మనసులో వేదన పొంగింది.
"నేనా రోజు ఎంత నిర్దయగా మాట్లాడానో తెలిసికూడా, నీ విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానో చూస్తూకూడా నువ్వు నాకు మేలెందుకు చేశావు? నా సుఖం ఎందుకు కోరతావు? నీ ఋణం ఎన్ని జన్మలకీ తీర్చుకోలేను. నా పాపం ఎన్ని జన్మలకీ నశించదు. విశాలీ! నన్ను తిట్టు. నా కేదైనా శిక్ష వెయ్యి."
అన్నయ్య పొందే బాధ చూడలేకపోయింది విశాలి.
"భలేవాడి వన్నయ్యా! ఏదో మహా పాపం చేసినట్టు అంత బాధపడతావెందుకు? అన్నిటికంటే ముఖ్యం నీ మనసు మారింది. నువ్వు ఇదివరకటి అన్నయ్యని కాదు. నా మేలు కోరే అన్నయ్యవి. నా కోసం కన్నీరు విడిచే అన్నయ్యవి. నా కంతే చాలు. అంతే చాలు." చివరి మాట లంటుంటే విశాలి గొంతు గాద్గదికమయింది.
ఓదార్పుగా రామం భుజంమీద చెయ్యి వేసింది విజయ.
"పోనీలెండి! ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఆ రాజేంద్రకి ఉత్తరం రాయండి. అతనితో విశాలి వివాహం జరిపించండి."
బాధగా ముఖం పక్కకి తిప్పుకున్నాడు రామం.
"నన్నేం చేసినా పాపం లేదు, విజయా! ఈమధ్య విన్నాను. ఎవరో చెప్పారు. ఇంతవరకూ విశాలికీ విషయం చెప్పలేదు. చెప్పడం అనవసరం అనుకున్నాను. రాజేంద్ర రైలు ప్రమాదంలో మరణించాడు."
"అన్నయ్యా!" ఒక్క అరుపుతో నిలుచున్న చోటనే కూలబడిపోయింది విశాలి. పశ్చాత్తాపం తో రామం గుండె దహించుకుపోతూంది. ఆరని వేదనతో విశాలి మనసు మండిపోతూంది. విశాలిని ఓదార్చడం విజయ తరం కాలేదు.
* * *
సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. వచ్చీ పోయే జనంతో, దుమ్ము రేపుతూ పోతున్న బళ్ళతో రోడ్డు రద్దీగా ఉంది. పరధ్యానంగా నడుస్తున్న రామం, తనకి కొంచెం దూరంలో రోడ్డుకి అటుపక్కగా నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న రాజేంద్రని చూస్తూనే తుళ్ళిపడ్డాడు.
"అవును! రాజేంద్ర ఇదెలా సంభవం? ఇది కలా? నిజమా?" ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క సంతోషం ... వడివడిగా అటువైపు నడిచాడు.
మాట్లాడటం అయిపోయింది కాబోలు, రాజేంద్రతో మాట్లాడిన వ్యక్తి అటువైపు వెళ్ళిపోయాడు. ఇటే వస్తున్నాడు రాజేంద్ర.
పరుగులాంటి నడకతో రాజేంద్రని చేరుకున్నాడు రామం.
'నన్ను క్షమించు' అని మనసులోనే అనుకున్నాడు.
సంతోషం కళ్ళలో నాట్యం చేస్తుండగా రాజేంద్ర చేతులు పుచ్చుకున్నాడు.
"నువ్వు! నువ్వేనా, రాజేంద్రా! నిజంగా నమ్మలేక పోయాను. ఇప్పుడెంత ఆనందంగా ఉందో నాకు ఎలా చెప్పమంటావు?"
నవ్వుతూ రామం భుజంమీద చరిచాడు రాజేంద్ర.
"ఓహో! నువ్వుకూడా, ఆ ఏక్సిడెంట్ లో నేను టపా కట్టేశాననే అనుకుంటున్నావన్న మాట!"
"పద! కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం!" హోటల్లోకి దారి తీశాడు రామం.
రాజేంద్రకి తనమీద ఏ కోపమూ లేదన్న మాట. గౌరవంగా, ప్రేమగా, అభిమానపూర్వకంగా రాజేంద్ర వైపు చూశాడు రామం.
కాఫీ తాగుతూ చెప్పడం మొదలుపెట్టాడు రాజేంద్ర.
"నేనూ, నా స్నేహితుడూ, కొలీగ్ అయిన భాస్కరం ఫస్టుక్లాసులో ట్రావెల్ చేస్తున్నాం. నా కేమో బెజవాడలో అర్జెంటు పనుంది. అందుకని నేను బెజవాడ వెళుతున్నాను. మధ్యలో ఏదో స్టేషన్ లో రైలాగినప్పుడు మేమిద్దరం కాఫీ తాగడానికి దిగాం. కాఫీ తాగడం పూర్తిచేసి డబ్బు లిద్దామని జేబులోంచి నేను పర్సు తీశాను. అది చటుక్కున నా చేతిలోంచి వాడు లాగేసుకున్నాడు. 'నువ్వేం ఇవ్వక్కర్లేదు. నే నిస్తాను డబ్బు' అంటూ తన పర్సు తీసి కాఫీకి డబ్బు చెల్లించాడు. ఆ తరవాత నా పర్సు తన జేబులో పడేసుకున్నాడు నన్ను ఏడిపిద్ధామని. నేను మాత్రం తక్కువ తిన్నానా? నా పర్సు ఇలా పబ్లిగ్గా కొట్టేస్తావేంరా? అంటూ వాడి పర్సు లాక్కుని నా జేబులో పడేసుకున్నాను. ఈ లోపల నాకు తెలిసిన ఒక పెద్దమనిషి కనుపించి కబుర్లేసు కున్నాడు. ఇవతల వీడేమో రైలు కదిలే టైమైంది రమ్మని రెండు సార్లు పిలిచాడు.
'నువ్వెళ్ళి ఎక్కు. నే నొస్తాన్లే రైలు కదిలే లోపల' అంటూ వాడిని పంపించాను. ఎందుకంటే, అప్పుడే ఆ పెద్దమనిషి ఒక అత్యవసరమైన విషయం మాట్లాడుతున్నాడు. అంతే. మా మాటలో మేమున్నాము. రైలు కదిలిపోయింది. కదులుతున్న రైలు ఎక్కడం మంచిది కాదంటూ ఆయన నా జబ్బ పుచ్చుకున్నాడు. నేను కూడా అట్టే బాధపడలేదు. నా సామాను పోతుందన్న బాధ, బెంగ లేవు. నా స్నేహితుడు వాడి సామానుతో పాటు నా సామానుకూడా వాళ్ళింటికి తప్పకుండా తీసుకెళతాడు. జాగ్రత్త చేస్తాడు. కాబట్టి కదులుతున్న రైలెక్కి ముప్పు తెచ్చుకోవడం అనవసరం అనుకున్నాను. జేబులో ఉన్నది నా స్నేహితుడి పర్సే అయినా అసలు డబ్బంటూ ఉన్నందుకు విచారం లేక పోయింది. బెజవాడలో అర్జెంటు పని ఉండడంవల్ల తిన్నగా బస్ స్టాండ్ కి వెళ్ళి బస్సులో బెజవాడ వెళ్ళి పోయాను. అక్కడ పని అయిపోయాక నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి వాడి డబ్బు వాడి కిచ్చి, నా సామానూ, డబ్బూ తెచ్చుకుందామనుకున్నాను." భారంగా నిట్టూర్చాడు రాజేంద్ర.
ఆత్రతగా చూస్తూ, ఆసక్తిగా వింటున్నాడు రామం.
"కానీ, ఇంత ఘోరం జరిగిపోతుందని ఎవరూహించారు? నన్ను వదిలిపెట్టిన ఆ రైలు భాస్కరాన్ని మాత్రం ఎందుకు ఎక్కించుకుంది? ఎందుకు వాడిని పొట్టన పెట్టుకుంది?" అంత బాధలోనూ విరక్తిగా నవ్వాడు రాజేంద్ర.
"భాస్కరం ఒక్కడే కాదు, ఇంకా ఎంతమందో దుర్మరణం పాలయ్యారు. భాస్కరం జేబులో ఉన్నది నా పర్సు. వాడి ముఖం గుర్తు పట్టే స్థితిలో లేకపోవడంతో, నామరూపాల్లేకుండా పోవడంతో, జేబులో ఉన్న నా పర్సులోని పేరూ, అడ్రసూ చూసి నేనే పోయినట్టు నిర్ధారణ చేశారు. కానీ నేను బ్రతికే ఉన్నాను. ఈ సంగతి రైల్వే వాళ్ళకి తెలియజేశాను. భాస్కరం తల్లీ, తండ్రీ ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. అందుకే వాళ్ళని పరామర్శించి పోదామని ఈ ఊరొచ్చాను. భాస్కరం తల్లి ఏమందో తెలుసా? 'ఆ పెద్దమనిషి రూపంలో దేవుడే వచ్చి నిన్ను కాపాడాడు. అందుకే రైలు కదిలిపోయింది. నువ్వెక్కలేదు' అంది. ఏది ఏమైనా భాస్కరాన్ని తలుచుకుంటే నా గుండె నీరవుతోంది" బాధగా తల ఊగించాడు రాజేంద్ర.
కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. రాజేంద్ర చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నిశ్శబ్ధాన్ని భగ్నం చేశాడు రామం.
"నా తప్పులు మన్నించి నా కోరిక చెల్లించు."
"నువ్వేదో తప్పు చేశావని నే ననుకోవటం లేదు" రాజేంద్ర కంఠస్వరం అతని మనసులాగే మృదువుగా ఉంది.
"నాకు తెలుసు, రాజేంద్రా! నీ మనసు నవనీతం. నీ హృదయం మంచికి నిలయం. పొగుడుతున్నానని అనుకోవద్దు. పద, మా ఇంటికి వెళదాం. రైలు ప్రమాదం గురించీ, నువ్వా ప్రమాదం పాలయ్యావనీ చెప్పినప్పటినించీ తిండికీ, నిద్రకీ దూరమైంది విశాలి. మనసంతా నిన్నే నింపుకుని ఆరాధిస్తున్న విశాలి నీదే! నీ దర్శనమే మహాభాగ్యంగా పులకించిపోతుంది. ఇంక నువ్వు తన వాడివైతే వేరే చెప్పాలా?"
కళ్ళ ముందు విశాలి రూపాన్నే నింపుకుని, అడుగులు కదిపాడు రాజేంద్ర.
* * *
"విశాలీ! విశాలీ!"హడావిడిగా, ఆనందంగా తలుపులు తోసుకుంటూ లోపల అడుగు పెట్టాడు రామం.
"వస్తున్నా!" వంటింట్లోంచి కేక వేసింది విశాలి.
"రావాలి! త్వరగా రావాలి! నీ కేం బహుమతి తెచ్చానో చూడు!"
"ఏమి టన్నయ్యా?" అంటూనే తలఎత్తి, ఎదురుగా నిలబడ్డ రాజేంద్రని చూస్తూనే ఆనందంతో నోట మాట లేక నిలబడిపోయింది. ఒక్క క్షణం నమ్మలేనట్టుగా చూసింది. మరుక్షణం రాజేంద్ర చూసే చూపులకి సిగ్గుల మొగ్గ అయి, సంతోషం, తృప్తి కళ్ళలో మెరుస్తుండగా చిరునవ్వుతో తల దించుకుంది.
వెనకే వచ్చిన విజయ విశాలి బుగ్గ గిల్లి నవ్వింది.
మనసు నిండిన తృప్తితో విశాలి చేయి అందుకుని రాజేంద్ర చేతిలో ఉంచాడు రామం.
విశాలి కళ్ళలో వింత మెరుపు, రాజేంద్ర కళ్ళలో అంతులేని తృప్తి ఆ ప్రదేశాన్ని వింత వింత వెలుగులతో నింపాయి.
---:సమాప్తం:---
