నేను దానవుడిగా బ్రతకలేను!
జొన్నలగడ్డ రామలక్ష్మీ
రమేష్ వేగంగా అడుగులు వేస్తున్నాడు. అతని మనసులో ఉత్సాహమూ, కంగారూ సమపాళ్ళలో వున్నాయి.
అతను ఇల్లువదలి మూడునెలలయింది. వ్యాపారంపని మీద ఇల్లు వదిలాడు. నిజానికి మూడునెలలూ మూడు క్షణాల్లా గడచిపోయాయి. రోజూ ఏదో ముఖ్యమైన పని తగుల్తూనే వుండేది. తనమాటలతో చాలామందిని ఇంప్రెస్ చేయగలిగాడు. ఒకరినుంచి యింకొకరు తనపేరు రికమెండ్ చేసి తనకు చాలా ఆర్డర్సిచ్చారు. తన సప్లై మెటీరియల్స్ లో ఇంకా కొత్తకొత్తవి చేరాయి. చాలామంది యివి సరఫరా చేస్తారా. అవి సరఫరాచేస్తారా అని అడుగుతూ వచ్చారు.
అక్కడ ఏమేమి డిమాండ్స్ లో ఉన్నాయో వాటిలో తనెన్ని ప్రొక్యూర్ చేయగలడో అన్నీ నోట్ చేసుకున్నాడు ఇవన్నీ సెటిలయితే ఒక సంవత్సరంలో బిజినెస్ చాలా పెద్దదయిపోతుంది.
రమేష్ అక్కడ ఇంకా మరికొంత కాలముండవలసిన వాడేగానీ ఒకచిన్న సంఘటన జరగడంతో అతను వెంటనే బయల్దేరి పోవలసి వచ్చింది.
తఃనకు ఆర్డరిచ్చిన రఘురామయ్య అనే అతను-అక్కడున్న మార్కెట్ డిమాండ్సు గురించి వివరాలన్నీ వున్న కాగితాలతో ఓ కవారిచ్చాడు. అది చదివి వివరాలు నోట్ చేసుకుని మళ్ళీ తనకిచ్చేయమన్నాడు. అలాగేనని రమేష్ దాన్ని తీసుకువెళ్ళి గదిలో చదివాడు.
అయితే అందులోవున్న వివరాలు రమేష్ ని దిగ్భ్రాంతుణ్ణి చేశాయి. మొదటిసారి చదివినప్పుడు అతనికి ఆ వివరాలర్ధం కాలేదుగానీ రెండోసారి చదివేసరికి కాస్త తెలిసింది. మూడోసారి చదివేసరికి పూర్తిగా అర్ధమయింది.
స్థానికంగా తనవూరిలో తయారయ్యే ఒక నూనెలో విషం కలపడానికి పథకం అందులో రాసివుంది. అది లక్ష్మిబ్రాండ్ రిఫైన్డాయిల్. దాని ప్రొప్రయిటర్ వీరయ్య గారు దేశభక్తుడుగా చాలా పేరుగాంచాడు. నాణ్యతకూ సరసమైన ధరలకూ ఆయన తయారుచేసే నూనెలు పేరుబడ్డాయి. లక్ష్మిబ్రాండ్ రిఫైన్డాయిల్ చాలామంది వాడుతారు. నగరంలోని ప్రముఖులందరూ అది వాడతారు.
అందులో వీళ్ళు కలుపబోయేది మరీ ప్రమాదకరమైన విషంకాదు. స్లోపాయిజన్ క్రమక్రమంగా మనుషుల ఆరోగ్యము క్షీణిస్తుంది. వీరయ్య నూనెపరిశ్రమ పడగొట్టడమేవారి ప్రధానోద్దేశ్యం. ఆ వూళ్ళోనే రఘురామయ్య కొత్తగా నూనెపరిశ్రమ ప్రారంభించుదామనుకొంటున్నాడు. ఈ వ్యవహారంలో అతనికి కొందరు ఫారినర్స్ సహాయం కూడావుంది.
రమేష్ కు వివరాలు చదువుతూనే ముచ్చెమటలు పోశాయి. అవి చాలా ప్రమాదకరమైన కాగితాలు. తన చేతిలో పడ్డాయి. తనిప్పుడేం చేయాలి?
రమేష్ మొట్టమొదట ఆ వివరాలన్నిటిని ఓ కాగితం మీద నోట్ చేసుకుని తన బ్రీఫ్ కేసు రహస్యపు టరలో దాచేశాడు. ఆ తర్వాత మరో రెండుగంటల క్కాబోలు- రఘురామయ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చిందతనికి.
"హలో-ఇందాకా నేనిచ్చిన వివరాలు చదివారా?"
"ఇంకాలేదండీ-టైము కుదరలేదు. బహుశా సాయంత్రందాక కుదరదు. రేపు తిరిగిస్తాను. మీ కభ్యంతరమా?"
"అభ్యంతర మేమీలేదు. మీరక్కడే వుండండి. నేను యిప్పుడే రెండునిమిషాల్లో వచ్చేస్తున్నాను"-అని ఫోన్ పెట్టేశాడు రఘురామయ్య.
రమేష్ తనగదిలోకి వెళ్ళలేదు. అక్కడే వుండి పోయాడు. అన్నప్రకారం రెండునిముషాల్లో రఘురామయ్య వచ్చేశాడు. అక్కడున్న రమేష్ ను చూసి "మీరు గదిలో వుంటారనుకున్నాను....." అన్నాడు.
"రండి, గదిలో మాట్లాడుకో వలసిన విషయమైతే అక్కడే మాట్లాడుకొందాం...." అన్నాడు రమేష్ ఆయన ఫోన్ చేశాక తనుగదిలోకి మరివెళ్ళలేదన్న విషయం తెలియడం కోసమే అతనంతసేపు అక్కడున్నాడు.
రఘురామయ్య అతనితోపాటు గదిలోకి నడిచేక ఆట్టే జాప్యంచేయలేదు. ఆయన రమేష్ కి ఒక కవరునందించి -"ఇందాక మీకిచ్చిన కవరు వేరే వ్యవహారానికి సంబంధించినది. ఇదీ అసలు కవరు. మీకు కలిగిస్తున్న ఇబ్బందికి విచారిస్తున్నాను....." అన్నాడు.
"ఇబ్బంది నిజానికి నాదికాదు. మీది నాకేదోసాయం చేయాలనుకున్నందుకు మీరుచాలా శ్రమపడవలసివచ్చింది. చాలాచాలా థాంక్స్...." అన్నాడు రమేష్.
రఘురామయ్య వెళ్ళేక అతనెంతో జాప్యం చేయలేదు. వెంటనే తిరుగు ప్రయాణానికి సన్నాహం చేసుకున్నాడు. అర్జంటుగా తన ఊరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే రఘురామయ్య చేస్తున్న కుట్రలో రెండురకాల ద్రోహాలున్నాయి. ఒకటి వీరయ్యగారి వ్యాపారాన్ని పడగొట్టడం, రెండవది నగర ప్రముఖుల హత్య మొదటి దానివల్ల రఘురామయ్య గారికీ, రెండోదానివల్ల ఏదో విదేశానికీ ప్రయోజనాలు న్నాయి. ఈ విషయంలో తనువెళ్ళి వెంటనే వీరయ్య గారిని హెచ్చరించాలి.
వీరయ్య రమేష్ కు బాగా తెలియడమేగాక ఇద్దరికీ చెప్పుకోదగ్గ స్నేహంకూడా వుంది. రమేష్ తమ్ముడు సురేష్ వీరయ్యకూతురు గంగను ప్రేమిస్తున్నాడేమోనని చూచాయగా అనుమానముంది రమేష్ కు. అయితే ప్రస్తుతం అతని హడావుడికివన్నీ కారణాలుగాదు. ఒక దేశద్రోహి కారణంగా సామాన్య ప్రజలూ, ప్రజానాయకులూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. దాన్ని తను నివారించాలి.
ట్రయిన్ రాత్రిదాకాలేదు. బస్సుల్లో అడ్వాన్సుబుకింగ్ అవసరం. అర్జంటుగా ఇల్లుచేరాలంటే టాక్సీలో పోవడం మంచిదని తోచింది రమేష్ కు. అదే చేశాడతను.
