్ళసూయపడి రకరకాలుగా చెప్పుకుంటారు. మనకు వాళ్ళతో నిమిత్తం లేదు. ఆ మాటకొస్తే డబ్బున్నవాళ్ళు, పేరున్నవాళ్ళూ, ఎంతో కొంత పాపం చేస్తూనే వుంటారు. నాన్న గురించి ఎవరో చెప్పుకోగా విన్నావే కానీ నువ్వు చూసి తెలుసుకున్నదేమీలేదు గదా! నీ దుఃఖంలో నువ్వు అన్నీ మరిచి పోయి నిన్నే ప్రాణంగా చూసుకునే నాన్నను అనుమానిస్తున్నావు. అందువల్ల నువ్వు సాధించేదేముంది నాన్నగారి మనసును బాధపెట్టడం తప్ప! నువ్వు నిజంగా శాంతిని ప్రేమిస్తున్నట్లయితే - ఆమెను చంపినవాడెవరో తెలుసుకుందుకు ప్రయత్నించు. వాణ్ణి ఉరికంబం ఎక్కించడానికి ఏర్పాట్లు చేయి. అంతేకానీ ఇలా గదిలో కూర్చుని ఏడిస్తే ఏమీలాభం?" అంది సుజాత.
    "అయితే నమ్మేం చేయమంటావ్? నా శాంతి ఇక లేదని తెలియగానే నా నవనాడులూ కృంగిపోయాయి. నా శక్తి క్షీణించిపోయింది. బుర్ర పనిచేయడం మానేసింది" అన్నాడు రవి.
    "అసలు శాంతి చచ్చిపోయిందని ఎలాగనుకుంటున్నావ్?" అంది సుజాత.
    "బ్రతికుంటే నన్ను విడిచి వుండలేదు నా శాంతి!"
    "అటువంటి భ్రమ నీక్కలిగించి ఎక్కడికైనా వెళ్ళి పోయిందేమో?"    
    "అందువల్ల ఆమెకు ప్రయోజనం?" అన్నాడు రవి.
    సుజాతకు సమాధానం వెంటనే దొరకలేదు. "శాంతి నువ్వనుకున్నంత మంచిది కాదేమో-నీకంటే డబ్బున్న మరొకడు తటస్థపడితే నిన్నిలా అర్ధాంతరంగా వదిలేసి తను వాడితో పోయిందేమో!" అంది ఓ క్షణం ఆలోచించి.
    "సుజాతా" రవి గట్టిగా అరిచాడు "శాంతి గురించి ఎవరైనా యిలా మాట్లాడితే నా గుండె బ్రద్దలైపోతుంది."
    "నిప్పులేనిదే పొగరాదంటారు. ఊళ్ళో కొందరు శాంతి గురించి యిలా కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళమాటలు నమ్మకూడదనుకుంటే నువ్వు నాన్న విషయంలో వాళ్ళనుకునే మాటలు కూడా నమ్మకూడదు" అంది సుజాత.
    ఈ మాటలు రవిపై బాగా పనిచేశాయి "చెల్లాయ్-నిజంగా నా శాంతి అలాంటిది కాదు. నా ఆల్భంలో శాంతి ఫోటోలు ఎన్నో వున్నాయి. ఒక్క దాంట్లో కూడా అమాయకత్వం తప్ప మరేమీ కనపడదు ఆ ముఖంలో. చూపిస్తాను దా" అంటూ అతనామెను ఒక బీరువావద్దకు తీసుకువెళ్ళి అందులోంచి ఆల్భం తీసి పెద్ద సైజూలో వున్న శాంతిఫోటోను చూపించి "ఇప్పుడు చెప్పు నువ్వు. శాంతి మంచిది కాదంటావా?" అన్నాడు.
    ఆ ఫోటో చూస్తూ ఉలిక్కిపడింది సుజాత. ఆ ముఖం ఎంతో పరిచయమైనదని ఆమె కనిపెట్టింది. అనుక్షణం తనను వెంటాడే ఆ కలలో కాళ్ళూ చేతులూ బంధింపబడి, మూతికి టేపువేయబడి నిస్సహాయపరిస్థితుల్లో గుండెల్లో కత్తి దిగబడి మరణించిన అభాగ్యురాలు నిజంగా ఈ ఇలలో వున్నదా? తను మళ్ళీ కలకంటోందా లేక ఇది నిజమా?
    "చెప్పు చెల్లాయ్ ఈమెను చూస్తే నీకేమనిపిస్తోంది?" అన్నాడు రవి ఆవేశంగా.
    "ఇది చాలా ఆశ్చర్యంగా వుందన్నయ్యా - నీ ప్రియురాలు శాంతిని నేను కలలో చూశాను. ఆ కలలో ఆమె అమానుషంగా హత్య చేయబడింది" అంది సుజాత.
    రవికి ఆమె మాటలు అర్ధంకాలేదు.

                                  6

    సుజాత చెప్పిన కధంతా ఇంటిల్లిపాదీ ఆశ్చర్యంగా విన్నారు.
    "ఇది నమ్మశక్యంగా లేదు" అంది సుజాత తల్లి.
    "నేనే నమ్మలేకపోతున్నాను" అంది సుజాత.
    "సుజాత క్కూడా మనసులో ఏ మూలనో నాకున్న లాంటి నమ్మకమే వుంది. హంతకుడిది ఎడమచేతి వాటం. నాన్నదీ అంతే! అన్నాడు రవి.
    సుజాత తండ్రి ఎడమచేయి గాలిలోకి లేచింది-కానీ ఎవరినీ దండించకుండానే అది క్రిందకు వాలిపోయింది-వివేకం హెచ్చరించడంతో.
    "నా కలే నిజమయితే-నేను హంతకుణ్ణి చూశాను. హంతకుడికీ నాన్నకూ పోలికలు లేవు" అంది సుజాత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS