Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 21

 

                                    10

    రామనాధం మాట్లాడలేదు. కారు 'కేశవ' ఇంటిముందు ఆగింది! తెల్లని నైలాన్ జరీ బట్టలు ధరించి, నడినెత్తికి ముడిజుట్టి, ముడినించి ఒక ప్రక్కగా భుజాలమీదకు జారేట్లు అప్పుడప్పుడే విరుస్తూ నవ్వుతూన్న జాజులమాల ధరించిన నళిని కారు ఆగిన చప్పుడు వినగానే వరాండామీదకు వచ్చి,
    'వసు అత్తయ్య వచ్చింది!' అంటూ తండ్రికి చెప్పి,
    'హల్లో కమాన్!' అంటూ అన్న తమ్ములిద్ధర్ని ఆహ్వానించింది! కేశవ లోపలికి వెళ్ళాడు మాధవా. రామనాధం నళినితో కబుర్లాడుతూ హాలులోనే కూర్చున్నారు! కేశవ తల్లివద్దకు వెళ్ళి
    'అమ్మా! వసుంధరవచ్చిందా! ఏదే!" అన్నాడు. సీతమ్మ--
    'వచ్చింది! మన నళినికి ఏదో సంబంధం వుందట! చూసి రావటానికి అగ్రహారం వైపు వెళ్ళింది! రాత్రికి వచ్చేస్తుంది అతను పెళ్ళికొడుకు మన అక్కయ్యకు దగ్గర చుట్టంట! ఇంజనీర్ పాసైనాడట! చదువుకున్న అమ్మాయివైతే చేసుకుంటానన్నాడట! పోనీ మనతో చెప్పిపోదామని వచ్చింది! పిచ్చితల్లి! పిల్లలు లేక పోయినా, నీకన్నా పదిమంది పిల్లలు కలుగుతే చాలు అంటుంది!' అంది సీతమ్మ.
    'చెల్లెమ్మ ఇంట్లో లేదు!' అన్నమాట వక్కటే విన్పించుకున్నాడు కేశవ!
    కేశవ హాలులోనికి వచ్చాడు! నళిని ఏదో సినిమాకు రమ్మని మాధవని బ్రతిమాలుతోంది! మాధవ రానని మారం వేసుకుంటున్నాడు.
    'పోనీ వెళ్ళవోయ్! సరదాగా! మీఅన్నకు వచ్చిన భయమేమీ లేదు! అతన్ని జాగ్రత్తగా మీ తండ్రివద్దకు చేర్చే పూచీ నాది!' అన్నాడు కేశవ!
    'మాధవ' నళినీ, సినిమాకు వెళ్ళి పోయేరు! రామనాధం వక్కడూ హాలులో కూర్చున్నాడు!
    'పైనవుంది కామేశ్వరి! వెళ్ళు! వెళ్ళి నీ అభిప్రాయం ఆమెకి తెలియచెప్పు!' అన్నాడు కేశవ! రామనాధం కదలలేదు! స్థాణువులా కూర్చున్నాడు! ఇంత 'స్నేహ శీలి అయిన పెద్దమనిషికి తాను ఎల్లాంటి ఉపకారం చేయబూనుతున్నాడు?' రామనాధం కళ్ళు చమర్చాయ్!
    'వెళ్ళవోయి! పెళ్ళికూతురి కుండాల్సిన సిగ్గు నీవు చూపిస్తున్నావేమిటి?' అన్నాడు కేశవ!
    అప్పటికీ రామనాధం కదలక పోవటం చూసి,
    'ఆలస్యం అమృతం విషం! పద! నేనూ వస్తాను!' అంటూ లేచాడు కేశవ! ఇద్దరూ పైకి వెళ్ళారు! కామేశ్వరి మంచంమీద బోర్లగిలాపడి వుండి తల గడలో ముఖం దూర్చుకున్నది.    
    'కామేశ్వరీ! ఎటూకానివేళ నిద్ర పోతున్నావా?' అన్నాడు కేశవ!
    కేశవ పలకరింపుకి మంచంమీద నుంచి లేచి నించుంది కామేశ్వరి. ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బివున్నాయి!
    'కామేశ్వరీ! నీతో మాట్లాడాలని రామనాధం వొచ్చాడు! నేను నిన్న నీకు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకో! జాగ్రత్తగావిను!' అని చెప్పి వరాండా లోనికి వచ్చి మేడమెట్లవద్ద నించున్నాడు! కేశవకి అకస్మాత్తుగా తానేదో కానిపని చేస్తున్నట్లు యోచన కలిగింది! రామనాధానికి కామేశ్వరి ఏమి జవాబు చెప్తుందో వినాలనిపించింది! ఎటూ కామేశ్వరికి నచ్చినవాడితో వివాహం చేయాలని తను అనుకుంటున్నాడు! కామేశ్వరి చెప్పే జవాబు వినాలని తనకెందుకీ తాపత్రయం! కామేశ్వరి తన్నే కోరాలనుకోవటం ఇంత వయస్సులోకూడా తనకి బుద్ధి చాంచల్యం వదలలేదనటానికి తార్కాణం! ఇప్పుడీ వయస్సులో కామేశ్వరి లాంటి చిన్నపిల్లతో, యవ్వనవతితో సంసారం చేయబూనటం హాస్యాస్పదంగా వుంటుంది కూడా! ఇల్లా తనలో తాను మల్లగుల్లాలు పడుతూ మేడమెట్లమీదనే స్థాణువులా నిలబడ్డాడు!
    రామనాధం కూడా కామేశ్వరివద్ద అల్లా స్థాణువులా నిలబడ్డాడు!
    'ఎందుకు వచ్చారు రామనాధం గారూ?' అంది కామేశ్వరి. ఆమె కంఠం రూక్షంగా వుంది!
    రామనాధం ఏమీ మాట్లాడలేక పోయాడు!
    'ఎందుకు వచ్చారు ఇక్కడికి! నాతో వంటిగా మాట్లాడటానికి అవకాశం మీ కెందుకు?' అంది. ఆమె స్వరంలో రోదన నిండుతూంది.
    'కామేశ్వరీ! ఏడాది క్రితం నిన్ను పెళ్ళిచూపులుగా చూసాను. అప్పుడు నీతో మాట్లాడటానికి నాకు కాని, నాతో మాట్లాడటానికి నీకు కాని అప్పుడు అవసరం అవకాశం లేవు! ఇప్పుడు 'కేశవ' గారి ఔదార్యంవల్ల మనకీ అవకాశం కలిగింది! నిజానికి కామేశ్వరీ! ఆరోజు నిన్ను చూసాను. నీవు నాకు చాలా చాలా నచ్చావు! అదే మా వాళ్ళతో చెప్పాను! కాని భగవంతునిదయ వేరుగా వుంది. వాళ్ళకి కట్నం నచ్చలేదు! నేను నా మనోనిర్ణయం నిర్లజ్జగా మా వాళ్ళముందు ప్రకటించేలోగానే నీ వివాహ నిర్ణయం మా వాళ్ళకి అందింది! ఇంక నాలో నేనే కుమిలిపోయేను! తర్వాత కూడా మావాళ్ళ ఒత్తిడివల్ల అనేకమంది అమ్మాయిలను చూసాను! కాని ఏ అమ్మాయిని చూసినా, చూడబోయినా నా మనోనేత్రం ముందు నీ మూర్తే సాక్షాత్కరించేది! నీవు వివాహితవై సుఖసంసారం సాగించుతున్నా కూడా నాకు నీమీద ధ్యానం పోయేది కాదు! కాలేజీలోజేరి చదువుతున్నావనీ నీకు పెళ్ళికాలేదనీ మాధవ చెప్పాడు! మళ్ళీ చితికిపోయిన ఆశలు చిగురించాయి! నాలో మోసులెత్తేయి కొత్తకోరికలు! కామేశ్వరీ! కేశవగారికి నా జీవితం అంతా ఋణపడి వుంటాను! నాకు అలభ్యమనుకుని ఆశ వదులుకున్న జీవితానందాన్ని తిరిగి ప్రసాదించారు! కేశవగారి హృదయ వైశాల్యాన్ని నేను గుర్తించాను! ఆయన మహానుభావుడు!' ఇంకా ఇల్లాగే కేశవ గురించిన స్తుతితో రామనాధం చెప్పుక పోతున్నాడు. మేడమెట్లమీద కేశవ శరీరం నిప్పుల్లో నించున్నట్లు ఉడికి పోతోంది! తన్ని అమితంగా స్తుతిస్తున్నాడు రామనాధం! ఈ స్తుతి పాఠాల కోసమేనా తాను త్రికరణశుద్దిగా, అగ్నిసాక్షిగా మూడుముళ్ళూ వేసిన భార్యని వొదులుకోవటం? ఛీ ఛీ! తానెంత తప్పు పని చేసాడు? వయస్సు ముదురుతోన్న కొద్దీ తనకి పిచ్చిపట్టటం లేదుకదా? అనవసరంగా లేనిపోని చికాకులు తెచ్చి పెట్టుకున్నాడు! తన సంసారం హాయిగా సాగిపోయేదానికి ఈ తిప్పలు తెచ్చి పెట్టుకున్నాడు! సంసారం కోసరమేకదా! తనతల్లి తనచెల్లి తనసంసారం తిరిగి పునరుద్ధరింపబడాలనేకదా-తనచెవి నిల్లు కట్టుకుని పోరిపోరి తన్ని మళ్ళీ పెళ్ళి చేసుకుందుకు వప్పించారు? తనకీ చితికిపోయిన ప్రేమల్ని పునరుద్దరింప చేయాలనే పాడుబుద్ధి ఎందుకు పుట్టింది? ఛ ఛ! ఎంత తప్పుపని చేసాడు?

                                    
    'అయ్యా రామనాధం గారూ! మీకు నేనేం అపకారం చేసాను? నా సంసారంలో చిచ్చురేపెట్టటానికి మీకెందుకీ పాడుబుద్ధి పుట్టిందీ! పెళ్ళిచూపులకు వచ్చినప్పుడు మీ ముఖం చూసిన గుర్తుకూడా నాకు లేదు! పెళ్ళికానప్పుడు తొంభయ్ సంబంధాలవాళ్ళు వస్తారు పోతారు! ఒకళ్ళు కొకళ్ళు నచ్చుతేకదా! మూడుముళ్ళూ పడేది! నాకు పెళ్ళికాని రోజుల్లో మీలాంటి యువకులకి ఒకళ్ళకీ నామీద జాలిలేదు! అప్పుడు మీకు నన్ను నా పేదరికాన్నించి ఉద్ధరించాలనే యోచనే కలగలేదు! మీరు నిర్లక్ష్యంగా కట్నం కోసరం తిరస్కరించిన ఒక పేద ఇంటి పిల్ల నేడు ఒక ఉత్తమ మానవుని భార్యగా గౌరవనీయమైన స్థానం పొందటం చూసి మీలో ఈసు ప్రారంభమైంది! నా స్థానం శిధిలంచేయటం కోసం ఈరోజు మీకు ప్రేమ పాఠాలు జ్ఞాపకం వచ్చాయి! మీ మాటలువింటే వారు ఏమనుకుంటారు? మా అత్తగారికీ నళినమ్మకీ ఏం జవాబులు చెప్పుకుంటాను? నా పరిస్థితికి వాళ్ళు, మీరు ఏమిచెప్పినా నమ్ముతారు! నేనేం చేయను! ఎందుకు నామీద మీకింత కక్ష!' చప్పున కామేశ్వరి దోసిట్లో ముఖం దాచుకుని వలవలా ఏడ్చేసింది!
    రామనాధం నిర్ఘాంతపోయేడు! కేశవకి అవ్యక్తానందంతో శరీరం పులకరించి పోయింది! కామేశ్వరి మంచిపిల్ల! ఆ పిల్లని చెంపలనిండా ముద్దులతో నింపి గాఢంగా తనలోనికి అదుముకోవాలన్న గాఢకాంక్ష అతనిలో బలంగా పాదుకుపోయింది! కేశవ ఇప్పుడు రెండోపెళ్ళి చేసుకున్నందుకు కుమిలిపోతూన్న మధ్య వయస్కుడు కాడు! నూతన తేజంతో చిప్పిల్లుతున్న కొత్తపెళ్ళికొడుకై నాడు!
    రామనాధంకి, కామేశ్వరి ఏడుస్తోంటే దగ్గరకు తీసుకుని అనునయించాలన్న కోర్కె కలిగింది! కాని కామేశ్వరి తన్ని తీవ్రభాషణాలతో గాయపరిచింది! ఆమెకి తనమీద ప్రేమకాని అభిమానం కాని లేవు! కేశవకూడా ఆమె మనస్సు ఏమిటో తెలుసుకోకుండా తన్ని ఈ సంభాషణకి ప్రేరేపించాడు! బహుశా అతనికి కామేశ్వరిని భార్యగా చూడటం ఇష్టం వుండి వుండదు! అందుకని తన్ని ఇందులోకి తోసాడు! తను అనవసరంగా ఆమె దృష్టిలో దోషిగా పరిగణింపబడ్డాడు! తను జీవితాంతం ఆరాధించుకుంటూన్న యువతి దృష్టిలో తనబుద్ధి వక్రబుద్దిగా నిరూపించబడింది! ఇంత నాటకం జరిగాక ఇంక ఏమిచెప్పి ఆమె దుఃఖం శాంత పర్చకలడు? భగవంతుడా! మొదటిసారిగా రామనాధానికి ప్రేమ, నివేదన, తిరస్కృతి, అపనిందా, ఆవేదనా తెలిసి వొచ్చాయి!
    'కామేశ్వరిగారూ మన్నించండి! చిన్నప్పుడే తల్లీ తండ్రులను కోల్పోయిన దౌర్భాగ్యున్నీ! సహజమైన మమతాను రాగాలకు, దూరమైనవాణ్ణి! తాతయ్య గారి చలవ వల్ల పెరిగి పెద్దవాణ్ణి అయ్యాను! నాకు మీమీద ఏమీ ఈసు లేదు! మీరు నవారు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను! దైవము అనుకూలించలేదు! అవకాశము వ్రేళ్ళనడుమ నించి జారిపోయింది! కేశవగారిచ్చిన, ఈ అవకాశము వృధా పుచ్చుకోకూడదనే వొచ్చాను! మీ మనసు నాకు తెలిసింది! మీరు కలకాలం సౌభాగ్యవతిగా, సుఖ సంసారం చేయాలని, మిమ్మల్ని తోలిచూపులోనే ప్రేమించిన మనిషిగా, ఇప్పుడు సోదరుడుగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను! మీరు కంటతడి పెట్టకండి! ఇకముందు కన్నుల నీరు నించేందుకవసరం రాకుండా మీ జీవితం జరగాలని కోరుకుంటున్నాను' రామనాధం దీనంగా, వేడికోలుగా అన్నాడు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS