Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 21

 

    వీరచంద్రుడు అవ్వ గుర్రాల శాలకు వెళ్ళాడు.
    అది చాలా పెద్దదిగా ఉంది. వీరచంద్రుడి గుర్రంతో కలిసి ఆ శాలలో వంద గుర్రాలు పూర్తయ్యాయి.
    "నాకసలు గుర్రాలశాల లేదు. స్వరూపరాణి స్వయం వరం పుణ్యమా అని ఇది కట్టించాను. నా దగ్గరకు తొంబై తొమ్మిదో రాజకుమారుడు వచ్చి ఇప్పటికి రెండున్నర మసాలైంది. ఈ గుర్రాలన్నీ నా స్వంతం అయినట్లే భావిస్తున్నాను. అన్నీ రాజకుమారుల ఉత్తమాశ్వాలు " అంది అవ్వ.
    వీరచంద్రుడి శరీరం జలదరించింది. ప్రతి ఒక్కరూ ఈ సిరిపల్లె గ్రామం చేరుకొని గుర్రాలను ఈ అవ్వకు సమర్పించుకుని తాండవవనంలోకి వెళ్లి మాయమై పోతున్నారు. తాండవవనంలో ఒక బ్రహ్మ రాక్షసి తిరుగుతుంది. అది సిరిపల్లె గ్రామస్థులకు చాలా పర్యాయాలు కనబడింది.
    తెలిసి తెలిసి తను ఆ అరణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు పోగొట్టు కోవాలా ?
    "బాబూ! నా మాట విని నాతొ ఉండిపో . నిన్ను చూస్తె చూడముచ్చటగా ఉన్నావు. ఓ ఆడదాని కోసం విలువైన నీ ప్రాణాలు పోగోట్టుకోకు . నీలాంటి కొడుకుంటే నా చివరి రోజులు సుఖంగా గడిచి పోతాయి. ఎందుకొచ్చిన తాండవవనం, ఎందుకొచ్చిన స్వయం వరం ?" అంది అవ్వ.
    వీరచంద్రుడు ఆలోచిస్తున్నాడు. పెడబొబ్బలు పెడుతున్న బ్రహ్మరాక్షసి అడవిలో తిరుగుతుంది. తొంబై తొమ్మిది మంది రాజకుమారులు అడవి లోకి వెళ్ళి ఇంతవరకూ తిరిగి రాలేదు. ఆఖరి వాడు వెళ్ళి అప్పుడే రెండున్నర మసాలవుతోంది. అంతమంది సాధించలేనిది తానూ సాధించగలడా?
    "ఏం నిర్ణయించుకున్నావు బాబూ ?" అంది అవ్వ    
    "నిర్ణయానికే ముంది? నీ గోడ మీద మసి బొగ్గుతో మరో గీత పెట్టు అవ్వా ?" అన్నాడు వీరచంద్రుడు నిశ్శబ్దం.
    
                                      4
    తాండవవనానికి కాస్త దూరంలో ఉండగానే వీరచంద్రుడికి వనంలో తెరుగుతున్న బ్రహ్మ రాక్షసి కనబడింది. ఎంతో ఎత్తున్న ఆ వన వృక్షాలు దాని నడుం దాకానే వచ్చాయి. దాని ఆకారం చూస్తూనే వీరచంద్రుడు భయపడ్డాడు. అలాంటి పర్వతాకారంతో తను తలపడడమంటే పొట్టేలు కొండను డీ కొన్నట్లే!
    ఇంతవరకూ విన్న మాటలు అతణ్ణి మరీ ఎక్కువగా భయ పెట్టలేదు. కానీ వినడం వేరు- చూడడం వేరు
    తాండవనంలో అడుగు పెట్టడ మంటే అతడి హత్యతో సమానం!
    అప్పుడే వీరచంద్రుడికి ముని తనకిచ్చిన  మంత్రం గుర్తుకు వచ్చింది. అతడికి అంతులేని ఉత్సాహం కలిగింది. ఇలాంటి మంత్రోపదేశం ఆ తొంబై తొమ్మిది మంది రాజకుమారులకూ లభించి ఉండదు. మంత్ర సాయంతో తాను అన్ని పనులూ చక్క బెట్టుకుని రాగలడు.
    వీరచంద్రుడు మంత్రం పఠించి అదృశ్యరూపుడై వనంలోకి వెళ్ళిపోయాడు.
    ఆడవిలోకి కొంతదూరం వెళ్ళగానే అది చాలా దట్టంగా మారుతున్నట్లు గ్రహించాడతను. ముందుకు వెళ్ళాలంటే కత్తితో మార్గం చేదించుకుని వెళ్ళవలసి వస్తోంది. దారి పొడవునా భయంకరమైన వన్య మృగాలు తానూ అదృశ్యరూపుడై ఉండి పోవడం వలన తప్పితే ఈ అరణ్యంలో ఇన్ని క్రూర మృగాల బారి నుంచి తప్పించుకోవడం కష్టం. కాస్త దూరం వెళ్ళేసరికే వీరచంద్రుడు అలసిపోయి ఓ చెట్టు క్రింద చతికిల బడ్డాడు.
    అతడు చతికిలబడిన చెట్టు పై ఓ కొండ చిలువ వేలాడుతోంది. వీరచంద్రుడు దాన్ని చూడలేదు. అతడక్కడ విశ్రమించగానే కొండచిలువ ఒక్క ఉదుటున నేలమీదకు దూకింది.
    వీరచంద్రుడు ఉలిక్కిపడ్డాడు. అయితే కొండచిలువ అతణ్ణి చూడలేదు. చరాచర పాకుతూ దూరంగా ఉన్న ఓ జింకపిల్ల వేపు వెళ్ళింది.
    వీరచంద్రుడి గుండెలు జలదరించాయి. తన కళ్ళ ముందే కొండచిలువ ఓ జింక పిల్లను బలిగొనడం చూడలేక అతడు చిన్న హెచ్చరిక చేశాడు. ఆ ధ్వనికి జింకపిల్ల పారిపోయింది. కొండచిలువ కదలకుండా ఆగిపోయింది.
    అప్పుడే వీరచంద్రుడు ఒక అద్భుతం చూశాడు.
    కదలకుండా ఉన్న కొండచిలువ తోకన ఏదో చిన్న వస్తువు మెరుస్తుంది. అదేమిటా అని అతను నెమ్మదిగా దాన్ని సమీపించి చూశాడు. అది ఒక ఉంగరం.
    ఆ ఉంగరం వీరచంద్రుడి ధరించిన దానికి వలెనె ఉంది. నమ్మలేక వీరచంద్రుడా ఉంగరాన్ని మరింత పరుశీలనగా చూశాడు. ఆ ఉంగరం పై అంకె ఉంది - తొమ్మిది !
    కాసేపు వీరచంద్రుడి బుద్ది పని చేయలేదు. ఇది తప్పకుండా స్వరూపరాణి ఇచ్చిన ఉండరమే! ఈ ఉంగరం కొండ చిలువ కేలా వచ్చింది! పోనీ అది రాజకుమారుణ్ణి మింగి ఉంటుందను కుందామంటే- ఎవరో పెట్టినట్లుగా ఉంగరం కొండచిలువ తోకకు ఉంది.
    వీరచంద్రుడి శరీరం జలదరించింది. ఎంత ఆలోచించినా అతడికి కారణం అంతు బట్టలేదు. అతని ఆలోచన లింకా అలా ఉండగానే కొండచిలువలో మళ్ళీ చలనం ప్రారంభమైంది. అది చరచరా పాక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది.
    వీరచంద్రుడి కిప్పుడు అలసటగా ఉంది. అరణ్యంలో అతడికి తెలిసిన ఎన్నో ఫల వృక్షాలున్నాయి. అతను దగ్గర్లో ఉన్న జామచెట్టు ఎక్కి ఓ జామకాయ కోయబోయాడు. వెంటనే అతడికి ఓ స్వరం వినిపించింది.
    "ఎవర్నువ్వు ? ఎవర్నువ్వు?"
    వీరచంద్రుడు ఆగిపోయాడు.
    ఇదెక్కడి మాయ? ఈ మాట లెక్కడినుంచి వచ్చాయి. చెట్టు మాట్లాడుతోందా ?  
    ఒక్క క్షణం ఆగి అతను మళ్ళీ కాయ కోయడానికి ప్రయత్నించాడు. మళ్ళీ అదే ప్రశ్న - "ఎవర్నువ్వు" ఎవర్నువ్వు?"
    వీరచంద్రుడు కాయ కోయలేదు. తన అదృశ్య రూపాన్ని కూడా గుర్తించి ప్రశ్నించగలిగిన ఆ శక్తి ఏమిటి ? ఆ శక్తి నిక్కడ ఎవరు నియోగించారు? ఈ అరణ్యం మాయలకు నిలయమా ? అదే నిజమైతే ఈ మాయల నెవరు సృష్టించారు? అందువల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు ?
    ఏమైతే అయిందని వీరచంద్రుడు జామకాయ కోయబోయాడు. వెంటనే చెట్టు విపరీతంగా ఊగిపోయి వీరచంద్రుడు కింద పడ్డాడు. అనుకోకుండా జరిగిన ఈ పనికి అతడికి నడ్డి విరిగినట్లయింది. ఎలాగో ఒళ్ళు దులుపుకుని లేచి కూర్చున్నాడు.
    కాసేపటికి వీరచంద్రుడి బుద్ది మళ్ళీ చురుగ్గా పని చేయసాగింది. తనను ప్రశ్న అడిగినది- బహుశా ఈ జామ చెట్టే అయుండాలి. దానికి తను జవాబు చెప్పక పోవడంతో చెట్టు తనను క్రిందకు విసిరేసింది. ప్రశ్నకు జవాబు చెప్పి ఉండే ఏం జరిగేది ?
    వీరచంద్రుడు మళ్ళీ జామచెట్టు ఎక్కి కాయ కోయబోయాడు . వెంటనే ప్రశ్న వినబడింది --- "ఎవర్నువ్వు ? ఎవర్నువ్వు ?"
    "నా పేరు వీరచంద్రుడు . నన్నీ ప్రశ్నలడుగుతున్న నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా ?' అన్నాడు వీరచంద్రుడు ధైర్యం కూడ గట్టుకుని.
    "నేను వనదేవతను . " అని మళ్ళీ వచ్చింది సమాచారం.
    "వనదేవతా! నేనాకలితో ఉన్నాను. అందుకే ఈ ఫలాలు కోసుకుని తినాలను కున్నాను. ఇందులో తప్పేముంది ?' అన్నాడు వీరచంద్రుడు.
    "అకారమున్న ప్రాణులకే తప్ప అదృశ్య రూపులకి ఈ తాండవవనదేవత ఆహారమివ్వదు: అంది ధ్వని. వీరచంద్రుడీ జవాబు విని నిశ్చేష్టుడయ్యాడు.
    కానీ వీరచంద్రుడికి తన అదృశ్య రూపం విడిచి పెట్టాలని లేదు. తన మంత్రం రోజు కొక్కసారి పర్యాయం మాత్రం పని చేస్తుందని ముని చెప్పాడు. ఇప్పుడు తనా రూపం వదిలి పెడితే బ్రహ్మ రాక్షసి పాల్పడక తప్పదు . ఎలాగో తన ఆకలిని ఓర్చుకుని తెల్లవారు ఝామున వరకూ గడిపితే అప్పుడు తను అదృశ్య రూపాన్ని వదిలి పెట్టి కడుపారా ఫలాలు భుజించి మూట గట్టుకుని, తిరిగి కొద్ది క్షణాల్లో కొత్త దినం ప్రారంభమవుతుంది కాబట్టి, మళ్ళీ అదృశ్యరూపం ధరించవచ్చు.
    వీరచంద్రుడు మౌనంగా చెట్టు దిగి నడక ప్రారంభించాడు.
    అలా కొంత దూరం వెళ్ళి అతను ఆగిపోయాడు. అతడికి కాస్త దూరంలో పర్వతాకారంలో బ్రహ్మ రాక్షసి కూర్చుని ఉన్నది. కూర్చున్నప్పుడే అది అరణ్యమంత ఎత్తున ఉన్నది.
    వీరచంద్రుడు దాన్ని పరీక్షగా చూశాడు. బాగా తల ఎత్తి చూస్తె తప్ప దాని తల కనబడడం లేదు. చెట్ల మధ్యన దాని తల సరిగ్గా కనబడడం లేదు. అది చేతులు కట్టుకుని కూర్చుని ఉంది. అది పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంది కాబట్టి ఏదో నిష్ఠలో ఉన్నదని కూడా అనుకోవచ్చు.
    వీరచంద్రుడు ముందడుగు వేయలేదు. అది కూర్చుని చాలా ప్రాంతం ఆక్రమించింది. దాని చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అతడికి తిన్నగా వెళ్ళాలని మాత్రమే ఉన్నది. అందుకే అతడు దానికి కాస్త దూరంలో చతికిలబడి అది అక్కణ్ణించి ఎప్పుడూ లేస్తుందా అని ఎదురు చూడసాగాడు.
    ఈలోగా అక్కడకు ఓ పెద్ద పులి వచ్చి అతడికి కాస్త దూరంలోనే విశ్రమించింది. అప్పుడే వేటాడి ఏ జంతువునైనా తిని వచ్చిందేమో అది అలసటగా మత్తుగా కనులు మూసింది.
    నిలువెత్తు పెద్ద పులి అది! ఎంతో అందంగా ఉన్న ఆ పెద్ద పులి వీరచంద్రుడిని ఆకర్షించింది. పులిని దాని నివాస స్థానమైన అడవిలో - బ్రతికుండగా  దగ్గర్నుంచి చూసే అవకాశం ఎప్పుడో గాని రాదు. వీరచంద్రుడు లేచి వెళ్ళి పరీక్షగా చూడసాగాడు. అప్పుడే అతడికి పులి పంజాని ఏదో మెరుస్తూ ఉండడం గమనించి ఉలిక్కి పద్డ్డాడు.
    అది ఉంగరం. స్వరూపరాణి వీరచంద్రుడికిచ్చి నటువంటిదే ఆ ఉంగరం. పరీక్షించి చూడగా ఆ ఉంగరం మీద ఓ సంఖ్య ఉంది. ముప్పై య్యేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS