Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 21

 

    "కౌముది నవ్వి -- "ఇప్పుడెం చేయగలదు మీనాక్షి?  ఇన్నేళ్ళ జీవితానుభవం లో అమెపగ ఎప్పుడో చచ్చిపోయింది. నా దగ్గర ఆమె కిప్పుడు జీవితం ఎంతో బాగుంది. పోగొట్టుకున్న వైభవం నా కారణంగా అమెకిపుడు మళ్ళీ లభించింది. రెండు సంవత్సరాలుగా నాతో వుంటూ నామీద మమకారం పెంచుకుంది. ఇప్పుడామెకు ఇంకే కోరికలూ లేవు. పాత పగలు-- మొదలే లేవు" అంది.
    రమణరావు  సాలోచనగా తల పంకించి -- "మీరిప్పుడెక్కడుంటున్నారు?' అనడిగాడు.
    "ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను. మీనాక్షి ద్వారా మా అమ్మ కధ విన్నప్పట్నుంచీ నా హృదయం రోశయ్య మీది పగతో పట్టు తప్పింది. వాడు చనిపోయిన సందర్భం కావడం వల్లనే నేను నిన్ను నాకింత దగ్గరగా రానిచ్చాను. ఈక్షణాలు మనం సరదాగా గడుపుదాము. మరో ఆలోచన వద్దు" అంది కౌముది.
    ఆమె ప్రోత్సహిస్తుంటే రమణరావు ఆమెను బిగి కౌగిలిలో బంధించాడు.

                                    8
    ఓరాత్రి వేళ  కళ్ళు తెరిచి చూసింది కౌముది. ఆమెకు పక్కలో రమణరావు  కనిపించలేదు. ఏమయ్యాడు చెప్మా అనుకుంటూ మంచాన్నానుకునే వున్న స్వేచ్ నొక్కింది.
    గదంతా ప్రకాశవంతమైంది.
    కౌముది వళ్ళు విరుచుకుంటూ లేచి బాత్ర్రూం కి వెళ్ళింది. అతడు అక్కడ లేడు. ఆమె తర్వాత గది తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు దగ్గరగా వేసి వుంది.
    "ఎందుకో బైటకు వెళ్ళి వుంటాడు. అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడేమిటి?"అనుకొంటూ తలుపు బోల్టు వేసింది కౌముది. ఆమె తిరిగి మంచాన్ని సమీపిస్తుంటే దాని క్రింద వున్న పెట్టి అప్రయత్నంగా ఆమె కళ్ళ బడింది. అందులో రోశయ్య శవం వున్నదన్న విషయం హటాత్తుగా ఆమెకు గుర్తుకొచ్చింది.
    అ హోటల్ గదిలో ఒంటరిగా తను! తనకు తోడుగా ట్రంకు లోని ఓశవం.
    రమణరావు ఏమయ్యాడు?
    అలా నిలబడి ఆలోచిస్తున్న ఆమె కళ్ళకు ట్రంకు మూట పైకి లేస్తున్నట్లు కనబడింది. అనుకోకుండా ఆమె కాళ్ళు వణికాయి.
    పెట్టిన మూత ఎలా కదుల్తోంది?
    ఒకవేళ రోశయ్య ఇంకా పూర్తిగా చావలేదా? కొనప్రాణంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడా?
    పెట్టె మూత కొంచెం మాత్రం పైకి లేచి మంచానికి తగులుకొని మళ్ళీ పడిపోతోంది.
    కౌముది నిశ్చేష్టురాలై ఆ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయింది. తనుభయపడడం లేదు.... మూత మంచానికి తగులుతున్న చప్పుడు కూడా వినబడుతోంది. పెట్టెలోని శవం కదుల్తోంది. కారణం ఏమిటి?
    స్వతహాగా కౌముది ధైర్యవంతురాలు. కానీ ఇప్పుడామె ధైర్యం నీళ్ళు గారి పోతోంది.
    కౌముది చూస్తుండగానే పెట్టె మూత కొద్దిగా తెరుచుకుని  మంచానికి తగిలి అలాగే ఆగింది. ఆ కాస్త కాళీ లోంచి ఓ చేయి బైటకు వచ్చింది. ఆ చేతిని చూస్తూనే కౌముది అప్రయత్నంగా కెవ్వుమని అరిచింది.
    సుమారు మోచేతి దాకా బయటకు వచ్చిన ఆ చేయి ఎంతో నల్లగా వుంది. మణికట్టు వరకూ దట్టంగా వున్న  నల్లటి వెంట్రుకలు....
    రోశయ్య చేయి అలా లేదు!...ఇది రోశయ్య చెయ్యి కాదు.
    కౌముది అలా చూస్తూ నిలబడింది. ఆ చేయి కాసేపు వృధా ప్రయత్నం చేసి మళ్ళీ పెట్టెలోనికి వెళ్ళింది. పెట్టె మూత పడిపోయింది. కౌముది వెంటనే గది లోంచి బైటకు వెళ్ళింది. బయటనుంచి తలుపు వేసింది. వరండాలో ఒక మూల టెలిఫోన్ వుంది. అక్కడకు వెళ్ళి ఓ నంబరుకు టెలిఫోన్ చేసినది.
    "సత్యానంద్...."అందామె.
    "కౌముది .....నువ్వా?" అందవతలి కంఠం.
    "అర్జంటుగా బయల్దేరి నా గదికి వస్తావూ?" అనడిగింది కౌముది.
    "అయిదు నిముషాల్లో అక్కడ వుంటాను...." ఫోన్ క్లిక్ మంది.
    "అయిదు నిముషాల  పాటు కౌముది వరండాలోనే పచార్లు చేసింది.
    రమణరావు ఏమయ్యాడు? పెట్టెలోని రోశయ్య శవానికా భయంకరమైన చేయి ఎలా వచ్చింది? ....వగైరా ఆలోచనలామెను విపరీతంగా కలవరపరుస్తున్నాయి. ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదు.
    సరిగ్గా అయిదు నిముషాల్లో అక్కడికి హోటల్ బాయ్ ఒకడు వచ్చాడు -- "ఎవరో సత్యానంద్ ఆట.... మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాడు. మీరూం కి ఫోన్ చేస్తే ఎవ్వరూ తీయడం లేదు. అందుకని నేనే వచ్చాను. కనుక్కుందుకు...."
    "అర్జంటుగా అతన్ని పంపించు" అంది కౌముది.
    మరో నిముషంలో సత్యానంద్ ఆమె ముందున్నాడు. కండలు తిరిగిన ఆ వస్తాదు వంక తృప్తిగా చూస్తూ ...." అవసరం వస్తుందని నేననుకోలేదు. కానీ వచ్చినట్లుంది. గదిలోకి పద!" అంది కౌముది.
    ఇద్దరూ గదిలోకి వెళ్ళేక తలుపులు వేసింది కౌముది. తర్వాత భయపడుతూనే మంచం క్రింద ట్రంకు ను చూపించింది . సత్యానంద్ దాని వంక చూశాడు.
    ఆ ట్రంకు కొద్దిగా హడావుడి చేస్తోంది. బలిష్టుడైన సత్యానంద్ కూడా ఆదృశ్యం  చూసి చలించాడు.
    "ఏముంది ఆ ట్రంకు లో?"
    "ఏమో -- నువ్వే చూడు...."
    సత్యానంద్ ట్రంకు ను మంచం కింద నుంచి బైటకు లాగాడు. వెంటనే మెరుపు వేగంతో ట్రంకు తెరచుకొని ఓ నల్లటి వ్యక్తీ బైటకు ఉరికాడు.
    "ఎంత భయంకరంగా వున్నాడో ...." అనుకోండి కౌముది అతణ్ణి చూస్తూ.
    "రమణరావు కు బుద్ది లేదు. నేనున్న పెట్టెని మంచం క్రిందకు తోసి తన అవసరం తీర్చుకొన్నాడు. మళ్ళీ బైటకు లాగాలన్న జ్ఞానం లేకపోయింది...."అన్నాడా వ్యక్తీ లేచి నిలబడుతూ.
    "ఎవర్నువ్వు?' అన్నాడు సత్యానంద్ తనూ అతని కెదురుగా నిలబడి.
    "నా పేరు పట్టయ్య...."అన్నాడా నల్లటి వ్యక్తీ.
    "ఎందుకొచ్చావిక్కడికి?"
    "రోశయ్య పంపాడు--ఆ అమ్మాయిని చంపమని."
    "మరి చంపుతావా?" అన్నాడు సత్యానంద్  తన చేతుల్ని పదును పెడుతూ.
    పట్టయ్య పరీక్ష గా పదునౌతున్న సత్యానంద్ చేతుల్నీకండలు తిరిగిన అతడి దేహాన్నీ చూస్తూ -- డబ్బుచ్చుకున్నగా మరి చంపక తప్పుతుందా?" అన్నాడు.
    అతడి మాటలు పూర్తి కాకుండానే సత్యానంద్ హటాత్తుగా అతడి కడుపులో గుద్దాడు. మెలికలు తిరుగుతూ పడిపోయాడు పట్టయ్య. అదే అవకాశంగా తీసుకుని సత్యానంద్ పట్టయ్య మీద కురికి కీలక స్థానాల్లో గబగబా నాలుగు దెబ్బలు వేశాడు.
    "ఎవర్నువ్వు?' అన్నాడు పట్టయ్య నీరసంగా.
    "నా పేరు సత్యానంద్...."
    "ఎవరు రప్పించారు నిన్ను....?'
    "కౌముది పై ఎవరైనా చేయి వేయాలను కొంటె ప్రత్యక్ష మావుతుంటాను నేను. ఆమెను చంపాలన్న పాడు ఆలోచన పోయేదాకా నీ ఒళ్ళు హూనం చేస్తూనే వుంటాను...." అన్నాడతను మరి నాలుగు గుద్దులు గుద్దుతూ.
    "నాలో ఇప్పుడే పాడు ఆలోచనలూ లేవు...." అన్నాడు పట్టయ్య.
    "నీకు అక్షరాలు రాయడం , చదవడం వచ్చా?' అన్నాడు సత్యానంద్.
    "వద్దు" అన్నాడు పట్టయ్య.
    రోశయ్య పంపగా తను కౌముది ని చంపడానికి వచ్చినట్లూ, ఆ ప్రయత్నం  సత్యానంద్ కారణంగా విఫలమైనట్టూ వాగ్మూలం రాయించి సంతకం పెట్టించాడు సత్యానంద్ పట్టయ్య చేత. బ్రతుకు జీవుడా అని బయటపడి పోబోతున్న పట్టయ్యతో -- "ఇంకో రెండు రోజుల వరకూ నువ్వు రోశయ్య ను కానీ, రమణరావు ని కానీ చూడ్డానికి వీల్లేదు....'అన్నాడు సత్యానంద్.
    'అలాగే!" అన్నాడు పట్టయ్య.
    "ఇదిగో .....ఈ ట్రంకు కూడా తీసుకుని పో---" అంది కౌముది.
    పట్టయ్య ట్రంకు నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోయాడు.
    అతను వెళ్ళిపోయాక --"నువ్వు చాలా సాహసం చేశావు. అదృష్టం నిన్ను కాపాడింది. ఎందుకిలా సుఖానవున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటావు" అన్నాడు సత్యానంద్.
    "నీకు తెలియదు సత్యానంద్! స్వల్ప పరిచయంలో అప్రమిత్రుడివై నాకు సాయం చేయడానికి నువ్వొచ్చావు. అంతా నీలాంటి వాళ్ళేనని నమ్మి మోసపోతుంటాను నేను. రమణరావును నేను నిజంగా నమ్మాను. ఎంతగా నమ్మానో నీకు తెలియదు. అతడు రోశయ్య ను నిజంగానే చంపాడనుకొని ఆ సందర్భాన్ని అతడితో కలిస్ సెలబ్రేట్ చేసుకొన్నాను. ఇంతకింతా అనుభవిస్తాడు ఆ రమణరావు!" అంది కౌముది.
    "పట్టయ్య నిన్ను చంపడానికి వచ్చాడనుకొను. మీనాక్షి గురించి నీచేత వివరాలు చెప్పడం కోసం వచ్చి వుంటాడు...." అన్నాడు సత్యానంద్. అలా అంటూంటే సత్యానంద్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది -- "ఎందుకు కౌముది -- అనవసరంగా నీ జీవితాన్నిలా వృధా చేసుకుంటావు? నిన్ను వివాహమాడ్డానికి నేను సిద్దంగా వున్నాను. నీ గత చరిత్రతో నాకు సంబంధం లేదు. నీకోసం నువ్వు కోరే రోశయ్య హత్య నేను చేస్తాను"
    కౌముది దిగులుగా నవ్వి -- "మచ్చలేని జీవితం నీది. నిన్ను హత్యకు పురికోల్పలేను. అందుకే నేను నా కార్యసాధనకు మోసగాళ్ళ సంతతినే ఎన్నుకుంటున్నాను. అయితే ఇంతవరకూ ఇద్దరు నన్ను మోసగించారు. ఈ రోజుతో నన్ను మోసగించింది ముగ్గురయ్యారు. రోశయ్య కంటే ముందు రమణరావు మీద ఇప్పుడు నా పగ!"అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS