Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 21

 

                        మానభంగ వివాహం!

                                                                     వసుంధర
    అతను గుమ్మం ముందు ఒక్కక్షణం ఆగి అప్పుడు తలుపు తట్టాడు.
    కొద్ది క్షణాల్లో మెరుపు తీగలాంటి అమ్మాయి వచ్చి తలుపు తీసి అతన్ని చూసి -- "ఎవరు కావాలండీ మీకు?" అనడిగింది.
    అతనామే వంక చూసి అప్రయత్నం గా నిట్టూర్చి -- "నీ పేరు రాధ కాకుండా ఉంటె ఎంత బాగుండును?" అన్నాడు.
    ఆమె కళ్ళలో ఆశ్చర్యం! "నా పేరు రాదే!" అందామె.
    "మీ నాన్నగారున్నారా?" అనడిగాడతను.
    "ఈరోజు స్కూలుకు సెలవు కదా? ఉన్నారు. మీరెవరో చెబుతారా?" అందామె.
    "జయరాజ్ వచ్చాడని మీ నాన్నగారికి చెప్పు--"
    అమెలోపలకు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి -- "లోపలకు రండి ' అంది.
    ఇద్దరూ ఓ గదిలోకి వెళ్ళారు. గదిలో రాధ తండ్రి పేర్రాజున్నాడు. అయన జయరాజ్ ని చూసి నిట్టూర్చి "కనీసం ముఖం చూస్తె నువ్వెవరో తెలుస్తుందనుకున్నాను. ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు--" అన్నాడు.
    "అయితే మీకు శేషయ్య గారు రాసిన ఉత్తరం అందలేదా?" అన్నాడు జయరాజ్.
    "శేషయ్యా? ఆయనేవరు?" పేర్రాజు మరింత కంగారు పడ్డాడు.
    ఈసారి జయరాజు కూడా కాస్త కలవరపడుతూ- "కాకినాడ లో శేషయ్య గారి నెరుగని వారు లేరు. ఆయనకో సినిమా దియేటరు, కాఫీ హోటలు, ఫర్నిచర్ షాపు ఉన్నాయి. అయన మీకుత్తరం రాశానంటేనే నేను మీ యింటికి వచ్చాను--' అన్నాడు.
    "చూడు బాబూ -- నాకు శేషయ్య గారి తోటి, కాకినాడ తోటీ కూడా పరిచయం లేదు. అంతేకాదు-- నాలుగు డబ్బులున్న వారెవ్వరి తోటి నాకు ముఖ పరిచయం కూడా లేదు. నువ్వు పోరబడ్డావు -- " అన్నాడు పేర్రాజు.
    "ఇది పోరాపాటైతేనే బాగుండేది!" అని గొణుక్కున్నాడతను. - "అయితే నేనిప్పుడెం చేయాలి?" అని కాస్త గట్టిగా అన్నాడు.
    "సమస్యేమిటో చెప్పు!" అన్నాడు పేర్రాజు.
    "మీ యింటి కెళ్ళి శేషయ్య గారి పేరు చెబితే మీరేదో పెట్టె ఇస్తారని అది తీసుకుని రమ్మనమనీ శేషయ్య గారు నాకు చెప్పారు. మీరేమో అసలేమీ ఎరుగనంటూన్నారు--" అన్నాడు జయరాజ్.
    "చాలా బాగుందయ్యా ! మిగతా సంగతులు తర్వాత చూసుకోవచ్చు. నీవాటం  చూస్తె బాగా అలసిపోయి నట్టున్నావు. ముందు కాస్త భోజనం చేసి వేడుదువు గాని --" అన్నాడు పేర్రాజు.
    జయరాజు తడబడి "నాకా మీ యింట భోజనమా?" అన్నాడు.
    పేర్రాజు నవ్వి "ఈ బడిపంతులు పేదవాడే అయినా అతిధి, అభ్యాగతులకు భోజనం పెట్టుకోగల స్థితి నుంచీ ఇంకా దిగజారి పోలేదు--" అన్నాడు.
    పేర్రాజు భార్య పుట్టింటి కెళ్ళింది. ఇద్దరు కొడుకులు పట్నం లో చదువుకుంటున్నారు. కూతురు ఇంటర్మీడియట్ ప్యాసయింది. ఇంట్లో ఆయనా, కూతురూ ఉన్నారు. జయరాజు ఒక్కడే భోజనం చేశాడు. అతడికి రాధ వడ్డించింది -- ఎంతో ఆప్యాయంగా!
    రాధ ఆడపిల్లే కావచ్చు, పల్లెటూల్లో నే పెరిగి ఉండవవచ్చు. అంతమాత్రాన ఆమె మగవాళ్ళను చూసి ముడుచుకు పోవడం లేదు. అమెది అరమరికలు లేని స్వభావం. ఆమెకు వగలు తెలియవు. నటనలు తెలియవు. సూటిగా మాట్లాడుతుంది. మంచి మనసుతో ఆదరిస్తుంది.
    జయరాజు , రాధ ఆదరణకు కరిగిపోయి -- "ఎలా, ఎలా, ఈమెను ఎలా?' అని తనలో తనే మధనపడ్డాడు.
    జయరాజు భోజనం చేస్తుండగా ప్రెసిడెంటు భద్రయ్య యింటి నుంచి ఓ మనిషి వచ్చి -- "కాకినాడ శేషయ్య గారి కివ్వడానికి ఓ పెట్టె ఇవ్వాలి, ఎవరైనా మనిషోస్తే వెళ్ళి పోనివ్వకుండా మీ యింట్లో నాలుగు రోజులుంచుకొండి" అని కబురు చెప్పి వెళ్ళాడు పెర్రాజుకు. అది విన్న పేర్రాజు ఆశ్చర్యానికి అంతు లేదు. వెంటనే ఆ కబురు భోం చేస్తున్న జయరాజుకు చెప్పాడు.
    "అయితే నేను మీ యింట నాలుగు రోజులుండాలన్నమాట-- " అన్నాడు జయరాజు. ఆ మాటలన్నప్పుడు అతడి కంఠం లో పెద్దగా ఉత్సాహం ధ్వనించలేదు. అమాయకమైన రాధ కనుల వంక ఆప్పుడప్పుడు ఓరగా చూస్తూ భారంగా నిట్టుర్చుతున్నాడతను.
    "అవును కానీ యిదంతా ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. ఓసారి భద్రయ్య గారింటికి వెళ్ళి అడిగోస్తాను --" అన్నాడు పేర్రాజు.
    "ఇందులో భద్రయ్య గారికి తెలిసేది కూడా పెద్దగా ఏమీ ఉండదనుకుంటాను. మీరు శ్రమపడి ఆయనింటికి వెళ్ళడం అనవసరం--" అన్నాడు జయరాజు.
    'అలాగని ఎందుకనుకుంటున్నావు?" అన్నాడు పేర్రాజు.
    "శేషయ్య గారు పెద్దవారు. పెద్దవాళ్ళ చేతులు, చేతలు పెద్దవిగానే వుంటాయి. నేనాయన ఉప్పు తింటున్న వాణ్ని, అయన పని మీదే నేనిక్కడకు వచ్చాను. వారే అయన భద్రయ్య పేరు చెప్పకుండా మీ పేరు చెప్పాడు. అంటే ఇదేదో రహస్యమైన వ్యవహారం . ఇటువంటి వాటిల్లో మనబొంట్లు అంటీ ముత్తనట్లుగా ఉండటమే మంచిదని నా అనుభవం చెబుతోంది" అన్నాడు జయరాజు.

                                                              2
    జయరాజు యింట్లో సరిగ్గా నాలుగు రోజులున్నాడు. ఆ నాలుగు రోజుల్లోనూ అతను తన ప్రవర్తనతో పేర్రాజునూ రాధనూ కూడా ఆకట్టుకుని వారి అభిమానానికి పాత్రుడయ్యాడు. వారంటే అతడి క్కూడా ఏదో అనుబంధం ఏర్పడింది.
    అయిదో రోజు ఉదయాన పేర్రాజు అత్తింటి నుంచి టెలిగ్రాం వచ్చింది -- అర్జంటుగా రాధను పంపమని. టెలిగ్రాం వచ్చిన కాసేపటికి భద్రయ్య మనిషి వహ్చి పెర్రాజుకో పెట్టె యిచ్చి వెళ్ళాడు.
    పేర్రాజుకు స్కూలు వదిలి వెళ్ళడానికి లేదు. తోడు లేకుండా ఒక్కర్తీనీ ఆడపిల్లను పంపడం అయన కిష్టం లేదు. అదృష్టవశాత్తు జయరాజు ప్రయాణం కూడా ఆ రోజే నిశ్చయమైందని అయన సంతోషించాడు.
    ఆ గ్రామం నుంచి రాజమండ్రికి బస్సుంది. అక్కడ్నుంచి మరో బస్సు మారాలి. రాజమండ్రి లో రాధకు సాయపడమని పేర్రాజు జయరాజుని కోరాడు. అలాగే నన్నాడు జయరాజు.
    ఇద్దర్నీ బస్సెక్కించి రాధను ఓ లక్షసార్లు హెచ్చరించి జయరాజుకు పదేపదే చెప్పి వెళ్ళాడు పేర్రాజు" "నేనేం చిన్నపిల్లను కాను, భయమెందుకు?" నా అంతట నేనే దర్జాగా ప్రయాణాలు చేసి రాగాలను. పైగా జయరాజు గారి తోడుంది --" అంది రాధ తండ్రికి ధైర్యం చెబుతూ.
    పేర్రాజుకు ధైర్యం కలిగినా కలక్క పోయినా బస్సు కదిలింది.
    రాధ ఆడవాళ్ళ సీట్లో కూర్చుంది. జయరాజు సరిగ్గా ఆమె వెనుక సీట్లో కూర్చున్నాడు.
    వాళ్ళేక్కినది ఎక్స్ ప్రెస్ బస్ కాదు. అయిదేసి నిముషాలకో ఊళ్ళో ఆగుతోంది. ప్రయాణం చాలా విసుగ్గా ఉంది. జయరాజు బస్సు ఆగినప్పుడల్లా ఏదో ఒకటి కొంటూ తినమని ఆమెను బలవంత పెడుతున్నాడు.
    " మా నాన్న మిమ్మల్ని రాజమండ్రిలో నాకు సాయ పడమన్నారు. గానీ ఇక్కడ్నించీ తిండి పెట్టి వేదించమనలేదు" అంది రాధ.
    "నీ యింట్లో నువ్వు నన్నిలాగే వేధించావు. అందుకు బదులు ఇది!' అన్నాడు జయరాజు.
    ఒక వూళ్ళో బటానీలు, ఇంకో చోట వేరుశనక్కాయలు మరోచోట జంతికలు, ఒకచోట కమలా ఫలాలు, ఇలా కొంటున్నాడు. రాజమండ్రి సమీపం లోకి వచ్చాక కూడా అతను బిస్కెట్లు కొన్నాడు.
    "ఇవి తినను"అంది రాధ.
    "ఇన్ని తిని ఇవి తిననంటే నా మనస్సు నొచ్చుకుంటుంది" అన్నాడు జయరాజు.
    "ఇటువంటి తిండి నాకు పడదు" అంది రాధ.
    "ఈ ఒక్క రోజుకీ -- నా కోసం--" అన్నాడు జయరాజు.
    రాధ బిస్కెట్లు తింది. రాజమండ్రి ఊళ్ళో బస్సు ప్రవేశించే సరికి ఆమె కడుపులో తిప్పినట్లయింది. "వాంతీ అయేలా వుంది" అందామె పక్కావిడతో. ఆవిడ చటుక్కున కదిలి సీటు మారి రాధకు కిటికీ పక్క సీటు ఇచ్చింది. రాధ ప్రయత్నించింది కానీ వాంతీ అవలేదు. కళ్ళు తిరిగినట్లనిపించి నిస్త్రాణ గా వెనక్కు వాలి పడుకుంది.
    బస్సు రాజమండ్రిలో ఆగింది.
    ఒక్కొక్కరే దిగుతున్నారు గానీ రాధ లేవలేదు. జయరాజు కంగారుగా "రాధా!" అని పిలిచాడు.
    ఆమె నీరసంగా "ఊ"అంది.
    "ఎమిటయింది?" అన్నాడతను.
    "తెలియడం లేదు. కళ్ళు తిరిగిపోతున్నాయి" అంది.
    "స్టాండు లో నీ బస్సు సిద్దంగా వున్నట్లుంది. ఎక్కలేవా?" అన్నాడు జయరాజు.
    "ఎక్కలేను"అంది రాధ.
    జయరాజు తను ఊతమిచ్చి రాధను బస్సు లోంచి దింపాడు. ఆమెకు నడవడం కూడా కష్టం గానే వుంది. "ఎక్కడయినా పడుకోవాలనుంది " అందామె. బస్ స్టాండు లో చతికిల పడుతూ. వాటం చూస్తె ఆమె అక్కడే పడుకునేలా ఉంది.
    జయరాజమే నక్కడే వదిలి బస్ స్టాండు చుట్టూ చూశాడు. నలుగురయిదురు రిక్షా వాళ్ళతన్ని చుట్టూ ముట్టారు బేరం కోసం, జయరాజు వాళ్ళను విదిలించుకుంటూ "నాకు టాక్సీ కావాలి!" అన్నాడు.
    "రాజమండ్రీ బస్టాండు కొచ్చి టాక్సీ కోసం చూసిన వాళ్ళ నెక్కడా చూడలేదు"అన్నాడో రిక్షా వాడు హేళనగా.
    సరిగ్గా అప్పుడే అక్కడికో టాక్సీ వచ్చి ఆగింది. అందులోంచి ఓ మనిషి హడావుడిగా దిగి కదులుతున్న ఓ బస్సు కేసి పరుగెత్తాడు. జయరాజు టాక్సీ డ్రైవర్ ని సమీపించి "టాక్సీ కడతావా ?' అన్నాడు.
    "ఊ" అన్నాడు డ్రయివర్.
    "హాస్పిటల్ కి వెళ్ళాలి."
    "గవర్నమెంటా - ప్రయివేటా ?"
    "ప్రయివేటే -- సీరియస్ కేసు" అన్నాడు జయరాజు.
    "అయితే కాకినాడ శేషయ్య ఇంటికి పోనిచ్చేదా?" అన్నాడు టాక్సీ డ్రయివర్.
    "అదే నాక్కావలిసింది" అన్నాడు జయరాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS