Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 21


                              ద్వంద్వ యుద్ధం

    బీచిలో సరిగ్గా ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు విఠల్.
    అతను ఎటువైపు చూస్తున్నాడోనని అటువైపు చూసిన కుసుమ ఇద్దరి కళ్ళు కలవగానే చూపులు మార్చేసింది. ఓ అయిదు నిముషాలయేక ఆమెకు చాలా ఇబ్బందనిపించింది.
    ఒంటరిగా బీచివద్ద కాలక్షేపంచేయడం ఆమెకు సరదాయేగానీ ఎవరో తనను ప్రత్యేకంగా గమనిస్తున్నారంటే ముళ్ళమీద వున్నట్లుంటుందామెకు. అందుకే అక్కడ్నించి లేచి కాస్త దూరంగా వెళ్ళి కూర్చుందామె.
    అది జరిగిన కొద్ది నిముషాలకు విఠల్ కూడా లేచి మళ్ళీ ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు.
    అతనెవరో ఆమెకు తెలియలేదు. బస్ స్టాండులో తదేకంగా తనను చూస్తూంటే అతన్ని గమనించిందామె. ఎవడో పోనీలే అనుకుంది. తనను చూసినంతలో నష్టమేం లేదుగదా అని సరిపెట్టుకుంది. తను బీచికి వెళ్ళడం కోసం రెండు మూడు బస్సులు వదిలేసి-పది నెంబరు బస్సు  వచ్చేవరకూ ఆగింది. అతనూ ఆ బస్సు కోసమే ఆగాడు.
    తనెక్కిన బస్సులోనే ఎక్కాడు. బస్సు కాస్త కాళీగానే తను కూర్చున్న సీటుకు దగ్గర్లో నిలబడ్డాడు. చాలా పర్యాయాలు ఇన్ షర్టూ, క్రాపింగూ సవరించుకున్నాడు. ఒకటి రెండుసార్లు ముఖం తుడుచుకున్నాడు. బీచివద్ద తను దిగితే అతనూ దిగాడు. కాస్తదూరం ఉంచి తన ననుసరించాడు. తను కూర్చున్నచోటే కూర్చున్నాడు. తను లేచి యింకోచోట కూర్చుంటే-తనూ మళ్ళీ అలాగే చేశాడు.    
    ఈ సంగతి గ్రహించాక కుసుమ ఇంక కూర్చోలేక పోయింది. ఇటువంటి అనుభవం ఇదే ప్రధమమామెకు. అయితే ఇటువంటి వ్యవహారాల్లో ఆమెకు భయమేమీలేదు. తన వెనకాల కామెంట్సు విరిసిన అబ్బాయిలకి చాలా పర్యాయాలు సూటిగాతగిలే జవాబులివ్వగలిగిందామె ధైర్యంగా. అందుకే ఇప్పుడు కూడా ఆలోచించి నెమ్మదిగా లేచి రివ్వుమని విఠల్ దగ్గరకు వెళ్ళింది.
    "మిస్టర్! నేను లేచానని నువ్వు లేచి నిలబడతావని నాకు తెలుసు. కానీ అలా చేయకు. నీ ఉద్దేశ్యమేమిటి? ఎందుకిలా నా వెంటబడ్డావ్?" అనడిగింది కుసుమ.
    ఆమె ఇలా వచ్చి అడుగుతుందని విఠల్ ఊహించినట్లు లేదు. అతను క్షణం తడబడి "మీరు చాలా మంచివారు. నాతో మాట్లాడారు...." అన్నాడు.
    అతని మాటలో మన్నన వుంది. వాక్యాన్ని ఉచ్చరించిన తీరులోకూడా మర్యాద వుంది.
    తొందరపడి అతన్ని' నువ్వు అని సంబోధించినందు కామె సిగ్గుపడింది. "నా మంచితనం సంగతి సరే-నే నడిగిన ప్రశ్నకు జవాబు రాలేదు...." అంది నువ్వనీ, మీరనీ అనకుండా.
    "ఏదైనా తప్పు చేశానా?" అన్నాడతను.
    జవాబు యేం చెప్పాలో తెలియలేదామెకు. తప్పు చేశాడని ఎలాగంటుంది? అతనామెను తాకడానికి ప్రయత్నించలేదు. పలకరించడానికి ప్రయత్నించలేదు. తరచుగా ఆమెవైపే చూశాడుకానీ కన్నుకొట్టడం వగైరా చిలిపి పనులు చేయలేదు. అయినా ఆమె తఃమాయించుకుని-"నే నెక్కడికి వెడితే అక్కడికి రావడం తప్పుకాదా?" అంది.
    అతను గొంతు సవరించుకున్నాడు. "నా పేరు విఠల్! నేను యూనివర్శిటీలో యమ్మెస్సీ ఫైనలియర్ చదువుతున్నాను. నేను అల్లరిచిల్లరగా తిరిగేవాణ్ణి కాదని ఇంత వరకూ నన్నెరిగినవారంతా చెబుతారు. ఆడపిల్లల గురించి పట్టించుకునే మనస్తత్వం నాకు లేదు. కానీ ఎందుచేతనో ఈరోజు మిమ్మల్ని చూడగానే మీ వెంటపడాలనిపించింది. మిమ్మల్ని పలకరించి మీతో పరిచయం పెంపొందించుకోవాలనిపించింది. కారణం ఇది అని చెప్పలేను. మనసును బాగా నిగ్రహించుకుందుకు ప్రయత్నించాను. మిమ్మల్ని వదలిపెట్టలేక మీకూడా తిరుగుతున్నాను. మిమ్మల్ని పలకరించే ధైర్యం లేక ఎలాగా అనుకుంటుంటే మీరే వచ్చి నన్ను పలకరించారు. నేను మీ వెంటపడడంలో తప్పుందని నేననుకోను. ఇది పదిమంది తిరిగే బీచి. ఇక్కడ నేనే విధమైన అన్యాయమూ మీకు తలపెట్టలేను.  ఇక్కన్నించి బస్సు సదుపాయం వుంది. అందువల్ల నా మూలాని మీకేవిధమైన ప్రమాదమూ లేదు...."
    "ప్రమాదం సంగతి నేనేమీ అనలేదు. నా ఇబ్బంది గురించి చెప్పాను. ఒక మనిషి- అందులోనూ-తెలియనివాడు-అదే పనిగా వెంటబడుతూంటే చిరాగ్గా వుంటుంది ఎవరికైనా-ఇక ప్రమాదం సంగతంటారా? నా వెంటబడినవాళ్ళకేకానీ నా కెప్పుడూ ప్రమాదముంటుందని అనుకోను...." అంది కుసుమ నెమ్మదిగా. విఠల్ ఆమెకు వింతమనిషిగా తోచాడు.
    "సరే-మీ సంగతి మీరు చెప్పారు. నా సంగతి నేను చెప్పాను. మన పరిచయం మీకేమైనా అభ్యంతరమా?" అన్నాడు విఠల్.
    ఈ సూటి ప్రశ్నకు కుసుమ ఆశ్చర్యపోయింది- "ముక్కూ ముఖం తెలియనివారితో కావాలని పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకేముంది?" అంది.
    "చూడ్డానికి చదువుకున్నవారిలా కనిపిస్తున్నారు. మీ ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముక్కూముఖం ఎరుగని మగవాడిని భర్తగా పెద్దలు నిర్ణయిస్తే-అతనితో జీవితాంతం గడపడమెలాగా అన్న సందేహంకూడా వెలిబుచ్చకుండా ఆమోదిస్తుంది మనదేశపు స్త్రీ! ఆలాంటప్పుడు మన పరిచయానికేం అడ్డు!"
    "పరిచయమంటే మీ నిర్వచనం......వివాహమా?"
    "కాదు. కానీ పరిచయం వివాహానికి దారితీస్తే అందులో తప్పేమీ వుండదు."
    విఠల్ సూటిగా మాట్లాడుతున్నాడని కుసుమ కర్ధమయింది. అటువంటి వ్యక్తిదగ్గర తను జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఆమె-"అయితే మీకు నా గురించినే పూర్తి వివరాలు తెలుసునా?" అనడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS