"నా పేరు జగన్నాధం. మీరు ఒకటి రెండు తడవలు నన్ను చూశారు" అన్నాడు వస్తూనే జగన్నాధం.
"గుర్తుకు వస్తున్నది. కూర్చోండి. వీళ్ళిద్దరూ నా స్నేహితులు. మిస్టర్ బాలచంద్ర, మిసెస్ నానా" అన్నాడు నాగేశ్వరరావు.
నిరాడంబరతా సౌమ్యతా మూర్తీభవించిన ఈ వ్యక్తిని చూసి గౌరవ భావాన్ని తెచ్చుకున్న నానా సరిగా కూర్చుంది.
బాలచంద్ర ఇతని చేత ఒకటి రెండు సార్లు సినిమా వాళ్ళ సన్మాన పత్రాలు వ్రాయించాడు నూజీవీడు లో.
"నేను గుర్తున్నానా అండి?' అన్నాడు తనే ముందుగా.
"అయ్య.....నమస్కారం. తమర్ని చూడలేదు" అని వినయించాడు జగన్నాధం.
"ఏం పని మీద దయచేశారు?" అని సిగరెట్ ఇవ్వబోయాడు బాలచంద్ర.
సిగరెట్ వద్దనీ , ఇంతమందిలో చెప్పొచ్చునా వద్దా అన్నట్లు చూశాడు జగన్నాధం . చివరికి ఇంతమంది లో చెప్పటమే మంచిదనిపించింది అతనికి.
"విజయగారు కనిపించని సంగతి మీకు తెలుసు. ఆరోజో క్రిందటి రోజో మీరు వారిని చూడటానికి వెళ్ళినట్లు తెలిసింది. మీకేమయినా ఆచూకీ తెలుస్తుందేమోనని వచ్చాను" అన్నాడు.
నాగేశ్వర్రావు మాట్లాడలేదు. ఎవరైనా విజయను గురించి అడిగితె అంతా చెప్పేసి ఈ బరువునూ భారాన్నీ కొంతవరకు తగ్గించుకుందామని అతనూ ఆశిస్తూనే ఉన్నాడు. నానాకు ఈ కధ అంతా తెలుసు. బాలచంద్ర కు కొంతవరకు తెలుసు. పసివాడికి సహజమైన కుతూహలం తో చూసున్నాడు అతను.
"మీరు రచయితలని విన్నాను" చెప్పబోయే కధకు నాందీ ప్రస్తావన గా అన్నాడు నాగేశ్వరరావు.
"ఇప్పుడు రచయితను కాను. శివనంద స్వామి శిష్యుడిని. కనక మీరుచేప్పేది ఎలాంటిదయినా భరించ గలను." నిర్లిప్తంగా నవ్వాడు జగన్నాధం.
శివానంద స్వామి శిష్యుడిని అన్న మాటలు అతని నానాకు ఎంతో సన్నిహితుడిని చేసినాయ్. ఆమె గౌరవం మరింత ఎక్కువయింది అతని పట్ల.
"నేను పొరపాటే చేసి ఉండవచ్చును." చెప్పటం ప్రారంభించాడు నాగేశ్వర్రావు.
"అయినా కూడా అది తప్పు మాత్రం కాదని నిశ్చయంగా చెప్పగలను. ఒకనాటి సాయంత్రం నేను వెళ్లేసరికి వదిన జీవన్మరణ సంధిలో పడి ఉంది. దగ్గర ఎవ్వరూ లేరు. వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకు వెడితే ఇది ఫ్లూరసీ , విజయవాడ తీసుకెళ్ళాలి అన్నాడు. సరే అలాగే తీసుకు వచ్చాను. తీసుకువచ్చిన మూడవ రోజున ఆమె అంత జ్వరంలోనూ వెళ్ళిపోయింది. ఎక్కడి కెళ్ళిందో , ఎందుకు వెళ్లిందో , ఏమయిందో ఇప్పటికీ నాకు తెలియదు. ఆమె కోసం అనుక్షణం అన్వేషిస్తూనే ఉన్నాను" అని నిట్టూర్చాడు నాగేశ్వర్రావు.
ఆడదానికి పాతివ్రత్యాన్ని మించింది లేదని నూరి పోసి పోసి చివరికి ఈ స్థితికి తీసుకు వచ్చింది దేశం. మగవాడి దృష్టి లో కూడా మూర్ఖురాలైన పతివ్రతకు ఉన్న విలువ వివేకవంతు రాలైన పతివ్రతకు ఉండదు, స్వయంగా సర్వేశ్వరుడే ఈ పాతివ్రత్యప్రభావంలో పడిపోతే సామాన్యుల మాట ఇక చెప్పనే అక్కర్ల్రేదు.
ఈ పవిత్రతకు అర్ధం ఏమిటో ఇంకా హిందూ దేశపు మగప్రాణి అవగతం చేసుకోలేదు.
శ్రీ శంకరులు స్త్రీ నరకానికి ద్వారం అని సెలవిస్తే , బైబిల్ లో అన్ని పాపాలకూ మూలం ఆడదేనని వ్రాశారు. టార్జులియాన్ అనే మాట బోధకుడు స్త్రీ తల్లి అయినా సోదరి అయినా సైతానుకు మందిరం అంటాడు. క్రీస్తు తరువాత కొన్ని వందల సంవత్సరాలకు ఒక క్రైస్తవ మత సమావేశంలో ఆడదానికి ఆత్మ ఉండదని స్పష్టంగా నిర్ణయించేశారు.
వారి విద్యలు అభివృద్ధి అన్నీ కూడా వైవాహిక నియమాలను పాటించడం ;లోనే ఉన్నాయని ముద్ర వేశారు. విజయ ఈ నమ్మకాలకు వారసురాలు . పరాయి మగవాడితో ఇంట్లోంచి వచ్చినాక ఇక బ్రతకటం అనవసరం అని నిర్ణయించుకుని ఉంటుంది. తొలిసారిగా స్త్రీ పవిత్రతా వ్యామోహాన్ని అసహ్యించుకున్నాడు జగన్నాధం.
"చనిపోయి ఉంటుందా అనిపిస్తున్నది" అన్నాడు నాగేశ్వర్రావు.
'అలా జరిగి ఉంటె అందరం అదృష్ట వంతులమే........" అని నిట్టూర్చాడు జగన్నాధం.
ఒకవైపున దరిద్రం లో ముంచి హింసిస్తూనే మరో వైపు మధుర జీవనాన్ని రుచి చూస్తూ ఆమె స్థితిని అస్తవ్యస్తం చేసి ఇల్లు దాటిస్తున్నాయి పరిస్థితులు. కాని మగవాడికి లాగా తిరిగి వచ్చే దారి మాత్రం ఇక ఉండదు. శాశ్వతంగా పదవి హీన అయిపోతున్నది ఆడది. అందుకే అంతరాంతరాల్లో ఏదో అనిర్వచనీయమైన భీతి ఆవరించింది జగన్నాధాన్ని.
ఇంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడని నానా------
"ఇతర దేశాలలో విడాకులయినా ఉన్నాయి ఆధ్యాత్మిక దేశం అనుకుంటున్న ఈ హిందూదేశం లో ఆడవాళ్ళ కు ఆ మాత్రం దారి కూడా లేదు. చట్టాన్ని ప్రవేశపెట్టినా పాలించే స్థితిలోకి ఈ దేశపు ఆడవాళ్ళు రానేలేదు" అన్నది.
శాస్త్రాలను అడ్డుపెట్టుకుని, విజ్ఞానాన్ని ఉదహరిస్తూ , నీతి సంప్రదాయాలనే కపట నాటకం మధ్య ఆడదానికి అంధత్వాన్ని ఆపాదిస్తున్న సంఘం ఏదైనా సరే అది నశించి పోవటమే మంచిది -- అనుకున్నాడు నాగేశ్వర్రావు.
స్త్రీ పవిత్రత అంటే ఇంతకాలమూ తన మనసులో ఉన్న గౌరవ కుతూహలాలు విజయ మూర్ఖత్వం ముందు తుక్కూ దూగరలాగా ఎగిరి పోయినవి.
బాలచంద్ర కు ఈ కధ మొదటి నుంచీ ఆశ్చర్యంగానే ఉంది. ఆడవాళ్ళ లో ఇంకా పతివ్రతా లున్నారన్న విషయం మీద అతనికి ఏమాత్రం నమ్మకం లేదు. విజయ తాలూకు ఈ పలాయనగాధ వెనకాల అతని నమ్మకాలు అతనికి ఉన్నాయి. విజయ అనే స్త్రీ పరాయి మగవాడు తనను జబ్బులో తీసుకోచ్చాడన్నా నేరానికి పారిపోవటం అనేది ఒక కట్టు కధలా అతనికి కనిపిస్తున్నది. పోనీ అతనయినా వేలు విడిచిన మరిదే గాని అంత పరాయి వాడూ కాదు. దీని వెనకాల ఏదో గొడవ ఉండి ఉంటుంది అనుకున్నాడు అతను. తెలివి గల వాడు కనుక పైకి అనలేదు.
"అన్నయ్య ఎలా ఉన్నాడు?' నాగేశ్వర్రావు ప్రశ్నించాడు.
"ఎప్పుడో ఒకసారి మీ ఒళ్లో నే చనిపోతానని చెప్పిందట. అందుకని బ్రతికే ఉంటుందని అయన నమ్మకం. ఎప్పటికో ఒకనాటికి తిరిగి వస్తుందనే ఆశ చేత నూజీవీడు వదలటం లేదాయన."
ఆ సమాధానం విని నిట్టుర్చకుండా ఉండలేక పోయింది నానా. ఇందులో ఏదయినా విలువ అంటూ ఉన్నదీ అంటే శతవిధాల ఆడదాని విలువ అయి ఉండదు. అది అతని ప్రవృత్తి విలువే అయి ఉంటుంది. అందుకేనేమో విజయ అంత పవిత్రంగా జీవించగలగడం? ఆమె ప్రేమ పవిత్రతకు ఆధారమైన కేంద్ర బిందువు. అతి బలవత్తరమైనది. బాలచంద్ర వంక చూసి నవ్వుకుంది ఆమె.
"ఎందుకు నవ్వుతున్నావు?"
"ఏమీ లేదు. నువ్వు విజయ భర్తవి అయి ఉంటె ....ఆమె ఇలా పవిత్రత కోసం ప్రాణాలు తీసుకుని ఉండేది కాదు. నాలా బ్రతికే ఉండేది"
"అయితే ఈ రెండింటి లో నీకేది గొప్పగా కనిపిస్తుందో చెప్పు మరి" అని రెట్టించాడు బాలచంద్ర.
"మహమద్ ఒకచోట ఇలా ఉంటాడు-- అతను స్వర్గ దృశ్యం చూడగానే అక్కడ ఉన్న చాలామంది బీదవాళ్ళు గా ఉన్నారు. తరువాత నరక దృశ్యం చూశాడట. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్త్రీలేనట."
"అంటే?"
'స్త్రీ ఏ పద్దతిలో జీవించినా స్త్రీ అనగానే దుఃఖాన్ని నరకాన్ని అనుభవించక తప్పదు. ఆ స్త్రీ హిందూ యువతి విజయలక్ష్మీ కావచ్చును. ఫ్రెంచి స్త్రీ నానా హీల్దా కావచ్చును" అన్నది నానా. కొంచెం సేపు నలుగురి మధ్యా నిశ్శబ్ద్జం గూడు కట్టింది.
"కర్తవ్యం కనిపించటం లేదు." నిట్టూర్చాడు జగన్నాధం.
'అన్నయ్య సంగతే బాధగా ఉంది. ఈ పాపానికంతటి కీ అనాలోచితంగా నేను చేసిన పని కారణం" అన్నాడు నాగేశ్వరరావు.
"ఆ సంగతి నేను ఒప్పుకోను. హృదయం ఉన్న మనిషి ఎవరయినా అదే పని చేస్తారు. బ్రతుకు సినిమా కాకుండా ఉంటె" అని సిగరెట్ పొగ రింగులలో నుంచి నానా వంక చూశాడు బాలచంద్ర.
"జగన్నాధం గారూ, స్వామి ఎక్కడున్నారు ఇప్పుడు?"
"సీతానగరం ఆశ్రమం లో నట. వెళ్లి చూడాలను కుంటున్నాను . మీకు తెలుసా స్వామి?' లేస్తూ ప్రశ్నించాడు జగన్నాధం.
"తెలుసు."
"సరే. నేను వెళ్లి వస్తాను, నాగేశ్వర్రావు గారూ! ఇందులో ఎవరి తప్పూ ఏమీ లేదు. ఇలాటి దురదృష్టాలకు ఫలితాలే తప్ప కారనాలుండవు. మీరేం విచారించకండి" అని అందరికీ నమస్కరించి గుమ్మం దాటాడు జగన్నాధం.
అతను వెళ్ళేదాకా తనను తను ఆపుకున్న బాలచంద్ర చిరునవ్వు నవ్వుతూ "ఆ స్వామి ఎవరో అయన చేత నాకు కూడా సన్యాస దీక్ష ఇప్పిద్దూ?" అన్నాడు.
"ఈ విషయంలో పరిహాసం మానేయి బాలా. అంతదూరం నీబోటి వాళ్ళు ఆలోచించటం కూడా అనవసరం" అని చిరుకోపంతో సమాధానం ఇచ్చింది నానా.
నాగేశ్వర్రావు ఈ సంభాషణ వినటం లేదు.
ఇంగ్లీషు నీతి ప్రకారం అసాద్యశ్య హేతువు కాని పరిస్థితిలో తన స్వేచ్చను ఇతరుల స్వేచ్చకు అఘాతం రానంత వరకూ తీసుకుపోవచ్చునని ఉన్నది. ఇప్పుడు తన స్వేచ్చ ఇతరుల స్వేచ్చకు మాత్రమె కాదు, జీవితానికి కూడా వ్యాఘాతం కలిగించింది. దీనికి నిష్కృతి లేదు.
