"అబ్బే! ఎవరో నాకు తెలియదు. పద వెళదాం!" ఇద్దరూ రెండు అడుగులు వేశారో లేదో ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళా దగ్గరగా వచ్చింది.
"మీ పేరు సారథి కదూ?"
"ఊఁ" అన్నాడు సారధి, ఎవరా ఈ అమ్మాయి అని ఆలోచిస్తూ.
పరీక్షగా ఆ యువతినే చూస్తూంది సువర్ణ.
"నా పేరు విజయ. మా అక్క సుహాసిని మీకు తెలుసనుకుంటాను."
ఉలిక్కిపడ్డాడు సారధి. సుహాసిని పేరు వింటూనే.
కలవరపడింది మనసు.
జవాబు చెప్పాలన్న సంగతికూడా మరిచిపోయి అలాగే నిలబడిపోయాడు.
బావ ముఖంలోకి ఒకసారి చూసి, తను కలగజేసుకుంది సువర్ణ.
"అవును! సుహాసిని ఆయనకి తెలుసు."
"మా అన్నయ్య పోలికలు ఉండడంవల్ల, అదీకాక ఎప్పుడో ఒకసారి మా ఇంటిముందునించి మీరు వెళుతుండగా అక్క చూపించింది మిమ్మల్ని. అందుకే మీ రేనా కాదా అని అనుమానంగా చూస్తున్నాను ఇందాకటినుంచీ."
"మీరు ఒకసారి...." సువర్ణ మాటలకి అడ్డువస్తూ నవ్వింది విజయ.
"మీ కంటే చిన్నదాన్ని...నువ్వు అనండి చాలు."
"ఓ! సరే! నువ్వు మాతో ఇప్పుడు మా ఇంటికి రావాలి."
"మీ ఇంటికా? ఎందుకూ?" అంతలోనే అదోలా మారిపోయింది విజయ ముఖం. అయిష్టంగా చూసింది.
"ఎందుకో అదంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడు కుందాం. ముందు పద." ఆమెని ఇంటికి ఆహ్వానించి యోగక్షేమాలు కనుక్కుని, ఏదైనా సహాయం కావలిస్తే చూసి ఆదరిస్తే సుహాసిని విషయంలో బాధ చెందుతున్న భర్త మనసుకి కొంత శాంతి, తృప్తి చేకూరుతాయన్న ఉద్దేశంతో విజయని తను ఇంటికి ఆహ్వానించింది సువర్ణ.
"క్షమించండి. ఇప్పుడు కాదు. ఇంకో రోజు వస్తాను. అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది."
తెల్లబోయాడు సారధి 'అమ్మ' అంటుందేమిటా అని.
సువర్ణకి కూడా అర్ధం కాలేదు. ఈ అమ్మాయి సుహాసిని చెల్లెలు కాదా? కాకపోతే అబద్దమాడవలసిన అవసరం ఏముంది? వీళ్ళమ్మగారు పోయినట్టు బావ చెప్పాడు. మరిప్పుడీ అమ్మాయి అమ్మ అంటుందేమిటి? ఏమో? అదంతా ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు.
"సరే అయితే! ఎప్పుడో కాదు. రేపే రావాలి. రేపు సాయంత్రం మీ అమ్మగారినికూడా తీసుకురావాలి. ఎదురుచూస్తూ ఉంటాం. సరేనా?" అంటూ ఇల్లెక్కడో గుర్తులు చెప్పింది సువర్ణ.
"అలాగే! వస్తాను." ఇద్దరికీ నమస్తే చెప్పి జనంలో కలిసిపోయింది విజయ.
"అమ్మ అంటుందేమిటి, సువర్ణా!" మనసులో మాట అడిగేశాడు సారధి.
"నాకూ అదే అర్ధం కావటం లేదు. ఒకవేళ నువ్వే మైనా తప్పు విన్నావేమో, బావా, ఆ రోజు?"
"లేదు, లేదు. నేను విన్నది నిజమే. ఆ రోజు నా తోటి వాళ్ళమ్మగారు పోయినట్టు వాళ్ళ పక్కింటివాళ్ళే చెప్పారు. వాళ్ళకి అబద్ధం చెప్పవలసిన అవసరం అందులో ఇటువంటి విషయంలో అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంటుంది చెప్పు?"
"అవు నదీ నిజమే! సరే! రేపు వాళ్ళు వస్తారు. అప్పుడే అన్ని విషయాలూ తెలుస్తాయి." ఆలోచించి బుర్ర పాడుచేసుకో దలుచుకోలేదు సువర్ణ.
* * *
ఆ మర్నాడు సాయంత్రం జగదీశ్వరిని తీసుకుని సారధి ఇంటికి రానేవచ్చింది విజయ. వాళ్ళని లోపలికి తీసుకువెళుతూ, గేటు చప్పుడు విని వెనక్కి తిరిగింది సువర్ణ.
కుడిచేత్తో రాజేంద్ర చేయి పుచ్చుకుని, ఎడం చేత్తో నిండుగా కప్పుకున్న పైట అంచు పట్టుకుని లోపలికి నడిచి వస్తూంది విశాలి హంసలా.
చాలా రోజుల తరవాత తమ ఇంటికి వస్తున్న స్నేహితురాల్ని చూసి సువర్ణ మనసు ఆనందం పట్టలేక పోయింది.
"అబ్బ! ఎన్నాళ్ళకి వచ్చావు మా ఇంటికి!"
"ఇంట్లో ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంటే కాసేపు నీ దగ్గిర కూర్చుని చల్లబరుచుకుందామని పించి ఉన్నపళంగా ఇలా వచ్చాను." నవ్వింది విశాలి.
"రండి, లోపల కూర్చుందాం" అంటూ ముందుకి నడిచింది సువర్ణ.
అప్పటికిగాని, తనవైపే చూస్తూ అటుపక్క నిలబడి ఉన్న విజయని గమనించలేదు విశాలి. చూసిన తరవాత అడుగు ముందుకి వేయడం మరిచిపోయి అలాగే నిలబడిపోయింది.
నవ్వుతూ వెనక్కి వచ్చింది సువర్ణ.
"అరే! మీ ఇద్దర్నీ ఒకరికొకర్ని పరిచయం చెయ్యడం మరిచిపోయాను కదూ? విజయా! ఇదుగో, ఈమె నా స్నేహితురాలు, విశాలి ఇదుగో! ఈ అమ్మాయి పేరు విజయ. వివరాలు మెల్లిగా తెలుసుకుందువుగాని, విశాలీ! రండి కూర్చుందాం."
అందరూ కూర్చున్నాక సారధికూడా వచ్చి కూర్చున్నాడు వాళ్ళ దగ్గిర.
అందరికీ కాఫీ లందించింది సువర్ణ.
కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు.
ఉన్నట్టుండి సారథి విజయవంక చూస్తూ అన్నాడు:
"సుహాసిని విషయంలో నేను చాలా పెద్ద పొరపాటే చేశాను. నా తప్పు నాకు ఆలస్యంగా తెలిసింది. మీ ఇంటికి వచ్చాను ఆ తరవాత. కానీ ఏం లాభం? జరగకూడనిధి అప్పటికే జరిగిపోయింది. క్షమించమని ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి కూడా సిగ్గుపడుతున్నాను....మీ అమ్మగారు..." అంటూ ఆగిపోయాడు సారథి.
"అవును. మా అమ్మ లేదు ....నా కథ చెప్పాలంటారా?" అంటూ సువర్ణ కేసి నవ్వుతూ చూసింది విజయ.
చెప్పమన్నట్టుగా చూసింది సువర్ణ.
సారధివై పోసారి చూసిచెప్పడం మొదలుపెట్టింది విజయ.
"మా అక్క విషయంలో మీ ప్రవర్తనకి నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. టై ఫాయిడ్ తో మంచం పట్టిన అక్క మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ షాక్ కి తట్టుకోలేక ఎన్నాళ్ళనించో జబ్బుతో బాధపడుతున్న అమ్మకూడా కొద్ది రోజుల్లోనే నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. నా అన్నవాళ్లు లేని నేను, దిక్కు తోచక భయపడుతున్న సమయంలో వచ్చాడు శివరావు. ఎప్పుడూ అంతకుముందు మా ఇంటి ముఖం చూసి ఎరగడు. మా అమ్మకి వరసకి అన్న అవుతాడు. నేను పుట్టాక ఆయనని చూడటం అదె మొదలు. ఎప్పుడో ఆయన గురించి అమ్మ చెప్పగా విన్నాను, అంతే, భార్య పోయి, చాలాకాలం అయింది ఆయనకి పిల్లలేరు. ఆ మనిషికి లేని దురలవాట్లు లేవని చెప్పింది అమ్మ. అది గుర్తు కొచ్చి ఆయనని చూడగానే వెగటు పుట్టింది నాకు. మాటతీరు, ప్రవర్తన కూడా అసహ్యం పుట్టించేటట్టున్నాయి." ఒక్క నిమిష మాగి అందరి ముఖాల్లోకి చూసింది విజయ.
ఇదివరకే ఇదంతా విజయ నోటివెంట విని ఉండడం వల్ల జగదీశ్వరి ముఖంలో ఆదుర్దా లేదు. కానీ మిగిలిన ముగ్గురూ ఎంతో కుతూహలంగా వింటున్నారు.
"మా ఇంటికి పద, అమ్మా! ఒక్కదానివీ ఇక్కడెలా ఉంటావు? నేను నీకు పరాయివాడినేం కాదు. నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతోంది" అంటూ కన్నీరు ఒలక'పోశాడాయన. ఇరుగుపొరుగువారి సలహాలతో తప్పని సరిగా, వేరే సహాయం, దిక్కూ తోచక ఆయన వెంట వాళ్ళ ఊరు వెళ్ళాను.
నాలుగు రోజులు బాగానే గడిచాయి. ఆ తరవాత ఒక రోజు నేను గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉండగా హాల్లో శివరావు మామయ్యకి ఇంకొక నూతన వ్యక్తి ఎవరో పచ్చనోటు అందిస్తూ ఏదో అనడం-మామయ్య ఆయనతో తిరిగి ఏదో చెప్పడం ఇదంతా కనిపించింది. మరి కొంచెం సేపట్లో ఆ ఇద్దరూ నా గదిలోకి వచ్చారు.
'చూడమ్మా! ఈయన మన ఇంటికి అతిథిగా వచ్చారు. మర్యాదలన్నీ నువ్వే చూసుకోవాలి. మళ్ళీ రేపు వెళ్ళిపోతారు' అన్నాడు మామయ్య నాతో.
నేను 'అలాగే' అన్నట్టు తల ఊపి ఆ వ్యక్తి వంక చూశాను.
పళ్లన్నీ బయట పెట్టి నవ్వుతూ, కన్ను కొడుతూ చూశాడు నా వైపు.
నా కసహ్యం వేసింది.
'సరే! వస్తాను. నే నీ వేళ రాత్రికి ఇంటికి రాను. పనుంది' అంటూ బయటికి వెళ్ళిపోబోయాడు మామయ్య.
నేను రెండు అంగల్లో ఆయన ఎదుటికి వెళ్ళాను. 'ఇంట్లో కొత్త మనిషిని వదిలిపెట్టి, రాత్రికి ఇంటికి రానంటావేమిటి, మామయ్యా! నా కొక్కదానికీ భయం ఉండదూ?'
'భయం అంటే ఎలా చెప్పు? ఇదిగో, ఇది ఇచ్చాడు. ఆయన చెప్పినట్టు విను' అంటూ జేబులోంచి నోటు తీసి చూపించాడు.
అప్పటికి నాకు మామయ్య పన్నాగం అర్ధమయింది.
కోపం ఆపుకోలేకపోయాను.
'ఛీ! నువ్వసలు మనిషివేనా! అందుకేనా నన్నిక్కడికి తీసుకొచ్చావు?' అన్నాను కన్నీటిని దాస్తూ.
వికృతంగా నవ్వాడు. 'లేకపోతే నిన్ను కూర్చోబెట్టి మేపుతాననుకున్నావా?'
'నన్ను తీసుకెళ్ళి పోషించు, నీ వెంట వస్తాను అంటూ నే నేం ఏడవలేదే? కావలసిన వాడినంటూ ఎక్కడలేని జాలీ ఒలకబోసి ఎందుకు తీసుకొచ్చావు?' అని ఉన్న మాట అడిగేశాను.
దానికి జవాబు చెప్పలేక తను చెప్పినట్టు నడుచుకుని తీరవలసిందేనంటూ కేకలు మొదలుపెట్టాడు.
'నే నీ ఇంట్లో ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతాను. గట్టిగా అరిచి ఇరుగు పొరుగువాళ్ళని' పిలుస్తానని బెదిరించేసరికి కాస్త తగ్గాడు. ఆ నూతన వ్యక్తితో ఏదో చెప్పి, కాసేపు బతిమాలి ఎలాగైతేనేం పంపించేశాడు. నా కింక ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉండ బుద్ధి కాలేదు.
నా బట్టలూ అవీ తీసుకుని వెళ్ళిపోదామని గదిలోకి వెళ్ళేసరికి, నా వెనకే వచ్చి గది తలుపు బయట గడియ పెట్టేసి, 'నేను చెప్పినట్టు వింటా ననేవరకూ ఈ గదిలోనే పడి ఉండు' అంటూ వెళ్ళిపోయాడు మామయ్య.
అనుకోని ఆ సంఘటనకి నేను చాలా భయపడి పోయాను.
అక్క, అమ్మ నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళి పోవాలి? నన్ను కూడా వాళ్ళతోపాటు ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇలాగే ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపాను ఆ గదిలో భయం భయంగా.
మర్నాడు ఉదయం గది బయట ఊడుస్తున్న చప్పుడై, నేను తలుపు చప్పుడు చేశాను లోపలినుంచి.
తలుపు తెరుచుకుంది.
చేతిలో చీపురుతో పనిమనిషి.
దేవుడి దయవల్ల మామయ్య తాళం వెయ్యలేదు అది నా అదృష్టం.
'ఏందమ్మా! ఇందులో ఉండిపోనారు? గడియెట్టేసి నారెవరు?' అంటూ నోరెళ్ళబెట్టి చూస్తున్నదాన్ని అలాగే వదిలి, నా బట్టలసంచీ తీసుకుని బయటికి నడిచాను నా అదృష్టంకొద్దీ మామయ్య స్నానం చేస్తున్నాడప్పుడు.
తిన్నగా స్టేషన్ కి వెళ్ళిపడ్డాను.
ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో తెలియదు. తెలిసిన మొహాలు లేని, సాధ్యమైనంత దూరపు ఊరు వెళ్ళిపోవాలని నిశ్చయిచుకున్నాను చివరికి." ఒక్క క్షణం ఆగి నవ్వుతూ జగదీశ్వరి వైపు చూసింది విజయ.
"మిగిలింది నువ్వు చెప్పమ్మా!"
అందరి ముఖాల్లోకీ ఒకసారి చూసి, విజయమీద తన దృష్టి నిలిపింది జగదీశ్వరి.
'మా ఇద్దరికీ రైల్లో పరిచయమైంది. సన్నిహితుల మయ్యాము రాల్లోనే. తన కథంతా వినిపించింది విజయ నాకు. నాకు జాలి వేయడమేకాక ఆశ్చర్యంకూడా కలిగింది. ఎందుకంటే, నేనుకూడా' ఎక్కడికి వెళ్ళాలో, ఎలా జీవితం సాగించాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. భర్త పోగానే అయినవాళ్ళందరిచేతా మోసగించబడ్డాను. ఆస్తంతా కాజేసి కానీకి కొరగాకుండా చేశారు నన్ను. అందరికీ దూరంగా పోవాలనిపించింది. కానీ, ఈ పెద్ద వయసులో ఒంటరిగా ఎక్కడికి పోవాలి? ఎక్కడ బ్రతకాలి? అన్న ఆలోచన బాధ పెట్టిన మాట నిజం. అభిమానం ఆ ఆలోచనని అణిచివేసింది. అంతే, బండి ఎక్కాను. విజయ కథ విన్న తరవాత నా కథకూడా తనకి వినిపించాను. చివరికి విజయే ఒక నిశ్చయానికొచ్చింది. దాని ఫలితమే మేమిద్దరం ఈ ఊరొచ్చి తల్లీకూతుళ్ళలా జీవితం సాగిస్తుండడం. ఒకరి కొకరం తోడుగా మా జీవితాలు నడిబజారుపాలు కాకుండా తల్లీ కూతుళ్ళలా జీవితం సాగిస్తున్నాం." చెప్పడం ఆపింది జగదీశ్వరి.
