అంతా విన్న విశాలి మనసులో ఎన్నో ప్రశ్నలు తలలెత్తుతున్నాయి. వాటికి సమాధానాలేమైనా దొరుకు తాయా అని చూస్తూంది.
విశాలి మనసులో భావాలు తెలిసిపోయినట్లే, వాటికి సమాధానమేనన్నట్లు సారధి వైపు చూస్తూ అంది విజయ:
"నాకు మగవాళ్ళమీద కోపం పెరిగింది. అసలు మగజాతిమీద కోపం పుట్టడానికి ప్రథమ కారకులు మీరు."
తెల్లబోయాడు సారథి.
"అవును, మా అక్క విషయంలో మీరు ప్రవర్తించిన తీరు నాకు బాధే కాక కోపంకూడా కలిగించింది. తరవాత శివరావు మామయ్య ప్రవర్తనతో మగజాతి అంటేనే అసహ్యం పుట్టింది. కోపం పెరిగింది. మగ వాళ్ళమీద కసి తీర్చుకోవాలనుకున్నాను. అందుకే రామం..." అర్దోక్తిలో ఆగిపోయింది విజయ.
చటుక్కున విజయ కన్నుల్లోకి చూసింది విశాలి.
ఏ భయం లేకుండా, ఏ సందేహమూ లేకుండా' విశాలి ముఖంలోకి చూస్తూ అంది విజయ:
"వ్యక్తిగతంగా ప్రత్యేకించి మీ అన్నయ్య మీద నా కెటువంటి కోపమూ లేదు. కానీ నా మనసులో మగజాతి మీద కసి తీర్చుకోవాలని ఉండడంవల్ల, ప్రపంచంలోని మగవారందరిమీదా కక్ష సాధించడం ఎలాగూ కుదరదు కాబట్టి, నా కందుబాటులో ఉన్న మీ అన్నయ్య మీద నా కోసం చూపించుకున్నాను. అతన్ని ప్రేమించినట్టు నటించి, కవ్వించి ఆడించాను. అతని కోరిక తోసివేసి, మనసు గాయపరిచి నా నాటకానికి ముగింపు పలికాను. కానీ నా మూలాన మరొక స్త్రీ వేదన పొందుతుందన్న ఆలోచన ఆలస్యంగా కలిగింది.
ఆ ఆలోచన నా మనసుని రంపపుకోత పెట్టింది. అయినా ఏం లాభం? జరగవలసినదంతా జరిగిపోయింది." విజయ ముఖంలో విచారపు చీకటి అలుముకుంది.
విజయ మాటలు వింటున్న సువర్ణ ఆశ్చర్యపోయింది.
తను విశాలిని విజయకి పరిచయం చేసింది. కానీ చూస్తుంటే, విజయ మాటలు వింటుంటే విశాలి నిది వరకే ఎరుగునని తెలుస్తూంది. అందుకే వింతగా వాళ్ళిద్దరివైపూ చూస్తూండి పోయింది.
ఇప్పుడు మనసులో వేరే ఆలోచన నిండింది విశాలికి.
ప్రత్యేకించి ఏ కోపమూ లేదు అన్నయ్యమీద విజయకి. అటువంటప్పుడు కలలో వదిన తన కిచ్చిన ఆజ్ఞ నెరవేర్చడానికి ప్రయత్నిస్తే తప్పేముంది?"
సారథి ముఖం చూస్తుంటే నిజంగా జాలివేసింది విజయకి.
మనసులో పొందుతున్న పశ్చాత్తాపం అతని కన్నుల్లో స్పష్టంగా చూడగలిగింది.
"ఇప్పుడు కోపం పోయిందా మీ అన్నయ్య మీద?' సారధిని చూపిస్తూ విజయవైపు తిరిగి నవ్వింది సువర్ణ. "ఈ రోజునించీ ఆయన అన్నయ్య, నువ్వు చెల్లెలివి."
"అవును." మనఃస్ఫూర్తిగా అన్నాడు సారధి.
ఇంటికి వెళ్ళబోయేముందు ఒంటరిగా చూసి విజయని అడిగింది విశాలి: "నీకు మా అన్నయ్యమీద కోపం ఏమీ లేదుకదూ?"
అలా ఎందుకడుగుతూందో అర్ధం కాలేదు విజయకి.
"లేదు" అంది మృదువుగా.
"నీ మీది ప్రేమతో, నువ్వు దూరంకావడంవల్ల అన్నయ్య మనసు పాడయిపోయింది. నిద్రలోనూ, మెలకువలోనూ కూడా 'విజయా' అంటూ పలవరింతలే. ఇంకా కొన్నాళ్ళిలా ఉంటే తప్పకుండా అన్నయ్యకి పిచ్చెక్కుతుంది." విశాలి కన్నుల్లో నీరు పొంగింది.
ఏదో తెలియని బాధతో, జాలిగా చూసింది విజయ.
"ఇలా అడగవచ్చో, అడగకూడదో నాకు తెలియదు. తప్పైతే క్షమించు. మా అన్నయ్యని మళ్ళీ మామూలు మనిషిగా నువ్వే చెయ్యగలవు. మనఃస్ఫూర్తిగా నీ కిష్ట మైతే నా ప్రార్ధన మన్నించు." విజయ చేతులు పుచ్చుకుంది.
చెంపలమీదుగా జారిన కన్నీరు ఆ చేతులని తాకింది వెచ్చగా వెంటనే ఏ సమాధానమూ చెప్పలేకపోయింది. విజయ.
"ఇప్పుడే వెంటనే సమాధానం చెప్పక్కర్లేదు. బాగా ఆలోచించుకునే చెప్పు. కానీ, ఇది మాత్రం నేను నిశ్చయంగా చెప్పగలను. ఏమిటంటే, అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి కాగలడు నువ్వు క్షమాహృదయంతో ఆదరిస్తే. దురలవాట్లుకూడా మానుకుంటాడని నేను హామీ ఇస్తాను. ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు."
* * *
"నిజంగా నేను నీ కెంతో ఋణపడి ఉన్నాను,
విజయా! నా మీద దయతో నా దగ్గరికి వచ్చావు. నా జీవితంలో భాగం పంచుకోవడానికి నన్ను క్షమించి వచ్చావు. నన్ను మళ్ళీ మనిషిగా చేశావు."
సుకుమారమైన తన చేత్తో రామంచేతినందుకుంది విజయ. చిన్నగా నవ్వుతూ మెల్లగా అంది: "అనవసరంగా నన్ను అంతగా పొగిడెయ్యకండి. నేను మీ అర్ధాంగిని కావడానికి ముఖ్య కారకురాలు మీ చెల్లెలు. ఆమెకి మీ కృతజ్ఞత తెలియజేసుకోండి."
తెల్ల బోయాడు రామం.
"ఏమిటి? ఏమిటి నువ్వంటున్నది, విజయా!" కంగారుగా అడిగాడు.
"ఎందుకంత కంగారు పడతారు? మీ కేం కావాలో మీ చెల్లెలు తెలుసుకుంది. మీకు మతి స్తిమితం తప్పకుండా, మీరు కోరుకున్నది, మీకు కావలిసింది చేకూర్చాలనుకుంది. మీ సాహచర్యం స్వీకరించమని నన్ను కోరింది. ఆలోచించి మనః స్ఫూర్తిగా ఒప్పుకున్నాను నేను."
"విశాలీ!" చెల్లెల్ని తలుచుకుని, బాధగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు రామం.
భయంగా చూసింది విజయ.
"ఏమిటి? ఏమైందండీ?"

"నీకు తెలియదు, విజయా, నీకు తెలియదు. నేను మహా పాపిని. నే నెంత క్రూరంగా ప్రవర్తించానో నా కిప్పుడు అర్ధ మౌతూంది. నే నంటే నా చెల్లెలి కెంత ప్రేమ ఉందో నా కిప్పుడు తెలుస్తోంది. ఒక్కనాడైనా ప్రేమగా విశాలితో నేను మాట్లాడలేదు. తన సుఖం గురించిగానీ, మంచిచెడ్డలుగానీ అసలే చూడలేదు. అయినాకూడా నా బాగోగులు, నా సుఖం చూస్తూంది తను. నేను సుఖపడాలని, నేను సంతోషంగా ఉండాలనీ కదా మన ఇద్దర్నీ ఒకటి చేసింది? నేను చాలా అన్యాయం చేశాను విశాలికి. చాలా అన్యాయం చేశాను, విజయా!" పశ్చాత్తాపంతో రామం కుమిలిపోయాడు.
"ఊరుకోండి. బాధపడి ప్రయోజనం ఏముంది? ఇప్పటికైనా మీ మనసులో పరివర్తన కలిగింది. అంతే చాలు. మీ చెల్లెలి విలువ గ్రహించారు." ఓదార్చ బోయింది విజయ.
"ఇంత ఆలస్యంగా గ్రహించడంవల్ల లాభం ఏమిటి, విజయా! చిన్నప్పటినించి కూడా నా చెల్లెలి మీద నాకు ద్వేషమే తప్ప ప్రేమ అన్నది లేదు. ప్రేమ చూపించలేకపోయాను. నా లాంటి అన్నయ్య లెవరైనా ఉంటారా? నాకు ఏ శిక్ష వేసినా చాలదు." రామంలో దుఃఖం పెల్లుబికి వచ్చింది.
అప్పుడే ఎందుకో అటు వైపు వచ్చిన విశాలి అన్నయ్యని చూసింది ఆశ్చర్యంగా.
ఒక్క అంగలో వెళ్ళి విశాలి రెండు చేతులూ పుచ్చుకుని క్షమాపణ కోరాడు రామం.
అర్ధంకాక అయోమయంగా చూసింది విశాలి.
"ఏమిటన్నయ్యా! నేను నిన్ను క్షమించడం ఏమిటి?"
"నీకు తెలియదు, విశాలీ! నీకు కలగబోయే సౌఖ్యాన్ని నేనే పాడు చేశాను. అయినాకూడా నువ్వు నా సుఖం నిన్ను ద్వేషించినా, నువ్వు నన్ను మిన్నగానే చూశావు. నిజంగా నువ్వు దేవతవి."
"నేనూ నీ లాంటి మనిషినే, అన్నయ్యా! నేను చేసిన గొప్ప పనీ, ఘనకార్యం ఏమీ లేవు." నిర్లిప్తంగా అంది విశాలి.
"కాదు, విశాలీ! నీకు తెలియదు. నీకు నేను చాలా అన్యాయం చేశాను. ముఖ్యంగా రాజేంద్ర విషయంలో. అబ్బ! ఎలా చెప్పను? నీ కెటువంటి అన్యాయం చేశానో....నీకు తెలియదు. అతను నిన్ను ప్రేమించాడు.
బాధతో కూడిన చిరునవ్వొకటి విశాలి పెదవుల మీద విరిసింది.
"నాకు తెలుసన్నయ్యా! నా కంతా తెలుసు."
ఆశ్చర్యంగా చూశాడు రామం.
"నీకు తెలుసా? నువ్వు మా మాటలు విన్నావా ఆ రోజు?"
మౌనంగా తల ఊపింది విశాలి.
ఒక్క క్షణ మాగి, ఆ రోజు రాజేంద్ర తన గదిలోకి వచ్చి మాట్లాడిన సంగతికూడా చెప్పింది.
రామం గుండెల్లో మంట రేగింది.
